నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Monday, August 16, 2010
కంప్యూటర్ కా షా టా లు
ఈ వయస్సులో కంప్యూటర్ అవసరమని పించింది. ( వయస్సు ఎంత అని అడక్కండి ప్లీజ్.) సరే కొన్నా. మా ఆవిడ కూడా అప్రూవ్ చేసింది.(అఫ్ కోర్స్ ఆవిడకు పాటలూ సినీమాలు అవీ వినొచ్చు.. చూడొచ్చని చెప్పా). కంప్యూటర్ లో చిప్పులు పెట్టి చేతికి యెలుక నిచ్చి వెళ్ళాడు కంప్యూటర్ ఆసామీ. ఇక కంప్యూటర్ తెరిచినదే తడవు ఈ ఎలుక ఆ చిప్పులకోసం పోతుంది. కావలసినవి అక్కర్లేనివీ అన్నీ తెచ్చేస్త్తుంది. తెలుగులో తెగ వ్రాసేద్దామని వుబలాటంతో ’అను’ తెలుగు యెక్కింపించా. అందులో ’ఆపిల్’ కి ’కీ’ బోర్డ్ నకలు యిచ్చాడు కంప్యూటర్ ఆసామీ. కొట్టడం మొదలెట్టా ఆసామీ యిచ్చిన సూచనల మేరకు. ఐతే నాకు ఇంగ్లీష్ కీ బోర్డ్ A S D F మాత్రం వచ్చు. ఏదో కొట్టడం యేదో పడ్డం. పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. ఈ లోగా ఓ మిత్రుడినడిగితే DOE చూడండన్నారు. అది కొంచెం బెటర్.
ఇదిలావుండగా మామిత్రులు సురేఖగారు(అమ్మాయి కాదు అబ్బాయే) ఆయన అస్తమానూ బ్లాగులు బ్లాగులు అంటూ వుంటారు. ఆ బ్లాగుల బ్లాగోగులు చూద్దామని ఇంటర్నెట్ పెట్టా. మళ్ళీ కా షా టా లు. జి మెయిల్ క్రియేట్ చేద్దామని నెమ్మదిగా అది ట్రయ్ చేస్తే this page cannot be shown అని దానికింద భయంకరంగా యేదేదో వ్రాసి వుండేది. వెనక్కి వెళ్ళక పోతే కడప బాంబ్ పేలుతుంది జాగ్రత్త. ఏం చేయాలి? ’x’ కొట్టేసి పారిపోవడమే... ఏదో స్టేట్ మెంట్ దాని కింద మూడు ఆప్షన్స్ యస్, నో, మోర్ ఇన్ఫర్ మేషన్. ఏది క్లిక్ చేసినా అది పోదే! పోనీ ఆఫ్ చేసి పోదామని x నొక్కినా యిది పోదు.ఈ సమయంలో మా ఆవిడ లోపల్నించి కేక పెట్టింది. "యెన్ని కూతలు వచ్చాయి. స్టవ్ ఆపారా?". "యేం స్టవ్? యేం కూత"లన్నాపరాకుగా. "అదేంటండీ? సెల్లార్ లో కూరలవాడొచ్చాడూ- నే వెడుతున్నామూడు కూతలొచ్చాక స్టవ్ ఆపమని చెప్పాగా". "యే సెల్లార్? యేకంప్యూటర్?......" మా ఆవిడకి వళ్ళు మండింది..."నా ఖర్మ..ఖర్మ" అనుకుంటూ ఎక్జిట్ తీసుకొంది. ’నీ ఖర్మ’ అనలేదు....పాతివ్రత్యం కాబోలు.... ఇక్కడ పవర్ ఆపేద్దామంటే బోల్డు డబ్బెట్టి కొన్న కంప్యూటర్.....కంప్యూటర్ ఆసామీ దగ్గరకి పరిగెత్తా. ఏవో సూక్ష్మాలు చెప్పాడు. మళ్ళీ జీ మెయిల్ try చేసా. అంత డేటా కష్టపడి యిచ్చాక యేదో మిస్సింగ్ అంటుంది. అది యిచ్చాక అదేదో వర్డ్ అర్ధం కాకుండా యిచ్చి అది క్రింద గది లో కొట్టమంటుంది( ఈ గది గొడవ అన్ని చోట్లా తగులుతూనే వుంటుంది.)కొంచెం ఆలోచిస్తున్నా...
మా ఆవిడ యేదో అంటోంది. "ఇదివరకు యింట్లో సాయం చేసేవారు.... కూరలు తొక్కలు తీయడమో...గిన్నెలు సర్దడమో....ఆ కంప్యూటర్ వచ్చింది ప్రాణానికి....కనీసం పాలు పొంగి పోతూవున్నా పట్టదు అవి కాస్తా మాడి తగలడ్డాయి...రేపు మజ్జిగ అన్నారు అంటే అప్పుడు చెప్తా" నన్ను కాదులే అన్నట్టు నా పనిలో నే వున్నా. ఆ వర్డ్ యెన్ని సార్లు చేసినా దీం దుంప తెగ(సారీ) యిది మళ్ళీ మళ్ళీ ఆ వర్డ్ మార్ఛేస్తూ కొట్టమంటూవుంటుంది. మొత్తానికి పాపం కంప్యూటర్ మహాశయుడు తృప్తిపడి కంగ్రాట్యులేషన్స్. కావలిస్తే చూసుకో అన్నాడు. సరే ఎలుకను పంపిస్తే యెంతకీ చూపెట్టదే. వళ్ళు మండి మళ్ళీ మొదలెట్టా. ఫలితంగా నీవు ఆల్ రెడీ వున్నావంది. హమ్మయ్యా....సాధించానన్న మాట...
ఇక బ్లాగు...కొంచెం అనుభవం వచ్చింది కదా...మొత్తం మీద సృష్టించ గలిగా.....సందేహాలు వచ్చేవి...కం.మీ ని అడిగితే కంప్యూటర్ నాలెడ్జే కాని ఇంటర్నెట్ నాలెడ్జ్...ప్చ్. అన్నాడు. కొన్ని మా సురేఖ గారు సాల్వ్ చేసారు. వారి ద్వారానే పరిచయం అయిన ఓ సహృదయం నా వివరాలు తీసుకొని నా బ్లాగు కి రంగవల్లులు కూర్చి చూడబుల్ గా చేయడమే కాకుండా- కూడా గైడ్ చేస్తున్నారు. థాంక్స్ మాత్రమే చెప్పగల మెయిల్ దూరం లో వున్న ఆ సహృదయానికి థాంక్స్... మొన్న నా బ్లాగు కోసం క్లిక్ చేస్తే screen అంతా నల్లగా అయిపోయింది....లోపలికీ కాని బయటికి కాని దారి లేదు. మళ్ళీ ఆపా. మళ్ళీ తెరిచా....వుహూ .. మళ్ళీ ఆ స్జ్రీనే...ఆ నలుపే....యేం చేయనూ....ఆ సహృదయము వెంట పడ్డా....శ్రమ తీసుకుని అభయ హస్తం చూపారు....ఈ లోగా కూడలి లో వుంది నాబ్లాగు బందీ గా. (ఖైదీ) నెం.115 ప్రస్తుతం అని గుర్తించా... హాస్యవల్లరి..dvhrao.blogspot.com...మీరూ చూడండి...సలహాలివ్వండి...నన్ను బ్లాగుగా చెయ్యండి. కష్టాల తో కంప్యూటర్ అదో అందం. కదా! ఈ బ్ల్లాగు బ్లాగుడు మీ రందరూ భరిస్తారు పాపం అని అనుకుంటూ శలవు...దినవహి.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
హహ మీ కష్టాలు బాగున్నాయి... :) మా నాన్న గారు కూడా...ఇలాగే. అంటూ ఉంటారు...
ఇలాంటివే ఇక్కడ చూడండి...
http://palaka-balapam.blogspot.com/2007/07/blog-post_24.html
మీ బ్లాగు కష్టాలూ బావున్నాయి. ఎవరైనా కష్టాలూ బావున్నాయంటారా? మీరు యాపిల్ ఎందుకు హాయిగా బరహ వాడుకోవచ్చుగా. చాలా వీజీ..
హనుమంత రావు గారు, ఈ వెబ్సైటు: http://mahigrafix.com/forums/index.php మరియు ఈ బ్లాగు: http://telugu-lo-computers.blogspot.com/ చూడండి. మీ కంప్యూటర్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.
మనలాంటివాళ్ళకు మొదట్లో ఇలాంటి కష్టాలు మామూలే.పాలను,స్టౌవ్ ఈలల్ను అన్నీ మరచిపోండి కంప్యూటర్నే లోకమనుకోండి అన్నీ వచ్చేస్తాయి, అయినా ఇప్పటికే వచ్చేసిందిగా.
ఈ కష్టాలన్నీ నేనే పడ్డాననుకున్నాను. నాకు తోడుగా మీరు వచ్చారని సంతోషంగా ఉంది.రిటైర్డ్ అన్న tag నాకూ ఉంది.
మీ కంప్యూటర్ కష్టాలు చాలా బాగున్నాయి. కొంచెం తేడాగా మా ఇంట్లో పరిస్థితీ అంతే. ఆవిడ నవ్వు ఆపుకోలేక పోయింది.
Post a Comment