Pages

Saturday, April 12, 2014

హరాజీకాలు - 5 -- శర్మ రైలాట

హరాజీకాలు - 5


శర్మ రైలాట



హరాజీకాలు అంటే ఏమిటో చెప్పకుండా ఈ పరాచికాలు ఏమిటంటూ మిత్రులు గుస్సా అవుతున్నారు.. తప్పక చెప్తాను.. కానీ తీరా చెప్పేసాక.. ఇంక చదవడానికి ఏముందని మా హరాజీకాలు చదవరేమో అని.. నాకూ కొన్ని భయాలుంటాయి కదండీ మరి..
“అబ్బే ఎందుకు చదవ”మంటారా?
ఎందుకు చదవరో నాకేం తెలుసు..
అంటే “చదువుతా”మనా… ఓ.కే  చదువుతారన్నమాట … .. ఆ హామీ ఇస్తే ఇంక నేను విజృంభిస్తాను.. చూడండీ......



రామంలాగానే నాకు మరో మిత్రులున్నారు..శర్మగారని ..  ఈయన నాకు మూడుకాలాల మిత్రులు.. భూత, వర్తమాన, భవిషత్ కాలాలు అనుకున్నా నాకభ్యంతరము.. ఊహూ .. లేదు.. ఈయనా  నేనూ బాంకులో పని చేసాం..(పని చేసాం , అంటే ఆయన ఒప్పుకోరు.. తర్వాత ప్లేస్ ఉంటే దీనిగురించి  వివరిస్తాను.) అంతకు ముందూ పరిచయం ఉంది. మా నాన్నగారిదగ్గర ఆయన చదువుకున్నారు.. నాన్నగారికి ఇతడంటే  భలే ఇష్టం. అక్కడికి రెండు కాలాలు అయ్యాయి కదా.. రిటైర్ అయ్యాక కూడా ఆయనకీ నాకూ లైకులున్నాయి, షేర్ లున్నాయి, కామెంట్స్ ఉన్నాయి. ఫేస్ బుక్ అని మీకర్థమయింది అని నాకు అర్థమయింది.


అలాంటి జిమ్మిక్ .. మా మిత్రుడు శర్మతో మంచి కాలక్షేపం. ఆయన ఉన్న చోట సందడి సందడి గా ఉంటుంది. ఇప్పటికీ అదే హుషారు..    మా ఊరికి రైలు దూరంలో ఉన్న మరో  ఊరు ట్రాన్స్ ఫర్ అయింది ఒక సారి శర్మగారికి.  సీజన్ టికట్ మీద ఆ ఊరు వెళ్లొస్తూ ఉండేవారు. రూల్ ప్రకారం సీజన్ వాళ్లను స్లీపర్ లో ఎక్కనివ్వరు.. చాలా మంది ఎక్కేస్తూ ఉంటారు.. 
జిమ్మిక్ లు చేసి స్లీపర్ లో ఎక్కడం మన శర్మ స్పెషాలిటీ .. .

రైలొచ్చింది .. ఎక్కేముందు రైలు ఆ చివరినుంచి ఈ చివరిదాకా ఓ సర్వే చేస్తాడు శర్మ ..(ఏకవచనమైతే కొంచెం కథనం ఎఫెక్టివ్ గా ఉంటుందని.. ) అలా సర్వే చేస్తుండడంలో . టికట్ కలెక్టర్  ప్లాట్ ఫాం మీద కనపడ్డాడు బోగీముందు . అతని దగ్గరికి వెళ్లి …
“గుడ్ మానింగ్..సర్, ఎం.ఎస్.టి .. అకామడేషన్ ఉంటుందా ?”
అలా అనగానే టి.సి. అటెంక్షన్ లోకి వచ్చేసాడు.. చ్చేసి, వినయంగా
“గ్లాడ్ టు సి యు సర్, నా సీట్ లో కూర్చోండి .. నేనొస్తాను..” అన్నాడు టి.సి.
ఇతను అతని సీట్ లో కూర్చున్నాడు … రైలు కదిలింది. టి.సి.తనకు ఎలాట్ అయిన రెండు మూడు బోగీల్లోనూ చెకింగ్ పూర్తి  చేసుకుని, ఇతని ప్రక్కన కూర్చుని,,,
ఇందాకటి వినయాన్ని కంటిన్యూ చేస్తూ “ఏ సెక్షన్ లో ఉన్నారు సార్ ?” అని అడిగాడు.
మనవాడికి అర్థం కాలేదు.. “సెక్షన్ ఏమిటి సార్” అని అడిగాడు ..
“అదే సార్ .. యమ్.యస్.టీ  అన్నారు కదా. ఏ సెక్షన్ లో ఉన్నారని అడిగా”
“యమ్.యస్.టీ అంటే…” గొణిగాడు శర్మగారు..
“మెయింటనెన్స్ ఆఫ్ సిగ్నల్స్ ట్రాఫిక్  .. అదే ఏ సెక్షన్ అని అడుగుతున్నా”
ఓహ్ అదొకటి ఉందా ? నా ఉద్దేశ్యం ఎమ్.ఎస్.టీ అంటే మంత్లీ సీజన్ టికట్ ..” అనగానే  కొంచెంసేపు ఆగి…
‘వినయం’  కిటికీలోంచి బయట పారేసి,  ఘొల్లు మన్నాడు టి.సి. 
“ఇదొకటి ఉందన్నమాట.. ఈసారి వాడుకుంటా”నని శృతి కలిపాడు శర్మ..
ఆ తర్వాత వాళ్ళిద్దరూ జిగ్రీ దోస్తులు అయిపోయారు.. మన యం.యస్.టీ సురక్షితంగా స్లీపర్లో పయనించాడు.


ఓ సారి ఆయనతో నేను హైదరాబాదు, ఏదో బాంక్ టెస్ట్ వ్రాయడానికి వెళ్ళా.. మా వాళ్లు కొంతమంది ట్రైన్ లో తగిలారు. వాళ్లంతా పాత కబుర్లు చెప్పుకుంటూ చాలా సేపు మెలకువగా ఉన్నారు.. నేను ప్రక్క’ కాన్’ లో అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్నాను. మధ్యలో క్రిందకి వచ్చి వీళ్ల ప్రక్కగా వెడుతుంటే ..
ఇతడు చెక్ మని లేచి “నమస్తే సార్ .. ఏవన్నా కావాలా సార్ “ అన్నాడు ..
నేను తమాయించుకుని… “.. ఆ .. ఇది ఏ స్టేషన్ “ అన్నా..
నోటికొచ్చింది చెప్పాడు.. ఆ రూట్ లో లేదా స్టేషన్ .... నాకు  తెలుసు.. సరే... నేను ముందుకు నడిచా..
“ఇదేనండీ వీడితో వెడితే.. అసలు  బాస్ తో.. ప్రయాణించకూడదండి .. ఏ స్టేషన్ అయితే వీడికెందుకు.. హైదరాబాదు దాకా ముడుచుకు పడుకోకూడదా.. “ అంటుంటే
ప్రక్క కాన్  లో ఒకాయన “ఆయన మీ బాసాండీ” అన్నాడు.
“అవునండి. మే ఏ మందో కొట్టేస్తున్నామేమో,కాస్త  కక్కుర్తి పడదామని.. “
కొంచెంగా వినిపించింది.. ఇద్దరమూ ఒకే స్థాయి ఉద్యోగులమే … అంత బిల్డప్ మా శర్మ స్వంతం.

స్టేషన్ లో దిగాము. గేట్ లో టికట్ ఇచ్చి ఆ టికట్ కలెక్టర్ ని
“గుడ్ మానింగ్ భాస్కర్ ! హౌ ఆర్ యు “ అని పలకరింఛి ముందుకు పోయాడు..
ఆ సో కాల్డ్ భాస్కర్ టికట్స్ కలెక్ట్ చేయడం మానేసి,  వెతుక్కుంటున్నాడు ప్రొద్దున్నే ఇంత ముద్దుగా పలకరించినవాడెవరా అని.. మన వాడుంటేగా..
“ఆయన మీకు తెలుసా ?” అని అడిగా…
“ప్చ్! జస్ట్ ఆయన పేరు చొక్కాకి తగిలించాడుగా .. అది చూసీ …. “ 
నేను నవ్వితే నా నవ్వుతో శృతి కలిపాడు.


రాజమండ్రి నుంచి తునికి ట్రాన్స్ ఫర్ అయింది ఇతగాడికి.. సీజన్ టికెట్--అప్ అండ్ డౌన్ .. గోదావరి స్టేషన్ లో టాటా ఎక్స్ ప్రెస్ ఆగింది.. ఇతను ట్రైన్ ఎక్కి పై బర్త్ మీద పడకేసాడు.. కొంచెం దూరం వెళ్లింది ట్రైన్ ..
“టికేట్..” అంటూ టి.సి. లేపాడు..
మెలకువవచ్చింది.. కాని బెర్త్ .. దిగ లేదు శర్మ ..
“టికెట్ …” అన్నాడు మరో సారి.. టి.సి..
“సర్ ఆర్ వుయ్ బిట్వీన్   రాజమండ్రి అండ్ సామల్కొట ఆర్,  ఆర్ వియ్ బిట్వీన్ సామల్ కోట అండ్ తుని… ” అన్నాడు.. ఇదేమి  వినిపించుకోకుండా ..”టికెట్” అన్నాడు ఆ టి.సి. మనవాడు జంకలేదు.. అదే ప్రశ్న మళ్లీ స్పష్టంగా రిపీట్ చేసాడు.. టికట్ కలక్టర్ ఇదేదో కేసు అనుకున్నాడు.. 
ఎక్కడుంటే మీకెందుకు.. ఇది బిక్కవోలు.. ముందు టికట్ చూపండి అన్నాడు.. ఠక్కున మనవాడు 
“అయితే కుడి జేబు సార్  “ అని గట్టిగా అని టికట్ తీసి చూపాడు ..
“సీజన్ టికట్టా” అని వెరిఫై చేసి, 
"కుడి జేబేమిటి .."   అన్నాడు..
“ఏంలేదు సార్ , సామర్లకోట తర్వాత అయితే ఎడమ జేబులో టికట్ ఇవ్వాలి అని..
If it is between Rajahmundry and samalkot, కుడి జేబు, 
If it is from Samalkot and Tuni అప్పుడు ఎడం జేబు అని బండ గుర్తు పెట్టుకున్నా.. 
ఆఫ్ కోర్స్ వచ్చేటప్పుడు , టర్న్ ద వికెట్ .. జేబులు మారతాయి.. అదన్నమాటండి …  అందుకని అలా అడిగా “ 
నవ్వేసాడు టి.సి.
...వ్వేసి, ‘అలా వెళ్లకూడదుకదండీ మరి,’’ అంటూ నవ్వుతూ అన్నాడు..


వెళ్తున్నారు కదండీ మరి..’ అని నవ్వులో నవ్వు కలిపి నవ్వేసాడు శర్మ….
(మిత్రులు శ్రీ కే.వి.శాస్త్రిగారికి ప్రేమగా ఈ కథ సమర్పించుకుంటున్నాను.. శాస్త్రీ జీ స్వీకరిస్తారు కదూ … )


  


3 comments:

Anonymous said...

కృతజ్నతలు అభినందనలు
మొదటివి ఎప్పడివో మధుర జ్ఞాపకాలు వ్రాసి ఆనందింప చేసినందుకు
రెండోవి మీ రచనా శైలికి .

శర్మ అనబడే మీ. శాస్త్రి

A K Sastry said...

ఇలాంటి శర్మలు మిత్రులు కావడం మహాభాగ్యం. వాళ్లు మనకి యెంతో చేస్తారు కానీ మనం వాళ్లకి యేమీ చెయ్యలేము. అలా అని వాళ్లలా ఇతరులకీ చేయలేము. నాకూ ఇలాంటి మిత్రులున్నారని చెప్పడానికి గర్విస్తాను. నిజజీవితం లో హాస్యం పండించేది వాళ్లే. అందుకే అందరూ వారితో స్నేహం చెయ్యడానికే వువ్విళ్లూరుతారు. HATS ఆఫ్ టూ శాస్త్రిగారు.

మిస్సన్న said...

నాకు ఆ శైలి చూడంగానే అనిపించింది. ఈ శర్మ గారు శాస్త్రి గారేమో అని. చివరికి అదే నిజమయింది. మొన్నామధ్యన ఈ శర్మ గారు మా బ్రాంచ్ కి వస్తే మా కొలీగ్స్ తో అదే చెప్పాను. శర్మ గారితో కలసి పనిచెయ్యడం ఒక ప్లెజర్ అని. చాలా బాగుంది హరాజీకా!

ఒక సారి మీరు మాటల సందర్భంలో జొన్నాడ దగ్గరో ఎక్కడో కానీ హైవే మీద వెళ్ళే లారీలను టోపీ ఊపుతూ ఆపి వాళ్ళ యోగ్యతా పత్రాలు అవీ చూపించమని అడిగేవారని, హడావిడి చేసే వారనీ చెప్పారు. ఈసారి అలాటి సంఘటన వ్రాయండి.