అమ్మ , నాన్నగారు రామభక్తి రుచి చూసారు.. చూపారు....అదే అందిందేమో
"శ్రీపతియు దశర థాత్మజుఁ డా పలువేలుపులు, నొక్క టం చెంచియు, సీ
తాపతి మా యిలువేల్పు, గృ పాపరుఁ డౌట,మదిఁ గొల్తు భక్తిన్, రామున్! "
(నాన్నగారు, దినవహి సత్యనారాయణగారు, తులసీ రామాయణానికి
తెలుగు వచనానువాదం చేసారు. అందులోని ముందు పద్యమిది.)
శ్రీ రా మ న వ మి... 'రామ' అంటేనే ఒళ్ళు ఝల్లు మంటుంది..
తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా
నిను తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా!..... ..... .. ...( త్యాగరాజ స్వామి)
శ్రీరామ భక్తితో నిండి పోయిన మనస్సు పలికే గానమెలా ఉంటుంది అంటే ...
కేరళరాష్ట్రంలోని కన్హన్ గాడ్లో ఆనందాశ్రమం ఉంది. . దాని వ్యవస్థాపకులు శ్రీ రామదాసు. పూర్వాశ్రమంలో
ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాతాధికారి. తన మనసు రామునికి అప్పజెప్పి.. రామాజ్ఞగా దేశమంతా తిరిగారు.. జేబులో డబ్బులు తస్కరింపబడినా అది రామాజ్ఞగా భావించారు.. యాచకుడిగా భావించి మరో యాచకుడు తనతో భిక్షాటనకు తీసుకు వెళ్తే రామాజ్ఞగా భావించారు. రాముడే రాముడే రాముడే . తన అనుభవాలన్నీ In search of Truth అనే తన పుస్తకంలో అద్భుతంగా వ్రాసారు. ఆయనకు అంతా శ్రీ రాముడే. ఆయన ఆశ్రమం చూడడానికి మన రాష్ట్రంలోని గుంటూరుప్రాంతానికి చెందిన ఒక స్వామిజీ వెళ్ళారుట. ఆ రామదాసుగారు మన ప్రాంత స్వామిజీకి తన ఆశ్రమంలో ఉన్న తోటను చూపిస్తూ... పళ్ళతో నిండిన టమోటా మొక్కను చూపి, ఈ పళ్ళను మీ తెలుగుభాషలో ఏమని అంటారు అని అడిగారట. గుంటూరు ప్రాంత స్వామి తనప్రాంతంలో టమోటాను "రామములక్కాయ" అంటారని చెప్పారట. "రామ" శబ్దంవినగానే ఆ రామదాసుగారు పులకరించిపోయారు... ఆనందాశ్రువులు రాలుస్తూ ఆ టమోటా పండును చూస్తూ..తన శ్రీరాముని ఎర్రటి కపోలాలను, నిగనిగలాడే మేని ఛాయను, నయనానందకరరూపాన్ని ఆ ఎర్రటి పండులో చూస్తూ ఆనందంతో పొంగి పోతూ నృత్యం చేసారట... అదే తలచినంతనే నా తనువేమో ఝల్లు ఝల్లుమనేరా.....ఆ ఆనందానుభవం భక్తుడి స్వంతం.
కౌసల్యా సుప్రజా రామా" అంటూ మేలుకొలిపి ..
"రామా లాలి-మేఘశ్యామా లాలి" అని బజ్జో పెట్టేదాకా రామునితోనే ఊసులాడతాడు భక్తుడు.
"ఉల్ల మలరించు కౌసల్య పిల్లవాడు, కూర్మి చెలువారు దశరథు కుఱ్ఱవాడు
అరసి జనకుని నచ్చిన యల్లువాడు, సీత మనసార వలచిన చెలువు వాడు" ...
(స్వర్గీయ గుడిపూడి ఇందుమతీ దేవిగారు)
అంటూ తన చిన్ని రామప్పను తనివితీరా ... మనస్సునిండా ... ప్రేమమీరా పలకరిస్తే
"ధరకేతెంఛిన విష్ణురామ ! వరసీతారామ ! దైత్యాళి సం
హరరామా ! రఘురామ ! వందనమయోధ్యారామ ! సర్వజ్ఞస
ద్గురు రామా ! ఋషివంద్యరామ ! నతులో కోదండరామా ! పరా
త్పరరామా ! వనవాసరామ ! హనుమద్రామా ! మహానందని
ర్భరరామా ! మునివేషరామ ! వరదా ! పట్టాభిరామా ! వసుం
ధరభారోద్ధరరామ ! మ్రొక్కులివి యాత్మారామ ! నా గుండెలో
దరిసింతున్ శివరామ ! యేలుకొనరాదా ! రామ చన్ద్ర ప్రభూ !" .... ("రామచన్ద్ర ప్రభూ" శతకం--శ్రీ సామవేదం)
అని కీర్తిస్తూ మురిసిపోతారు.
"సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాదు తండ్రి
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన
తాత భరతాదులు సోదరులు.... "
ఎంత దగ్గరైపోయామో చూసావా.. ఓ వెర్రి మనసా .. అంతేకాదు
"పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనసా !"... .... .....( త్యాగరాజ స్వామి)
రాముడే కావాలనుకుంటారు వీరు. వీరందరూ ఇప్పుడు నా వారయి పోతారు కదమ్మా....
మేము రామునివారము..
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో ర్వాయ్వాదికోణేషు చ,
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలమ్....
ఇంత రక్ష .. ఇంక మాకేల విచారము.
అందుకనే
మ్రొక్కిన నీకె మ్రొక్కవలె.. మోక్షమొసంగిన నీవ ఈవలెన్
దక్కిన మాటలేమిటికి దాశరథీ! కరుణాపయోనిథీ...!
అంతా రామ మయం.. జగమే రామమయం..
ఇన్ని భాషలేల, ఇన్ని వర్ణములేల
"రా"యు - "మ"యును, చాలు "రామ"యనగ
"రామ" యనుచు పిలువ "రామా"యను జగతి
రాముడేలు జగము రమ్యముగను ...
ఆ
" - రా మా .... ఆ నామం ఎంత శక్తిమంతమో కదా !
"రా".. కలుషంబులెల్ల బయలంబడద్రోచిన "మా"కవాటమై
డీ కొని బ్రోచు...
ఎంత గొప్ప మంత్రమది...
"మహా మంత్ర జొయి జపత మహేసూ | కాసీ ముకుతి హేతు ఉపదేసూ||
మహిమా జాసు జాన గన రావూ| ప్రథమ పూజిఅత నామ ప్రభావూ ||" ......
"ఆ మహా మంత్రమును శివుఁడు జపించును. అద్దానినే కాశిలో ముక్తిహేతువుగ నాతఁ డుపదేశించును. అద్దాని మహిమను గణనాయకుఁ డెఱుంగును. ఆ నామప్రభావముననే యాతఁడు తొలుదొల్త పూజింపఁబడుచున్నాఁడు." (తులసీదాసు)
"సలలిత రామనామ సార జపము" ఆ మంచుకొండవాడికే తెలుసట..
అందుకే "శ్రీరామ రామ రామేతి" అంటూ అమ్మకు చెవిలో చెప్పాడు.. శ్రీరాముని నామ విశేషం చెప్పి
ఊరుకున్నాడా? లేదే ?
"బంటురీతి కొలువీయవయ్యా రామా" అంటూ దిగి వచ్చేయలేదా....
"చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి...."
ఏలాగు వివరింతురా నీ నామ రుచి,,
నీ విమలమేచక రూపాన్ని
"అలక లల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో.." ...రామా !
నీల మేఘ శ్యాముడు.... శ్రీరాముని......పోతనగారు చూసారు మనకోసం పోత పోసారు.
సీ|| మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నుగిద చెంగటనున్న నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిరునవ్వు మొలచువాఁడు
వల్లీ యుతతమాల వసుమతీజము భంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీల నగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు
ఆ|| పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁడొక్కరుఁడు నా, కన్నుఁగవకు నెదురఁగానఁబడియె.... ..... ....(పోతనగారి భాగవతం)
రామా! నిన్ను,...
"కన కన రుచిరా కనకవసన నిన్ను....
పాలుగారు మోమున శ్రీ యపారమహిమ దనరు నిన్ను... కన కన రుచిరా.."....
రామో విగ్రహవాన్ ధర్మః ..... ధర్మమే తనువైన ఓ రామా....
"నాల్గు పాదాల ధర్మంబు నడుపువాడు ... నాల్గు పురుషార్థముల వెంట నడుఛువాడు
నాల్గు వేదాలు మెచ్చెడి నడకవాడు.... భూమిభారంబు వహించె మోదమలర"....(మావుడూరు రఘురామయ్య - రఘురామ రామాయణం)
మా కోసం వచ్చావా రామయ్యా.....
"మాకొఱకు జననమొందితి....రాకాసుల రాజుఁ జంపి రక్షించితి వౌ
లోకంబు లెల్లఁ గృపతో ... సాకేతపురాథినాథ ! సజ్జన వినుతా !".... ... .... (మొల్ల రామాయణం)
రామా ... ఆదుకో తండ్రీ.....
"కరములు నీకు మ్రొక్కులిడ, కన్నులు నిన్నునె చూడ, జిహ్వ నీ
స్మరణ దనర్ప, వీను భవత్కథలన్ వినుచుండ, నాస నీ
యరుతను బెట్టు పూసరులకాసగొనన్, బరమార్థసాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ ! కరుణాపయోనిధీ !"... ..... ..... .....( రామదాసు-దాశరధీ శతకం)
మనస్సంతా నిండిన మంగళమూర్తీ.....మనస్సు దివ్వెలతో మంగళమయ్యా కళ్యాణ రామయ్యా.... హే! సీతాపతే !
నీ నామ రూపములకు - నిత్య జయ మంగళం..
పవమాన సుతుడు బట్టు - పాదారవిందములకు .... |నీ|
ఓం శాంతిః..... శాంతిః .... శాంతిః
______()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()______
[ఈ దేహము సేకరించిన పుస్తకాలయంలో కొలువైన శ్రీరాముని ఊసులు ఇవి.....
ఎందరో మహనీయులు అనుభవంతోపలికినవి ఆ శ్రీరాముని ఊసులు ఇవి.....
పుంసా మోహనరూపుడు శ్రీరామునికి మనసా, శిరసా నమస్కరించి...
హృద్యంగా చెప్పిన మహనీయులకు అంజలిఘటిస్తూ చెప్పుకుంటున్న ఆ శ్రీరాముని ఊసులే ఇవి ...]
~~~~~~~~()()()~~~~~~~
1 comment:
నమస్కారం
మీరు వ్యాఖ్యల్లో ఒక చోట భారత్ వికాస్ పరిషత్ అని అన్నారు. గోదావరి పరిశుభ్రత కార్యక్రమం గురించి. మీకు వీలయినప్పుడు మరిన్ని వివరాలు తెలియజేయగలరు. ఇంకా కొనసాగిస్తున్నారో లేదో, ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఈ పుణ్య కార్యం కొంచెం తెలియజేయండి.
మీ email-id తెలుపగలరు.
ధన్యవాదాలు
కృష్ణ
Post a Comment