Pages

Wednesday, April 30, 2014

ఎన్ని కలలో … ఎంతెంత కలలో

ఎన్నికల వేళ .. ఎప్పుడో పోస్ట్ చేసినది మరల పునః ప్రసారం..



ఎన్ని కలలో … ఎంతెంత కలలో

రచన: డి.వి.హనుమంతరావు

ఒక సర్వ సంగ పరిత్యాగి కి కల వచ్చింది.
ఆ కలలో ఆ సాధు మహారాజ్ కు బంగారు రాశులు కనపడ్డాయి..
ఏంచేసుకుంటాడు ఆయన సర్వ సంగ పరిత్యాగి కదా.
కలలో కూడా అంతంత బంగారు రాశులను చూడని ఆ సర్వ సంగ పరిత్యాగి,
కలలో చూసిన ఆ బంగారు రాశులను
కలలో కూడా   ముట్టుకోకుండా లోపాయికారీగా యువరాజావార్కి  కబురు చేరవేసాడు.

అప్పటికే హస్తినాపురి గద్దె నెలా ఎక్కాలా అని ఆలోచిస్తూ, కలలు కంటున్నారు యువరాజా వారు.  
యు.రా. వార్కి బంగారం(లాంటి) కబురు అందింది… ఆ బంగారు కల తనకెందుకు రాలేదా అని కొంచంసేపు సోచాయించి, ఇదేమైనా ప్రతిపక్షాల కుట్రా అని కూడా ఆలోచించిన వారై, ఎందుకైనా మంచిది అని లోపాయికారీగానే వెళ్లి బంగారు రాశులు ఎక్కడ ఉన్నట్టు కలవచ్చిందో తెలుసుకున్నారు.. అది ఏదో ఆలయ ప్రాంతం. అక్కడ తవ్వితే ఆ బంగారు రాశులు స్వంతమవుతాయి. కాని  గునపాలు,పారలు ఉపయోగించాలి,...
గుడి ప్రాంతం అంటే   .. మడిగా వుండాలి కదా .. తను సెక్యులర్.. పాపం  మడికి పనికి రాడు..
అదీ కాక, తనకు పెళ్ళంటే ఖర్మ కాలి అవలేదు కాని,  తను అప్పుడే తాత వయసుకు వచ్చేస్తున్నాడు. ఆ గునపాలు, పారలు పట్టుకుని శారీరక శ్రమ అంటే కష్టం.. అందుకని రాజమాతకు చెబ్తే సరి. ఆమె చూసుకుంటుంది..
ఆవిడదగ్గర ఎంత అడ్డమైన పనులున్నా చెప్పండమ్మా చేస్తామంటూ జుత్తూడిపోయినవారు, గెడ్డాలు మీసాలు పెంచుకున్నవారు  చాలా మంది ఉన్నారు… వాళ్లకి తనంటే కూడా చాలా వినయమూ భక్తీ కలవారు. .. అని బంగారం కబురు  రాజమాతకు చెప్పడానికి వెళ్లారు  యువరాజా వారు..  

అక్కడకు వెళ్లేటప్పటికి అక్కడ జైలు నుంచి వచ్చిన కిష్టన్నయ్య ఉన్నాడు..
” ఏంటన్నయ్యా ఇలా వచ్చావు.” అన్నారు  యు. రా.
“తమ్మూ ! నీ మీద నాకు చాలా కోపం గా ఉంది. “ అన్నాడు కిష్ట్
“ఏమైంది ?”
“ఎప్పటికైనా మనం మనం ఒకటి.. అలాంటప్పుడు ఎవరికో తిండి లేదని రాజమాత ఏడిచినారట  ?”
“అవును.. నేను.. అక్కడెక్కడో చెప్పాను కదా ?”
“అదే.. అదే… ఎక్కడో చెప్పడమేమిటి , నాకు చెప్పొచ్చుకదా ? ఎప్పటికైనా మనం మనం ఒకటి కదా?”
“నువ్వేం చేస్తావన్నయ్యా”
“ఏడుస్తుంటే ఓదార్చడంలో నేను చాలా పరిశోధన చేసాను, నేనొచ్చి క్షణంలో ఓదార్చగలను..ఆమాత్రం అమ్మని ఓదార్చలేనా.. ఎప్పటికైనా మనం మనం ఒకటి. నీకు తెలియదా?  “
“నిజమే అన్నా .. నువ్వెంతోమందిని  ఓదార్చావు కదా.. మరచిపోయాను, సారీ…”
“ఇక ఎప్పుడూ అలా చేయకు తమ్మూ,నా దగ్గర ఎప్పుడూ బిక్క మొహం రెడీగా ఉంటుంది. అదేసుకుని వెంటనే వచ్చెయ్యగలను.. ఎంత చెడ్డా మనం మనం ఎప్పటికైనా ఒక్కటే కదా..  “ అన్నాడు క్రిష్ట్.

సరే తాను విన్న బంగారు కల, ఆ అన్న ముందు చెప్పడమా మానడమా.. అని ఆలోచించారు యు. రా. వారు. లక్షలకోట్లు సునాయాసంగా  లాగడానికి ఎన్నో ఉపాయాలు తెలుసున్నవాడు, అనుభవజ్ఞుడు, కనుక చెప్తేనే మంచిది అని నిర్ణయించుకుని, రాజమాతకు  బంగారు రాశులు గురించి చెప్పారు.. యు.రా వారు…
“పవిత్ర ప్రదేశమంటున్నావు.. అక్కడ వారి సెంటిమెంట్ కు ఏమీ ఫర్వాలేదుగా మరి” అన్నారు రాజమాత.
”ఫర్వాలేదు మాతా,.. ఏదైనా తేడా వస్తే..మరల మనం కట్టించి ఇద్దాము..”
అన్నారు యు. రా.
కిష్ట్ అందుకుని..” కావాలంటే.. మా బామ్మర్ది ఉన్నాడు.. తనదైన శైలిలో ప్రార్థనా మందిరాలు అవీ కట్టించిన అనుభవమున్నవాడు, వాడిని రప్పిస్తాన”న్నాడు.
రాజమాత గారు వెంటనే కార్య రంగంలోకి దిగారు. చిరంజీవి చెప్పిన కల ఎపిసోడ్ తనలోనే దాచుకుని, మంత్రిపుంగవులకి పనులు పురమాయించారు. అధికారులకు ఆదేశాలందాయి.. క్రింద ఉద్యోగులు అనేకానేక సాంకేతిక కారణాలు చెప్పినా.. ఎవరికీ వినపడలేదు. ప్రతి పక్షాలలో కొందరు  ఇదేమి సెక్యులర్ దేశం.. అన్నారు…మరికొందరు మేము కొత్త ఊరు కట్టుకుంటాము,మాకు మేజర్ షేర్ కావాలన్నారు. మరికొందరు, అది మాద్వారా బడుగు వర్గాలకు పంచాలి.. అది మేం నొక్కుడంటున్నాము అన్నారు.. ఇలా అనేక విధంగా ముక్త కంఠం తో అందరూ   ప్రతిఘటించారు..
ప్రజలు వంటలు, వార్పులూ చేసి నిరసనలు తెలియజేసారు. బట్టలుతికి, ఆరేసి, మిరపకాయ బజ్జీలు వేసి, అర్థ గుండులు పావు గుండులూ చేయించుకుని నిరసనలు ఉవ్వెత్తున.. తెలియపర్చారు. దిష్టి బొమ్మలు అందమైనవి తెప్పించి అంత్యేష్టి క్రియలు చేయించారు. ఈ ఉద్యమ సమయాన కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారికి తొత్తుగా కొందరు నాయకులు పుట్టారు.
రాజమాత ఆలోచించారు. వృద్ధరాజమాత ఫొటోకు దండేసి.. నమస్కారము పెట్టి.. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకున్నారు.. ఏమి స్ఫూర్తి పొందారో.. మంత్రివర్యులను కేకేసారు.. ఉద్యమాలలోకి చొచ్చుకుపొమ్మన్నారు. చొచ్చుకుపోయి విచ్చిన్నం చేయండి అన్నారు. బంగారం ఆలోచన  యువరాజా వారి డ్రీమ్ ప్రాజెక్ట్.  అని లోపాయికారీగా చెప్పారు.
వెంటనే హవేలీని నమ్ముకు బ్రతుకుతున్న  భజనపరులైన మంత్రిగణం.. “అమ్మమ్మా ..అతడే మా భావి మహరాజు.. “ అని వంగి వంగి దణ్ణాలు పెట్టారు, కళ్ల నీళ్లు కూడా పెట్టుకున్నారు..   తామూ ఉద్యమంలోకి రహస్యంగా చొరబడ్డారు..బజ్జీలు వేసే మూకుళ్ళు, చట్రాలు మాయంచేసారు. బట్టలుతికే బండలు మాయమయ్యాయి. పెద్ద నాయకులయితే లాభంలేదని, చోటా నాయకులను పిలిచారు.  సామ, ధన, లాభోపాయాలు ఉపయోగించారు..  అంతే… నిరసనకారులు ఐకమత్యంగా, మిగిలిన బజ్జీలపిండీ, ఉతకాల్సిన బట్టలు పట్టుకుని ఇళ్ళకు పోయారు.. చిరుగేతప్ప, బట్ట కనపట్టంలేదని .. బట్టలిచ్చిన ధర్మపత్నులు..పతులను .. ఉతికి ఆరేసి, ఇస్త్రీ చేసేస్తున్నారు. బొత్తిగా ఖారంలేని బజ్జీలను వేసారని పిండి తిని రుచి చూసిన  వారు  తమ అయిష్టాన్ని తెలియబరచారు.

అక్కడ కేంద్ర స్థానంలో గోతులు తవ్వడం యదేచ్చగా సాగుతోంది…బంగారు రాశులకోసం.  ఇది ఇలా ఉండగా  ఇంకా పలు ప్రాంతాలలో కళ్లు మూసుకుని సర్వసంగ పరిత్యాగులు నిద్ర పోతున్నారు… వారితో పాటు సర్వ సంగ భోగులూ కూడ నిద్ర పోడం మొదలెట్టారు, పక్కలో గునపాలు, పారలు రెడీగా పెట్టుకుని. -- బంగారు రాశులను కలలో కనడానికి. ఇక చూడండి…  ఎన్నికలలో…  

Saturday, April 26, 2014

ఋషిపీఠం కార్యక్రమం

ఋషిపీఠం కార్యక్రమం


‘దేశమంతా ఒకే ప్రజ’ అనే భావంతో, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి చూడకుండా, సమగ్ర దేశాభివృద్ధికి కృషి చేసే పాలన కోసం మనం ఎదురుచూస్తున్నాము  
అలా దేశ క్షేమం కోరుకునే వారంతా సెక్యులరిజం ముసుగులో ఉన్న అసుర వర్గాలని గుర్తించాలి ..
నిజమైన అభ్యుదయాన్ని, సమగ్ర దేశప్రగతిని కాంక్షించేవారిని, అవినీతిలేని వారిని ఎంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన తరుణం.

సర్వదేశ పౌరుల క్షేమంకోసం, మొత్తంగా ఈ దేశం అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించడంకోసం… అవినీతి రహిత సుస్థిర పాలనకోసం సంకల్పించి
ఋషిపీఠం రాజమహేంద్రవర శాఖ ఒక సత్కార్యం తలపెట్టింది.

అసుర శక్తుల్ని దునుమాడి, త్యాగశీలురైన నాయకులు ఎన్నిక కావాలని,  
స్వార్థప్రయోజనాలును విస్మరించి, దేశాభ్యున్నతికి కృషిచేసే ఆదర్శభారత ప్రభుత్వం ఏర్పడాలని ..
అలాంటి నాయకత్వానికి సమర్థిస్తూ ఓటు వేసే సద్బుద్ధి ఓటర్లందరికీ కలగాలని
ఆదిశక్తిని .. కోరుకుంటూ .. భగవంతుని ప్రార్థిస్తూ…

చైత్ర మాసంలో మాస శివరాత్రి పుణ్య దినాన
గణపతి హోమం, చండీ హోమం, సుదర్శన హోమం..శివాభిషేకం.. చేయనున్నది ఋషిపీఠం …
27 ఏప్రిల్, 2014 ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభించి సుమారు 3 గంటలపాటు జరిగే ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొనవచ్చు..
రాజమండ్రి దానవాయిపేట చిన్నగాంధీ బొమ్మ వీధిలో రామచంద్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ కార్యాలయ ప్రాంగణంలో వేదపండితుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

మన మనస్సులు 
మంచిగా ఆలోచించాలి… 

దేశ సంస్కృతిని .. ధర్మాన్ని రక్షించే 
మంచి మనస్సుగల నాయకులు మనకు రావాలి

మన రాష్ట్రం 
దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపు దిద్దుకోవాలి, ,

మన భారత దేశం 
పూర్వ వైభవాన్ని సముపార్జించుకుని ప్రపంచంలోనే అగ్రదేశంగా భాసించాలి  ..

…. మీ అందరికీ శుభాహ్వానం



Sunday, April 20, 2014

ఆడు మగాడు..



ఆడు మగాడురా బుజ్జీ ..
...... వారే శ్రీ ఓటరు
 

రచన: డి.వి హనుమంతరావు.


ఓటరు ఏమై పోయాడు ?

ఏమోనండి.. ఇప్పటిదాకా అక్కడ పేడ చేస్తూ ..ఎవరో వచ్చారని, వీధిలోకి వెళ్లాడు..

వెళ్ళి ?

వచ్చి .. చేతి నిండా పేడ అంటేసింది కదా .. ఆ పేడ కడిగేసుకున్నాడు

తర్వాత ?

అక్కడ గలీజుగా ఉందని చీపురెట్టి తుడిచేసాడు

ఇంట్రెస్టింగ్?

తిరుగుతున్న ఫాను ఆపేసాడు

అదేం...?

చెప్పాను కదండీ..తెలియదని...

మరి ?

బయటికివచ్చాడు .. అక్కడ  ఎవరో కారాయన, లిఫ్ట్ కావాలా అన్నాడు...

కారెక్కాడా ?...

లేదండి,, ఆ ప్రక్కనే ఒకాయన, ’తాతా! సైకిలెక్కుతావా’ అన్నాడు,

ఒహో సైకిలెక్కాడా ?

అలాగని నే చెప్పానా ?

సైకిలూ ఎక్కలేదా... మరి ?

లేదండీ బాబూ ..  చెప్పులు కూడా వేసుకోకుండా..

ఇంత ఎండలో .. అలాగే నడిచాడా ?

అదేనండి మరి...

ఆ ప్రక్కనున్న చెరువుగట్టు మీదకి  వెళ్తే చల్లగా ఉండును కదా…

మీరనేది ఆ తామర చెరువా..

ఆ అదే.

అస్సలటువైపు కూడా చూడలేదండి ..

మరి ఎక్కడికెళ్లాడండీ...

అక్కడో స్కూలు ఉంటే .. అక్కడ ఓ గదిలోకి దూరాడు .. అక్కడ  గోడమీద బూతు నెం.7  అని వ్రాసి ఉందండీ ..

ఆ ! నాకు తెలిసిపోయింది... మీకు తెలిసిందా ?..

ఏమో .. ఏ బూతు పని చేసొస్తాడో..ఎవరికి తెలుసు..?

ఆడు మగాడండీ .. బూతులోకి వెళ్లాడు కదా …  
గొప్ప మార్పుని పుట్టించే పని చేస్తాడు...ఆడు మగాడు ..

Saturday, April 12, 2014

హరాజీకాలు - 5 -- శర్మ రైలాట

హరాజీకాలు - 5


శర్మ రైలాట



హరాజీకాలు అంటే ఏమిటో చెప్పకుండా ఈ పరాచికాలు ఏమిటంటూ మిత్రులు గుస్సా అవుతున్నారు.. తప్పక చెప్తాను.. కానీ తీరా చెప్పేసాక.. ఇంక చదవడానికి ఏముందని మా హరాజీకాలు చదవరేమో అని.. నాకూ కొన్ని భయాలుంటాయి కదండీ మరి..
“అబ్బే ఎందుకు చదవ”మంటారా?
ఎందుకు చదవరో నాకేం తెలుసు..
అంటే “చదువుతా”మనా… ఓ.కే  చదువుతారన్నమాట … .. ఆ హామీ ఇస్తే ఇంక నేను విజృంభిస్తాను.. చూడండీ......



రామంలాగానే నాకు మరో మిత్రులున్నారు..శర్మగారని ..  ఈయన నాకు మూడుకాలాల మిత్రులు.. భూత, వర్తమాన, భవిషత్ కాలాలు అనుకున్నా నాకభ్యంతరము.. ఊహూ .. లేదు.. ఈయనా  నేనూ బాంకులో పని చేసాం..(పని చేసాం , అంటే ఆయన ఒప్పుకోరు.. తర్వాత ప్లేస్ ఉంటే దీనిగురించి  వివరిస్తాను.) అంతకు ముందూ పరిచయం ఉంది. మా నాన్నగారిదగ్గర ఆయన చదువుకున్నారు.. నాన్నగారికి ఇతడంటే  భలే ఇష్టం. అక్కడికి రెండు కాలాలు అయ్యాయి కదా.. రిటైర్ అయ్యాక కూడా ఆయనకీ నాకూ లైకులున్నాయి, షేర్ లున్నాయి, కామెంట్స్ ఉన్నాయి. ఫేస్ బుక్ అని మీకర్థమయింది అని నాకు అర్థమయింది.


అలాంటి జిమ్మిక్ .. మా మిత్రుడు శర్మతో మంచి కాలక్షేపం. ఆయన ఉన్న చోట సందడి సందడి గా ఉంటుంది. ఇప్పటికీ అదే హుషారు..    మా ఊరికి రైలు దూరంలో ఉన్న మరో  ఊరు ట్రాన్స్ ఫర్ అయింది ఒక సారి శర్మగారికి.  సీజన్ టికట్ మీద ఆ ఊరు వెళ్లొస్తూ ఉండేవారు. రూల్ ప్రకారం సీజన్ వాళ్లను స్లీపర్ లో ఎక్కనివ్వరు.. చాలా మంది ఎక్కేస్తూ ఉంటారు.. 
జిమ్మిక్ లు చేసి స్లీపర్ లో ఎక్కడం మన శర్మ స్పెషాలిటీ .. .

రైలొచ్చింది .. ఎక్కేముందు రైలు ఆ చివరినుంచి ఈ చివరిదాకా ఓ సర్వే చేస్తాడు శర్మ ..(ఏకవచనమైతే కొంచెం కథనం ఎఫెక్టివ్ గా ఉంటుందని.. ) అలా సర్వే చేస్తుండడంలో . టికట్ కలెక్టర్  ప్లాట్ ఫాం మీద కనపడ్డాడు బోగీముందు . అతని దగ్గరికి వెళ్లి …
“గుడ్ మానింగ్..సర్, ఎం.ఎస్.టి .. అకామడేషన్ ఉంటుందా ?”
అలా అనగానే టి.సి. అటెంక్షన్ లోకి వచ్చేసాడు.. చ్చేసి, వినయంగా
“గ్లాడ్ టు సి యు సర్, నా సీట్ లో కూర్చోండి .. నేనొస్తాను..” అన్నాడు టి.సి.
ఇతను అతని సీట్ లో కూర్చున్నాడు … రైలు కదిలింది. టి.సి.తనకు ఎలాట్ అయిన రెండు మూడు బోగీల్లోనూ చెకింగ్ పూర్తి  చేసుకుని, ఇతని ప్రక్కన కూర్చుని,,,
ఇందాకటి వినయాన్ని కంటిన్యూ చేస్తూ “ఏ సెక్షన్ లో ఉన్నారు సార్ ?” అని అడిగాడు.
మనవాడికి అర్థం కాలేదు.. “సెక్షన్ ఏమిటి సార్” అని అడిగాడు ..
“అదే సార్ .. యమ్.యస్.టీ  అన్నారు కదా. ఏ సెక్షన్ లో ఉన్నారని అడిగా”
“యమ్.యస్.టీ అంటే…” గొణిగాడు శర్మగారు..
“మెయింటనెన్స్ ఆఫ్ సిగ్నల్స్ ట్రాఫిక్  .. అదే ఏ సెక్షన్ అని అడుగుతున్నా”
ఓహ్ అదొకటి ఉందా ? నా ఉద్దేశ్యం ఎమ్.ఎస్.టీ అంటే మంత్లీ సీజన్ టికట్ ..” అనగానే  కొంచెంసేపు ఆగి…
‘వినయం’  కిటికీలోంచి బయట పారేసి,  ఘొల్లు మన్నాడు టి.సి. 
“ఇదొకటి ఉందన్నమాట.. ఈసారి వాడుకుంటా”నని శృతి కలిపాడు శర్మ..
ఆ తర్వాత వాళ్ళిద్దరూ జిగ్రీ దోస్తులు అయిపోయారు.. మన యం.యస్.టీ సురక్షితంగా స్లీపర్లో పయనించాడు.


ఓ సారి ఆయనతో నేను హైదరాబాదు, ఏదో బాంక్ టెస్ట్ వ్రాయడానికి వెళ్ళా.. మా వాళ్లు కొంతమంది ట్రైన్ లో తగిలారు. వాళ్లంతా పాత కబుర్లు చెప్పుకుంటూ చాలా సేపు మెలకువగా ఉన్నారు.. నేను ప్రక్క’ కాన్’ లో అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్నాను. మధ్యలో క్రిందకి వచ్చి వీళ్ల ప్రక్కగా వెడుతుంటే ..
ఇతడు చెక్ మని లేచి “నమస్తే సార్ .. ఏవన్నా కావాలా సార్ “ అన్నాడు ..
నేను తమాయించుకుని… “.. ఆ .. ఇది ఏ స్టేషన్ “ అన్నా..
నోటికొచ్చింది చెప్పాడు.. ఆ రూట్ లో లేదా స్టేషన్ .... నాకు  తెలుసు.. సరే... నేను ముందుకు నడిచా..
“ఇదేనండీ వీడితో వెడితే.. అసలు  బాస్ తో.. ప్రయాణించకూడదండి .. ఏ స్టేషన్ అయితే వీడికెందుకు.. హైదరాబాదు దాకా ముడుచుకు పడుకోకూడదా.. “ అంటుంటే
ప్రక్క కాన్  లో ఒకాయన “ఆయన మీ బాసాండీ” అన్నాడు.
“అవునండి. మే ఏ మందో కొట్టేస్తున్నామేమో,కాస్త  కక్కుర్తి పడదామని.. “
కొంచెంగా వినిపించింది.. ఇద్దరమూ ఒకే స్థాయి ఉద్యోగులమే … అంత బిల్డప్ మా శర్మ స్వంతం.

స్టేషన్ లో దిగాము. గేట్ లో టికట్ ఇచ్చి ఆ టికట్ కలెక్టర్ ని
“గుడ్ మానింగ్ భాస్కర్ ! హౌ ఆర్ యు “ అని పలకరింఛి ముందుకు పోయాడు..
ఆ సో కాల్డ్ భాస్కర్ టికట్స్ కలెక్ట్ చేయడం మానేసి,  వెతుక్కుంటున్నాడు ప్రొద్దున్నే ఇంత ముద్దుగా పలకరించినవాడెవరా అని.. మన వాడుంటేగా..
“ఆయన మీకు తెలుసా ?” అని అడిగా…
“ప్చ్! జస్ట్ ఆయన పేరు చొక్కాకి తగిలించాడుగా .. అది చూసీ …. “ 
నేను నవ్వితే నా నవ్వుతో శృతి కలిపాడు.


రాజమండ్రి నుంచి తునికి ట్రాన్స్ ఫర్ అయింది ఇతగాడికి.. సీజన్ టికెట్--అప్ అండ్ డౌన్ .. గోదావరి స్టేషన్ లో టాటా ఎక్స్ ప్రెస్ ఆగింది.. ఇతను ట్రైన్ ఎక్కి పై బర్త్ మీద పడకేసాడు.. కొంచెం దూరం వెళ్లింది ట్రైన్ ..
“టికేట్..” అంటూ టి.సి. లేపాడు..
మెలకువవచ్చింది.. కాని బెర్త్ .. దిగ లేదు శర్మ ..
“టికెట్ …” అన్నాడు మరో సారి.. టి.సి..
“సర్ ఆర్ వుయ్ బిట్వీన్   రాజమండ్రి అండ్ సామల్కొట ఆర్,  ఆర్ వియ్ బిట్వీన్ సామల్ కోట అండ్ తుని… ” అన్నాడు.. ఇదేమి  వినిపించుకోకుండా ..”టికెట్” అన్నాడు ఆ టి.సి. మనవాడు జంకలేదు.. అదే ప్రశ్న మళ్లీ స్పష్టంగా రిపీట్ చేసాడు.. టికట్ కలక్టర్ ఇదేదో కేసు అనుకున్నాడు.. 
ఎక్కడుంటే మీకెందుకు.. ఇది బిక్కవోలు.. ముందు టికట్ చూపండి అన్నాడు.. ఠక్కున మనవాడు 
“అయితే కుడి జేబు సార్  “ అని గట్టిగా అని టికట్ తీసి చూపాడు ..
“సీజన్ టికట్టా” అని వెరిఫై చేసి, 
"కుడి జేబేమిటి .."   అన్నాడు..
“ఏంలేదు సార్ , సామర్లకోట తర్వాత అయితే ఎడమ జేబులో టికట్ ఇవ్వాలి అని..
If it is between Rajahmundry and samalkot, కుడి జేబు, 
If it is from Samalkot and Tuni అప్పుడు ఎడం జేబు అని బండ గుర్తు పెట్టుకున్నా.. 
ఆఫ్ కోర్స్ వచ్చేటప్పుడు , టర్న్ ద వికెట్ .. జేబులు మారతాయి.. అదన్నమాటండి …  అందుకని అలా అడిగా “ 
నవ్వేసాడు టి.సి.
...వ్వేసి, ‘అలా వెళ్లకూడదుకదండీ మరి,’’ అంటూ నవ్వుతూ అన్నాడు..


వెళ్తున్నారు కదండీ మరి..’ అని నవ్వులో నవ్వు కలిపి నవ్వేసాడు శర్మ….
(మిత్రులు శ్రీ కే.వి.శాస్త్రిగారికి ప్రేమగా ఈ కథ సమర్పించుకుంటున్నాను.. శాస్త్రీ జీ స్వీకరిస్తారు కదూ … )