Pages

Friday, June 24, 2011

"చు క్కో ప ని ష త్"


ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ !
పొగచెట్టై జన్మించెను
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ !!

ఇది మన గిరీశంగారు శిష్యుడు వెంకటేశానికి చెప్పిన పద్యం.. బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వుందని సదరు గిరీశంగారే ఉవాచ.."మీతో వుంటే నాకు పొగచుట్ట త్రాగడం తప్ప చదువేం రావటంలేదట" అని వెంకటేశం వాపోతే చుట్ట మాహాత్మ్యం పైవిధంగా చెప్తారు గురువుగారు.
ఇప్పుడు మనకు కావలసినది -- ఆ పద్యంలో పాయింటేమిటని? దున్నపోతు, పొగచుట్ట కాదండి-- 'చుక్క'. అది మనపాయింట్... భుగ భుగ పొంగుతోందట.. అమృతంపు చుక్క.. అమృతం ఖగపతి అంటే గరుత్మంతుడు తెచ్చాడు.. "నా దగ్గర దాస్యం చేస్తున్ననీ తల్లికి విముక్తికావాలంటే నాకు అమృతంకావాలి..అమరపురికి వెళ్ళి అమృతం తెచ్చి ఇయ్యి..." అని సవతితల్లి కండిషన్ పెట్టింది...వెంటనే వైనతేయుడు సురపురికి వెళ్ళి, దేవతా వీరులనోడించి.. అమృతభాండము గ్రహించి, చేతిలో ఉన్న అమృతాన్ని కనీసం వాసనకూడా చూడకుండా, సవతితల్లికి సమర్పించి, అక్కడున్న దర్భలపై వుంచాడు వినతాసూనుడు. అఫ్ కోర్స్ అలా పెట్టించడం దేవతల ప్లానే అనుకోండి తల్లికి దాస్యవిముక్తి అయిందని కద్రువ ఇలా డిక్లేర్ చేయగానే; రెడీగా ఉన్నదేవతలు అలా అమృతభాండాన్నికాస్తా తన్నుకు పోయారు... కద్రువ సంతానమైన నాగులు పాపం ఆ దర్భల్ని నాకాయట అమృతపు చుక్కలు ఏమైనా అక్కడ పడ్డాయేమోనని...'చుక్క' అమృతంకూడా పడలేదు సరికదా నాలుకలు నిలువుగా చీలాయి మాగాయి ముక్కల్లా ... పాములకు రెండు నాలుకలు అప్పట్నించీ....
అక్కడ పడని ఆ యొక్క అమృతపు చుక్క భూమి మీద పడి పొగచెట్టై కనపడింది గిరీశానికి. ఆ అమృతం భుగ భుగ పొంగుతోందట.. విషానికి తోబుట్టువుకదా.. అదీకాక పొంగితే కాఫీకూడా గొప్ప రుచిగా వుంటుంది... పొంగు రుచి మరి...

బాపు రమణలకు "సాక్షి" లో కనపడింది అదే....హీరోయిన్ 'చుక్క' కొబ్బరి పీచు కొట్తూ వుంటుంది.. ఆ శ్రమకు వంటినంటిన వలువల అస్తవ్యస్తమైన పరిస్థితి.. అది చూసిన మునిసిబు "చుక్క వళ్ళు దాచుకోకుండా పనిచేస్తుందయ్యా" అని ప్రక్కనే ఉన్న కరణంతో అంటాడు, "మరే! మరే!" దాగీ దాగని వళ్ళుచూసి పరవశుడై పళ్ళికిలిస్తాడు కరణం. 'చుక్క' విలువకు "సాక్షి" ఆ సినీమా. అందుకే ఆ కారెక్టరుకి బాపు,రమణలు పెట్టిన పేరు "చుక్క"

ఋషులకాలంలో ఆకాశంవైపు అలా చూసి, చుక్కని బట్టి టైము చూసేవారు...వేగుచుక్క పొడిస్తే తెలవారే టైము...తూర్పువెళ్ళేరైలు సినీమాలో అనుకుంటా 'వేగుచుక్క పొడిచింది' అంటూ పాటకూడా ఉందండోయ్...అదీ బాపుగారిదే...కోడికూతతో కూడా టైము చూసేవారనుకోండి...అది అంత స్టాండర్డు కాదేమో...ఎందుకంటే గౌతమ మహర్షి దెబ్బతిన్నాడుకదా... అయినా పరాయి వాళ్ళ ఫామిలీ గొడవలు మనకెందుకులెండి...?

మనజీవితాలు చుక్కలోంచే పుట్టాయి. "అణురో రణూయాన్..." అణువు అంటే చుక్క..
అది అలా ఉంచితే అసలు సృష్టిక్రమం చూడండి... పైనుంచి ఓ నీటి చుక్క పడుతుంది....తన చిరునామా తెలియని ఆ చుక్క-- చిన్న చెలమవుతుంది.. అందులో ఓ పసితనం... తర్వాత గలగలపారే ఏరవుతుంది...అది గంతులేసే బాల్యం... గట్టులనొరిసిపారే చెరువవుతుంది నిండు యవ్వనంతో....స్వాదుజలాల్ని అందించే తల్లి గోదావరిగా మారుతుంది... ఆ తర్వాత నిండుగంభీర సాగరాన్ని చేరుతుంది... ఆ రత్నగర్భకు ప్రారంభం ఆ యొక్క నీటిచుక్కే కదా..

చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో అనేవారు... శ్రీ----చుక్క-----బొల్లిమేక అని. టైముకన్నా ముందు స్కూలుకెళ్తే...చేతిలో 'శ్రీ' వ్రాసేవారట...అదిగొప్ప; టైముకెళ్తే 'చుక్క' పెట్టేవారట... మరీ ఆలస్యంగా వెళ్తే వాడు 'బొల్లిమేక'గా పరిగణింపబడేవాడు. ఇది వినడమేకాని నాకు అంతకన్నా తెలియదు.
అంచేత స్కూల్ రోజులు 'చుక్క'తోనే ప్రారంభం.. చుక్కలాట ఆడేవాళ్ళం వెనకాల బెంచీల్లోకూర్చుని... కాగితం మీద వరుసగా చుక్కలు పెట్టి, ప్రక్క చుక్కలు, తడవకు ఒకరు చొప్పున, కలుపుతూ... నాలుగు చుక్కలు కలిసి స్క్వేర్ అవగానే మనకొక పాయింట్... మధ్యలో మేట్టారు చూస్తే "మేట్టారండీ..మేట్టారండీ..కొట్టకండి మేట్టారండీ".
పద్యానికి చుక్క మార్కు ఉంటే అవి కంఠతా పట్టాలి....తప్పదు. ఎందుకంటే అవి పరీక్షల్లో అడుగుతారు మరి.

ధనుస్సంక్రమణం ప్రారంభమవగానే ముగ్గులు ప్రారంభం...నెలపట్టు అనేవారు...వేకువనే చక్కని చుక్కలు ఇంటిముందు కళ్ళాపు చల్లి, జారిపోతున్న పమిట (ఒకప్పటి డ్రస్సులెండి) సర్దుకుంటూ చుక్కలు పెట్టి...(ముగ్గు డిజైన్ ని బట్టి చుక్కల లెక్క ఉంటుంది).. ఆ చుక్కలు కలుపుతూ రక రకాల ముగ్గులు పెట్టే చక్కని చుక్కలు మనకి తెలుసు...వారి ఓరచూపులు కేచ్ చేస్తూ చుక్కల్లో చంద్రుడిలా కొంటె కుర్రాళ్ళు.

వయసువచ్చిన నవవధువులు బుగ్గమీద చుక్క పెట్టుకుని "బుగ్గమీద పెళ్ళి బొట్టు ముద్దులాడ" సిగ్గులమొగ్గలై పెళ్ళిమంటపంలో కూర్చుంటే ఆ చుక్క ఠీవి వరుని బుగ్గపై ప్రతిఫలించడం చూస్తూనేవున్నాంగా...

ఎన్నికలొస్తే చుక్కతో ప్రారంభమై..చుక్కతో ముగుస్తుంది ఎలక్షన్... ముందు చుక్క పోస్తేనే బూతు చేరతాడు విలువైన ఓటరు, చేతిపై చుక్కపెట్టింఛుకున్నాకనే చుక్క మత్తులో ఓటు వేస్తాడు.. అప్పుడు ఎలక్షన్ పూర్తయినట్టు... ఎన్నికైన ప్రభుత్వం గద్దెనెక్కాక...కుళాయిల్లో నీటిచుక్కలు లేక కన్నీటిచుక్కలతో గొంతు తడుపుకొంటే వాళ్ళకేం పట్టింది... కన్నీరు అలా చుక్కలుగా ఉండక ప్రవాహంగా మారితే ఆ కన్నీళ్ళు కూడా జాతీయంచేసీయగలదు ప్రభుత్వము. అప్పోజిషన్ వాళ్ళు రంగు జెండాలు పాతినా పాతీయొచ్చు. తస్మాత్..జాగరత!...

మన భాగ్యనగరంలో చుక్కల అరటి పళ్ళు ..అబ్బా ఏం రుచండి... చుక్కంటే అంతేమరి..
మనం నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయని గగ్గోలుచేస్తాం...ఆ బాధ పోగొట్టడానికి ముందుచూపుతో వాడ వాడలా చుక్కల దుకాణాలు తెరచారు దయగల ప్రభుత్వంవారు. పవిత్రమైన ఓటువేసే వాడిపై
(చుక్కవేసుకుని మరీఓటు వేసేవాడిపై) అంతప్రేమ.

అసలీ చుక్కగొడవ నీకెందుకయ్యా అని మీరనొచ్చు. చుక్కమీది మక్కువ ఎందుకంటే మేమున్నది..చుక్క అప్పల స్వామి రెడ్డి గారి మేడ ప్రక్క వీధిలో...
మీరుమాత్రం తక్కువ తిన్నారూ..? ఏం చేసానంటారా... అంతర్జాలంతో ఆడుకుంటున్నారా? అదంతా మరి చుక్కలే కదండీ... సో అండ్ సో చుక్క బ్లాగ్ స్పాట్(అదీ చుక్కే) తర్వాత చుక్క ఆ తర్వాత కామ్..
సో అండ్ సో జిమెయిల్ చుక్క కామూ.,
చుక్క కో;
చుక్క ఇన్నూ.
ఈ జగమంతా చుక్కల మయమూ...
ఇతి . . . .చుక్కోపనిషత్ సర్వం సంపూర్ణం... ఏతత్ ఫలం మీకే సమర్పయామి.
____________________________________________________________________________________________________________________________________________________________________
{మిత్రులు శ్రీ కె.వి.శాస్త్రిగారు వైజాగ్ నుంచి మాట్టాడుతూ..."శ్రీ రమణ ఏదో మేగజైనులో చుక్కమీద వ్రాసారండి బాగుంది..చూసారా" అని అడిగారు. అది నేను చూడలేదు..కాని నా కొచ్చిన ఆ చుక్క ఆలోచన పైవిధంగా రూపొందింది... సారూప్యాలుండవచ్చు, నిజాలు కదా.
చిన్నమనవి.. చుక్క ఆలోచనంటే అపార్థం చేసుకోకండి ప్లీజ్.....}
--- ---- ----- ------- ------ ------ ------- ------- - ------- ---

4 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

చుక్కల మీద వ్రాసి చుక్కలు చూపించిన మీ వ్యాసం చుక్కగా సారీ చక్కగా వుంది. ఎంత పెద్ద చందమామైనా చుక్కల్లో వున్నపుడే అందంగా
అగుపిస్తాడు.మన రాత ఆగాక చివర చుక్కుండాల్సిందే! అంతా చుక్క ప్రభావమే.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చుక్కలు చుక్కలు అంటూ చుక్కోపనిషత్ బోధించేసారు. కాసిని చుక్కలు మాకు ఉంచారా లేదా. :))

Vinjamuri Venkata Apparao said...

హనుమంతరావు గారు .. మీ చుక్క చాల బాగుంది.
ఎన్ని సార్లు చవి చూసానో అంతు లేదు.
ధన్యావాదాలు.

హనుమంత రావు said...

చుక్క నిలవ ఉంచితే దాని రుచి పెరుగుతుంది.. విలువా పెరుగుతుంది. ఆ రహస్యం తెలిసున్నవారు మీరు.. చాలా సంతోషం.. మరల మీరు ఫేస్ బుక్ లో షేర్ చేసి చుక్క విలువ మరి కొంత పెంచిన మీ సహృదయానికి కృతజ్ఞతలు.