Pages

Wednesday, December 31, 2014

HAPPY NEW YEAR 2015

 

మళ్లీ హేపీ న్యూ యియర్ వచ్చేసింది..


నాకు డెబ్భై ఏళ్లు దాటాయి.. ప్రతి సంవత్సరం క్రొత్తదనంతో క్రొత్త సంవత్సరం వస్తోంది.. 
క్రొత్త కోరికలతో స్వాగతిస్తూనే ఉన్నాను.
అరవై ఏళ్ల క్రితం ఎలా స్వాగతించామో నాకు గుర్తు లేదు.. ఇంట్లో అన్నయ్యలూ అక్కయ్యలూ ఎలా క్రొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారో… ఆ తర్వాత ఏదైనా ముద్దు ముద్దు మాటలతో  ‘ హెప్పీ నా యియర్’ అన్నానేమో .. విన్నవారికి ముద్దొచ్చి పెట్టుకున్నారో, పట్టుకు తన్నారో … ఏమో మరి..

ఆ తర్వాత హైస్కూల్ … ఫ్రెండ్స్ ,, హడావుడి .. అప్పుడు న్యూ యియర్ విష్ ఎవరు ముందు చెప్తారన్న తొందర .. హేపీ న్యూ ఇయర్ … అని ఇద్దరమూ ఒకేసారి అనడం .. నేను ముందన్నానంటే నేనంటూ వాదులాడుకోవడం.. అలా నవ్వులతో కేరింతలతో హేపీ న్యూ ఇయర్ …
కాలేజీలోకి వచ్చాక… ఒక స్టైల్.. తెచ్చిపెట్టుకున్న స్టైల్.. ఆనందం దాచుకుని, నవ్వు పులుముకుని గ్రీటింగ్స్ చెప్పుకోవడం.

తర్వాత ఉద్యోగం..
ఉద్యోగాల్లో బాస్ ను గ్రీట్ చేయడమే కాని, బాస్ ఉద్యోగాలు నేను చెయ్యలేదు. అంటే బాస్ ఉద్యోగాలు చేసినా ఏదో పల్లెటూళ్లో .. అంతే …
ఉద్యోగం . మొదట్లో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ … ఫేస్ టు ఫేస్ బాస్ తో అప్పుడే.. ఆయనకు షేక్ హాండ్ ఇవ్వడం.. పదాలు కూడబలుక్కుని ‘విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరాస్ న్యూ యియర్ సర్” అని హడావుడిగా చెప్పడం ,, ఆయన చిరునవ్వు నవ్వితే .. ఓ యబ్బో.. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ … “మనం ఇచ్చిన యాపిల్స్, కేక్స్ ప్లస్ కాఫీ.”... అదే అపురూపం . అక్కడ్నించి, మా పై వారితో ఆయన మాట్లాడే బిజినెస్.మనల్ని పలకరించడం పెద్దాయనకు ఇబ్బందేమో…

తర్వాత బాంక్ ఉద్యోగం.. ఇక్కడ పధ్ధతి డిఫరెంట్ .. పలాసాలో ఉన్నప్పుడైతే చిన్న ఊరు .. మాకు మేమే బంధువులం.. ప్రొద్దున్నే ఏజంట్ గారింటికి వెళ్లడం, అక్కడ గ్రీట్ చేసాక పిచ్చాపాటీ … జోకులు సరదాలు..
మేం అక్కడ ఉండగానే మెసెంజర్ పోస్ట్ తీసుకు వచ్చేవాడు. స్వంత జిల్లాలకు దూరంగా ఉద్యోగాలలో ఉండి,
ట్రాన్సఫర్ కు ఎదురుచూస్తూ ఉండేవాళ్లం.. క్రొత్త సంవత్సరంలో మంచి వార్తగా మాకెవ్వరికైనా అలాంటి బదలీవార్త హెడ్ ఆఫీస్ వారు పంపితే, వస్తుందేమో అని ఆశగా ఎదురుచూడ్డం … నిరాశమిగిలి పోవడం.. అదికూడా ఆనందంగా రిసీవ్ చేసుకోవడం .. అదో సరదా..  నేనే ఒక్కోసారి స్టాఫ్ కు అందమైన గ్రీటింగ్స్ కొని.. ఆ పోస్టల్ బాగ్ లో వచ్చేటట్టు చేసేవాణ్ణి.. ఊహించని విధంగా వచ్చిన గ్రీటింగ్స్ చూసి ఏజంట్ గారు, మిత్రులు చాలా ఆనందించేవారు..మాలో చాలా మందికి  ఇంకా పెళ్లికాని రోజులు.. అదో ముచ్చట..

తర్వాత రాజమండ్రి వచ్చేసాను… నిజం చెప్పాలంటే పల్లెటూళ్ళలో కన్నాపట్టణ వాసాల్లో .. కొంచెం కనపడని బాసింగ్ మా బ్యాంకుల్లో కనపడేది.. సిటీ పెద్దదవుతున్నకొద్దీ … అది పెరిగేది.సెక్షన్ వైస్ బి.ఎమ్. గార్ని గ్రీట్ చెయడం. మా సెక్షన్ మేనేజర్ ముందు వాళ్లింటికి రమ్మనే వారు. ఆయన మాతో సరదాగా మాట్లాడి కాఫీలు అవీ ఇచ్చేవారు. ఆయనకు పార్టీలు ఇచ్చిన కమలాలు,ఆపిల్స్ మాకు ఇచ్చేసేవారు. ప్రొద్దున్న రష్ గా ఉంటుందని, సాయంత్రం మా సెక్షన్ వాళ్లందరమూ బి.ఎమ్. గారింటికి వెళ్లేవాళ్లం, మా మేనేజర్ గారి తో కలసి. అప్పుడు బి.యమ్ ఖాళీగా ఉండి, మాతో పిచ్చా పాటీ మాట్లాడేవారు.. సరదాగా గడిచేది.

ఇది హెడ్ ఆఫీస్, జోనల్ ఆఫీస్ స్థాయిలో … ఆ ఆఫీసులు ఉన్న నగరాలు పెద్దవేమో, నగరమంతా సందడిగా ఉండేది. ఒక బేచ్ తర్వాత ఒక బేచ్ పెద్ద వాళ్ల ఇళ్లకు వెళ్లేవారు.. ఒక గుంపు వస్తుంటే వేరే గుంపు లోపలకి వెళ్ళడం. దారిలో ఆగి ఒకరికొకరు హాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం.. కొందరి బాసులకు ముందరి రోజూ 'హాపి' ఎక్కువైతే,ఎవర్నీ మరునాడు చూడకపోవడం,, తమాషాగా ఉండేది. పెద్దాయనగారి ఇంట్లో ఆయన్ను ఒక గదిలో గ్రీట్  చేయడం, ఇంకోగదిలోమాకు పెట్టింది మేయడం. ఆ రోజుల్లో న్యూ ఇయర్ కు మొదట్లో శలవు ఇచ్చేవారు. తర్వాత తీసేసారు. గ్రీటింగ్స్ అయ్యాక మరల ఆఫీస్ కు వెళ్ళలి. వెళ్ళేవాళ్ళం, కాని ప్రధాన కార్యాలయాల్లో పని జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్లినప్పట్నించీ ఓ డిపార్ట్ మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్ కు పోయి విష్ చేయడం..అక్కడ్నించి మరో డిపార్ట్ మెంట్, అదీ కాక యూనియన్ లీడర్లను కూడా గ్రీట్  చేయాలిగా… లేపోతే అడక్కండి మరి…

కాలెండర్ల కలెక్షన్.. డైరీల కలెక్షన్ బాగానే ఉండేది.. పలాసాలో ఉన్నప్పుడైతే చిన్నఊరు కనుక బాంక్ వాళ్ళపై విపరీతమైన గౌరవం ఉండేది పార్టీలకు. అలా కష్టమర్స్ డైరీలు కొనుక్కొచ్చి, ముందు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమనేవారు. . ఆ తర్వాతనే గవర్నమెంట్ ఆఫీసు వారికిచ్చేవారు. కొందరైతే మా పేర్లు దైరీలమీద ప్రింట్ చేయించి ఇచ్చేవారు. .

ఉద్యోగపు మొదటి రోజుల్లో గ్రీటింగ్స్ కొని పంపించేవాణ్ణి .. చాలా కొనే వాడ్ని. ఇందులో ఓ చమత్కారముంది. మనం ఎవరికీ పంపిస్తామో వారినుంచి కాకుండా, మనం పంపని వాని దగ్గరనుంచి మనకు గ్రీటింగ్ వచ్చెది. కొన్నాళ్ళుప్రింట్ చేసి. ప్రెస్ వాణ్ణి మంచి చేసుకుని పది పది గ్రీటింగ్ కార్డ్ లు మా ముగ్గురు పిల్లల పేర్లనీ వేయిస్తే పాపం వాళ్లు ఎంత ఆనంద పడేవారో. కొన్నాళ్ళు రబ్బర్ స్టాంప్ .. హాపీ న్యూ ఇయర్ అని చేయించి అది వేసే వాడ్ని.. తర్వాత యస్. యమ్. యస్ లు. ఆ తర్వాత way2sms…

హైదరాబాదులో ఉన్నప్పుడు నేనున్న ఇళ్లలో జనాన్ని హుషార్ చేసి వీధిలో పెద్ద ప్రోగ్రామ్ చేసాము … అలాగే ఎక్కడున్నా ఏదో హడావుడి చేసి అందర్నీ ఇన్ వాల్వ్ చేయడం…

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఆ హుషార్ బాగా తగ్గింది.. ఈ రోజు 31-12-2014 ఇంట్లోనే ఉన్నా … కంప్యూటర్ ముందు కూర్చుని.. నా మనసు విపి మీకో విషయం చెప్దామని… అది ఏమంటే…

“మీకూ మీ కుటుంబము వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆరోగ్యం,ఆనందమూ,ఐశ్వర్యము మీకు రాబోవు సంవత్సరములో కలగాలని, మీకు మీ కుటుంబం వారికి సకల శుభాలు కలుగాలని కోరుకుంటున్నాను. 
మన మైత్రి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను… శలవు.  

2 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Unknown said...

చాలా బాగా రాశారు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.