Pages

Tuesday, October 26, 2010

అంతటా వున్న చైతన్యస్వరూపం


ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమౌతుంటే...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....

అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.
మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....
మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...

ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....
దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....
तेरे साई तुझ मे जो पुहुपन मे भास
कस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास
పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.
ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం.అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..
నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు...కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.
భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.
భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...
అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.

6 comments:

kaartoon.wordpress.com said...

చిత్రం! భళారే విచిత్రం! మీ బ్లాగుకి చిత్రాలను జోడించడం
బహు బ్లాగు,బ్లాగు!!

santhi said...

Chala baagundi daddy

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీలో ఇంత కవితావేశం ఉందని ఈ వేళే తెలిసింది.అదర గోట్టీసారు.బాగుంది.నేను అంటే తెలిసి తే నాకు కూడా చెప్పండి.చివరికి అంతా మిధ్య అంటారా.

హనుమంత రావు said...

శ్రీ సుబ్రహ్మణ్యం గారికి నమస్సుమాంజలులు !
'నేను' తెలిస్తే చెప్పడానికి యింక 'నేను' యెక్కడ?
అంతవరకు వెళ్ళాక చెప్పే 'నేను', వినే 'నేను'.....
రెండు వుంటాయా....ఏకమే. (చూసారా? మీరు
అడిగారనగానే...ఈ ఆరడుగుల శాల్తీ ప్రగల్భాలు.
మన్నించండి).........దినవహి.

Ravi Kiran Muddha said...

Namassulu,
...neevaara shukavattanvi peetaabhaasvatyanoopama...tasyaa shikhaaya madhye paramaatmaa vyavasthitaha...

ekameva advitiyam brahma nunchi sarvam khalvidam brahma sthayi ki vellamantundi munDaka upanishattu.

anantam nunchi mee varaku vacchina mee anveshaNa baagundandi.

vyaktamainaTuvanTi swaroopamu kanna avyktamainaTuvanTide chaala ekkuvagaa undi anTundi upanishattu.

హనుమంత రావు said...

శ్రీ రవిగారు, నమస్కారములు....తెలిసో తెలియకో ఆలోచనలు అటే
వెళ్తుంటాయి...అది మీ లాంటి సజ్జనుల సాంగత్యంగా నేను భావిస్తున్నాను.
నా కృషి యేమీ లేదు...మీరెన్నో విషయాలు వుటంకించారు...చాలా
ఆనందమైంది....మీరు వ్రాసిన దానిలోని ఆఖరి వాక్యం, కొంచెం
వివరించగలరా....శలవు...దినవహి.