Pages

Thursday, August 23, 2012

రాజమండ్రి.... 5




రాజమండ్రి ఊరుగురించి ఎంతో చెప్పి మా శ్రీరామనగర్ గురించి కొంతయినా చెప్పక పోవడం తప్పుకదా.. నేను రాజమండ్రిలోనే పుట్టి పెరిగాను... నా ఆరవ ఏట రాజమండ్రిలోని ఈ శ్రీరామనగర్ వచ్చేసాము..చిన్నప్పుడే వచ్చేయడంవల్లనేమో ఈ శ్రీరామనగర్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో ఉద్యోగరీత్యా కొద్దికాలము దూరమైనా ఈ పేటతో నా నికర అనుబంధము నలభై ఏళ్ల పైమాట....   ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మధ్య మధ్య రాజమండ్రి వచ్చి ఈ గాలి పీలుస్తే కాని తోచేది కాదు..ఆ అభిమానంతోటే ..మరల రిటైర్ అయ్యాక ఈ పేటలోనే ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాను. అంచేత నిజమైన అనుబంధం నా జీవిత కాలం అని చెప్పడం సబబు.... 

రాజమండ్రిలో ఇప్పుడు నేనుంటున్న మా ఫ్లాట్ కు పొడుగాటి బాల్కనీ ఉంది.. దానికి ముందువైపు సగంవరకు అద్దాలు పెట్టించాము .. దాని వెనుక నాకో చిన్న రూమ్ లా చేసుకున్నా... బయట వర్షం పడుతుంటే ఆ అద్దాల వెనుకనుంచి రోడ్ చూస్తుంటే భలే కాలక్షేపం... అలా వర్షం పడుతున్న ఓ సాయంత్రం ఆ వర్షాన్ని చూసి ఆనందిస్తున్న మనస్సు ప్రశాంతమై చిన్నతనంలోకి వెళ్లిపోయింది...

నలభైల్లో మా నాన్నగారు రూపాయికి ఆరు చదరపుగజాల చొప్పున, (ఆశ్చర్యంగా ఉంటుంది కాని నిజం...) శ్రీరామనగర్ లో  1400 చ.గ. స్థలం కొన్నారు.. నాన్నగారిపై అభిమానంతో మా చుట్టూ అందరూ మా బంధువులే స్థలాలు కొనుక్కున్నారు.. మేముకాని మిగిలిన వారుకాని  ఇల్లు కట్టే సాహసం చాలాకాలం చెయ్యలేదు.. ఎందుకంటే ఊరికి దూరం.. పైగా ఈ పేటకొచ్చే దారిలో జనసంచారము అసలు ఉండేది కాదు.. మా పేటకు ముందున్న సీతంపేటలో జనజీవనం కొంచెం ఉండేది., అది దాటాక ఇప్పుడు వాటర్ ట్యాంకున్న స్థలంలో సీతమ్మ చెరువు, ముందుకొస్తే  రోడ్డుకిటూ అటూ పెద్ద పెద్ద చెట్లు... రాత్రిళ్లైతే మరీ భయంకరంగా ఉండేవి

1949లో...అప్పట్లో మేము రామా టాకీసు (ప్రస్తుత నాగదేవి) దగ్గర అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.. ఇంటి వాళ్లు కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కోపంతో మా నాన్నగారు వారం రోజుల వ్యవధిలో శ్రీరామనగర్ లో మా స్వంత స్థలంలో ఓ పాక వేసుకుని అక్కడికి మకాం మార్చేసారు.  మేము  ఈ పేటలోకి వచ్చినప్పుడు అయిదారు ఇళ్లకన్నా ఎక్కువలేవు.. అప్పట్లో ఊరు అంతగా పెరగక పోవడంవలన ప్రభుత్వయాజమాన్యంలో ఉన్న పేపరుమిల్లు  ఊరికి దూరంగా ఉన్నట్టు ఉండేది.. మా పేట మొదట్లో చుక్కా అప్పలస్వామి రెడ్డిగారి పెద్ద పేలస్ ఉండేది.. ఆ పేలస్  నాలుగు రోడ్లకు సరిపడా ఉండేది..  ఆయన తన సోదరునితో కలసి కలప వర్తకం చేసేవారు.. ఆ పేలస్ చుట్టూ పెద్ద దొడ్డి.. మామిడి, బాదం లాంటి చెట్లు.. ఆ ఇంట్లోకి చిన్నప్పుడు వెళ్లేవాడ్ని. లోపలకెళ్తే బయటికి ఎలా రావాలో తెలియనట్టుండేది... ఆ అప్పలస్వామి రెడ్డిగారు కొన్నాళ్లు మునిసిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు.. చాలాకాలం ఇప్పుడు సీతానగరం రోడ్డుగా పిలవబడే మా రోడ్... చుక్కా అప్పలస్వామి రెడ్డీ రోడ్డే.. మా ఇంటి అడ్రస్సు చెప్పడానిక్కూడా వారి పేలస్ ఒక లాండ్ మార్క్. వాళ్ల అబ్బాయి సదాశివరెడ్డి బాల్ బ్యాడ్ మింటన్ జాతీయస్థాయీ ఆటగాడు.  

మేం ఈ పేటకు వచ్చే నాటికి మా పురోహితులు గుంటూరి సత్యనారాయణగారి పాక ముందుగా ఉండేది ...
మా పాక దాటాక దూరంగా మరో రెండు పాకలుండేవి... ఆ తర్వాత అన్ని చెట్లూ, పిచ్చిమొక్కలు అలా కాలిదారులు తప్ప ఏ దారీ ఉండేది కాదు..  పేట అంతా పచ్చిక బయళ్లు, తాడి చెట్లు.. అంతే.. పాక ముందు కూర్చుంటే విపరీతమైన గాలి.. ఆ జీవితం చాలా ఆనందంగా ఉండేది... 
నాన్నగారు ఊళ్లో హిందీ పాఠశాల కొన్నాళ్లు, తర్వాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.. తర్వాత్తర్వాత వయస్సు పైబడ్డాక ఇంటిదగ్గరే ఉండిపోయేవారు.. 
నా చదువు..... కొన్నాళ్లు సీతంపేటలో ఎలిమెంటరీ చదువు చదివి, పుష్కరఘాట్ లో ఉన్న మునిసిపల్ హైస్కూల్లో ఫస్ట్ ఫారం అంటే ఇప్పటి సిక్స్త్ లో చేరాను... ఆ హైస్కూలు ఒక్కటే అపుడు మాకు దగ్గర...అయిదారు  కిలో మీటర్ల దూరముండేదేమో..... ఒక చేతిలో పుస్తకాల సంచీ, ఒక చేత్తో రెండుగిన్నెల క్యారియర్ తో భోజనం, వర్షాకాలమైతే గొడుగు.. ఈ లోడ్ అంతా భుజాలకి తగిలించుకుని లెఫ్ట్ రైట్....అరగంటపైన నడిచి స్కూలుకి చేరేవాళ్లం... లాగుడు రిక్షాలుండేవి, ఎప్పుడైనా ఎక్కేవాణ్ణి..  నా సెకండ్ ఫారంలో అనుకుంటా సైకిలురిక్షాలు వచ్చాయి.. ఆ రోజుల్లోనే సిటిబస్సు ఒకటో నెంబరు, రెండో నెంబరూ  వచ్చాయి.. ఒకటి పేపరుమిల్లునుంచి, గోదావరి స్టేషన్ దాకానే.. కాని మనటైమ్స్ కాదు. .. స్కూల్లో ఏ ఫంక్షనో అయి లేట్ అయితే, మా వీధిలోకి వెళ్లాలంటే భయం భయంగా ఉండేది... అలా చీకటడ్డాక వచ్చినప్పుడు మా వీధిలోకి తిరగ్గానే "దేముడా దేముడా" అనో , "జై వీరాంజనేయా" అనో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ వచ్చేవాడ్ని. (ఇప్పటికీ ఆ అలవాటు అప్పుడప్పుడు మనస్సులో మెదులుతుంది.)


మా ఇంటి ముందర మునిసిపాలిటీ దీపం.. శుభ్రంగా తుడిచి కిరసనాయిల్ పోసేవాడు.. చీకటి పడుతుంటే వెలిగించేవాడు... తమాషాగా వెన్నెల వచ్చేదాకా వెలిగి ఆ దీపం ఆరి పోయేది.. అంత కరక్ట్ గా పోసేవాడు.. ఆ దీపమే  మాకు లైట్ హౌస్.. దీపం వెలుగు అంతంత మాత్రమే కదా !  . దానివైపే చూస్తూ దేముడా దేముడా అని నెమ్మదిగా అనుకుంటూ ఇళ్లకి చేరేవాళ్లం...





ఇంట్లో హరికెన్ దీపాలు.. కోడిగుడ్డు దీపాలు. అమ్మ చిమ్నీలు శుభ్రంగా తుడిచి.. సాయంత్రం అయ్యేసర్కి వెలిగించి వీధిలో ఉన్న తాటాకు పందిరిలో ఇనుప కొక్కీకి ఓ హరికెన్ దీపం తగిలించేది.. అలా సాయంసంధ్యలో వెలిగే దీపం ఓ లక్ష్మీ శోభతో ప్రకాశించేది.. ఆ తాటాకు పందిరి క్రింద ఓ రౌండ్ టేబుల్.. దాని చుట్టూ మెట్రిక్ పరీక్షలకు, హిందీ పరీక్షలకు చదివే పిల్లగాళ్లకు నాన్నగారు పాఠాలు చెప్పేవారు.. అదో అందమైన దృశ్యం.

వర్షం వచ్చిందంటే మా పేట సంగతి ఇక అడక్కండి..   బురద కాలికి అంటుకుపోయేది. కాలు పెద్ద టైరు చెప్పులా అయిపోయేది.. ఆ బురదకాళ్లతో  బరువుగా రోబోలా అడుగులు వేస్తూ రోడ్డుమీదకి వచ్చి... అక్కడ వర్షపు నీటి గుంటల్లో కాళ్లు కడుక్కుని స్కూలుకి పోయేవాళ్లం... సైకిళ్ల మీద వచ్చిన వారి అవస్థ వర్ణనా తీతం.. క్రింద చెరువుల దగ్గరకి పోయో, లేకపోతే ఆ నీళ్లగుంటలదగ్గరనో గంటల తరబడి కడిగితేనే కాని  సైకిలు కదిలేది కాదు.. జిత్ మోహన మిత్రా ఇప్పటికీ మా ఇల్లుగురించి తలుచుకుని ఇదే చెప్తాడు... ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాడు. 

అసలు రాజమండ్రిలో వర్షం వచ్చిందంటే ఎప్పుడూ పెద్ద సీనే.. మేం స్కూలుకి వెళ్లేదారిలో ఉన్న మరోపేట తుమ్మలావ.. అక్కడ శ్రీ ముదుగంటి సూర్యనారాయణగారని మా ట్యూషన్ మాష్టారు ఉండేవారు.. వర్షం ఏ కొద్దిగా పడినా తుమ్మలావలోఉన్న నాలుగు వీధులూ జలమయమై పోయేవి.. రెండుమూడురోజులుదాకా నీరు లాగేది కాదు..ఓ సారి నేను ట్యూషన్ కని బయలుదేరి.. ఆ నీటిలో ఉన్న వీధులు గుర్తు పట్టలేక... మాష్టారింటికోసం అలా తిరుగుతూనే ఉన్నాను.. చివరికి మేష్టారు స్కూలుకి బయల్దేరుతూ కనపడి.. "ఇంక చాల్లే వెతకడం, పద స్కూలుకి" అని స్కూలుకి తీసుకుపోయారు.. అంటే ఏడింటికి ట్యూషన్ లో ఉండవలసినవాణ్ణి తొమ్మిదిన్నరదాకా వెతుకుతూనే ఉన్నానన్నమాట... 

తుమ్మలావ, ఆర్యాపురంలోంచి ఓ కాలువ ఊళ్లో పడ్డ వర్షపునీటిని, మురికినీటినీ గోదావరిలోకి తీసుకువెడుతుంది.. గోదావరికి వరదలు ఒక స్థాయికి మించి వస్తే ఆ వరదనీరు ఊళ్లోకి రాకుండా ఆటోమెటిక్ గా ఈ కాలువ తలుపులు మూసుకుపోతాయి.. అప్పుడు ఈ మురికినీటికి దారి ఉండదు.. పేటల్లోకివచ్చేస్తాయి.. అదే టైములో వర్షం పడిందంటే ఇక ఊహించండి...  బయట వరద తగ్గేదాకా ఇదే పరిస్థితి.. అలా అలా ఈ మురికినీరు లెవెల్ పెరిగి, ముందు తుమ్మలావ, తరువాత ఆర్యాపురం వీధుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది.. అప్పుడు రాకపోకలు చాలా బాధకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి అప్పట్లో వర్షాకాలంలో నిత్యమూ ఉండేది.. ఇప్పుడు చాలా మెరుగైంది.

పాక అని చెప్పాను కదా.. దానిముందు కొంతకాలం తర్వాత నాన్నగారు పెంకుటిల్లు కట్టారు.. మూల పెంకు అంటారు, బంగలా పెంకు కాదు.. మూలపెంకు ఇంటిలో శీతాకాలం వెచ్చగానూ, వేసవికాలం చల్లగాను ఉంటుంది. ఆ పెంకుటింట్లో మా సామాను పెట్టి కొంతకాలం మేము శ్రీకాకుళం జిల్లా దేవాది అనే ఊరిలో ఉండాల్సివచ్చింది. ఆ దేవాది అండ్ ముబగాం ఎస్టేట్స్ కు మా పిన్నిగారు జమీందారిణి. వాళ్ల ఎస్టేట్స్ వ్యవహారం చూడ్డానికి నాన్నగారిని రమ్మన్నారు.. మేమూ వెళ్లాం.. అక్కడ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కొద్దికాలం చదివా.. దివానుగారబ్బాయిని కదా.. నేను వెళ్లాకనే స్కూలు ప్రారంభమయ్యేది.. మాష్టారు నన్ను "రండి బాబూ.."అంటూ పిలవడం లీలగా గుర్తు.. అలా పిలిపించుకోవడం తప్పని తెలుసుకోలేని వయస్సు.. ఆయన ప్రక్కన నాకు ఎత్తుగా బల్లో కుర్చీయో వేసి కూర్చోమనేవారు.. మిగతా పిల్లలు క్రింద కూర్చునేవాళ్లు.. దసరాలకు విల్లంబులు తీసుకుని, పద్యాలు పాడుతూ మా దివానానికి మేష్టారు, పిల్లలూ వచ్చేవారు.. అమ్మా, పిన్ని మేష్టారుకి పళ్లెంలో బట్టలూ,డబ్బులు ఇచ్చేవారు.. నేను పద్యాలు చదివేవాణ్ణి... మా మామయ్యగారబ్బాయికూడా నాతో చదివేవాడని గుర్తు... అక్కడనే శర్మగారని ఆ జమీలో పనిజేసి వృద్ధులైన ఒకాయన ఉండేవారు.. ఆయన చిలకమర్తివారిదగ్గర కొంత కాలం ఉన్నారట. ఆయన పిల్లలతో తమాషాగా మాట్లాడేవారు... తలనొప్పికి మందు చెప్పేవారు... పేను గుండెకాయ, తలుపు కిర్రు, నల్లి మెదడు... కలిపి నూరి బుర్రకు పట్టించాలట..... అక్కడ పెద్ద పెద్దతోటలు, గులాబిజాం మొక్కలు, తామర చెరువులు, దివానంలో గంట గంటకు కాలాన్ని సూచిస్తూ గంటలు కొట్టడం, దీపావళికి పనివాళ్లు బాంబులూ అవీ తయారుచేసి కాల్చడం... అదో జీవితం, కాని చాలా కొద్దికాలం.. ఆ తర్వాత కాకినాడ వచ్చేసాం.. అక్కడ భారతీ విద్యాలయంలో చదివా.. 

ఆ తర్వాత రాజమండ్రి....
రాజమండ్రి మునిసిపాలిటి అయినా మా పేటకు 1957 వరకు కరెంటు లేదు.. నేను యస్.యస్.యల్.సి చదువుతున్నప్పుడు మా పేటకు కరెంట్ వచ్చింది. అప్పుడు కూడా మా బాబాయి గారు మరొక పేటవాసికలసి స్తంభాలు, వైరు ఖర్చు భరిస్తే కరెంట్ ఇచ్చారు.. ఆ తర్వాత నేను రాత్రిళ్లు బాబాయి గారింటికి వెళ్లి చదువుకొనేవాణ్ణి.. 60W బల్బ్.. ట్యూబ్ లైటు లగ్జరీ.. అవి అందరూ వేసుకునేవారు కారు... ఆ తర్వాత మాకు కరెంట్ వచ్చింది.. 
అద్దె సైకిలు కావాలంటే సీతంపేట వెళ్లాలి.. అప్పుడు సైకిల్స్ అద్దెకిచ్చేవారు.. ఎరుగున్నవాళ్లకే ఇచ్చేవారు.. కోటగుమ్మందగ్గర ఇప్పుడు తుమ్మిడిరామకుమార్ గారి షాపు ఉన్నదగ్గర.. సైకిళ్లు పట్టుకుని ముందుకొచ్చె రెడీగా ఉండేవారు.. వాళ్లైతే అందరికీ ఇచ్చేవారు.. 

సీతంపేట మాకు డౌన్ టౌన్.. అక్కడ రామకృష్ణా హోటల్ .. చిన్నతనంలో హోటల్ కు వెళ్లడం అలవాటు లేదు.. కాలేజీలో జేరాక అప్పుడప్పుడు స్నేహితుల తోటి.. తరవాత్తర్వాత ఒక అలవాటైపోయింది.. చాలాకాలం ఆ అలవాటుండేది... ఇప్పుడు ఈ ధరలు చూస్తుంటే  అవసరమనిపిస్తేనే వెళ్లడం.. అదీకాక పాకెట్ మనీ చదువుకునే కుర్రాళ్ల జన్మహక్కు అని అప్పట్లో మాకు తెలియకపోవడం.. కష్టాల రుచి తెలుసున్నవాళ్లమో ఏమో, హోటళ్ల రుచి అంతగా అలవాటు కాలేదు.. సినీమాలు అంతే.. మీ టైములో ఇవన్నీ లేవు అంటాడు మా మనవడు... ఏమో అదీ నిజమేనేమో...

కాలేజీకి (1957-58), (1959-1962) వెళ్లాలంటే సీతంపేట మీదనుంచి, వీరభద్రాపురం పుంతలోంచి వెళ్లేవారం.. ఆ పుంత రోడ్డు పగలు కూడా వళ్లు దగ్గరెట్టుకుని నడవాలి.. ఎగుడుదిగుడుగా ఉండి ఎక్కడ పడిపోతామో అన్నట్టుగా ఉండేది. నిజానికి మాకు కాలేజీ అలా కోరుకొండ రోడ్డు మీదనుంచి దగ్గర.. కోరుకొండరోడ్డుకి వెళ్లాలంటే  పచ్చిక బయళ్లలోంచి, తుప్పల ప్రక్కనుంచి వెళ్లాలి అన్నమాట.. పగలు అప్పుడప్పుడు పెద్ద పెద్ద పాములు కూడా కనపడేవి.. 
1962 లో అందరికీ ప్రియతమ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు రాజమండ్రి వచ్చారు..  విమానంలో మధురపూడి వచ్చి పేపరుమిల్లులో రక్షణ నిధికి ఇచ్చే విరాళం స్వీకరించడానికి మా వీధిలోంచి వెళ్లారు.. అప్పుడు మా రోడ్ కు మోక్షం వచ్చింది.. కోరుకొండ రోడ్ దాకా ఉన్న తుప్పలు నరికించి... శుభ్రం చేసి కచ్చారోడ్ వేసారు. ఇప్పుడు పక్కా  రోడ్ మా యల్.బి.శాస్త్రి రోడ్..ఇన్ మా శ్రీరామనగర్....సందడే సందడి....

కొద్దిగా రాజమండ్రిలోని మా పేట శ్రీరామనగర్ గురించి వ్రాసి బోరుకట్టాను కదా.. మళ్లీ తర్వతెప్పుడైనా మరల ఈ పనే చేస్తానేం ? అంతవరకు శలవు..


..

13 comments:

Dinavahi Murali said...

Namasthe Thathagaru,

chala baga rasaru.


Naku ee post dhwara chala vishyalu thelisayi. inka chala unayi kadha.

Sriramnagar lo post office ki muthathagaru ey karanam anta kadha.Dhani gurinchi kuda chepra .Please.....

హనుమంత రావు said...

డియర్ మురళీ,, నేను వ్రాసినది చదివి, నీ అభిప్రాయము చెప్పావు, చాలా సంతోషము. అక్కడ పోస్ట్ ఆఫీసుకు మీ తాతగారే కారణము.. ముత్తాతగారు కాదు.. అవన్నీ నెమ్మది నెమ్మదిగా వ్రాస్తాను.. చదివి నీ అభిప్రాయము చెప్తూ ఉంటే ఆనందము గా వ్రాస్తాను.. థాంక్ యు ఒన్స్ అగైన్....

చంద్ర said...

సులభమైన భాష లో అలనాటి విషయాల గురించి చక్కగా వ్రాసారు.
నేను రాజమండ్రి చూసింది ఒకసారే. మీరు రాసింది చదివాక అక్కడికి వెళ్లి రావాలి అనిపిస్తోందండి. ధన్యవాదాలు.

హనుమంత రావు said...

చంద్రగారు, మీ స్పందన తెలియజేసారు. చాలా సంతోషం.. ఆత్మీయ వాతావరణం మా రాజమండ్రిలో చూస్తారు.. తప్పక మరోసారి రండి.. వీలైతే రాజమండ్రిపై వ్రాసిన మిగతా పోస్ట్ లు చూసి స్పందించండి..

రసజ్ఞ said...

ఊరి ముచ్చట్లు బాగున్నాయండీ! నాకు శ్రీరాంనగర్ అనగానే గుర్తుకొచ్చేది పోస్ట్ ఆఫీసే :) దాని చుట్టూ చేసినన్ని ప్రదక్షిణలు ఏ గుడి చుట్టూ చేసున్నా ఎంతో పుణ్యం వచ్చేది ఈ పాటికి:):) వరద వచ్చిందంటే ఆర్యాపురం, అక్కడా అంతా పడవలు వేసేవారు కదూ! నాకయితే భలే సరదాగా ఉండేది!

హనుమంత రావు said...

ధన్యవాదాలు రసజ్ఞగారు.. ఇప్పుడు పరిస్థితి బాగుంది. ఆర్యాపురంలో పడవలు తిరగటంలేదు.. మనుషులే తిరుగుతున్నారు.. శ్రీరామనగర్ పోస్టాఫీసు ఇప్పుడు సాయిబాబాగుడి దగ్గరకు మారింది.. అక్కడికి దగ్గరనే మా ఇల్లు.. ఈ సారి మీరు వస్తే స్వాగతిస్తాను...

Phaniram said...

Chala opigga, sraddhaga, sulabhanga charitra chepparu. Maa abbayiki kooda chadivi vinipistunnanu sir. Thanks.

Unknown said...

గౌ. హనుమంతరావు గారు, నిజంగా మీరు వ్రాసిన మీద రాజమండ్రి మనోగతం, అత్యంత మనోహరంగా వుంది. ఈ వ్యాసం చదువుతుంటే, నాను నా చిన్నతనం, మా నాన్న గారితో గడిపిన మధుర జ్ణాపకాలు కళ్ళ ముందు కదలాడాయి. మీద మధురమైన మనోగతంతో పాటు, మా చిన్నతనాన్ని గుర్తు చెసిన మీకు హృదయ పూర్వకంగా కృతజ్ణతలు. - మీ M R K శర్మ

Unknown said...

నా reply లో తప్పులు దొర్లినవి. సహృదయంతో క్షమించండి. - శర్మ

Unknown said...

నా reply లో తప్పులు దొర్లినవి. సహృదయంతో క్షమించండి. - శర్మ

Unknown said...

గౌ. హనుమంతరావు గారు, నిజంగా మీరు వ్రాసిన మీద రాజమండ్రి మనోగతం, అత్యంత మనోహరంగా వుంది. ఈ వ్యాసం చదువుతుంటే, నాను నా చిన్నతనం, మా నాన్న గారితో గడిపిన మధుర జ్ణాపకాలు కళ్ళ ముందు కదలాడాయి. మీద మధురమైన మనోగతంతో పాటు, మా చిన్నతనాన్ని గుర్తు చెసిన మీకు హృదయ పూర్వకంగా కృతజ్ణతలు. - మీ M R K శర్మ

Murti Yerrapragada said...

చాలా బాగు౦ది బావగారూ! 1953 లో వచ్చిన గోదావరి వఱదలు గుర్తున్నాయా?మన౦ అప్పుడు ఆ వీధిలోనే ఉన్నాము. ఊరికి దూర౦గా ఉన్నా ఊరికన్నా ఎత్తయిన చోట ఉ౦డి వఱద తాకిఢి తప్పి౦చుకొన్నా౦. August 28, 2016

హనుమంత రావు said...

నా రచనకు మీ స్పందన బాగుంది. చాలాధన్యవాదములు. నే నెరిగిన రాజమండ్రి గురించి కొన్ని వ్రాసాను. ఒక దాంట్లో వరదల గురించి వ్రాసిన గుర్తు.వీలైతే పాత పోస్ట్స్ చూసి మీ అభిప్రాయం తెలియజేస్తే చాలా సంతొషిస్తాను.