Pages

Monday, November 12, 2012

దీపాల పండుగ .... దీపావళి



 







 దీపం జ్యోతిః పరంబ్రహ్మా దీపం సర్వ తమోపహరమ్
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే



దీపదర్శనము సర్వపాపాలను నశింపజేస్తుంది. మన హృదయమే ప్రమిదగా, భక్తి చమురుగా, ప్రేమ అనే అగ్నితో వెలిగించేదే దీపం. దీప ప్రాధాన్యాన్ని ఋగ్వేదం చెప్తుంది... సృష్టి, స్థితి, లయ మూడింటికి దీపంతో సంబంధం ఉంది. దీపకాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల కాంతి... స్థితి కర్త విష్ణుమూర్తికి, తెల్లని కాంతి.... లయకర్త శివునికీ, ఎరుపుకాంతి... సృష్టికర్త బ్రహ్మదేవునకు అర్థంగా చెప్తారు.

మన సంస్కృతిలో పర్వదినాలుకాని, దేవతా మూర్తులు కాని, వారి ఆయుధాలు కాని అన్నీశాస్త్రసమ్మతమైన  సంకేతములతో కూడినవే కాని కాకతాళీయంకాదన్నవిషయం స్పష్టం.. నరకచతుర్థి.. నరకాసుర సంహారానికి జ్యోతిష్యపరంగా విశేష అర్థం చెప్తారు.. నరకుడు భూదేవి కుమారుడు. అతడు మేషరాశికి సంకేతం. నరకుని పాలన అంధకార బంధురం.. దీనికి సంకేతమే మేషరాశి తూర్పుదిక్కుగా సూర్యాస్తమయ సమయాన ఉదయించి (తెల్లారేసరికి) అస్తమిస్తుంది. ఆ సమయానికి తులారాశి తూర్పున కనబడుతుంది. స్వాతి నక్షత్రాధిదేవత వాయువును అధిష్టించి నరకుని మీదకు బయలుదేరిన శ్రీకృష్ణుడు సూర్యునికి ప్రతీక. సత్యభామ చంద్రుడు. నరకుడు అస్తమించగానే అంచులమీద దీప ఛాయలతో ఉన్న కన్యారాశి (కొన్నినక్షత్రాల సమూహం) తమకి విముక్తిని కలిగించిన సూర్యుని చుట్టూ చేరతాయి... అది చెప్పడమే కృష్ణుని వరించడం....
నరకుడన్న ఉపగ్రహం భూమిచుట్టూ తిరుగుతూ, భూ కక్ష్యలోనికి వచ్చి, భూమిని ఢీకొనే ప్రమాదం ఏర్పడగా శ్రీ కృష్ణుడు తన ప్రజ్ఞతో దానిని ఆకాశంలో ప్రేల్చగా ఆ ముక్కలు వాతావరణం రాపిడికి అంటుకుని ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయని, ఆ వెలుగుల జిలుగులే ఈనాటి దీపావళి కాంతులు అని ఒక భావన.

కాలక్రమంలో మన సంస్కృతితో పాటు దీపావళి ఉత్సవం కూడా దేశ దేశాలకూ విస్తరించింది.  పై ఆచారాలు కొన్నిటితో ఒక్కొక్క దేశంలో దీపావళి పండుగ ఒక్కో విధంగా జరుపుకోవడం కనిపిస్తుంది.
సయామ్ (ఇండోచైనా)లో ఈ ఉత్సవం రాజకీయ మహోత్సవంగా జరుపుతారు.
చైనా ప్రజలు క్వాన్(అర్థనారీశ్వరుడు) అనే పేరుతో దేవపూజ చేస్తారు. చైనా తత్త్వవేత్త కన్ ఫ్యూషియన్ దేవీపూజా విధానాన్ని తన మతగ్రంథంలో వివరించాడు. చైనా ప్రజలు తమ గుమ్మాల వద్ద ఎర్ర కాగితాలతో జయవిజయులను తయారుచేసి నిలబెడతారు. తమభాషలో మైక్ శైన్ అని పిలవబడే ఈ ద్వారపాలకులను ఉంచడంవలన ఏడాది పొడుగునా భూత ప్రేత పిశాచముల పీడ ఉండదని వీరివిశ్వాసం.
జపాన్ లో దీపావళి మూడురోజులపాటు సామూహిక ఉత్సవంగా జరుగుతుంది. మొదటిరోజు ఊరిబయట దీపాలతో అలంకరించిన తోటలోకి,  దీపాలతో అలంకరించిన బళ్లపై జట్లు జట్లుగా వెళ్తారు... రెండవరోజు నూతన వస్త్ర ధారణ, విందుభోజనాలు. పెద్దలున్న తావుకు వెళ్లి వారి దీవెనలు పొందుతారు. మూడవరోజు పడవలపై జలవిహారం.. పడవలపైన సామూహిక భోజనాలు.నృత్యగీత వినోదాలు.. ఆ రోజు ఏ తలుపులూ మూయరట. మూడురోజులూ ఇంట్లో చీపురు వేయరు... గుడ్డతో తుడుస్తారు, నీళ్లతో కడుగుతారు కాని చీపురు వేయరు.
జావాలో, సుమాత్రాలలోనూ... భారత దేశంలో లాగుననే రామలీల, దుర్గాపూజ, దీపోత్సవం జరుగుతాయి

ఇక దీపావళి నాడు విధిగా చేయవలసినవి..
ప్రాతఃకాలంలో అభ్యంగ స్నానం.  ప్రదోషంలో దీపదానం, లక్ష్మీ పూజలను నిర్దేశించారు. ఒంటికి తైలం రాసి, నలుగుపెట్టి. (కుంకుడుకాయకాని, షీకాయకాని రసముతో)తలంటు స్నానం చేయడాన్ని "అభ్యంగం" అంటారు. తైలంలో లక్ష్మి, జలంలో గంగ, ఈ దినాన సన్నిహితులై ఉంటారని శాస్త్రోక్తి. అందుకే అభ్యంగ స్నానం ఐశ్వర్యప్రదం, పవిత్రకరం.
ప్రదోషసమయంలో (సాయంకాలం) ఇళ్లూ, వాకిళ్లూ శుభ్రం చేసి లక్ష్మీ పూజని ఆచరించాలి. అటుపై లక్ష్మీ స్వరూపంగా దీపాలను వెలిగించాలి. దీపమాలికలతో  గృహప్రాంగణాలు, దేవాలయాలు, తులసికోటలు, తోటలు మొదలైనవి అలంకరించాలి.
రాత్రి ప్రారంభంలో లక్ష్మీ పూజ, దీప ప్రకాశనం చేసినతరువాత ..విందు భోజనాల ఆరగింపు, వేడుకల తరవాత,
అర్థరాత్రి దాటాక ఇళ్లూ, వాకిళ్లూ తుడిపించాలని ధర్మశాస్త్రం చెబుతుంది.
దీన్ని " అలక్ష్మీ నిస్సరణం " అంటారు.. అంటే దరిద్రాలను తొలగించడం.

దీపావళి మరునాటినుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం సర్వదేవతలకూ ప్రీతి కరమైనది . శివారాధనకు, విష్ణ్వారాధనకు, శక్త్యారాధనకు ఇది ప్రసిద్ధి. ప్రయాసలతో, కఠోర నియమాలతో కూడిన యజ్ఞయాగాదుల అవసరం లేకుండానే, ఈ మాసంలో చేసే దీపారాథనలు, అనుష్టానాలు వివిధ యజ్ఞాల ఫలాలను ప్రసాదిస్తాయి. యజ్ఞాగ్నికి సంకేతంగా రుద్రభగవానుని ఆరాధించడం సంప్రదాయం. శివారాధన సర్వదేవతా పూజాఫలన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అగ్నికీ, యజ్ఞానికి సంబంధించిన ఈ మాసం ఆగ్నేయుడైన సుబ్రహ్మణ్యునికి ప్రీతి పాత్రమైనది. ఈ పూర్ణిమకు కుమార దర్శనం అని పేరు ఉంది. ఆ రోజున దేవతలందరూ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారని పురాణవచనం. విష్ణుపరంగా .. కార్తీకం చాలా ప్రసిద్ధి. ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ధిద్వాదశి తులసీ వనంలో స్వామిని అర్చించే పర్వం. ఈ మాసానికంతటికీ విష్ణువు దామోదర నామంతో అధిపతిగా ఉన్నాడు. సర్వలోకాలను తనలో దాచుకున్న పరతత్త్వమే దామోదరుడు. అందుకే ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా " కార్తీక దామోదర ప్రీత్యర్థం "అని సంకల్పించడం ఆనవాయితీ...

మన హైందవ సంప్రదాయంలోనే కాక జైన, బౌద్ధ ముస్లిమ్, క్రైస్తవ సంప్రదాయాల్లో సహితం దీపారాధన సంప్రదాయం ఉంది. ఆ యా సంస్కృతుల ప్రకారం ప్రతివారికీ దీపావళి అత్యంత పుణ్యప్రదమైన శుభపర్వదినం.
దీపారాధనలో విద్య, శక్తి, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతీ, దుర్గ, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. దీపకాంతులు విరజిమ్మే ఇంట లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. 

నిత్య దీపారాధన జరిగే ఇంట అశుభాలు జరుగవని శాస్త్రాలు బోధిస్తున్నాయి. వైదిక సంస్కృతిలో "దీపావళి" మహాపర్వం.
                                                                    ooooooOOOOOooooooo


(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఋషిపీఠంలోని వ్యాసాలనుండి సేకరించబడింది. )

Friday, October 12, 2012

తీసినా స్నేహం తీయనిదే !



friend ship redefined.

we two with jahnavi
with bulusu subrahmanyam garu .. blog friend

"సృష్టిలో స్నేహం తీయనిది"  అని పెద్దలు అన్నారు..
"ఎవరన్నారు.. మేం తీసాంగా" అన్నారు పెద్దలు రమణగారు, బాపు గారూనూ...
నిజమే బాపుగారు, రమణగారు స్నేహం తీసారు.. తీయక ముందు.. తీయని స్నేహం రుచి రమణగారు, బాపుగారు.చూసారు కదా ?.. రుచి తెలిసాక కదా స్నేహం చేసారు... అప్పుడు కదా స్నేహం తీసారు...తీసిన ఆ (తీయని) స్నేహం అప్పుడు కదా వేసారు...  వేసారు కనుకనే కదా  ఆ స్నేహం ఎంతో మంది చూసారు... గొప్పగా ఉంది కనుకనే కదా  అదీ స్నేహంఆంటే  అనేసారు...  తీసినా స్నేహం , తీయనిదే కదా..అన్నారు అందరూ....అంచేత చూసినా, చేసినా, తీసినా, వేసినా...ఏంచేసినా, ఎన్ని అనేసినా స్నేహం తీయనిది..
.

నేను పలాసాలో ఉద్యోగిస్తున్నప్పుడు... మా అన్నయ్యను చూడ్డానికి పార్వతీపురం వెళ్తూ ఉండేవాణ్ణి.. అన్నయ్య అక్కడుండేవాడు.. పలాసానుంచి శ్రీకాకుళం బస్సులో వెళ్లి అక్కడనుంచి పార్వతీ పురం మరో బస్సెక్కి వెళ్లాలి.. అప్పుడు ప్రైవేట్ బస్సులుండేవి. ఆర్.టి.సి కాదు. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వెళ్లే అలాంటి ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవరు రామారావు.. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం చేరడానికి మూడుగంటల సమయం పట్టేదనుకుంటా... ఈ బస్సు వెడుతుంటే రోడ్డుకిరుప్రక్కల చిన్నపిల్లలు చేరిపోయేవారు.. తమాషా ఏంటంటే ఈ బస్సు డ్రైవరు రామారావుకి వాళ్ళందరూ దారిపొడుగునా నమస్కారములు చెప్పేవారు.. హలో అనేవారు... పిలిచేవారు... రామారావు కూడా అందరినీ పలకరిస్తూ బస్సు నడిపేవాడు. హలో అనేవారిని హలో అనేవాడు. నమస్కారములు చెప్పేవారికి నమస్కారమనేవాడు... పలకరించేవారిని నవ్వుతూ పలకరించేవాడు.. అలా పలకరించడానికి అవసరమనిపిస్తే బస్సు స్లో కూడా చేసేవాడు.. "ఒరేయ్... ప్రక్కకుండండిరా.. వెహికల్స్ వస్తాయి." అని హెచ్చరించేవాడు... ఇతడి పలకరింపుతో పులకరించిపోయి ఆనందంతో గంతులేసేవారు ఆ పిల్లలు... నేను ఎప్పుడువెళ్లినా ఈ దృశ్యం తప్పక కనిపించేది.. రామారావు ముఖాన ఎప్పుడూ విసుగూ కోపం చూడలేదు.. ఆ పిల్లలు ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు.. అదీ స్నేహమే కదా....

రాజమండ్రిలోని పుష్కరఘాట్ కు దగ్గరగా ఉన్న మునిసిపల్ హైస్కూలులో చదువుకునే వాణ్ణి.. పేపరుమిల్లు నుంచి ఆర్యాపురం మీదుగా స్కూలుకు వెళ్లే వాళ్లం.. ఆర్యాపురం మధ్య వీథిలో చివర కుడి ప్రక్కగా కొణితివాడ జమీందార్ గారిల్లు.. ఎర్రరంగు శరీర చ్చాయ, తెల్లటి పంచె, తెల్ల చొక్కా.. తెల్ల జుత్తు... నవ్వు పులిమిన ముఖము.. స్కూలుకెళ్లే పిల్లలందరూ ఆయనకు నమస్కారము పెట్టి స్కూలుకి వెళ్లేవారు... నేనూ అంతే... అందర్నీ నవ్వుతూ పలకరించే ఆ పెద్దల స్నేహం ఓ తీపి జ్ఞాపకం...

అప్పుడెప్పుడో 1977-78 మధ్య మా అమ్మను తీసుకుని, మా దంపతులం మా ఆఖరి పాపతో సహా రామేశ్వరం వెళ్లాము.. మా అమ్మ అప్పటికే డెబ్భై సంవత్సరాల పైబడి వయస్సు. ఏవో కారణాల వలన నడుము బాగా వంగిపోయింది.... మనోబలంతో వచ్చి యాత్రలు చేస్తున్నది... సరే ! సాయంత్రానికి రామేశ్వరము చేరి మరునాడు ఆ క్షేత్రంలో చేయవలసిన కార్యక్రమములు జరిపించుటకు పురోహితుని మాట్లాడుకుని, రాత్రి ఫలహారానికి హోటల్ కు వెళ్తే... మమ్ములను వెతుకుతూ ఒక యువకుడు, తన తలిదండ్రులను వెంటబెట్టుకుని  మా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు...  మేము కుదుర్చుకున్న పురోహితులే వారికీ కుదిరారట... వారికి మా గురించి ఆయనే చెప్పారట. ఆ పెద్దాయన ఆర్.టి.సిలో ఇన్స్పెక్టరుగా ఉన్నారట.. రెండేళ్లలో రిటైర్ కానున్నారట....అంతవరకు బాగానే ఉన్నది.. కాని, ఆఫీసు ట్రైనింగుకని దగ్గర ఉన్న గ్రామానికి వచ్చిన ఆ యువకుడు.. తాను ట్రైనింగుకు వెళ్లిపోతున్నానని, తన తలిదండ్రులు మాతో వస్తారని... మీతోపాటు మీరేమేమి చూస్తే అవి చూడ్డానికి వస్తారని, వారి ఖర్చులు వారే పెట్టుకుంటారని చెప్పి ... ఫైనల్ గా వారిని మద్రాసులో వదిలేస్తే వారు హైదరాబాదు చేరతారు అని చెప్పాడు.. వారిని ఒక్కరినీ పంపించాలంటే కొంచెం భయంగా ఉంది అన్నాడు.. దానికేం పంపించండి..మాకూ తోడుంటుంది అన్నాము... మా యాత్ర రామేశ్వరములో మరునాడు ప్రారంభమైంది.. అక్కడ వివిధ రకాలు తీర్థాలు అంటే పుష్కరిణులు, నూతులు వాటిలో స్నానాలు.. దర్శనాలు అవీ  అయ్యాక.. రామేశ్వరమునుంచి ప్రక్కనున్న మండపం అనే ఊరు చేరి ఆ ఊరికి దగ్గరలో ఉన్న దేవీ పట్నం వెళ్లాము.. అక్కడ నవ పాషాణాలు... పురాణకథ ప్రకారము. శ్రీరామచంద్రుడు ప్రతిష్టించబోయిన నవగ్రహాలను సముద్రుడు ముంచ బోయాడుట..శ్రీరాముడు కన్నెర్రజేసాడు.. సముద్రుడు అణిగాడు... ప్రతిష్టించిన తొమ్మిదింటిలో కొన్నిఅప్పటికే ములిగాయి కాని కొన్ని నీటి మట్టానికి పైకే ఉంటాయి.. సముద్రంలోకి వెళ్లి అక్కడ నవగ్రహార్చన చేయాలి.. కాని  అక్కడకు కొంచెం దూరంగా లక్ష్మణ తీర్థం అని ఒక పుష్కరిణి ఉంది..  ముందు అందులో స్నానం చేద్దామని వెళ్లాము.. పాపకు స్నానం చేయించాము,..మా అమ్మ స్నానం చేసి పాపను ఒళ్లో కూర్చో బెట్టుకుని గట్టు మీద ఉంది.. నా స్నానం అయి అటు తిరిగి తుడుచుకుంటున్నాను.. ఇంతక్రితం పుష్కరిణిలలో చేపలకు భయపడి స్నానం మ్రొక్కుబడిగా పూర్తిచేసిన మా శ్రీమతి కొంచెం ఉత్సాహంగా స్నానానికి దిగింది.. కంగారులో మెట్టు తప్పింది.. మధ్యకు వెళ్లి పోయింది.. ఒక ములక..మరల ములకవేస్తూ చేయి పైకెత్తిందట, రామేశ్వరంలో పరిచయమైన ఆ పెద్దాయన ఒక్క సారి నీళ్లలోకి దిగి ఆవిణ్ణి గట్టుకు లాగేసారు.. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది.. అటు తిరిగిఉన్న నాకు ఆవిడ గట్టుమీదకు లాగబడ్డాక అమ్మ కంగారుగా మాట్లాడినప్పుడు విషయం తెలిసింది.. ఆయనను అడిగా "మీకు ఈత వచ్చునా" అని రాదన్నారు... ఆవిడ ములిగిపోతోంది లాగేయలనిపించింది, లాగేసాను అన్నారు.. నేను తనకి సాయం ఉంటానని ఆ అబ్బాయి ఈయన్ని నాకప్పజెప్పాడు, కాని ఇప్పుడెవరికెవరు సాయం...ప్రాణానికి తెగించి మా కుటుంబానికి ప్రాణం పోసిన ఆ భగవత్ప్రసాదితమైన స్నేహ మాధుర్యం మరవగలమా....


ఇది జరిగిన ఇరవై ఏళ్ల పైన గడిచాక నా అడ్రస్సు .. ఎలాగో సంపాదించి ఆయన ఉత్తరం వ్రాసారు... తన భార్య గతించిందని, తాను ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న తన కొడుకు దగ్గర ఉన్నానని... శ్రీరామునికోసం ఎదురు చూస్తున్న శబరిలా మృత్యువుకోసం ఎదురుచూస్తున్నానని వ్రాసి... మా పరిచయాన్ని గుర్తుచేస్తూ... వీలైతే ఆ ఉత్తరానికి జవాబు వ్రాస్తే ఆనందిస్తానని వ్రాసాడు.. మా ఇద్దరికీ కన్నీరు ఆగలేదు.. అప్పటికే హైదరాబాదు ప్రయాణమున్నది కనుక, హైదరాబాదు చేరగానే వారుంటున్న bhel క్వార్టర్స్ కు వెతుక్కుంటూ వెళ్లి ఆ ప్రాణదాతకు ప్రణతులు సమర్పించుకున్నాము.. వృద్ధాప్యము, చెవులు వినపడవు, చూపు మందగించింది.. కొడుకూ, కోడలూ ఉద్యోగానికి వెళ్లడం వలన ఇంటిలో లేరు.. స్వయంగా మేము వచ్చామన్న ఆనందం ఆయన మాటలోనూ.. సజల నయనాలలోను ప్రస్ఫుటమైంది.. ఏ.. టీ కాఫీ ఈయలేకపోతున్నానని బాధ పడ్డారు.. అది ఆయన సంస్కారము.. ఇప్పటికే ఎంతో ఋణపడ్డ మాకు ఇంకా ఏదో ఇద్దామనే ఆయన ప్రేమ... కన్నీటితో సాగనంపారు... నేనూ మా ఆవిడా...నీరు నిండిన కళ్లతో గృహోన్ముఖులమయ్యాము.. ఆయనగురించి మరల తెలియలేదు......ఇది జరిగి పదేళ్లయింది... ఈ స్నేహానికి విలువ కట్టగలమా ?

చదువుకునే రోజుల్లో స్నేహాలు ఉంటాయి.. అవి మరల కొనసాగే అవకాశము తక్కువ. ఉద్యోగంలో స్నేహాలు  అన్నీ ఆత్మీయమనలేము కాని, మనల్ని బట్టి దగ్గరౌతాయి.. కొనసాగుతాయి.. అలా రిటైర్ అయ్యాక కూడా రోజూ పలకరించే స్నేహితులు ఉండడం నాకో అదృష్టము...  ఓ కార్యక్రమంలో నిర్వహణలో ఒకనిగా నా ఫోను నెంబరు ఋషిపీఠంలో చూసి ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నారు.. ఆతడు మద్రాసులో ఉంటారు.. ఆత్మీయత పెంచుకున్నారు.. శ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు కంచిలో జరిగినప్పుడు  చాలాకాలం తర్వాత ఈ మిత్రుడు నేనూ కలసుకోవడం జరిగింది.. ఎంత అభిమానము చూపారో చెప్పలేను.. నేను వయస్సులో పెద్దవాణ్ణనే గౌరవంతో అక్కడక్కడ నా లగేజీ కూడా తాను అందుకోబోయేవారు.. నాకేవేవో పుస్తకాలు బహూకరించారు... ఇప్పటికీ ఫోనులో పలకరిస్తూనే ఉంటారు.... అలాగ్గానే బ్లాగులు, ఫేస్ బుక్ లు వచ్చిన తర్వాత ఎంతో మంది మిత్రులవుతున్నారు.. బ్లాగులో మిత్రులైన శ్రీ బులుసువారు సతీ సమేతంగా రాజమండ్రి వచ్చి  మా ఇంటికి వచ్చిన ఆ సౌజన్యానికి విలువ కట్టగలమా ?


సుమారు ఎనిమిదేళ్లకు ముందు తిరుపతి వెళ్లి నేనూ మా శ్రీమతీ రాజమండ్రి వస్తున్నాము.. మా బర్త్ కు ఎదురు బర్తులమీద ఒక ఫామిలీ.... దంపతులు, ఒక చిన్న పాప (సుమారు నాలుగైదు సంవత్సారాలుంటాయి), చిన్న బాబు... ఎక్కారు.. ఆ పాప చాలా కళగా ఉంది.. మాట్లాడే తీరు మా దంపతులను ఆకర్షించింది... "నాన్నగారూ ", " అమ్మా" అనే తలిదండ్రులను సంబోధిస్తున్నది.. మమ్మీ డాడీ క్లల్చరు కాదు..దారి పొడుగుతా కుతూహలంతో ఎన్నో ప్రశ్నలు..ఆయా స్థల విశేషాలు తండ్రిగారిని అడిగి తెలుసుకుంటున్నది.. నేను ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరడిగా.. "జాహ్నవి" అంది. "అంటే ?".... "గంగ" అని తానే చెప్పింది..అడిగిన వాటికి చక్కటి సంస్కారముతో జవాబులు చెప్పింది.. మా ఆవిడ ఆ అమ్మాయి చేత పాడించుకుంది.. తను ఓ పాట ఆ అమ్మాయికి నేర్పింది... వాళ్లు బిలాస్ పూర్ లో ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నారు.. మరునాడు కనకదుర్గమ్మ దర్శనానికని  విజయవాడలో వాళ్ళు దిగారు, మేము రాజమండ్రి వచ్చేసాము.. తర్వాతరోజు విజయవాడలో దేవి దర్శనం అయ్యాక అక్కడనుంచి బిలాస్ పూర్ వెళ్తూ రాజమండ్రి దాటుతుండగా నేనిచ్చిన ఫోన్ కు ఫోను చేసి...."తాతయ్యా... మీ ఊరు గోదావరి ఇప్పుడే దాటుతున్నాము.. మీరు  బాగున్నారా ?" అంటూ పలకరించింది... తర్వాత రెండు మూడుసార్లు ఆ తండ్రిగారు ఫోను చేసారు... తర్వాత మేము ఇల్లు మారడం, సెల్లు మారడం... నెంబరు మిస్సయింది.. కొంత కాలం తర్వాత... ఆయనకు ఫోన్ నెంబరు దొరికిందట ఆయన ఫోన్ చేసి ... జాహ్నవి తాతగారిదగ్గర సబ్బవరంలో చదువుకుంటోంది.. ఫోన్ చేయమని ఫోన్ నెంబరు ఇచ్చారు.. రాత్రి పదిగంటల వేళ ఫోన్ చేసాను.. వాళ్ల అమ్మమ్మగారు ఫోన్ తీసారు.. జాహ్నవి ఉందా... అంటే పడుకుందండీ, మీరెవ్వరు... అన్నారు.. నేను రాజమండ్రి నుంచి అన్నా.. ఆవిడ రాజమండ్రియా అండీ అంటున్నారు.. ఆ మాట విన్నవెంటనే నిద్రలేచిన జాహ్నవి "రాజమండ్రీ తాతయ్యా..." అంటూ అమితోత్సాహంతో ఫోన్ తీసుకుని మాట్లాడింది... ఆ తర్వాత తరచు మాట్లాడటం... ఈ మధ్య ఆ ఫామిలీ మరల తిరుపతి వెళ్లారు... వెళ్లి తిరుగు ప్రయాణంలో విజయవాడలో దిగవలసిఉన్నా దిగకుండా రాజమండ్రి వచ్చి మా ఇంటికి వచ్చారు.. ఎనిమిదేళ్ల క్రితం పరిచయం... మధ్యలో మరల కలవలేదు... మన ఊరు కాదు... కానీ ఏమిటో ఆ ఆత్మీయత... సాయంత్రందాకా ఉన్నారు.. మా జాహ్నవి ఇప్పుడు సెవెన్త్ క్లాస్.. మార్కులు 98 %  దాకా వస్తాయిట.. ఎంత సంస్కారమో.. తనకి వచ్చినవి... అడిగితేనే కాని ప్రకటించుకోదు.. ఆ వయస్సు పిల్లల అల్లరి లేదు.. అలా అని ముంగిలా కూచోదు.. నవ్వుతూ పలకరిస్తుంది.. ఆప్యాయంగా ఉంటుంది.. "తాతయ్యా .. మీకోసం తిరుపతిలో కొన్నాను" అంటూ రాగానే అన్నమయ్య కీర్తనలకు పద్య రూపంగా ఉన్న ఓ పుస్తకం బహూకరించింది... ఆ అమ్మాయి అభిరుచులు నాకు తెలియవు. ఎవరికైనా ఉపయోగమే కదా అని ఇంగ్లీష్..టు..ఇంగ్లీష్...తెలుగు డిక్షనరీ కొని ఉంచాను. అది ఇచ్చాను... నీకు ఉపయోగమని ఇది నీకోసం కొన్నానంటే .. నవ్వుతూ తీసుకుంది.. నీ దగ్గర ఏదైనా ఉందామ్మా.. అని అడిగాక... "ఆక్స్ ఫర్డ్" ఉంది తాతయ్యా అని అప్పుడు చెప్పింది.. "పెద్దవారు కూడా మనమేదైనా ఇస్తే .. ఓస్ ఇదా ఇది నేనెప్పుడో కొన్నాను" అనే సంస్కారులను చూస్తూనే ఉంటాము... ఆ అమ్మాయి.. హుందాతనానికి ముగ్ధులమైనాము మా దంపతులము.. జాహ్నవి తండ్రిగారు మాతో పరిచయానికి ఎంతో మురిసిపోతూ మాట్లాడారు.. ఎక్కడో ఎప్పుడో రైల్లో కలసిన ఈ పసి స్నేహం... ఏమని నిర్వచించగలము..?

అంచేత చూసినా, చేసినా, తీసినా, వేసినా...ఏంచేసినా, ఎన్ని అనేసినా స్నేహం తీయనిది... తియ్యనిది..

Friday, September 21, 2012

కష్టాలు కూడా ఇష్టమౌతాయిట... ఎలాగట....



మోదకప్రియుడు బొజ్జ గణపయ్య ప్రమోద ప్రియుడు...
అందుకే ఈ ప్రమోదాలు సమర్పయామి..........



                                .....ఇ లా గ ట !
                                     (రచన: డి.వి.హనుమంతరావు... 14, జులై, 2010)

                                 -------                          ---------                        --------                                                       

కామన్ మేన్:      (ఆటోను పిలుస్తూ)  బాబూ... ఆటో...
ఆటో వాలా:       చెప్పండిసార్ ! ఎక్కడికి ?
కా.మే:        దగ్గిర్లో మంచి భోజన హోటలుందా ?
ఆ.వా:        ఊఁ ! తీసికెళ్తాను... ఎక్కండి.. యాభైరూపాయలవుద్ది..
కా.మే:        ఏం ? అంత దూరమా ?
ఆ.వా:        ఎక్కండి సార్, ట్రాఫిక్కులో ఆపితే కేసు రాసేస్తారు...
        (ఎక్కిన కాస్సేపటికే ఆటో ఆగింది.)
కా.మే:        అప్పుడే ఆపేసావేంటి..?
ఆ.వా:        దిగండీ..ఇదే హోటలు.. ఏభై ఇయ్యండి...
కా.మే:        ఇదేంటయ్యా..? ఈ కాస్త దూరానికే యాభైయ్యా...?
ఆ.వా:         అసలు మినిమమ్ అరవైయండి..ఏదో పెద్దారిలా ఉన్నారని తగ్గించా.. పెట్రోలు, డీసిలు పెరిగిపోయింది..    
                   తెలుసా ?    అసలు పేపరు సదవరేంటి గురూ గారు ?
కా.మే:        నిజమేఅనుకో..
ఆ.వా:        సార్.. మీకు తెలవదేమో... మేంకూడా ఆటో అడిగితే యాభై, ఆటో ఎక్కితే డెబ్భై 
                  చేసేద్దామని ఆలోచిత్తున్నామండి.. రేపు యూనియన్ మీటింగ్ లో తేలిపోద్ది...ఆఁ...

కా.మే:        (హోటల్ బోర్డ్ చూస్తాడు)... హోటల్ "సై" - పేరు బాగుందే ! (లోపలకు వెళ్తాడు)
హొటల్ వాలా:     రండి సార్ ! భోజనమా....?
కా.మే:        అవునండీ...
హొ.వా:        వెజ్జా .. నాన్ వెజ్జా ?
కా.మే:        వెజ్జే.... ఆకలి దంచేస్తోంది...
హో.వా:    మా హోటల్లో కస్టమర్ ఛాయిస్... మీరే చెప్పండి.. ఏం కావాలి ? ఎర్ర వంకాయ 1975, పచ్చ గుమ్మడి కాయ             1996, టమోటారూట్ తో  దాల్ ఫ్రై, గుజరాత్ రసం, బెంగాల్ సాంబారు, మహరాష్ట్ర స్పెషల్...ఛాయిస్ చెప్పండి ?
కా.మే:        ఏదో ఒకటి ఇయ్యండి .., చెప్తుంటేనే ఘుమ ఘుమ లాడిపోతోంది.. ఎంతో చెప్పండి...
హొ.వా:        అయితే ఓపని చేయండి.. ఎకానమీ డిష్...డెబ్భై ఇవ్వండి..  చాలా బాగుంటుంది..
కా.మే:        రేటు ఫర్వాలేదే...
హొ.వా:        మరేమిటనుకున్నారు.... ఒరేయ్ .. అయ్యగారికి పావు .. పప్పూ దప్పలం, సెవెన్టీ ఫైవ్, రూట్, మహరాష్ట్ర..
సర్వారావు:    ఇక్కడింకా కస్టమర్సున్నారు,, కూకోమనండి....
హొ.వా:        ఈయన ఆకలి మీదున్నాడ్రా... ఒరేయ్ ఆ గళ్ల లుంగీ ఆయన ఎకానమీ...అరగంట అయిపోతున్నాది...                              అక్కడ లాగేయ్    ..ఈయనకి తగిలించు... (కా.మే తో)ఎళ్లండి...(స.రా తో) గొట్టం కడగరొరేయ్...బొట్టు 
                    అదీ   పెట్టి  భక్తుడులాగా 
ఉన్నాడు...పాపం....
కా.మే:        తగిలించడమేమిటీ ? పావు అంటారేమిటీ ? నాకంతా అయోమయంగా ఉంది..
స.రా:        ఏం అయోమయంలేదండీ... రండి... కూకోండి నే సెప్తాను....
కా.మే:        ఏంటయ్యా బాబూ... టేబులేది ? కుర్చీ ఒకటే ఉందేమిటి... ఆ గొట్టాలేంటి ?...
స.రా:        ఊఁ .. గొట్టాం తగిలించేను...ముందు టమోటా పప్పు... పీల్చండి., ఆఁ ఇప్పుడు వంకాయ 75 .. పీల్చండి.. ఘుమ         ఘుమలాడిపోతోంది.. ఓ.కే... పావుగంట దాటిపోయింది.. గొట్టాం తీసేశా... ఇంక పీల్చకండి.. ఎక్ స్ట్రా                అవుద్ది..ఆపేయండి....
కా.మే:        ఏంటీ... ఈ కాస్సేపూ పీల్చి... డెబ్భై ఇయ్యాలా... కనీసము పెరుగూ అన్నం పెట్టండ్రా బాబూ.. నీరసం                 వచ్చేస్తోంది..మొర్రో...
స.రా:        పెరుగూ అన్నానికి వాసనేం ఉంటుంది సారూ... పీల్చడానికి, అంచేత నో కర్డ్....
కా.మే:        ఇదేం హోటల్రా బాబూ... వాసన చూడ్డానికి ... అవ్వ... డెబ్భై రూపాయలా...
హొ.వా:        మరేంటి సార్... కూరలు, పప్పులు, గాసూ అన్నీ అలా పెరిగిపోతున్నాయి... ఇది కూడా కిట్టటం లేదు..
కా.మే:        ఐతే...
హొ.వా:        అందుకనే హొటల్ చూ.క.చూ ప్లాన్ చేస్తున్నాము...
కా.మే:        చూ.క.చూ.... అదేంటి....చైనా కొలాబరేషనా బాబూ...
హొ.వా:        కాదు బాబూ...ఇది హొటల్ సై.. అంటే smelly...మొదటి అక్షరము యస్, చివరక్షరము వై కలిపి...సై.. అది చూకచూ..         అన్నీ ఫస్ట్ క్లాస్ .. కూరలూ, పప్పులు, మసాలాలు అన్నీ మొదటి రకం సరుకు వాడతాము.. బాగా వండి..అందంగా         గార్నింగ్ చేసి.. చక్కగా ప్లేటులో పెట్టి...
కా.మే:        అదీ.. అలాగైతే ఓ రూపాయెక్కువైనా ... అందరూ వచ్చి తిని, చక్కగా ఆశీర్వదిస్తారు కూడానూ...
హొ.వా:        వినండీ...అలా ప్లేటులో పెట్టిన ప్రతీ ఐటమ్ కు చక్కగా ఫోటోలు తీసి, కస్టమర్స్ ను ఎ.సి. రూమ్ లోకి తీసుకెళ్లి, మా         స్వంత ఖర్చులతో కొన్న కంప్యూటర్ ద్వారా ఆ చక్కటి ఫోటోలు ప్రదర్శిస్తాము..పావుగంటకి నూట యాభై దాకా చార్జీ         ఉంటుంది ..లేకపోతే వర్క్ అవుట్ కాదు.... ఎ.సి., కంప్యూటర్ పెట్తాం కదా...... చాలా సెంటర్స్ లోఈ చూ.క.చూ క్లిక్         అయిందని సమాచారం....
కా.మే:        బావుంది నాయనా.. చాలా బావుంది... ఇంతకీ చూ.క.చూ అంటే ?
హొ.వా:        అంటే... చూడు కళ్లెట్టుకు చూడు....చూ.క.చూ....
స.రా:        నడవండి సార్, ఇంకా బోల్డు మంది లైనులో ఉన్నారు....మాకిది బిజినెస్ టైము...
        (కామన్ మేన్ బయటికి వచ్చాడు..)

కా.మే:        బాబూ ! ఇక్కడ బెల్టు షాపు ఏమైనా ఉందా ?
షాపువాలా:    రండి.. ఇదే బెల్టు షాపు..
కా.మే:        బాబూ ! నాకు సరిపడే ఓ మంచి బెల్టు చూపించమ్మా...
షా.వా:        ఒరేయ్ ! గురూగార్కి ఓ పెగ్... గ్లాసు శుభ్రంగా కడుగొరేయ్... బాబూ ! తినడానికేమైనా ఈ మంటారా ?
కా.మే:        పెగ్గేమిటి... గ్లాసు ఏమిటి నాయనా ? నేనడిగినది నడుంకి తోలు బెల్ట్...
షా.వా:        ఓస్..అదా...ఆ బెల్టు షాపు లిప్పుడెక్కడున్నాయండీ... ఇపుడన్నీ ఈ షాపులే...
కా.మే:        ఆఁ ?
షా.వా:        బాబూ ! మీకో రహస్యం చెప్పనా ?
కా.మే:        చెప్పు.. వినక తప్పుతుందా ?
షా.వా:        మా షాపులో శుభ్రంగా నాలుగు పెగ్గులెయ్యండి... మిరపకాయ బజ్జీలు అరడజను నంజుకోండి... అంతే... నాస్సామి         రంగా... పాంటుందో లేదో కూడా తెలియదు.. అన్నీ మరచిపోతారు.. అప్పుడు ఇంక బెల్టే అక్కరలేదు...
కా.మే:        బాగుందయ్యా... చాలా బాగుంది... తనది కాకపోతే .....
షా.వా:        చూడండి కామన్ మేన్ గారూ... ఒక పెగ్గేసుకోండి.. ఇంట్లో బాధలు మరచిపోతారు... రెండేసుకోండి...గాసు బండరేటు         మర్చిపోతారు, మూడు... పెట్రోలు రేట్లు భగ్గుమన్నాయని మరచిపోతారు... నాలుగు... అయిదు....ఆరు.....కూరల         ధరలు ఆకాశానికంటుతున్నాయని కాని, తిరుపతి గుడికి బంగారు తాపడంకాని,  తప్పని మహాలఘు దర్శనంలో         కనపడని దేముడుకాని, ఇంటికొస్తే మీ ఆవిడగారి తిట్లు కానీ... అన్నీ ... అన్నీ మరచిపోతారు...
కా.మే:        నిజమా ?
షా.వా:        అందుకనే కదా... మన దయగల ప్రభుత్వము వారు అన్నీ ప్రియంచేసి... బెల్టు షాపులు ప్రజలకందుబాటులోకి         తెచ్చారు... మనకి ప్రియతములయ్యారు..
కా.మే:        ఏడుకొండలవాడా... వెంకట రమణా.... గోవిందా... గోవిందా...
వెంకన్నబాబు:    (ప్రత్యక్షమై) పిలిచావా భక్తా ?

కా.మే:        ఇదేమిటి స్వామీ...  అలా పిలవగానే ఇలా  చక్కా వచ్చేసావు.. నా భక్తి పెరిగిందా.. లేక ,,,,
వెం.బా:        నీ భక్తి పెరగడం కాదయ్యా... కామన్ మేనూ ! నాపరిస్థితే బాగో లేదయ్యా....
కా.మే:        అదేమిటి స్వామీ...నీ క్కూడా కష్టాలా...
వెం.బా:        ఏం చెప్పమంటావయ్యా... మీరిచ్చే మ్రొక్కులూ, డబ్బులూ నాదాకా రావటంలేదు... మధ్యలోనే నొక్కేస్తున్నారు..         నగలు మార్చేసి ఏదో బంగారంతో తాపడం చేస్తారట... వడ్డీలైనా కట్టకుండా నాకు బంగారు తాపడాలంటే..... మా         అన్న గోవిందరాజులు నమ్ముతాడా.. నన్ను అనుమానించడూ... భక్తులు వరహాలిచ్చినా.. పూజారుల అనుగ్రహం...         ప్చ్! సర్లే..ఇంతకీ నీవెందులకు పిలిచావు ?
కా.మే:        నా బాధలు నీతో చెప్పుకుందామని.. ఏం చెప్పమంటావు.. ఆకలి అంటే వాసన చూడు, వాయు భక్షణ ఆరోగ్యం             అంటున్నారు... ప్రభుత్వాన్నడుగుదామంటే ఊరంతా మద్యం చెరువులున్నాయి కదా... అందులో                 ములుగు అన్ని బాధలూ పోతాయి అంటోంది ప్రభుత్వం... ఆ ఆరోగ్యం, ఈ అనారోగ్యం మధ్యలో నువ్వేమైనా             చెప్తావేమో అంటే, నువ్వేమో...
వెం.బా:        నీ కష్టాలలో నేను గుర్తొచ్చానన్నమాట... అంతేనా... చూడు కామన్ మేనూ.. అనాయాచితంగా దొరికిన  అవకాశాన్ని         సద్వినియోగం చేసుకో.... తరించే మార్గం చెప్తా విను...
కా.మే:        చెప్పు స్వామీ...చెప్పు..చెప్పు....
వెం.బా:        ఊపిరి నిలుపు, వాయు నిరోధం చెయ్... ఏమీ తినకుండా....త్రాగకుండా...గాలికూడా భుజించకుండా... నన్నే             ధ్యానించు...ఏ ధృవ పదమో...మోక్షమో ఏదో ఒకటి ఇచ్చేస్తాను.. అదైతే నా చేతిలో పని...
కా.మే:        అదేమిటి స్వామీ... నాకింకా బతకాలని ఉంది...
వెం.బా:        అయితే నీ ఖర్మ... నే పోతున్నాను.. (అంతర్థానము ఐపోతాడు)

బె.షా:        అయ్యా... కామన్ మేనుగారూ... మీ కింకా బతకాలని ఉంది అంతేనా ?
ఆ.వా :        కష్టాలు మరచిపోయి బతకాలని ఉంది.. అంతేనా
హొ.వా:        ఆనందంగా బతకాలని ఉంది... అంతేనా
స.రా:        నవ్వుతూ బతకాలని ఉంది... అంతేనా ....
కా.మే:        బాగా కనిపెట్టారు....అంతే నర్రా... అంతే... అంతే....అంతే.....
(అందరూ)    ఐతే మాతో రండి.....
బె.షా:        ఇదే... హాసం క్లబ్....
ఆ.వా :        మీ కష్టాలను మరచిపోండి....
హొ.వా:        నెలకోసారి జరిగే హాసం క్లబ్బు కార్యక్రమాలకు రండి....
స.రా:        హాయిగా నవ్వొచ్చు...
(అందరూ):    ఆనందంగా  నవ్వుకోవచ్చు... మీరూ నవ్వించవచ్చు....
హొ.వా:        మెలడీలు, పేరడీలు పాడుకోవచ్చు....
బె.షా:        మనల్ని మనమే మరచి పోవచ్చు....

అందరూ;    మీ బాధలకు దివ్యౌషధం.... హాసం క్లబ్ నవ్వుల కార్యక్రమం......
(వైకుంఠ ధామం నుండి ఆనంద నిలయుడు, మోదకప్రియుడు... దేవతల కూడి... చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వుతున్నారు.)

                ()()()()()()()()()()()()()()()(------)()()()()()()()()()()()()()()()()









   

Friday, September 14, 2012

రాజమండ్రియే మనకు గొప్ప కదా....

రాజమండ్రి...13
రాజమండ్రి అంటే ఎంత ఇదో... 

                                                                                    ...డి.వి.హనుమంతరావు. 
రాజమండ్రి మీద నాకు ఎంతో ప్రేమ.. చెప్పాను కదండీ.....అప్పటికీ ఇప్పటికీ రాజమండ్రిని ఎవరైనా ఏమైనా అంటే నాకు భలే కోపం వస్తుంది.. అప్పుడైతే బహిరంగంగా ప్రకటించేవాణ్ణి.. ఇప్పుడు పెద్దవాణ్ణి కదా ....లోపలే  దాచుకుంటాను... ఆ రోజుల్లో ఎప్పుడైనా శలవలకు కాకినాడ వెళ్లడం ఒక సరదా...అక్కడ మా పిన్నిగారింట్లో దేవీ నవరాత్రిపూజలు చాలా బాగా చేసేవారు.. ఆ పదిరోజులు చుట్టు ప్రక్కలఊళ్లలో ఉన్న మా  బందువులు కూడా మా పిన్నిగారింటికి వచ్చేవారు... ఉదయం సాయంత్రం పూజలు, మంత్రపుష్పాలు వేద స్వస్తి .. తరవాత అందరూ కలసి భోజనాలు, సందడే సందడి... చాలా బాగుండేది... మా మామయ్యగారిది ఆ ప్రక్కనే ఉన్న వేములవాడ గ్రామం.. మా పిన్నికి పిల్లలు లేరు..  మా మామయ్యగారి పిల్లలు చదువులకోసం కాకినాడలో ఉండి పిన్నిగారింటనే ఉండేవారు... దసరా పూజలు చూడాలని, సమవయస్కులతో సరదాగా గడపాలని ఉత్సాహంగా  వెళ్లేవాణ్ణి....
మామయ్యగారి పిల్లలూ నేను కలిస్తే ఎంతసేపూ రాజమండ్రి కాకినాడల్లో ఏది గొప్ప ? ఇదే చర్చ.. పిన్నిగారిది జమీందారీ కుటుంబము.. పెద్ద ఇల్లు.. దొడ్లలో కాపురాలున్నవాళ్ల పిల్లలు కూడా కాకినాడ పక్షాన చర్చలో పాల్గొనేవారు.. వాళ్లందరూ నేనొక్కణ్ణే.. కాకినాడలో రోడ్స్ చాలా ప్లాన్డ్ గా ఉంటాయి... సిటీ బస్సులు చక్కగా పద్ధతిగా  తిరుగుతాయి... మెడికల్ కాలేజ్ ఉంది... అక్కడ అప్పట్లోనే కాన్వెంట్ ఉండేది.. కేరళ క్రిస్టియన్స్ అనుకుంటా నడిపే వాళ్లు.....సినీమా హాల్స్ అన్నీ ఒకే రోడ్ లో ఉండడం కాకినాడవాసులకు ఒక అడ్వాన్టేజ్.. ఆ పాయింట్స్ కాదనలేము...

మన ఊరిగురించి మాట్లాడదామంటే ఇరుకు రోడ్స్ మనకు  వీక్ పాయింట్.. మొన మొన్నటిదాకా రాజమండ్రి మెయిన్ రోడ్ అటూ ఇటూ లెక్కవేస్తే మూడు అడుగులు ఉండేదేమో.. గట్టిగా ఎగిరితే అటుప్రక్క కొట్లోంచి ఇటు వైపు పడొచ్చు.. నిజం !  పైగా రాజమండ్రిలో మెయిన్ గా... ఫ్లోటింగ్ పాప్యులేషన్ . ఉదయంఅవుతూనే.. అటు కొవ్వూరు, పసివేదల చాగల్లు లాంటి ఊళ్లనుంచి అమ్మలక్కలు రైళ్లలో దిగిపోయేవారు.. ఇటు తొర్రేడు, కాతేరు.. అందరూ సంపన్న కుటుంబీకులే ... అందరూ రాజమండ్రిలో బట్టలు, ఇత్తడి సామాను, బంగారాలు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల షాపింగ్ చేయడానికి వచ్చేసేవారు..... ప్రొద్దున్ననుంచి బాగా చీకటి పడేవరకు ఊరులో జనం, పొరుగూరి జనం కలసి ఆ మెయిన్ రోడ్ లో అయితే గొప్ప సందడి.  ఆ వీధి పొడుగునా నడవడానికే చాలా కష్టమయ్యేది..  అప్పట్లో మాక్కూడా  ఏ వస్తువు కావాలన్నా ఫోర్ట్ గేట్ సెంటరుకు రావలసిందే..

అంటే కోట గుమ్మం సెంటర్.. కోటకు సంబంధించిన గుర్తులు ఏవీ లేవు కాని ..ఆ చుట్టుప్రక్కల తవ్వకాలలో పాత కాలంనాంటి శాసనాలు, రాతి విగ్రహాలు కనపడ్డాయి.. కుమారీ టాకిసు దగ్గర ఉన్న రాళ్లబండి సుబ్బారావుగారి మ్యూజియంలో అవి భద్రపరచారు...... ఇప్పటికీ జనబాహుళ్యంలో ఉన్న కోట గుమ్మం, కందకం రోడ్ లాంటి పేర్లు మాత్రం రాజరికపు వ్యవస్థ ఉండేది అని చెప్తాయి.. అలాగే దొరికిన శాసనాలు, విగ్రహాలు కూడా రాజమండ్రి యొక్క చారిత్రిక నేపథ్యాన్ని గుర్తుకు తెస్తాయి..

సరే ఆ సెంటర్ కు ప్రతి చిన్న వస్తువుకు రావలసి వచ్చేది.. టూత్ పేస్ట్ కావాలన్నా బెజవాడో, ఏరుకొండో... వెళ్లాల్సిందే.... అంటే బెజవాడ వెంకన్న అండ్ సన్స్, యేరుకొండ వెంకన్న అండ్ సన్స్ అనే రెండు ఫాన్సీ స్టోర్స్ ఉండేవి.. యేరుకొండవారి షాపులో లోపలికి వెడ్తుండగానే ఎదురుగా వేంకటేశ్వరస్వామి ఫోటో పెద్దది గోడకు ఉండేది.. దాని ముందు రెండు పెద్ద కొబ్బరి చిప్పలు సరిగా సెంటరుకు పగిలి అటూఇటూ పెట్టేవారు.. చుట్టూ సీరీస్ బల్బులు వెలుగుతుంటే అగరొత్తుల ఘుమ ఘుమలు స్వాగతం పలికేవి... వెంకన్నగారు ఆ కొట్టు యజమాని.. ఆయనకు నలుగురైదుగురు కొడుకులుండేవారు.. వారందరూ శనివారం తల అంటుకున్న తలలతో, నుదుట కుంకుమతో శోభాయమానంగా ఉండేవారు....ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ పలకరించేవారు... బెజవాడ వెంకన్నగారి షాపులో పెద్దాయన సిల్వర్ హెయిర్. తెల్లటి జుట్టు.. పొట్టి చేతుల ఖద్దరు చొక్కా.... చక్కగా రిసీవ్ చేసుకునేవారు... ఇప్పుడు ఆ షాపులున్నాయి కాని, వారసులు పంచుకుని షాపుల పేర్లు రకరకాలుగా మార్చేసారు... ఇప్పటికీ అక్కడ ఉన్న ఫాన్సీషాపులు చాలా మటుకు  బెజవాడ వారి కుటుంబీకులవే..  అన్నిరకాల కుంకుమలు, పెళ్లి దండలు, అత్తరువులు, సెంటులూ.. దీపావళి వచ్చిందంటే టపాసులు అన్నీ అమ్ముతుంటారు...
స్కూలు పుస్తకాల సీజన్ వచ్చిందంటే రామా అండ్ కో, వేంకట్రామా అండ్ కో  అవే ఫేమస్.. వాళ్లు పబ్లిష్ చేసిన పుస్తకాలు పాఠ్యపుస్తకాలుగా ఉండేవి.. కాళహస్తి తమ్మారావు, రౌతు బుక్ డిపో .. ఓరియంటల్ లాంగ్ మన్స్ మొదలైనవి కూడా ఉండేవి.. కాలేజీ రోజుల్లో ఆంధ్రాబుక్ షాప్ ఉండేది శ్యామలా థియేటర్ ప్రాంతంలో... అత్యవసరమయితేనే అక్కడకు .. ఎందుకంటే ఆ ఓనర్ ... అబ్బో చాలా౦; కోపంగా ఉండేవాడు. 
గుండువారి వీధిలో ఎంత బిజినెస్ అండి బాబు.. అంతా కాస్ట్ లీ బిజినెస్.. బంగారం, వెండి అక్కడ ప్రధానంగా ... ఇప్పటికి అంతే... బాలాజీ వేణుగోపాల్ అని ఒక ఇత్తడి షాపు... మార్వాడీస్.. లోపలికి వెళ్తే పెద్ద కాంపౌండ్, ఒక పెద్ద ఇల్లు అన్నమాట.. ఒక్కో ఐటమ్ ఒక్కో గదిలో ఉన్నట్టు ఉండేది.. ఇత్తడి ఇస్త్రీపెట్టెలు, రకరకాల బిందెలు, దేముడి సామాన్లు... ఒకరకం కాదు,,, అన్నీ తలోగదిలోనూ ఉండేవి... కళ్లవేడుకగా ఉండేది... అక్కడే ఓ బంగారం వర్తకులు... శివలాల్ అని పేరు గుర్తు... మా పిన్నిగారి దత్తుని వివాహమప్పుడు బంగారం, వెండి కొనడానికి వెళ్లాం... కొనేవాళ్ళు డబ్బిస్తుంటే లెక్కెట్టుకుని అక్కడ కూర్చున్నతను ఆ ప్రక్కనున్న గదిలోకి కట్టలు కట్టి విసిరేసే వాడు .. భలే తమాషాగా అనిపించింది.. ఆ తర్వాత , హడావుడి తగ్గాక సేఫ్ లో పెడ్తాడన్నమాట...అంత హడావుడిగా ఉండేవి అక్కడ బేరసారాలు.. ఆ వర్తకుల్లో చాలామందికి అక్కడ నివాస భవనాలు కూడా ఉన్నాయి.. వైశ్యులు, మార్వాడీలు, బ్రాహ్మణులు... అందరూ ఉంటారు.. పైకి కనపడే చిన్నవీధి కాకుండా లోపల్లోపల పూతరేకు మడతల్లా ఇరుకు సందులు అందులో దివ్య భవంతులు.. ఆశ్చర్యంగా ఉంటుంది.. ఆ వీధి చూస్తుంటే వెంటనే కాశీనగరం గుర్తుకొస్తుంది.... ఇంకొంచెం ముందుకు వెడ్తే నూనె కొట్ల సందు.. అన్నీ నూనెకొట్లే... మెయిన్ రోడ్ లోనే కూరగాయల దుకాణాలు...నవ నవలాడుతూ,,పచ్చగా కనువిందుగా కూరల అంగళ్లు.. కళ్లతో చూస్తే చాలు కడుపు నిండిపోతుంది....ఈ దుకాణాలు ఇప్పుడు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోకి మారిపోయాయి.... 
వంకాయలవారి వీధి మొగదలలో అన్నదమ్ములు ఇద్దరు అరటాకులు అమ్మేవారు.. పేద్ద ఆకు.... మట్ట దగ్గరకు కోసి, అయిదేసి కలిపి అమ్మేవారు.. అయిదు ఆకులంటే ఒక కవిరి అనేవారు... ఒక కవిరి కొంటే ముచికాకులు అయిదూ కాక, చిన్న చిన్న ఆకులు పన్నెండో పదిహేనో అయ్యేవి.. పదిహేనుమంది సునాయాసంగా వాటిలో తినడానికి వీలుండేది... సుమారు మూడు నాలుగు  అడుగుల పొడుగున్న అంత పెద్ద అరటాకుల కట్ట ఇంటిదాకా ఆకు చిరగకుండా తేవడం ఒక ఫీట్..  ఇప్పుడు ఆ కవిరే అయిదు ముచికాకులు ఇస్తారు..చిరగకుండా ఉంటే అయిదుగురు వాటిల్లో తినొచ్చు... అప్పుడు అది పావలా... ఇప్పుడు అయిదు రూపాయలు... అయినా మా రాజమండ్రిలోనే చవకనుకుంటాను...

కాకినాడ వాళ్లకి మన రోడ్స్ ఇరుకని వాదించేవారు... మీ రాచవీధి, మెయిన్ రోడ్ దొప్పెడుంది... అనేవారు..
నేను: నిజమే, కాని  మేం ఏదన్నా క్లాత్ బేనర్ కట్టాలంటే ఎక్కువ పురికోస లేకుండా సెంటర్ కు కట్టొచ్చు.. మీరైతే ఆ చివరనుంచి ఈ చివరికి ఎంత తాడయినా సరిపోదు.. అదీకాక అంత తాడు కట్టి చిన్న బేనరు కట్టినా అసహ్యంగా ఉంటుంది...  మెయిన్ రోడ్ లో మేమైతే వర్షం వచ్చినా  షాపు నుంచి షాపుకు తడవకుండా వెళ్లొచ్చు.. ఆసదుపాయం మీకేది..? పెద్ద రోడ్ అయితే ఆ చివరొకడూ, ఈ చివరొకడు.. ఒకడికీ ఒకడికి పొత్తేది.. మా ఊళ్లో రాసుకు, పూసుకు తిరుగుతుంటే ఆప్యాయతలు తొణికిసలాడతాయి... ఇలా ఎదుర్కొనేవాణ్ణి...
సిటీ బస్సులు అప్పట్లో కాకినాడలో టైమ్స్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా నడిపేవారు.. మన ఊరిలో లేటుగా ప్రారంభమయ్యాయి.. బస్సులు పెరిగినా అన్నీ గోకవరం స్టాండు నుంచి, ధవళేశ్వరమే ఎక్కువగా వెళ్లేవి.. శ్యామలా సెంటర్ అయితే మరీ తమాషా.. ధవళేశ్వరం వైపు వెళ్లే బస్సులన్నీ అక్కడే ఉండేవి.. అన్ని ఇంజనులు ఆన్ చేసి ఉంచేవారు.. డ్రైవరు సీటులో రెడీగా ఉండేవాడు.. మన ఏ బస్సు ఎక్కుదామా అని ఆలోచిస్తుంటే బస్సు ఆక్సిలేటర్ నొక్కి డుర్రుమనిపించేవాడు..  వెళ్లిపోతోందేమోనని  కంగారుగా బస్సెక్కగానే లోపలున్న కండక్టరు డబ్బులుచ్చుకుని, టిక్కట్టు కొట్టేవాడు... ఏంచేస్తాం.. కూర్చోక తప్పేది కాదు..  ముందు బస్సులు  ఒకటొకటిగా వెళ్లిపోయేవి, మనబస్సు సారధులిద్దరూ...అప్పుడు తాపీగా  దిగి బాతాఖూనీ..... మిర్తిపాడు వైపు ఓ బస్సు ఉండేది.. ఆ బస్సు రిటర్న్ లో గోకవరం బస్టాండులో గంటల తరబడి ఆగిపోయేది.. అద్దీ సి టీ బ స్సు.... ఇప్పుడు మనకున్న సిటీబస్సులను సమర్ధించాలంటే మనకి డిఫెన్స్ లేదు... అందుకని అడ్డంగా డబాయించేవాణ్ణి.....ఆరోగ్యానికి నడక ఉత్తమము., అందుకని మేం బస్సులెక్కము.. మీరు అస్తమానం బస్సుల్లో తిరుగుతారు.....ఆరోగ్యాలు జాగ్రత్త మరి...అని...
రాజమండ్రిలో సిటీబస్సులు రానప్పుడు శ్యామలా సెంటరులో  మోటారు సైకిల్ రిక్షాలు ఒకటో రెండో ఉండేవి...ఆటోలకన్నా ఇవి కొంచెం డిఫరెంట్.  అంతకన్నా ముందు జట్కాబళ్లు.. ధవళేశ్వరం గుర్రాలని గొప్ప పేరు.. ఒక అడుగు ముందరికేస్తే రెండడుగులు వెనక్కి వెళ్తాయట... భమిడిపాటి వారి రచనల్లో కూడా ధవళేశ్వరం జట్కా ప్రసక్తి వస్తుంది..  నేనెక్కలేదు కాని, చూసిన గుర్తు.... సినీమా హాల్స్ విషయంలో మనకో ప్లస్ పాయింట్.. అప్పట్లో మన ఊరిలో కాకినాడకన్నా ఎక్కువ హాల్స్ ఉండేవి... అశోకా (అంతక్రితం అది గజలక్ష్మిట), శ్యామలా, రామా (ఇప్పుడు నాగదేవి), జయ (ఇప్పుడు విజయ), కృష్ణా (ఇప్పుడు సాయి కృష్ణా), మినర్వా (అన్నపూర్ణగా మారి చరిత్రలోకి పోయింది), హనుమాన్ (జయశ్రీ అయి, తర్వాత సూర్యగా అయింది). కాకినాడలో మనకన్నా ఒకటి తక్కువ అనుకుంటా... ఆ పాయింట్ పట్టుకుని గట్టిగా వాదించేవాణ్ణి... మన ఊరు ఒక చైతన్య ప్రవాహం... కలప, అల్యూమినియం, గ్రాఫైట్...బిజినెస్సులు. బంగారం వ్యాపారానికైతే... ఇటు విజయవాడ, అటు విజయనగరం..తో సమానమైన మార్కెట్టు మనది...అంత కాంపిటీటివ్ ...
ఆధ్యాత్మిక పరిమళాలు చెప్పనక్కరలేదు.. సాహిత్య గోష్టులు సరే సరే....కృష్ణాష్టమి రోజుల్లో...గోదావరి తీరంలోని ప్రతి వీధిలోనూ వేద ఘోషే....పుష్కరాలొచ్చాయంటే ప్రతి ఇల్లూ అన్నపూర్ణ స్వరూపమే.. ఎంత చెప్పినా తరగని రాజమండ్రి విషయాలు గుర్తొస్తే మళ్లీ ముచ్చటిస్తాను..  మీకు ఇంట్రెస్ట్ గానే ఉందని నమ్ముతున్నాను....

Sunday, September 2, 2012

అభిమాన సంఘాలు.


అభిమాన నటుని సినీమా రిలీజు...  అంటే .... భారీ కటౌట్లకు అతి భారీ దండలూ... సినీమా హాల్స్ ముందు హల్ చల్... స్క్రీన్ మీద అభిమాన హీరో కనపడగానే ఈలలు, కేకలు, ... టపాసులు...
పేరు తెచ్చుకున్న నటుని జన్మదినం... అంటే అభిమాన సంఘాల హడావుడి. అన్న సంతర్పణలు, రక్త దానాలు, పేదలకు పళ్ళు..
అభిమాన సంఘాలు  మా చిన్నతనాల్లో ఉండేవో లేదో గుర్తులేదు కాని, కాలేజీలో ఉన్నప్పుడు...అలాగే నేను ఉద్యోగంలో చేరిన క్రొత్తలోనూ  అగ్రశ్రేణి హీరోలకు అభిమానులు మాత్రం ఉండేవారు...అలా  ఉండడం తెలుసు..
నేను రెగ్యులర్ సినీమా గోయర్ ని కాను.. కాని నేను హైస్కూలులో చదివేరోజుల్లో... పరీక్షల ఆఖరి రోజు మా ఫ్రెండ్స్ చాలామంది సినీమాలకు వెళ్లాం అని చెప్తూ ఉండేవాళ్లు..  తర్వాత కలిసినప్పుడు వాళ్లు చూసిన సినీమాలలోని  విషయాలు వర్ణించి చెప్తుంటే కొంచెం ఈర్ష్యగా ఉండేది.. థర్డ్ ఫారమో, ఫోర్తుఫారమో చదివినప్పుడు అనుకుంటా...పరీక్షలప్పుడు, ఆఖరి పరీక్ష వ్రాసాక, ఇంట్లో గొడవచేసాను.. సినీమాకు వెళ్తానని. నాన్నగారు ఒప్పుకుని మా అన్నయ్యతో నన్ను సినీమాకు తీసుకెళ్లమని చెప్పారు.. ఆరోజుల్లో ఒక్కడినీ పంపేవారు కారు...ఇంతోటి పరీక్ష వ్రాసాక సినీమా ఏమిటి అని అన్నయ్య ఎద్దేవా చేసాడు. అలా అంటే ఏడుస్తానన్నాను..  నాతో సినీమాకు రావడం వాడికి పాపం చిన్నతనం....మొత్తానికి వాహినీవారి "పెద్ద మనుష్యులు" సినీమాకు వెళ్లాము.. ఆ కథ ఇప్పటికీ గుర్తు ఉంది కాని, నటనా సామర్థ్యాలు అర్థంచేసుకోగలిగిన జ్ఞానం అప్పట్లో సున్నా... రేలంగి మాత్రం బాగా నచ్చాడు...
కాలేజీలో మరీ తమాషా.. మా క్లాస్ మేట్ ఒకతను ఉండేవాడు.. అతను దేవానంద్ కు పిచ్చి అభిమాని. దేవానంద్ లాగా ఎర్రటివి, పసుప్పచ్చవి  ప్లేన్ కలర్ షర్టులు... క్రాఫింగ్ ముందు భాగంలో చిన్న బఫ్ ..అంటే కొంచెం జుత్తు ఎత్తుగా వచ్చేట్టు దువ్వేవాడు.. దేవ్ అని పిలిపించుకోవడం సరదా....అఫ్ కోర్స్ బాగా చదివేవాడు.. ఒక ప్రక్కకు వంగి నడక, స్టైలు అంతా దేవానంద్ లాగానే మెయిన్ టైన్ చేసేవాడు...
తర్వాత బ్యాంక్ లో ఉద్యోగానికి ముందు ఫారెస్ట్ ఆఫీసులో చేసినప్పుడు మా హెడ్ క్లర్క్ ఉండేవారు .. ఆయన శనివారం ఖచ్చితంగా సినీమాకు వెళ్లేవారు. రిటైర్ మెంట్ కు దగ్గర వయస్సు వచ్చినా ఆయన పద్ధతి అది.. అల్లాగే నేను బ్యాంక్ లో చేరాకకూడా మిగతా ఫ్రెండ్స్ మాట ఎలాగున్నా మా కొలీగ్ తన భార్యతో తప్పకుండా శనివారం సినీమాకు వెళ్లేవాడు. ఉద్యోగంలో చేరిన క్రొత్తలో శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఉన్నప్పుడు సినీమాలు ఎక్కువ చూసే వాణ్ణి.. అప్పుడు బ్రహ్మచారి జీవితం... అందరూ వెళ్తుంటే నేనూ వెళ్లక తప్పేది కాదు.. సినీమా అంటే ఎవర్షన్ అని కాదు.. ఏమిటో.?  ..  ఒక్కోసారి ఆదివారం ఉదయానికి శ్రీకాకుళం వెళ్లిపోయి మేటనీ, ఫస్ట్ షో చూసి రాత్రికి పలాస చేరేవాళ్లం...ఇంకో బ్రహ్మచారి ఫ్రెండ్ ఉండేవాడు.. ఆ మూల ప్రకాశం జిల్లా నుంచి ఈ మూల శ్రీకాకుళంజిల్లాకు వచ్చాడు... అతనికి రామారావంటే పిచ్చి అభిమానం... పలాసాలో అప్పుడు  రెండు హాల్స్ ఉండేవి... రామారావు పిక్చర్ వచ్చిందంటే ఒకసారి ఎలాగా చూసేవాడు.. వారం తిరక్కుండా మళ్లీ మళ్లీ చూసేవాడు.. ఓ సారి మేము సినీమాకు రామారావు సినీమా వస్తే సెకండ్ షోకి బయల్దేరాము... ఇతగాడు ఆ సినీమాకు ఫస్ట్ షోకు నాలుగోసారి వెళ్లి వస్తున్నాడు...దారిలో కనబడ్డాడు..సెకండ్ షోకు వెళ్తున్నాము, వస్తారేంటి... అన్నాము.. అతని భోజనం ఇంకా అవలేదు.. వచ్చేదాక హోటల్ ఉండదు కట్టేస్తారు...అయినా సరే మా గురువు సినీమా వచ్చేస్తాను.. ఈ భోజనం ఎప్పుడూ ఉండేదే...అంటూ మాతో బయల్దేరాడు..... ఇంకో సీనియర్ కొలీగ్.. అతను అక్కినేని వారి అభిమాని.. పైకి హుందాగానే ఉండేవాడు.. రామారావు అభిమానులతో వాదనకు దిగేవాడు.. మేం అప్పుడు సుబ్బమ్మా క్వార్టర్స్ అని ఓ పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ లో ఉండేవారము.. క్రింద ఆరు ఫామిలీ పోర్షన్స్. అందులో మూడు పోర్షన్స్ మా బ్యాంకు వాళ్లమే....రెండు పోర్షన్స్ లో మా బ్యాంక్ వాళ్లు ఫామిలీస్ తో ఉండేవాళ్లు..మూడో దాంట్లో బాచిలర్స్ ముగ్గురం కలసి ఉండేవాళ్లం.. మిగతా మూడింటిలోనూ వ్యాపారాలు చేసుకునేవారుండేవారు.. వీటికి పైన పన్నెండు సింగిల్ రూమ్స్. అందులో ఒక రూమ్ లో ఇందాక చెప్పిన ప్రకాశం జిల్లా రామారావు అభిమాని అయిన మా బ్యాంక్ కొలీగ్, అతని ప్రక్కన  డిగ్రీ చదువుకోసం దగ్గర ఊరునుంచి వచ్చిన స్టూడెంట్ ఒక రూములో ఉండేవాడు.. ఇతను నాగేశ్వర్రావభిమాని...  
భోజనాలయ్యాక క్రింద అందరూ మా రూమ్ లో సమావేశం.. ప్రొద్దుపోయేదాకా వాదోపవాదాలు. రామారావభిమాని పాపం ఆ ప్రకాశం జిల్లా అతను ఒక్కడే.. హుందా నాగేశ్వారావ్వభిమాని, స్టూడెంటూ కలసి అతన్ని వాయించేసేవాళ్లు.. నాగేశ్వర్రావు ద్విపాత్రాభిమానంతో "బుద్ధి మంతుడు" అప్పుడే వచ్చింది.. రామారావు ద్విపాత్రాభినయంతో "భలే తమ్ముడు" వచ్చింది... ఏ సినీమా బాగుంది అన్న దానిమీద చర్చ.. హుందా అభిమాని, అతని మిత్రులు "కాకి కోకిల అవుతుందా" అని అటాక్.. "రహస్యంలో" జానపద హీరోగా నాగేశ్వర్రావును ఆక్షేపిస్తూ డిపెన్స్...., దెబ్బకి ఓ డిస్ట్రిబ్యూటర్ బోర్డ్ తిప్పేసేడని ఆర్గుమెంట్. రామారావుకి చారిటీ ఎక్కువని ఒకళ్లంటె... కాదు కాదు నాగేశ్వర్రావుకే అని మరొకరు...రామారావుకి  భోజనం సీను లేకపోతే ఆక్ట్ చెయ్యడు, నాగేశ్వరరావు థరో జెంట్ల్ మన్ అని ఒకరు.. నాగేశ్వరరావుకి తింటే పడదని డిఫెన్స్. "మారువేషములు కలవా" అని ప్రొడ్యూసర్ ని ఆడిగి ఉంటేనే వేస్తాడు అంటే... ఏ వేషం వేయాలన్నా నప్పాలి కదా .. అందుకనే వాటి జోలికి పోడు మీ వాడు అని వీళ్ళు....చేతనైతే కృష్ణుడి వేషం వేయమనండి మీ వాణ్ణి.... వీరి రివర్స్ వాదన.. అలాంటి పాత వేషాలు మా వాడు ఎందుకు వేస్తాడు అని వాళ్ల డిఫెన్స్..ఇలా సాగేవి వాద ప్రతివాదాలు...మేము తటస్థ విధానం.. లైవ్ లీ గా ఉండడానికి సందర్భాన్ని బట్టి అటూ ఇటూ కూడా ఉండే వాళ్లం.. మాది లౌక్యమే అనిపించినా అదో సరదా కదా... రామారావాభిమానికి కళ్లనీళ్ల పర్యంతం అయ్యేది.. అప్పుడు వాదనలు క్లోజ్ చేసి .. అందరం కలసి మా రూమ్ లో వేడి వేడి పాలు త్రాగి.... డిస్బర్స్ అయ్యేవాళ్లం...
అప్పుడు పైకి వెళ్లాక ఈ ప్రకాశం ఊరుకునేవాడా అంటే స్టూడెంట్ నాగేశ్వరరావున్నాడు కదా .. అతనిమీద అట్టాక్.. అతను మరునాడొచ్చి... అయ్ బాబోయ్..వాయించేసాడండి బాబూ అంటూ గోల.. . 
ఆదివారాలు మాతో చేరే మిత్రులలో ట్రాన్స్ పోర్ట్ ఉద్యోగి ఒకతనుండేవాడు...మాకందరికీ మిత్రుడు. కొంచెం జంటిల్ మన్..బ్యాంక్ వాళ్లం అని మాతో స్నేహానికి ఇష్ట పడేవాడు..అతను హిందీ పాటలు బాగా పాడేవాడు.  అతనికి రామారావంటే ఇష్టం.. అలా అని పోట్లాట వేసుకునేవాడు కాదు. .. ట్రాన్స్ పోర్ట్ అతను  చక్కగా పాడుతుంటే,  మా హుందాగారున్నారు కదా ఆయన మా  ఫ్రెండ్ దగ్గర ఉన్న బుల్ బుల్ తీసుకుని కర్కశంగా, ఏదో మద్దెల దరువేసినట్టు వాయించేసే వాడు.. పాడే అతను రామారావభిమాని అన్న ఒకే ఒక్క కారణంతో అతని పాట చెడగొట్టాలని... సీనియర్ కొలీగ్ . ఏమీ అనలేకపోయేవాళ్లం... అలా సాగేవి అభిమానాలు..
మా హుందా గారే కాదు, ఎంతో మంది నాగేశ్వరరావు అభిమానులు, నాగేశ్వరరావులా  మాట్లాడడం, అతనిలా నడవడం, అతనిలా బొడ్డు పైకి టక్ చేసుకోవడం... అలా అనుకరించడాలు అప్పట్లో ఉండేవి... ఆ రోజుల్లో ప్రథాన పాత్రలకు... నాగేశ్వరరావు, రామారావు వీళ్లే నటులు.. యువ ప్రేమికుల్లా, కాలేజీ స్టూడెంట్స్ లాగా , ఇంట్లో ఆఖరి తమ్ముళ్లగా వాళ్లని చూసే వాళ్లం.. ! ! ! మిగతా నటులున్నా  వీరి నీడలో వారి ప్రకాశము తక్కువ అనే చెప్పాలి.. కథలన్నీ వీరి చుట్టూనే అల్లబడేవి.. వారపత్రికల్లో సీరియల్ వస్తోందంటే, అది సినీమాగా తీస్తున్నారంటే ఏ పాత్రకెవ్వరో కాలేజీ కుర్రాళ్లు ఊహించేవారు, ఊహించినవారే  సినీమాల్లో ఆ పాత్రల్లో  కనపడేవారు.. ఆ వయస్సులో ఇవన్నీ టైమ్ పాస్... అంతకు మించి ఏమీ కావు...

Thursday, August 23, 2012

రాజమండ్రి.... 5




రాజమండ్రి ఊరుగురించి ఎంతో చెప్పి మా శ్రీరామనగర్ గురించి కొంతయినా చెప్పక పోవడం తప్పుకదా.. నేను రాజమండ్రిలోనే పుట్టి పెరిగాను... నా ఆరవ ఏట రాజమండ్రిలోని ఈ శ్రీరామనగర్ వచ్చేసాము..చిన్నప్పుడే వచ్చేయడంవల్లనేమో ఈ శ్రీరామనగర్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో ఉద్యోగరీత్యా కొద్దికాలము దూరమైనా ఈ పేటతో నా నికర అనుబంధము నలభై ఏళ్ల పైమాట....   ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మధ్య మధ్య రాజమండ్రి వచ్చి ఈ గాలి పీలుస్తే కాని తోచేది కాదు..ఆ అభిమానంతోటే ..మరల రిటైర్ అయ్యాక ఈ పేటలోనే ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాను. అంచేత నిజమైన అనుబంధం నా జీవిత కాలం అని చెప్పడం సబబు.... 

రాజమండ్రిలో ఇప్పుడు నేనుంటున్న మా ఫ్లాట్ కు పొడుగాటి బాల్కనీ ఉంది.. దానికి ముందువైపు సగంవరకు అద్దాలు పెట్టించాము .. దాని వెనుక నాకో చిన్న రూమ్ లా చేసుకున్నా... బయట వర్షం పడుతుంటే ఆ అద్దాల వెనుకనుంచి రోడ్ చూస్తుంటే భలే కాలక్షేపం... అలా వర్షం పడుతున్న ఓ సాయంత్రం ఆ వర్షాన్ని చూసి ఆనందిస్తున్న మనస్సు ప్రశాంతమై చిన్నతనంలోకి వెళ్లిపోయింది...

నలభైల్లో మా నాన్నగారు రూపాయికి ఆరు చదరపుగజాల చొప్పున, (ఆశ్చర్యంగా ఉంటుంది కాని నిజం...) శ్రీరామనగర్ లో  1400 చ.గ. స్థలం కొన్నారు.. నాన్నగారిపై అభిమానంతో మా చుట్టూ అందరూ మా బంధువులే స్థలాలు కొనుక్కున్నారు.. మేముకాని మిగిలిన వారుకాని  ఇల్లు కట్టే సాహసం చాలాకాలం చెయ్యలేదు.. ఎందుకంటే ఊరికి దూరం.. పైగా ఈ పేటకొచ్చే దారిలో జనసంచారము అసలు ఉండేది కాదు.. మా పేటకు ముందున్న సీతంపేటలో జనజీవనం కొంచెం ఉండేది., అది దాటాక ఇప్పుడు వాటర్ ట్యాంకున్న స్థలంలో సీతమ్మ చెరువు, ముందుకొస్తే  రోడ్డుకిటూ అటూ పెద్ద పెద్ద చెట్లు... రాత్రిళ్లైతే మరీ భయంకరంగా ఉండేవి

1949లో...అప్పట్లో మేము రామా టాకీసు (ప్రస్తుత నాగదేవి) దగ్గర అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.. ఇంటి వాళ్లు కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కోపంతో మా నాన్నగారు వారం రోజుల వ్యవధిలో శ్రీరామనగర్ లో మా స్వంత స్థలంలో ఓ పాక వేసుకుని అక్కడికి మకాం మార్చేసారు.  మేము  ఈ పేటలోకి వచ్చినప్పుడు అయిదారు ఇళ్లకన్నా ఎక్కువలేవు.. అప్పట్లో ఊరు అంతగా పెరగక పోవడంవలన ప్రభుత్వయాజమాన్యంలో ఉన్న పేపరుమిల్లు  ఊరికి దూరంగా ఉన్నట్టు ఉండేది.. మా పేట మొదట్లో చుక్కా అప్పలస్వామి రెడ్డిగారి పెద్ద పేలస్ ఉండేది.. ఆ పేలస్  నాలుగు రోడ్లకు సరిపడా ఉండేది..  ఆయన తన సోదరునితో కలసి కలప వర్తకం చేసేవారు.. ఆ పేలస్ చుట్టూ పెద్ద దొడ్డి.. మామిడి, బాదం లాంటి చెట్లు.. ఆ ఇంట్లోకి చిన్నప్పుడు వెళ్లేవాడ్ని. లోపలకెళ్తే బయటికి ఎలా రావాలో తెలియనట్టుండేది... ఆ అప్పలస్వామి రెడ్డిగారు కొన్నాళ్లు మునిసిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు.. చాలాకాలం ఇప్పుడు సీతానగరం రోడ్డుగా పిలవబడే మా రోడ్... చుక్కా అప్పలస్వామి రెడ్డీ రోడ్డే.. మా ఇంటి అడ్రస్సు చెప్పడానిక్కూడా వారి పేలస్ ఒక లాండ్ మార్క్. వాళ్ల అబ్బాయి సదాశివరెడ్డి బాల్ బ్యాడ్ మింటన్ జాతీయస్థాయీ ఆటగాడు.  

మేం ఈ పేటకు వచ్చే నాటికి మా పురోహితులు గుంటూరి సత్యనారాయణగారి పాక ముందుగా ఉండేది ...
మా పాక దాటాక దూరంగా మరో రెండు పాకలుండేవి... ఆ తర్వాత అన్ని చెట్లూ, పిచ్చిమొక్కలు అలా కాలిదారులు తప్ప ఏ దారీ ఉండేది కాదు..  పేట అంతా పచ్చిక బయళ్లు, తాడి చెట్లు.. అంతే.. పాక ముందు కూర్చుంటే విపరీతమైన గాలి.. ఆ జీవితం చాలా ఆనందంగా ఉండేది... 
నాన్నగారు ఊళ్లో హిందీ పాఠశాల కొన్నాళ్లు, తర్వాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.. తర్వాత్తర్వాత వయస్సు పైబడ్డాక ఇంటిదగ్గరే ఉండిపోయేవారు.. 
నా చదువు..... కొన్నాళ్లు సీతంపేటలో ఎలిమెంటరీ చదువు చదివి, పుష్కరఘాట్ లో ఉన్న మునిసిపల్ హైస్కూల్లో ఫస్ట్ ఫారం అంటే ఇప్పటి సిక్స్త్ లో చేరాను... ఆ హైస్కూలు ఒక్కటే అపుడు మాకు దగ్గర...అయిదారు  కిలో మీటర్ల దూరముండేదేమో..... ఒక చేతిలో పుస్తకాల సంచీ, ఒక చేత్తో రెండుగిన్నెల క్యారియర్ తో భోజనం, వర్షాకాలమైతే గొడుగు.. ఈ లోడ్ అంతా భుజాలకి తగిలించుకుని లెఫ్ట్ రైట్....అరగంటపైన నడిచి స్కూలుకి చేరేవాళ్లం... లాగుడు రిక్షాలుండేవి, ఎప్పుడైనా ఎక్కేవాణ్ణి..  నా సెకండ్ ఫారంలో అనుకుంటా సైకిలురిక్షాలు వచ్చాయి.. ఆ రోజుల్లోనే సిటిబస్సు ఒకటో నెంబరు, రెండో నెంబరూ  వచ్చాయి.. ఒకటి పేపరుమిల్లునుంచి, గోదావరి స్టేషన్ దాకానే.. కాని మనటైమ్స్ కాదు. .. స్కూల్లో ఏ ఫంక్షనో అయి లేట్ అయితే, మా వీధిలోకి వెళ్లాలంటే భయం భయంగా ఉండేది... అలా చీకటడ్డాక వచ్చినప్పుడు మా వీధిలోకి తిరగ్గానే "దేముడా దేముడా" అనో , "జై వీరాంజనేయా" అనో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ వచ్చేవాడ్ని. (ఇప్పటికీ ఆ అలవాటు అప్పుడప్పుడు మనస్సులో మెదులుతుంది.)


మా ఇంటి ముందర మునిసిపాలిటీ దీపం.. శుభ్రంగా తుడిచి కిరసనాయిల్ పోసేవాడు.. చీకటి పడుతుంటే వెలిగించేవాడు... తమాషాగా వెన్నెల వచ్చేదాకా వెలిగి ఆ దీపం ఆరి పోయేది.. అంత కరక్ట్ గా పోసేవాడు.. ఆ దీపమే  మాకు లైట్ హౌస్.. దీపం వెలుగు అంతంత మాత్రమే కదా !  . దానివైపే చూస్తూ దేముడా దేముడా అని నెమ్మదిగా అనుకుంటూ ఇళ్లకి చేరేవాళ్లం...





ఇంట్లో హరికెన్ దీపాలు.. కోడిగుడ్డు దీపాలు. అమ్మ చిమ్నీలు శుభ్రంగా తుడిచి.. సాయంత్రం అయ్యేసర్కి వెలిగించి వీధిలో ఉన్న తాటాకు పందిరిలో ఇనుప కొక్కీకి ఓ హరికెన్ దీపం తగిలించేది.. అలా సాయంసంధ్యలో వెలిగే దీపం ఓ లక్ష్మీ శోభతో ప్రకాశించేది.. ఆ తాటాకు పందిరి క్రింద ఓ రౌండ్ టేబుల్.. దాని చుట్టూ మెట్రిక్ పరీక్షలకు, హిందీ పరీక్షలకు చదివే పిల్లగాళ్లకు నాన్నగారు పాఠాలు చెప్పేవారు.. అదో అందమైన దృశ్యం.

వర్షం వచ్చిందంటే మా పేట సంగతి ఇక అడక్కండి..   బురద కాలికి అంటుకుపోయేది. కాలు పెద్ద టైరు చెప్పులా అయిపోయేది.. ఆ బురదకాళ్లతో  బరువుగా రోబోలా అడుగులు వేస్తూ రోడ్డుమీదకి వచ్చి... అక్కడ వర్షపు నీటి గుంటల్లో కాళ్లు కడుక్కుని స్కూలుకి పోయేవాళ్లం... సైకిళ్ల మీద వచ్చిన వారి అవస్థ వర్ణనా తీతం.. క్రింద చెరువుల దగ్గరకి పోయో, లేకపోతే ఆ నీళ్లగుంటలదగ్గరనో గంటల తరబడి కడిగితేనే కాని  సైకిలు కదిలేది కాదు.. జిత్ మోహన మిత్రా ఇప్పటికీ మా ఇల్లుగురించి తలుచుకుని ఇదే చెప్తాడు... ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాడు. 

అసలు రాజమండ్రిలో వర్షం వచ్చిందంటే ఎప్పుడూ పెద్ద సీనే.. మేం స్కూలుకి వెళ్లేదారిలో ఉన్న మరోపేట తుమ్మలావ.. అక్కడ శ్రీ ముదుగంటి సూర్యనారాయణగారని మా ట్యూషన్ మాష్టారు ఉండేవారు.. వర్షం ఏ కొద్దిగా పడినా తుమ్మలావలోఉన్న నాలుగు వీధులూ జలమయమై పోయేవి.. రెండుమూడురోజులుదాకా నీరు లాగేది కాదు..ఓ సారి నేను ట్యూషన్ కని బయలుదేరి.. ఆ నీటిలో ఉన్న వీధులు గుర్తు పట్టలేక... మాష్టారింటికోసం అలా తిరుగుతూనే ఉన్నాను.. చివరికి మేష్టారు స్కూలుకి బయల్దేరుతూ కనపడి.. "ఇంక చాల్లే వెతకడం, పద స్కూలుకి" అని స్కూలుకి తీసుకుపోయారు.. అంటే ఏడింటికి ట్యూషన్ లో ఉండవలసినవాణ్ణి తొమ్మిదిన్నరదాకా వెతుకుతూనే ఉన్నానన్నమాట... 

తుమ్మలావ, ఆర్యాపురంలోంచి ఓ కాలువ ఊళ్లో పడ్డ వర్షపునీటిని, మురికినీటినీ గోదావరిలోకి తీసుకువెడుతుంది.. గోదావరికి వరదలు ఒక స్థాయికి మించి వస్తే ఆ వరదనీరు ఊళ్లోకి రాకుండా ఆటోమెటిక్ గా ఈ కాలువ తలుపులు మూసుకుపోతాయి.. అప్పుడు ఈ మురికినీటికి దారి ఉండదు.. పేటల్లోకివచ్చేస్తాయి.. అదే టైములో వర్షం పడిందంటే ఇక ఊహించండి...  బయట వరద తగ్గేదాకా ఇదే పరిస్థితి.. అలా అలా ఈ మురికినీరు లెవెల్ పెరిగి, ముందు తుమ్మలావ, తరువాత ఆర్యాపురం వీధుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది.. అప్పుడు రాకపోకలు చాలా బాధకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి అప్పట్లో వర్షాకాలంలో నిత్యమూ ఉండేది.. ఇప్పుడు చాలా మెరుగైంది.

పాక అని చెప్పాను కదా.. దానిముందు కొంతకాలం తర్వాత నాన్నగారు పెంకుటిల్లు కట్టారు.. మూల పెంకు అంటారు, బంగలా పెంకు కాదు.. మూలపెంకు ఇంటిలో శీతాకాలం వెచ్చగానూ, వేసవికాలం చల్లగాను ఉంటుంది. ఆ పెంకుటింట్లో మా సామాను పెట్టి కొంతకాలం మేము శ్రీకాకుళం జిల్లా దేవాది అనే ఊరిలో ఉండాల్సివచ్చింది. ఆ దేవాది అండ్ ముబగాం ఎస్టేట్స్ కు మా పిన్నిగారు జమీందారిణి. వాళ్ల ఎస్టేట్స్ వ్యవహారం చూడ్డానికి నాన్నగారిని రమ్మన్నారు.. మేమూ వెళ్లాం.. అక్కడ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కొద్దికాలం చదివా.. దివానుగారబ్బాయిని కదా.. నేను వెళ్లాకనే స్కూలు ప్రారంభమయ్యేది.. మాష్టారు నన్ను "రండి బాబూ.."అంటూ పిలవడం లీలగా గుర్తు.. అలా పిలిపించుకోవడం తప్పని తెలుసుకోలేని వయస్సు.. ఆయన ప్రక్కన నాకు ఎత్తుగా బల్లో కుర్చీయో వేసి కూర్చోమనేవారు.. మిగతా పిల్లలు క్రింద కూర్చునేవాళ్లు.. దసరాలకు విల్లంబులు తీసుకుని, పద్యాలు పాడుతూ మా దివానానికి మేష్టారు, పిల్లలూ వచ్చేవారు.. అమ్మా, పిన్ని మేష్టారుకి పళ్లెంలో బట్టలూ,డబ్బులు ఇచ్చేవారు.. నేను పద్యాలు చదివేవాణ్ణి... మా మామయ్యగారబ్బాయికూడా నాతో చదివేవాడని గుర్తు... అక్కడనే శర్మగారని ఆ జమీలో పనిజేసి వృద్ధులైన ఒకాయన ఉండేవారు.. ఆయన చిలకమర్తివారిదగ్గర కొంత కాలం ఉన్నారట. ఆయన పిల్లలతో తమాషాగా మాట్లాడేవారు... తలనొప్పికి మందు చెప్పేవారు... పేను గుండెకాయ, తలుపు కిర్రు, నల్లి మెదడు... కలిపి నూరి బుర్రకు పట్టించాలట..... అక్కడ పెద్ద పెద్దతోటలు, గులాబిజాం మొక్కలు, తామర చెరువులు, దివానంలో గంట గంటకు కాలాన్ని సూచిస్తూ గంటలు కొట్టడం, దీపావళికి పనివాళ్లు బాంబులూ అవీ తయారుచేసి కాల్చడం... అదో జీవితం, కాని చాలా కొద్దికాలం.. ఆ తర్వాత కాకినాడ వచ్చేసాం.. అక్కడ భారతీ విద్యాలయంలో చదివా.. 

ఆ తర్వాత రాజమండ్రి....
రాజమండ్రి మునిసిపాలిటి అయినా మా పేటకు 1957 వరకు కరెంటు లేదు.. నేను యస్.యస్.యల్.సి చదువుతున్నప్పుడు మా పేటకు కరెంట్ వచ్చింది. అప్పుడు కూడా మా బాబాయి గారు మరొక పేటవాసికలసి స్తంభాలు, వైరు ఖర్చు భరిస్తే కరెంట్ ఇచ్చారు.. ఆ తర్వాత నేను రాత్రిళ్లు బాబాయి గారింటికి వెళ్లి చదువుకొనేవాణ్ణి.. 60W బల్బ్.. ట్యూబ్ లైటు లగ్జరీ.. అవి అందరూ వేసుకునేవారు కారు... ఆ తర్వాత మాకు కరెంట్ వచ్చింది.. 
అద్దె సైకిలు కావాలంటే సీతంపేట వెళ్లాలి.. అప్పుడు సైకిల్స్ అద్దెకిచ్చేవారు.. ఎరుగున్నవాళ్లకే ఇచ్చేవారు.. కోటగుమ్మందగ్గర ఇప్పుడు తుమ్మిడిరామకుమార్ గారి షాపు ఉన్నదగ్గర.. సైకిళ్లు పట్టుకుని ముందుకొచ్చె రెడీగా ఉండేవారు.. వాళ్లైతే అందరికీ ఇచ్చేవారు.. 

సీతంపేట మాకు డౌన్ టౌన్.. అక్కడ రామకృష్ణా హోటల్ .. చిన్నతనంలో హోటల్ కు వెళ్లడం అలవాటు లేదు.. కాలేజీలో జేరాక అప్పుడప్పుడు స్నేహితుల తోటి.. తరవాత్తర్వాత ఒక అలవాటైపోయింది.. చాలాకాలం ఆ అలవాటుండేది... ఇప్పుడు ఈ ధరలు చూస్తుంటే  అవసరమనిపిస్తేనే వెళ్లడం.. అదీకాక పాకెట్ మనీ చదువుకునే కుర్రాళ్ల జన్మహక్కు అని అప్పట్లో మాకు తెలియకపోవడం.. కష్టాల రుచి తెలుసున్నవాళ్లమో ఏమో, హోటళ్ల రుచి అంతగా అలవాటు కాలేదు.. సినీమాలు అంతే.. మీ టైములో ఇవన్నీ లేవు అంటాడు మా మనవడు... ఏమో అదీ నిజమేనేమో...

కాలేజీకి (1957-58), (1959-1962) వెళ్లాలంటే సీతంపేట మీదనుంచి, వీరభద్రాపురం పుంతలోంచి వెళ్లేవారం.. ఆ పుంత రోడ్డు పగలు కూడా వళ్లు దగ్గరెట్టుకుని నడవాలి.. ఎగుడుదిగుడుగా ఉండి ఎక్కడ పడిపోతామో అన్నట్టుగా ఉండేది. నిజానికి మాకు కాలేజీ అలా కోరుకొండ రోడ్డు మీదనుంచి దగ్గర.. కోరుకొండరోడ్డుకి వెళ్లాలంటే  పచ్చిక బయళ్లలోంచి, తుప్పల ప్రక్కనుంచి వెళ్లాలి అన్నమాట.. పగలు అప్పుడప్పుడు పెద్ద పెద్ద పాములు కూడా కనపడేవి.. 
1962 లో అందరికీ ప్రియతమ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు రాజమండ్రి వచ్చారు..  విమానంలో మధురపూడి వచ్చి పేపరుమిల్లులో రక్షణ నిధికి ఇచ్చే విరాళం స్వీకరించడానికి మా వీధిలోంచి వెళ్లారు.. అప్పుడు మా రోడ్ కు మోక్షం వచ్చింది.. కోరుకొండ రోడ్ దాకా ఉన్న తుప్పలు నరికించి... శుభ్రం చేసి కచ్చారోడ్ వేసారు. ఇప్పుడు పక్కా  రోడ్ మా యల్.బి.శాస్త్రి రోడ్..ఇన్ మా శ్రీరామనగర్....సందడే సందడి....

కొద్దిగా రాజమండ్రిలోని మా పేట శ్రీరామనగర్ గురించి వ్రాసి బోరుకట్టాను కదా.. మళ్లీ తర్వతెప్పుడైనా మరల ఈ పనే చేస్తానేం ? అంతవరకు శలవు..


..

Sunday, August 12, 2012

about maalika.... a web magazine.

వెబ్ మాగజైన్... మాలిక మీరు చదువుతున్నారా...చాలా బాగా ఉంటోంది.. చక్కటి కథలు, వ్యాసాలు, హాస్యం అన్నింటికి తగిన అవకాశమిస్తూ మంచి రచనలు అందిస్తున్నారు.. మీ రచనలు కూడా పంపించవచ్చు... వివరాలకు www.magazine.maalika.org.in ద్వారా ఆ పత్రికను అందుకోవచ్చు. శ్రావణ మాసపు సంచిక అందుబాటులో ఉన్నది.. ఇప్పుడిక సంచిక ప్రతి రెండునెలలకూ విడుదలవుతుందని ప్రకటించారు. సంపాదకవర్గంలో జ్యోతివలబోజు గారిది ప్రముఖపాత్ర.. ఈ నెల రసజ్ఞ గారు జ్యోతి అనే రచనలో అగ్ని గురించి చాలా విషయాలు రసవత్తరంగా ... చక్కగా ... చెప్పారు..  మంచి మంచి రచనలు చదవమని కోరుతూ... నా రచన ... "ప్రమోషనులు..పరీక్షలు" కూడా ఉంది.. నాకు మాలిక వారు అందిస్తున్న ప్రోత్సాహమునకు నా బ్లాగుద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను....

Wednesday, August 8, 2012

కన్నయ్యా... కదలి రావయ్యా...



గోధూళీ ధూసరిత కోమల గోపవేషం, గోపాల బాలక శతై రనుగమ్య మానమ్
సాయన్తనే ప్రత్రిగృశమ్ పశుబంధనార్థం, గచ్ఛంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం.
(కడుపునిండా మేత మేసిన గోవులను తోలుకొని, వాటిని వాటి వాటి స్థానాల్లో కట్టడానికి గోపాల బాలురతో కలసి... గోధూళి నిండిన దేహంతో వస్తున్న అచ్యుతునికి నమస్కరిద్దాము....)
వేదాంత వీధుల్లో తిరిగే వేదవేద్యుడు.. గోవిందుడై ... బృందావనంలో గోప బాలురతో గోవుల కాసుకుంటూ తిరుగుతున్నాడంటే ఏమాశ్చర్యం ?

"ఒక పులినతల మండప మధ్యమున మహేశ్వర ధ్యానము చేసుకుంటున్న సమయంలో" పోతనగారికి 
తన ముందు ఆజానుబాహుడైన రాజకుమారుడు సాక్షాత్కరించాడట... ఘనమేఘముతో ఉన్న మెఱపుతీవలా  ఒక స్త్రీమూర్తి ఆతడి ప్రక్కన శోభిస్తున్నదట .. చంద్రునిలాగా అమృతమయమైన చల్లని చిరునవ్వు ఆతడి మోమున వెలుగుతోందిట..... మూపున విల్లంబులు, అరవిందములబోలు విశాలనేత్రములు, నీలాకాశములో మెరిసే భానునిభంగి ఘన కిరీటముదాల్చిన ఆ అందగాడు తనని శ్రీరామభద్రునిగా పరిచయంచేసుకుని (తెలుగువారి భాగ్యమా అన) భాగవతము తెలుగులో వ్రాయమని పోతనగారిని  ఆదేశించినాడట... ...
                               భాగవతమంటేనే శ్రీ కృష్ణుడు..
భగవంతుని కథ భాగవతము::భాగవతుల కథ భాగవతము::భాగవతము అనే పదే పదే అన్నా బాగౌతాము...
భా.. భక్తి; గ ...జ్ఞానం; వ ... వైరాగ్యము... భక్తి జ్ఞాన వైరాగ్య తాత్పర్యమే భాగవతమని ఒక నిర్వచనం చెప్పారు.
వ్యాసకృత భాగవతాన్ని మందార మకరంద మాధుర్యంలో ముంచి అందించారు పోతనగారు........

భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పఱువెత్తు కఱివేల్పు ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కుగొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి
రయ్య ! ఏ రాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !

(ఆయుధం ముట్టనని చెప్పాడు అర్జునునికి... కాని తన అనన్య భక్తుని రక్షించడానికి తన ప్రతిన కూడ మరచి రథాంగపాణియై భీష్మునిపైకి లంఘించాడు..
భార్యామణితో సరససల్లాపములలో తేలియాడుతున్న గజేంద్రుని ఆర్తనాదము వినగానే ఉన్నపళంగా పరుగెత్తాడు.. సంగటికాళ్లకు చల్దులు మాగాయ పచ్చళ్లతో నంజి మరీ నోటికందించిన అమ్మ కారుణ్యము కృష్ణుడు...... తన కవితామృతంతో భక్తుల హృదయాలను తడిపేసాడు తెలుగుకవి.....(జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి అందమైన భావన ఈ పద్యం)

అద్వైత సిద్ధిపొందిన కారణ జన్ముడు పోతన...
కనుకనే  గోధూళితో ప్రకాశించే బాల కృష్ణుడు.. బూతి పూసుకున్న బాల శివునిలా దర్శనమిచ్చాడు పోతనగారికి....

తనువున నంటిన ధరణి పరాగంబు, పూసిన నెఱిభూతి పూతగాగ
ముందఱవెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునకగాగ
ఫాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను గాగ
గంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయ మగు మెడ కప్పుగాగ
హారవల్లు లురగహారవల్లులు గాగ బాల లీల బ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమి దెల్ప వెలయునట్లు....

.....................................శివాయ విష్ణురూపాయ... శివ రూపాయ విష్ణవే

విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః
శ్రద్ధా దయా తితిక్షా చక్రతవశ్చ హరేస్తనుః 
బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యం, దమం, శమం, శ్రద్ధ, దయ, సహనం, యజ్ఞం ఇవన్నీ విష్ణువు శరీరాలు...అని శాస్త్ర వచనం..

నీ నామము భవహరణము
నీ నామము సర్వ సౌఖ్య నివహకరంబు
నీనామమమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా...

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః

చూపులకు చిన్ని వటువు... పలకరిస్తే పరమాత్మ..
బలి చక్రవర్తి ప్రశ్నలు వేసాడు.......
"వడుగా...ఎవ్వరి వాడ వెవ్వడవు, సంవాస స్థలంబెయ్యది..". 
"ఇది నాకు నెలవని.. (నా చోటు అని) యే రీతి బలుకుదు.. నొకచోటనక నిండియునేర్తు" (అంతాటా నిండిన విష్ణువుకదా మరి)
"ఎవ్వరి వాడనని ఏంచెప్తాను నా యంతవాడనై నేనై తిరుగుతూ ఉంటాను"
"నీ నడిచేదెక్కడ అంటే ముల్లోకాలములలోను తిరిగే నేను ఫలాన చోట తిరుగుతానని చెప్పలేను"
తను ఎక్కడ ఉంటాడో చెప్పాడు... చేతనైతే పట్టుకో మంటున్నాడు...
ఎవరి వాడవంటే... అందరూ నాకు ఆత్మీయులే... అంటాడు.. 
తొలి సిరి గలదుట.. పాపం వటువుగా ఉన్నప్పుడు ఆవిడ లేదుకదా మరి..

ఆఖరిగా.. "సుజనులయందు దఱచు చొచ్చియుందు.."
నేను సజ్జనుల మధ్య ఉంటానని .. చెప్పాడు... 
పట్టుకోవాలంటే సజ్జన సాంగత్యమొక దారి... ఒ క్క టే దారి.


Wednesday, August 1, 2012

రా రండోయ్... నా పుట్టిన రోజుకి రారండోయ్...







"ప్రతీ సారీ ... నేనే గుర్తు చెయ్యాలా ? "
"ఏమైందమ్మా ఏమైంది.?" అడిగా బ్లాగుని
"ఇవ్వాళ ఎంత తారీఖు?"
"ఆగష్టు రెండు"
"అంటే ?" అడిగింది బ్లాగ్..
"అంటే.. ఏముంది, ఇంకో పదమూడురోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం.." చెప్పా..
"అంతేకాని నా జన్మదినోత్సవం గుర్తు లేదన్నమాట." నిలదీసింది బ్లాగు.
",,,, ఓహ్ ?.. అవును కదూ... అప్పుడే రెండేళ్లయిపోయింది"
"అదే మరి.. ఈ మధ్య నన్నసలు పట్టించుకోవటం లేదు... అన్నీ రెడీ చేసాను.. ఫన్క్షన్ చెయ్యి.." ఇంక తప్పదు..
"ఏం చేద్దాం.. ఎలా చేద్దాం.."
" వెన్యూ రెడీ... కేక్ రెడీ.." చాలా స్పీడుగా ఉంది.
"మనవాళ్లు పెరిగారు.. అందర్నీ పిలవాలంది..."  నాకర్థం కాలేదు... అదే అడిగా రెండేళ్లకి కనీసం అయిదువేలమంది కూడా చూడలేదు.. ఆ చూసిన నాలుగువేల అయిదువేలమందిలోనూ... ఏరోజు ఎంతమందిచూసారో అనుకుంటూ మళ్లీ మళ్లీ మనమే చూస్తున్నాము.. అలాంటప్పుడు సర్కిల్ పెరిగిందని ఎలా అంటావు అని అడిగా.. పిచ్చి మొహమా ఆ రీడింగు తప్పు.. కావాలంటే వీక్షణలు చూడు.. పదహారువేలు దాటి పోయారు.. ఆమధ్య నేను తప్పిపోయినప్పుడు.. మీటరు చెడి పోయింది.. జీరో జీరొకి వచ్చేసి.. నాలుగు వేలే చూపుతోంది.. కరక్ట్ ఫిగర్ పదహారువేల ఎనిమిదివందల ముప్ఫై అని గణాంకాలు చెప్పేసింది...వచ్చినవాళ్లని ఉద్దేశించి నువ్వు ఏమైనా చెప్పు అని ఆర్డర్ వేసింది...... వారి వారి మాటలు వారి వారి వ్యాఖ్యల్లోనే....

బ్లాగు పెట్టిన కొత్తలో .. నన్ను కొత్త మిత్రుడుగా పరిచయం చేసుకున్నప్పుడు తను అన్న మాటలు సురేఖ గారు గుర్తు చేసుకున్నారు.
" మన హాసం క్లబ్ లొ మన ఇద్దరిని చూసి అంతా " అహ " అన్నారు.( అప్పారావు,హనుమంతరావు). మీరూ బ్లాగులో(కా)నికి ప్రవేశించడం బ్లాగు బ్లాగు. నవ్వుల పువ్వులు మన బ్లాగర్ల పై విసరండి !. *** (సురేఖాచిత్రం)

నిజంగాచెప్తున్నాను... బ్లాగు ఆత్మీయతలను పెంచింది. ఉపయోగించడం మన లోపమే కాని ఎంతో మంది అభిమానంగా పలకరిస్తున్నారు .. ఈ మధ్య బ్లాగు ద్వారా పరిచయమైన శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు సతీ సమేతంగా మా ఇంటికివచ్చి ఆనందం కలుగ జేసారు.

లో బ్లాగున్నారా ?లో నా తరఫునా, నా శ్రీమతి గారి తరఫునా మీకు, మీ శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆతిధ్యానికి, ఆత్మీయతకి కృతజ్ఞతలు. మా ఆవిడ ఫోటోలు బ్లాగు కెక్కించినందుకు ఆమె ఆనందభరితయైనది. మీకు నా ద్వారా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటిదాకా నేనా పని చేయనందుకు నాకు...... నేనూ ఫోటోలు తీసాను కానీ ఫోటోలో ఎవరూ పడలేదు. కెమేరానే కింద పడింది.....దహా...బులుసు

వయో బేధం లేకుండా బ్లాగు పోస్టులు చదివి అభినందించారు.. మా రాజమండ్రి గురించి వ్రాసినప్పుడు ఎంతమంది స్పందించారో ... చాలా ఆనందమైంది.
ఒకాయన "నాది రాజమండ్రి కాదు; మీ జనరేషను అసలే కాదు. కానీ మీ టపా ఏ మాత్రం బోర్ కొట్టించలేదు. ఇట్టే చదివేశా! చాలా బాగుందండి..    "

రాజమండ్రిలోని వేణుగోపాలస్వామి ఆలయం గురించి చదివిన మిత్రులు దాని వివరాలు అడిగి తెలుసుకుని వచ్చి చూసి ఆనందించి నాకు తెలియజేసారు. ఆ సమయంలో నేను ఊళ్లో లేను... ఆయన్ని కలుసుకునే భాగ్యం లేకపోయింది.

రాజమండ్రి ఊసులు..ఉస్సూరుమంటూ...4లో హనుమంత రావు గారు, మీరు చెప్పిన ఆనవాల ప్రకారం వెళ్ళి ఈరోజు స్వామి వారి దర్శనం చేసుకున్నాను. కోవెల చాలా బాగుంది. పూజారి గారు ఊరికి కొత్త అని కూడా అడిగారు అన్ని పరిశీలిస్తుంటే. ఆకడ గోడకి పెట్టిన శాసనాలు చదవడానికి ప్రయత్నించాను. మీ వల్ల ఈ రోజు మంచి దర్శనం అయ్యింది. సంతోషం. ప్రస్తుతం అక్కడ రోజూ తిరునక్షత్ర పూజలు జరుగుతున్నాయి అంట. ధన్యవాదాలు
రాజమండ్రి మీద మరొక చిరకాల మిత్రుని వ్యాఖ్య...
" EXCELLANT.i am feeling I am unfortunate I am forced to leave Rajahmundry.Many Many happy memories many many friends like you keep me active today.Please add some more happy memories I too will recollect and communicate to you. Regards and best wishes kvshastri   
ఆ మధ్య పడ్డావుగా... అదీ వ్రాసావు.. చెప్పు మరి.. అంది బ్లాగు..
ఒక సారి కాదు మూడు సార్లు... దానిక్కూడా మంచి స్పందన వచ్చింది.

..... పడి పడి పడి...మూడుసార్లు పడిన రావుగారులో అయ్యా పడ్డ వాళ్లెప్పుడూ చెడ్డవాళ్ళు కాదండీ. అలాగే మీరు చిరకాలం పడిన పడి పడకుండా దిగ్విజయంగా పడుతూ ఉండాలని మా ఆకాంక్ష. నిరంతర పడి ప్రాప్తిరస్తు......(మిస్సన్న)
...... పడి పడి పడి...మూడుసార్లు పడిన రావుగారులో అయ్యో పడ్డారా పాపం. ముందే ఎందుకు చెప్పలేదు సార్. పడకుండా పట్టుకునే వాళ్ళం. పడితే ఇంత మంచి హాస్య టపా రాస్తారు అన్నమాట..... దహా (బులుసువారు)

మేమ చేసిన యాత్రా విశేషాలతో పోస్ట్ కు...   
 sir namaskaram andi, meru mi yatrani baga vivarincharu andi. sir nenu kuda ee madya MAHABALIPURAM & RAMESWARAM vellanu andi, vatini kuda mi stayilo kakapoyina edo natoliprayantnamga rasanu.. mi lanti peddalu oksari chusi cheppagalaru.. http://rajachandraphotos.blogspot.com-------rajachandra akkireddi

ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.... యాత్రలో హనుమంతరావు గారూ..!! నమస్కారం. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మా కాశీయాత్ర నాటి జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చారు. త్రివేణీ సంగమంలో స్నానాలూ, వేణీదానం, ఆ చిన్న పడవలలో వెళ్ళడం, ఆ పక్షులు, అన్నీ మళ్ళీ కళ్ళకు కట్టాయి. గురువు గారితో పాటు యాత్ర చేసి వారి ప్రవచనాలు వింటూ ఆ ఆద్యాత్మికతలో ఓలలాడిన మీ బృందానికి మనఃపూర్వక అభినందనలు.--------రాధేశ్యాం

   
ఇక మా బ్లాగ్గురువుగారున్నారు జ్యోతి వలబోజుల.. ఏ సమస్యకైనా ఆమె దగ్గరకే పరుగెడ్తాను.. ఆవిడా అంత ఓపిగ్గానూ గైడ్ చేస్తారు.. ఓ సారి బ్లాగు కనపడక పోయింది.. ఆవిడకి మొర పెట్టా... పువ్వుల్లో పెట్టి బ్లాగులో పెట్టారు...అప్పుడు మెత్తగా పెట్టిన చీవాట్లు చూడండి.

" బ్లాగు మొదలెట్టి, రెండు మూడు టపాలు గెలికి వదిలేస్తే అలగదా మరి?? ఇకనైనా దాన్ని అలా వదిలేయకండి. మీరే దానికి దిక్కు.. పాపం కదా..-------------జ్యోతి.
ఆవేళ అనుకున్నా విడవకుండా రోజూ వ్రాయాలని.. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా...రోజూ వ్రాయాలని... సరే మొత్తంమీద నా బ్లాగుకూడా నచ్చిన వారున్నారని ఆనందం.. ఆధ్యాత్మికం వ్రాసినప్పుడు కూడా మంచి స్పందన. అసలు పాయింట్, అంతటా నిండిన చైతన్యరూపం, కృష్ణాష్టమి.. అలాంటివే.
శ్రీ హనుమద్ర్వతంలో "రామాయణంలోని పాత్రలు : హనుమంతుడు" - ఒక పరిశీలన. సమగ్రమైన వివరణ. హనుమద్భక్తులైన మీకే సాధ్యం. అభినందనలు....మిస్సన్న
శ్రీ హనుమద్ర్వతంలో ఇప్పటిదాకా మీ బ్లాగు చూడలేకపోయాను .చాలాబాగావ్రాస్తున్నారు ,,దుర్గేశ్వర్   
లండన్ నుంచి ఓ మిత్రుడు......   
హాసం క్లబ్ రాజమండ్రిలో Dear Sri Hanumantha Rao garu, Namaskaramulu. I have a limited knowledge and experience as compared to the very senior and experienced people on this blog. Your effort prove the blog to be a group of very young minds ( as they say, the age is determined by the state of mind and its activity). Keeping up the spirit of your name, You are providing the real needed 'sanjeevani' through this blog, for all those who might lose the zest of their lives -by missing happiness and smiles. My hearty wishes for making us smile and please keep it up. reverence & hearty love to you for taking up a great activity, DNS Siva Kumar, Leicester, UK

చాన్స్ ఇస్తే సోది బాగానే కొడతావు.. నీ ఫ్యూచర్  చెప్పుమరి. అని సణిగింది బ్లాగు..
నా బ్లాగుకి అనుబంధంగా విజయగీతిక అని ఒక బ్లాగు తెరిచా.. మా ఆవిడకి పాటలు పాడ్డం ,,, వినడం ... ఇష్టం...ఈ మధ్య వ్రాస్తోంది కూడా... ఆ పాటలు అందులో పోస్ట్ చేద్దామని.. ప్రయత్నం మొదలెట్టా ... ఇంకా పెర్ పెక్షన్ రాలేదు... ఆడవారికి సంబంధించిన మాకు తోచిన విషయాలకు కూడా అదే బ్లాగుగా చెయ్యాలని. అని చెప్తుండగానే... మా వాడికి అయిడియాలు మంచివేనండి, కాని ఈ మధ్య ఆ ఫేస్ బుక్ ఒకటి పట్టుకున్నాడు.. ఇది తగ్గించాడు అని గొణిగింది.. అదేం కాదండీ... అది అప్పటికప్పుడు స్పందన ఉంటుంది. చాటింగ్ ఉంటుంది.. అందుకని ఓ ఆకర్షణ.. అని అంటూండగానే ఆ స్పందనలన్నీ లైకు.. డిస్ లైకు అంతే కదా...అంది బ్లాగు.
సర్లే.. ఇంక నీ సోదె ఆపి .. అతిథి సత్కారాలు చూడు... చాలా దూరం నుంచి అభిమానంగా వచ్చారు.. అనగానే ఒక్కసారందర్నీ మొదట్లో చూడమను.. అదిరిపోయే సెట్టింగు... నోరూరించే కేక్... ఆ ఫోటో నువ్వూ ...అండ్  సుబ్రహ్మణ్యంగారు... నా బ్లాగులో...
   

   



   

Monday, July 16, 2012

పూతరేకులు (జోక్స్ బాక్స్) ...తయారీ సుధామ


చదివినతర్వాత ......

హాసం క్లబ్, హైదరాబాదు వారి కార్యక్రమానికి హాజరై రాగానే పెట్టె తెరిచి మా ఆవిడ అక్కడ నేనందుకున్న మెమెంటో అవీ చూడ్డం మొదలెట్టింది. మరో కవరుచ్చుకుని లోపల అల్మారాలో పెడ్దామని నేను తీసుకెళ్తుంటే...
"అదేమిటి ?" అంది..
"పూతరేకులు"అన్నా..
"ఎక్కడివి ?"
"మా మీటింగు ప్లేస్ కు వచ్చి పాపం అభిమానంగా మన సుధామ ఇచ్చారు"
"ఎవరు ? ఆ రేడియో ఆయనా... మీకు సుగర్ అని ఆయనకు తెలియదా ?"
"ఈమధ్య ఇంటర్నెట్ ద్వారానే కాని ఇంటికెళ్లడాలు లేవు కదా.. బహుశా తెలిసుండదు."
"అయితే అవన్నీ లాగించేస్తారా ?"
"కావాలంటే నీకూ ఇస్తాలేవోయ్..."
"చాలు సరసం.. మీరు వాసనకూడా చూడొద్దు..."
అప్పటికింక చాలనిపించింది.. సరసంకాదు.. సరససంభాషణ... "సుధామగారు వ్రాసిన "పూతరేకులు" సర్దిన జోక్స్ బాక్స్ అమ్మా.. ఇది.. ముందు నేను చదివి తరువాత నీకు ఇస్తాను.. .." అన్నా ... పాత మూడ్ లోనే ఉందికనుకేమో నా ప్రతిపాదన వీటో చేయలేదు..
ఏక బిగిని చదివాను...
పడి పడి నవ్వించే జోకులు లేవన్నారు.. కాని కొన్నింటికి బాగా నవ్వుకున్నాను. అయినా ముళ్లపూడి వారన్నట్టు జోకులు నలుగురులో ఉన్నప్పుడు ఒకలా నవ్విస్తే .. ఒక్కరం ఉన్నప్పుడు ఒకలా నవ్విస్తాయి కదా...
"పెళ్ళికి ముందు.. తర్వాత"  పైనుంచి క్రిందకి , క్రిందనుంచి పైకి చదివించారు.. చాలా బాగుంది.
"లేట్ కమర్ ", "పర్లేదు",..  "మాటమారింది" ఇలా ఎన్నని చెప్పను..ఎన్జాయ్డ్.. క్షీరాయనమః.. ఎక్కువ నవ్వించింది.,,
ప్రశ్న: సగం యాపిల్ పండులాగా ఆమె దగ్గర కనిపించేది ఏది ?
జవాబు: మిగతా సగం యాపిల్ పండు

(లౌక్యంగా ఉంది జోక్)
మీరు ముందు మాటల్లో చెప్పినట్టు కొన్ని యస్సెమ్మెస్ లుగా సర్కులేట్ అయ్యాయి.. మళ్లీ ముళ్లపూడినే కోట్ చేస్తే జోకులు ఒరిజినల్ గా కొన్నే మిగతావి వాటి ఎక్స్టెన్షన్ అంటారు కదా ?
సజెస్టివ్ జోకులు నాకు చాలా ఇష్టం. అవి మీ పూతరేకుల్లో పుష్కలంగా కనపడ్డాయి. "బిల్డింగ్" "ఆలస్యం" "పర్లేదు" "సెంటేన్సు". "ఆఫీసు" ఇలా చాలా ఉన్నాయి. ఆలస్యం మరీ బావుంది.
"అయిపోయింది కదా అని ఏడవకు. అయిపోయింది కదా అని సంతోషించు.." మాటల మతలబు గొప్పగా ఉంది.
చిన్న సోత్కర్ష: ఈ మధ్య శశికళగారి బ్లాగు పోస్ట్ కు నా అభిప్రాయం రాసా..." మొదట్లో మగాళ్లు సాధించినట్టు  కనిపించినా చివరికి సాధించేది ఆడవాళ్లే"నని.. మాటల మడత అనొచ్చేమో కదా. ?
"పెయింటింగ్" కార్టూనిస్టులను బాగా పరిచయం చేసారు. అలాగే హింగ్లీషు: ముఖారి మొదలైన రాగాలను బాగా వాడారు...
పూతరేకుల్లో... రేకుల కోమలత్వం, జీడిపప్పు కమ్మతనం, పూసకట్టిన నేతి ఘుమ ఘుమ.. గట్టిబెల్లం మాధుర్యం అన్నీ కలిపి వండిన అందం కనపడ్తున్నది. తినే ఉబలాటంలో పెదవి కొరుక్కునే చురకలూ ఉన్నాయండోయ్...

బియ్యంప్పిండి పల్చగా ఉడికించి నిప్పుల్లో బాగా కాలిన గుండ మీద పల్చాతి పల్చగా పరిచి... ఆ రేకుల్లొ సున్నితంగా (లేకపోతే విరిగిపోతాయి) కూర్చి మడతలు పెట్టి.. పొరల మధ్యలో తేనె పూత, బెల్లప్పొడి చేర్పు, జీడిపప్పు పొడి. జల్లి.. తినడానికి కష్టం తెలియకుండా రెడీ చేస్తే.. అవి ఎవరైనా తిని ఎంజాయ్ చేస్తే చేసినవారు కష్టాన్ని మరిచిపోతారు. అవునా...
అంచేత పూతరేకులు కొనుక్కోండి... తెచ్చుకు మనసారా ఆస్వాదించండి...ఫోన్ నెం: 9848276929 కు ఫోన్ చేసి యాభైరూపాయలు మీవి కాదనుకుంటే మీరు తినగలిగినన్ని పూతరేకులు మీకు చేరతాయి.. సుగర్ ఉన్నవాళ్లుకూడా హాయిగా తినవచ్చు.. ఆనందంగా నవ్వుకోవచ్చు.
అక్కడక్కడ కనపడిన కోటబిల్ కోట్స్ అనదగ్గ ఓ కోట్ తో ముగిస్తాను..
"గొప్ప స్నేహితులు జ్ఞాపకాల్లో భాగం
చెరిపేయలేదు ఎప్పుడూ కాలం
నీలాంటి స్నేహితానికి వేసిన గాలం
తీపిజ్ఞాపకాల అదృష్టజాలం."


శలవు.

Monday, July 9, 2012

హలో బ్లాగున్నారా ?




1.Guest Couple, 2. Bulusu Subrahmanyam gaaru with camera 3.Guest and Me 4. Srimati ME and Srimathi GUEST.(date of photos 9th july and not as you see on photo)

సింహాద్రి అప్పన్నగారి ఫోన్... ఎవరీ సింహాద్రి... మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది...
"హలో..ఎవరండీ...?"
"నేను మీ ఇంటికి వస్తున్నాను.. రెండురోజుల్లో.. "
"ఎందుకుట ?" అడిగా...
"నవ్విస్తా..." 
"మీకదేం సరదా ? ఇంతకీ మీరెవ్వరు...?" ...
"నేనండీ బులుసు సుబ్రహ్మణ్యాన్ని... నవ్వితే నవ్వండి బ్లాగు ఓనరు."
"మీరా?"
"మీరాను కాదండీ..సుబ్రహ్మణ్యాన్నండీ... ఇంతకీ ఇటు నేనేనా.. అటు మీరేనా ?"
"నేనే...మీరే/\మీరే నేను..." ఏమిటేమిటో... అన్నట్టుగానే సుబ్రహ్మణ్యంగారు సతీ సమేతంగా ఈ రోజు ఉదయం మా ఇంటికి వచ్చారు.. బ్లాగులోనే పరిచయం..ఎప్పుడు ఎదురుపడలేదు. ఆయన రావడం చాలా ఆనందమైంది. సుమారు రెండుగంటలు మా ఇంట్లో ఉన్నారు.. చమత్కార సంభాషణలు సరదాగా సాగేయి... లక్ష్మీ అని పిలవబడే వారి శ్రీమతి అంటే మన ప్రద్యుమ్నుడిగారి భార్య చాలా ఆనందంగా మాట్లాడారు.. మళ్లీ వస్తారట.. ఈ చుట్టుప్రక్కల అన్నీ చూపించి, వారి కారులో పెట్రోలు బంకుదాకా తీసుకెళ్లి పెట్రోలు పోయించాక నాకు థాంక్స్ .. టా టా ఏకకాలంలో చెప్తారట... నేను పర్సు మూయకుండా ఆటో ఎక్కి ఇంటికి చేరాలట. ఇదంతా చెప్పడానికి నేపథ్యం.. మా ఆపెను ఆయన చెల్లిగా గౌరవిస్తున్నారట.. అందుకని బావమరదిగా నా బాధ్యత నిర్వర్తించాలట.. .. మా అన్నగారెందుకు ఇస్తారని ఆవిడ నాకు సప్పోర్ట్ ఇచ్చారు.. ఇన్ని చెప్పినాయన మా ఇంట్లో కాఫీమాత్రమే తీసుకున్నారు.. మందేసుకోవాలి కనుక ఏలూరునుంచి వస్తూ దారిలో తినేసామన్నారు... బ్లాగుల పరిచయం ఇంత ఆత్మీయం అయినందుకు ఆనందమైంది. మా ఇంటికి దగ్గరగా ఉన్న అప్పారావుగారింటికి (అంటే సురేఖగారు) వెళ్లాము. అప్పారావుగారు "ఈగ"సినీమా చూసిన విషయం చెప్పారు. ఈగ బాగుందన్నారు.   బాపుగారి విషయం వచ్చినప్పుడు బాపుగారిపై ఎంత బాగున్నా ఈగను వ్రాలనీయలేదు... చక్కటి చర్చ ఒకటి మా మధ్య సాగింది.. ఇన్ కెమెరా.. బాపు రమణలను అంతగా అభిమానించే మా అప్పారావుగారిలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.. అక్కడనుంచి సుబ్రహ్మణ్యంగారు వారి పనికై బయల్దేరారు..
ఇంతకీ ఆయన ఎందుకు వచ్చారో తెలుసా ? ఈమధ్య చిన్నవయస్సులోనే స్వర్గస్తుడైన మన బ్లాగ్ మిత్రుడు సరస్వతుల శంకర్ అంత్యక్రియల్లో ఆఖరిరోజు కార్యక్రమానికి.. ఆ శంకర్ ను ఈయన వీడియో చాట్ లోనే చూసారట... సుబ్రహ్మణ్యంగారి హృదయ సంస్కారానికి శిరసా అంజలి ఘటిస్తున్నాను.. బ్లాగులో ఇంత మంచి మిత్రులు ఉన్నందుకు సంతోషిస్తూ, బ్లాగు సంస్కృతిని కాపాడుకుందాం అని కోరుకుంటూ....

Friday, June 22, 2012

పన్ డిత ప్రజ్ఞ

{ఉపోద్ఘాతం: నిత్యజీవితంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఉపన్యాసాలలో మాట్లాడేటప్పుడు కొందరు విషయము చక్కగా మాట్లాడుతారు.. కాని కొందరు విషయాన్ని వదిలేసి తమకు వచ్చిన విషయాన్నంతా చెప్పేయాలనే ఉబలాటం చూస్తూ ఉంటాము.  పత్రికలలో సమాధానాలు శీర్షికల్లోకూడా ఈ అసాధరణ ప్రజ్ఞ కనపడుతూ ఉంటుంది.. ఆ నేపథ్యంలో ఈ పన్ డిత ప్రజ్ఞ... అవధరించండి.}
                          ---------------

ప్రశ్న:         నమస్కారమండీ... ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్యం అంటే మీకేమనిపిస్తున్నది ?
జవాబు:     నమస్కారమండి. 1847-లో ఒక ప్రఖ్యాత రచయిత తన నవల "క్రిస్ట్ కా  జీన్" లోని నాయకుడు       హస్నాహెంపా "మా ముగ్గురితో   సమానమైన వ్యక్తులు లే" రంటాడు. "ప్రజాస్వామ్య భవిష్యత్తు చూసేటందుకు భాష రావాలా" అంటాడు మర్స్ కాడింగా అనే ఫ్రెంచి  శాస్త్రజ్ఞుడు.  పదిహేడవ దశాబ్దపు తొలిదశకంలో పాస్లీ యుద్ధ
వాతావరణ నీడలో......
ప్రశ్న:        ఒక్క ముక్క అర్థం అవటం లేదు... అయ్యా మరొక ప్రశ్న.. కులవ్యవస్థ ఇంత భయంకరంగా వేళ్లూనుకు పోతున్నదికదా .. దీనిపై మీ   అభిప్రాయం శలవీయండి.
జవాబు:     మొదటి ప్రపంచ యుద్ధమయ్యాక, ఒక నాటి సూర్యాస్తమయ సమయంలో, ఇంకా పూర్తిగా సూర్యుడు పశ్చిమ కనుమలలోకి కృంగక  మునుపు, ప్రశాంత, నిశ్చల, నిశ్శబ్ద గంభీర వాతావరణంలో నైలునదీ పరీవాహక ప్రాంతంలో ... బోగన్ విల్లాయో లేక మజ్జీకారానోయో  చెట్టు నీడలో.. ద్రవిడజాతికి చెందిన ఒక యువకిశోరం చేపలు పట్టుకుంటూ ఉంటే ఒక ఉత్తమజాతికి చెందిన చేప ... చక్కటి వర్ణంగల చేప దొరికింది. అది తిందామనుకుంటున్న సమయంలోనే హరప్పా నాగసాకీ పై బాంబుదాడి జరిగి.....
ప్రశ్న: అయ్యా! నేనడిగినదానికీ, దీనికీ సంబంధం ఏమిటో నాకైతే అర్థం కావటంలేదు.
 సరే ! ముచ్చటగా మూడో ప్రశ్న.. మన ప్రాంతంలో ఈ మధ్య హ్యూమరు క్లబ్బులూ, లాఫింగు క్లబ్బులూ అంటూ, అలాగే కామెడి  సినీమాలు, కామెడీ కథలు అంటూ ఇలా హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు కదా..అసలు నవ్వు జనానికి అంత అవసరమా... దాని గురించి  కొంచెం వివరిస్తారా ?
జవాబు: ఐశ్వర్యవంతులకీ ... అతి సామాన్యులకూ మధ్య ఎన్నో మెట్లు ఉన్నాయని పద్ధెనిమిదవ శతాబ్దపు తొలిరోజులలో ఒక పరిశోధన జరిగింది. దానికి వాసిన సిద్ధాంత వ్యాసం 1854 పేజీలపైన ఒక బ్రహ్మాండమైన గ్రంథం అయింది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా చరిత్రకు  ఎక్కిద్దామంటే... అప్పటికి ఇంకా గిన్నీస్ బుక్ గురించి ప్రపంచ మేధావులకు తెలియదు. అప్పటికింకా తాజ్ మహల్ కట్టబడలేదు,  సరికదా కట్టడానికి రాళ్లెత్తేకూలీలనుకూడా కుదుర్చుకోలేదు. ఎవరు వచ్చి రాళ్లెత్తుతారో తెలియని పరిస్థితి.. వాళ్లెవరో తెలిస్తేకదా పాటలు  పద్యాలు వ్రాయడానికి. అలాంటి అయోమయ పరిస్థితిలో అలాంటి లౌకిక జీవన విధానంలో.....
ప్రశ్న:  అయ్యా...అయ్యా....నాకు మెంటలెక్కిపోతోంది.. అయినా కార్యక్రమం చెయ్యక తప్పదు.. ఇంకొక్క ప్రశ్న... ఇది ఆఖరిది... చాలా సింపుల్ గా  అడుగుతాను.. డైరెక్ట్ గా జవాబు చెప్పండి. మనిషికీ మనిషికీ మధ్య ఇప్పుడు ప్రేమాభిమానాలు తగ్గుతున్నాయని అందరూ    అంటున్నారు కదా... ఎందువల్ల నంటారు.
జవాబు: 1757లో దేశాన్ని ఏలిన స్వార్థపూరిత రాజుల రాజ్యపటిష్టత పేకమేడలా కుప్పకూలిపోతున్న తరుణంలో, రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండునుంచి   పొగ బండిలో మనదేశానికి వస్తూఉంటే "జ్యుయల్ ఇన్ ది బ్రిటిష్ క్రౌన్" గురించి అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో డార్జిలింగు నదీ తీరంలో రాజ్యాధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము....
ప్రశ్న:  అయ్యా ! మీ సమాధానాలు వినే ఓపిక నాకు లేదు.ప్రోగ్రాం టైము కూడా అయిపోతోంది. పిల్లి అంటే మార్జాలంలాగా సాగే ఈ జవాబులతో.....
జవాబు: సరేగాని యాంకరుగారూ ! పిల్లి అంటే మార్జాలం అంటూ ఉంటారు కదా.. అంటే ఏమిటో కాస్త వివరిస్తారా ?
ప్రశ్న: ఏమిటా... వినండి... కళ్లికోట యుద్ధానికి ముందు ప్లాస్లా యుద్ధంలో...అంటే పదిహేడవ శతాబ్దపు తొలి దశకంలో ఔరంగజేబు కోటగోడమీదనుంచి పసిఫిక్ మహా సముద్ర మధ్య ప్రాంతంలో గన్స్ ఆఫ్ టుటికోరన్ అనే యుద్ధ నౌక జండా కొయ్య మీద వ్రాలిన మార్జాలన్నిపిల్లి అంటారు. తెలిసిందా...?
జవాబు:  అర్థం కాలే....

                        ---------------------