Pages

Saturday, May 7, 2011

విశేషం వైశాఖం



ఆధ్యాత్మిక జీవనం గడిపేవారికి వైశాఖమాసం చాలా విశేషమైన మాసం....ఎందరో మహనీయులు ఈ మాసంలో జన్మించారు....ఎందరో దేవతలకు సంబంధించి అర్చనాదులు ఈ మాసంలో జరుపుతారు...
మే నెల 4వ తేదీ ప్రారంభమై జూన్ నెల 1వఱకు సాగే ఈ నెలలో


5వ తేదీ....శ్రీ సింహగిరి నాథునికి చందనోత్సవం...సంవత్సరమంతా చందనపూతతో అలరారుతూ శివలింగాకృతిలో దర్సనమిచ్స్ నృసింహ స్వామి., పూసపాటి రాజవంశీయుల ఆధ్వర్యవంలో జరిగే చందనవలుపు తర్వాత భక్తులకు ఓ రోజంతా నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు.. మరునాటినుంచి మూడు తడవలుగా చందనపూతతో శ్రీ నృసింహస్వామి చల్లబడతాడు..విష్ణు రూపాయ నమశ్శివాయ...

6వ తేదీ..పరశురామ జయంతి...రేణుకా జమదగ్నుల పుత్రునిగా, శ్రీహరే, జన్మించి దుష్టశిక్షణచేసిన క్షాత్రతేజం పరశురాముడు...కోదండరాముని అవతారం జరగగానే తన అవతార ప్రయోజనం పూర్తి చేసిన పరశురాముని... ధ్యానించడం ఈ రోజు విశేష ఫలాన్నిస్తుంది. అదీకాక ఈ రోజు అక్షయ తృతీయ...ఈ రోజు చేసిన
ఏ ఆధ్యాత్మిక సాధనయైనా అక్షయ ఫలాన్నిస్తుందని శాస్త్రవచనం...

8వ తేదీ..శ్రీ శంకర జయంతి...అద్వైత మతావలంబికులకు ఆదిగురువు ఆది శంకరులు... వైదిక మతాలన్నింటిని సమన్వయపఱచి వేదాంత మతాన్ని ప్రతిష్టించిన అపరశంకరులు బ్రహ్మసూత్రాది విషయాలకు వారు వ్రాసిన
భాష్యాలు పండిత ప్రకాండులకు సహితం శిరోధార్యాలు...స్తోత్ర వాఙ్మయం ఎంతోమందికి నిత్య పఠనీయం

సదాశివ సమారంభం..వ్యాస శంకర మధ్యమం...
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం..

ఆది శేషుని అంశావతారంగా కీర్తించబడే శ్రీ రామానుజాచార్యుల జయంతి కూడా ఈరోజే..
విశిష్టాద్వైత మత సంస్థాపకులు శ్రీ రామానుజులు హరిభక్తి తత్పరులు.

9వ తేదీ..త్యాగయ్యగారి జయంతి....ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానం చేస్తూ 95కోట్ల రామనామాన్ని జపించిన నాద బ్రహ్మ....శ్రీరాముని సన్నిధిని మించిన పెన్నిధిలేదని చాటిచెప్పిన వాగ్గేయకారుడు...

10వ తేదీ...విద్యారణ్య జయంతి..హరిహర బుక్కరాయలద్వారా విద్యానగర(విజయనగర) రాజ్యనిర్మాణ శిల్పి...."శంకర విజయం"..ఆది శంకరుల చరిత్రను మనకందించిన మహనీయులు;...వేదాలకు భాష్యం వ్రాయడమేకాదు.....సనాతనధర్మాన్ని మ్లేచ్ఛుల దురాక్రమణనుండి రక్షించిన సిద్ధపురుషులు...
గంగాదేవి జన్మించిన తిథి కూడా ఇదే...గంగపూజ,,గంగా స్నానం...విశేష ఫలితాన్నిస్తుంది.

అస్మద్ గురుదేవులు....అభినవ షణ్మతాచార్య, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి జన్మదినం కూడా ఈ రోజే.... వ్యవస్థాపక సంపాదకులుగా తమ మానసపత్రిక ఋషిపీఠం ద్వారా, తమ శాస్త్రబద్ధ ప్రసంగాలద్వారా సనాతన ధర్మ సమున్నతికి వీరు చేస్తున్న కృషి బహుథా శ్లాఘనీయం...శ్రీశర్మగార్కి పరమేశ్వరుడు ఆయురారోగ్యైశ్వర్యములు కలుగ జేయాలని ప్రార్థిద్దాము..

16వ తేదీ శ్రీనృసింహ జయంతి.....సంధ్యా తత్త్వం..హరి ఎక్కడున్నాడో చెప్పు అని ప్రశ్నించే తండ్రి....హరి
లేనిదెక్కడనే తనయుడు....హిరణ్యకశిపుని కోరిక మేరకు....ప్రహ్లాదుని విశ్వాసం మేరకు...తనని తాను
రూపకల్పన చేసుకుని నారసింహునిగా ఆవిర్భవించిన శ్రీ హరి ...రెండు ఆలోచనల మధ్య
ఆలోచనారహితస్థితి సంధ్య....లోపల వెలుపలాకాకుండా, రాత్రి పగలు కాని సంధ్య స్థితిలో, ప్రాణముండీ
లేని గోళ్ళే ఆయుధంగా, క్రిందా పైనా కాని తన ఒడిలో, నరుడు మృగమూకాకుండా ఆవిర్భవించిన ఆ
శ్రీ హరి దుష్టశిక్షణ ...శిష్ట రక్షణ ఏకకాలంలో పూర్తిచేసిన పరిపూర్ణావతారం శ్రీ నృసింహస్వామి...

17వ తేదీ హనుమత్ జయంతి....భక్తుడూ అతడే, భగవంతుడూ అతడే.....తాను నమ్మిన శ్రీరాముని
మనసావాచా సేవించే మహాభక్తుడు....నీవే శరణని భక్తిగా కొలచే భక్తులకు సకల కామితములు
అనుగ్రహించే భక్తజన సులభుడు...శ్రీరామానుగ్రహం హనుమత్ కృపవల్లనే
లభ్యమౌతుంది....

బుద్ధిర్బలం యశో ధైర్యం::
నిర్భయత్వమరోగతా:

అజాడ్యం వాక్పటుత్వంచ::
హనుమాన్ స్మరణాత్ భవేత్||

ఇన్ని విశేషాలుకలిగిన ఈ నెలలో దాహార్తులకు మజ్జిగ, మంచినీరు అందీయడం యెంతో
తృప్తిని కలిగిస్తుంది......చలివేందరలు ప్రారంభించాలి...మూకుళ్ళతో డాబాలమీద నీరు పెట్టడం ద్వారా ...
వీధుల్లో నీళ్ళ తొట్టెలు పెట్టడం ద్వారా పశుపక్ష్యాదులకు దాహార్తి పోగొట్టడం మంచిపని..ఆ మూగ జీవాలు
మౌనంగా మనకు మంచిని ఆకాంక్షిస్తాయి...ప్రయత్నిద్దామా!!!

2 comments:

kalyani said...

చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, thank you verymuch. 17వ తేది బుద్ధ పూర్ణిమ , 27న హనుమజ్జయంతి అనుకొంటాను.

హనుమంత రావు said...

పొరబాటు...సరిదిద్దినందుకు కృతఙ్ఞుడ...హనుమజ్జయంతి 27నే