Pages

Wednesday, June 22, 2011

మా నాన్న గారి జయంతి ఈ రోజు

మధ్యలో నాన్నగారు దారా వేషం లో...ఆయనప్రక్కన జహానారా గా ఒక జడ్జీ గారు ఆడ వేషం వేసారు.

(కూర్చున్న వారిలో ఎడమ చివర నాన్నగారు..పాత ఫోటో అర్థం చేసుకోండి.)




గాయత్రీ మంత్ర దీక్ష ప్రేమనొసంగినట్టి
గురు నుత్తమజనకు
సత్యనారాయణాఖ్యు
తలతు గురుండని ఎల్లవేళలన్

గాయత్రీ మంత్రోపదేశము చేసిన గురువు... ఒక చిరునామా ఇచ్చినన్ను లోకానికి పరిచయం చేసిన మహావ్యక్తి, ...ఇంకెవరు మా నాన్నగారు...
సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా తమ తలిదండ్రులు గొప్పవారే..
తలిదండ్రుల ప్రత్యేకతలు ఆయా తలిదండ్రులవే..
మా తండ్రిగారు శ్రీదినవహి సత్యనారాయణగారు. వారి పుట్టినరోజు రోజు (ఇంగ్లీషు కాలండర్ ప్రకారము..22-6-1894).
జీవితంలోని కష్టసుఖాలను భగవత్ప్రసాదంగా స్వీకరించి ఆనందంగా జీవనయానంచేసిన మా నాన్నగారు
నాకు ఆదర్శమూర్తి...
ఆయన దేశభక్తులు, తెలుగు,హిందీ,వంగ భాషలలో పాండిత్యం కలవారు. అభినయదక్షులు.,సహృదయులు.
1921లో గాంధీమహాత్ముని పిలుపుమేరకు చదువుతున్న బి. క్లాసులను వదలి జాతీయోద్యమంలో చేరిన మా నాన్నగారు కాకినాడలో స్థాపింపబడిన జాతీయ పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసారు. చుట్టుప్రక్కల ఉన్న పల్లెలలో ఒకచేత్తో హరికేన్ లాంతరు పట్టుకుని ఇంటింటికీ వెళ్ళి జనాల్ని ప్రోత్సహించి హిందీ భాష నేర్పెడివారట. నిర్వాహకులైన నాయకులు జైలుపాలవుతుంటే పాఠశాల నిర్వహణ కష్టదశలో ఉన్నప్పుడు విద్యార్థులనుత్సాహ పరుస్తూ వారితో కలసి నాటకాలు ప్రదర్శించి నిధులు సేకరించెడివారు....జాతీయపాఠశాలలో విద్యార్థినిగా దుర్గాబాయ్ (దేశముఖ్) నాన్నగారిదగ్గర హిందీ నేర్చుకున్నారు.. అది తన జీవితచరిత్రలో ఆమె ప్రస్తావించారు కూడా..చురుకుగా ఉండే దుర్గాబాయ్ విద్యార్థినిగా ఉన్నప్పుడే నాన్నగారి ప్రోత్సాహంతో జాతీయ పాఠశాలకు ప్రిన్సిపల్ గా పరిచయంచేయబడ్డారు
స్వాతంత్ర సముపార్జన తర్వాత వీరు గుజరాత్ విద్యాపీఠ్ వారి బి. పూర్తిచేసారు కాని డిగ్రీ మన ప్రభుత్వము గుర్తించని కారణంగా సరియైన ఉద్యోగం లేదు.. ఏలూరులో ఉండగా అక్కడ ఉన్నవిద్యాధికులతో కలసి హిందీలో వీరు నటించిన షాజహాన్ నాటకం మద్రాసులో పురస్కారములందుకుంది. పై ఫోటోలో దారా వేషంలో ఉన్నది నాన్నగారు. మొదటి ఫోటోలో వేషాలు వేసినవారే క్రింద ఫోటోలో వున్నవారు. lచంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వీరి పాత్రధారణ బహుథా ప్రశంసింప బడింది.. తణుకు టౌన్ హాల్ లో వీరికి సన్మానం జరిగిందని వారి పంచాయతీ సావనీర్ లో వుంది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన "షాజహాన్" నాటకాన్ని తెలుగులోకి అనువదించి, ముద్రింపించారు.. అది బహుళ ప్రజాదరణ పొందింది. కలకత్తాలో ఉండగా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాలీ భాషకు గ్రామరు వ్రాసారు. ప్రేమచంద్ కథలు, మేవార్ రాజ్యపతనం వీరు తెలుగు అనువాదాలు... వీరికి బాగా పేరు తెచ్చినది... తులసీదాస కృత శ్రీరామ చరితమానస్ గ్రంధానికి వీరి తెలుగు వచనానువాదం.. 1962లో వీరు ముద్రించిన గ్రంధానికి మొత్తం మూడుముద్రణలు జరిగాయి.
అయితే వీరికి బెంగాలి,పాలీ,హిందీ,తెలుగు భాషలలో విధమైన డిగ్రీలూ లేకపోవడం
ఆశ్చర్యకరం.
స్వాతంత్రోద్యమంలో నిర్మాణాత్మక కార్యక్రమాలలోనే ఉండమన్న నాయకుల ఆదేశాలు కారణంగా వీరు జైలుకి వెళ్ళే సందర్భం రాలేదు.. ఫలితంగా వీరు స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింప బడలేదు. విధమైన ప్రభుత్వ సాయమూ అందలేదు. అదీ భగవంతుని ప్రసాదమనే భావించారు... అప్పటి రెవెన్యూశాఖామాత్యులు శ్రీ కళా వెంకటరావుతో వీరికి సాన్నిహిత్యముంది. సాయంచేయమని అర్థించడం చేతకాని విద్య నాన్నగారికి...
శ్రీరాముని హృదయంలో ప్రతిష్టించుకుని శ్రీరాముని బిగ్గరగా స్మరిస్తూ తన 88 ఏట సునాయస మరణాన్ని పొందిన
మా నాన్నగారు ధన్యజీవి అని నే నెప్పుడూ భావిస్తాను. జన్మదినం సందర్భంగా వారికి వినయాంజలులు....

(నాన్నగారు పై పద్యం రోజూ చదివేవారు...కాని వేంకట్రామాఖ్యు అని తాతగారి పేరు అనేవారు.. గణ యతి దోషాలు ఉంటే అవి నావి ..విన్నది గుర్తు చేసుకోవడం..)

11 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

అప్పుడు మన ఇళ్ళు దాదాపు ఎదురెదురుగా వుండేవి. తరచు మీ నాన్నగారిని కలుస్తుండేవాళ్ళం.ఆ రోజులు, ఆ ఆప్యాయత ఇప్పుడు సమాజంలో అసలు లేవననుకాని తగ్గాయేమోననిపిస్తుంది. కానీమన ఇద్దరి కుటుంబాల స్నేహం హాసాల విలాసాలతో సాగి పోవడం భగవంతుడు మనకిచ్చిన వరం !

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ నాన్నగారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ప్రతిఫలాపేక్ష లేకుండా నలుగురికి మంచి చేసిన మీ తండ్రి గారు ధన్యజీవి. తండ్రిగారిని నిత్యం స్మరించుకునే మీకు అభినందనలు.

హనుమంత రావు said...

సురేఖగారికి, తలిదండ్రుల ఆప్యాయతను అభిమానాన్ని పొందిన మన జీవితాలు ధన్యమనిపిస్తుంది.. తమ తమ పిల్లల్ని స్నేహితులుగానే చూసారు మా నాన్నగారైనా
మీ నాన్నగారైనా... బ్లాగుకి మీ స్పందన బాగుంది..

సుబ్రహ్మణ్యంగారూ...కృతఙ్ఞతలు

Manchiraju said...

Muttatagari gurinchi naaku teliyani viseshalu mee valana telusukunnanu. Aa goppa manishi puttina kutumbamlo puttinanduku nijamga nenu dhanyudini.

హనుమంత రావు said...

డియర్ సూరిబాబు,
నువ్వు ముత్తాతగారి గురించి వ్రాసినది చదివి స్పందించావు..నీ బిజీ రొటీన్ లో అంత
టైము వుండదేమో అనుకున్నా... చాలా సంతోషం..అప్పుడప్పుడు నా బ్లాగు చూసి స్పందిస్తే
కొత్తవి వ్రాయడానికి ఉత్సాహం వస్తుంది...బై...

మిస్సన్న said...

అయ్యా చాలా ఆలస్యంగా తాత గారి గురించిన టపా చూశాము. ధన్యులము. వారు చూపిన ఆప్యాయత మా మదిలో నిత్య నూతనంగా గుబాళిస్తూ ఉంటుంది.
వారి మహనీయ వ్యక్తిత్వానికి అంజలి ఘటిస్తున్నాను.

హనుమంత రావు said...

ఏ సమయంలో వచ్చినా సరే తనకు తెలిసినది నలుగురికీ
చెప్పడానికి ముందుకొచ్చే అమృతమూర్తి నాన్నగారు.
నాన్నగారి గురించి నాకన్నా కూడా వారి ప్రేమను అనుభవించిన నీ బోంట్లకు బాగా తెలుసు..నాకు
తెలిసినా కొన్ని విషయాలు వ్రాసాను...చూసి
స్పందించిన నీ మంచితనానికి కృతఙ్ఞతలు.

avsmanyam9 said...

mavayya nee blog chudatam first time chala bagundi.tatayya gari gurinchi naaku teliani chala vishayalu telisai.

naa 2years agelo ayana dairy lo nenu geesina geetalu terigi ayana naa 16 years age lo naaku chupincharu. ascharya poyanu.

హనుమంత రావు said...

thank you dear subrahmanyam for the appreciation given by you to my blog.

Vinjamuri Venkata Apparao said...

Very much thrilled to see your posting...
My father Vinjamuri venkatarao garu
used to mention Sri D.Satynaryangaru
He was working as central Suptd ,Kovvur,,Way back in 1952.

హనుమంత రావు said...

శ్రీ వింజమూరివారికి నమోవాకములు.. భగవంతుని నిర్ణయాలు అర్థంకావు.. ఇలా మీ నాన్నగారూ, మా నాన్నగారు పరిచయస్తులు అవడం... ఈ విధంగా మనం స్నేహితులమవడం...ఓహ్.. నా బ్లాగు పాతవి మీరు చూసి స్పందించడం చాలా సంతోషం.. నాన్నగారు కొవ్వూరు బాపూజీ నగర్ లో ఇల్లు కట్టుకున్నారు.. అక్కడ మకాం ఉండలేకపోయాము. రాజమండ్రి వచ్చేసాము.. మీ తండ్రిగారి గురించి ప్రస్తావించారేమో కాని నాకు అంత గుర్తులేదు.. ఏమైనా పాత బంధువులమయ్యాము కనుక ఈ బంధుత్వము కొనసాగిద్దాము.. మరొక్కసారి మీ స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ..శలవు.