Pages

Sunday, November 29, 2015

హరాజీకా - 12


హరాజీకా - 12

చేతిలో పేలిన జోకు.

---డి.వి. హనుమంత రావు

[దీపావళి వెళ్లి పోయింది, మళ్ళీవచ్చే నాగులచవితి వెళ్లి పోయింది… క్షీరాభ్ధి ద్వాదశి, కార్తిక పూర్ణిమ అన్నీ ఆనందంగా జరుపుకున్నాక ఈ పేలడాలేమిటనకండి. జోకులకి సమయ పాలన లేదు.. ఎప్పుడైనా వెయ్యచ్చు. కొన్ని మతాబుల్లా తెల్ల కాంతులు వెదజల్లుతాయి. కొన్ని ఇలా చేతుల్లోనే పేలిపోతాయి… చదవండి ]


ఒక్కోసారి మనం అతి తెలివికి పోతుంటాము. దానికి నేనేమీ ఎక్సెప్షన్ కాదు. పైగా నాకు అందర్నీ నవ్వించగలనని ఒక దుర్నమ్మకం. (ప్రయోగం రైటేనా ? ఏమో మరి !).

మాది ఓ పెంకుటిల్లు. నేను చిన్నవాడిగా ఉన్నప్పణ్ణుంచీ, పెద్దై  బ్యాంకుద్యోగం వచ్చి, పెళ్ళయి, ఈ ఊరునుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఆ పెంకుటింట్లోనే నా జీవితం. మా అమ్మ నాన్నగారల  దగ్గర అక్కడే  పెరిగాను,. మా నాన్నగారు ఎప్పుడో  కొన్న పెద్ద స్థలంలో ఓ పెంకుటిల్లు, పెద్ద దొడ్డి. అమ్మ రక రకాల మొక్కలు పెంచేది. బీర, బెండ,దొండ లాంటివి, అరటి అవీ కాసేవి. ఇప్పుడు అరవయ్యీ డెబ్భై పెట్టి కొనుక్కుంటున్న కాకరకాయలు దడిమీదకు ప్రాకిన పాదుకు తెగ  కాసేసేవి. బయటి వాళ్ళు కూడా  కోసుకునేవారు. ఆ పెంకుటింటికి చుట్టూ మామూలు దడి. పెద్ద రక్షణ కాదు కాని, అది ఒక హద్దు. రోడ్డుపైనుంచి ఇంట్లోకి వస్తూంటే ..  ఓ ప్రక్కగా అరుగు. నాన్నగారు అక్కడ ఓ కర్ర కుర్చీలో కూర్చునే వారు. నాన్నగారికి రెండు కళ్ళకు నాలుగు ఆపరేషన్లయ్యాయి. అందుకని పేపర్లో పెద్ద లైనులు చదవగలిగేవారే కాని, చిన్న అక్షరాలు కనపడేవి కావు. మామూలుగా ఆయన పుస్తకాలు ఎక్కువ చదివే వారు. ఏదో పుస్తకం ఎప్పుడూ చదువుతూ  ఉండేవారు. ఈ నేత్రావరోధము ఆయనకు ఇబ్బంది పెట్టేది కాని, ఆయన అదో ఇబ్బంది అని ఎప్పుడూ అనుకునేవారు  కాదు. ఎంత కనపడితే అంతే చదివే ప్రయత్నం చేసేవారు. అమ్మ ఇంట్లో పనులయ్యాక ఆ అరుగుమీద చేరేది. ఆమెకు దరిమిలా చెవులకు వినికిడి బాగా తగ్గింది. ఆమె చదువుకున్నది అంతంత మాత్రం. ఐదో తరగతి కూడా కాదేమో .. అయితే భారత భాగవతాది గ్రంథాలలోని పద్యాలూ వచనాలు, అలవోకగా చదివేసిది. చదివి అర్థం చేసేసుకునేది.

రోజూ ఏ భారతమో, భాగవతమో తెచ్చుక్కూర్చునేది. నాన్నగారు కుర్చీలోనూ, అమ్మ క్రింద నేల మీద. అర్థం కానిచోట్ల నాన్నగారిని అడిగేది. నాన్నగారికి ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఆ సందేహ నివృత్తి చేసేసేవారు. అవసరమైతే లోపలికెళ్ళి తన లైబ్రరీ లోని పుస్తకాల సాయంతో వివరించి చెప్పెవారు. నాన్నగారు చెప్పేది వినపడక అమ్మ మళ్లీ మళ్లీ అడిగేది.  నాన్నగారు, ప్రేమ విసుగు కలబోసిన మాడ్యులేషన్ తో, ఈయన కుర్చీ పైనుంచి కొంచెం వంగి గట్టిగా చెప్పడం …ఆవిడ వినపడక మళ్లీ అడగడం, ఈయన ఓపిగ్గా చెప్పడం …  ఆ సీన్ గుర్తుచేసుకుంటూంటే, ఈనాటికీ తెలియని ఆనందంతో కనులు చెమరుస్తాయి, ఇంట్లో వాళ్లకే కాదు, ముందే చెప్పాగా… అరుగు వీధి వైపు, వెదురు దడి అంతంత మాత్రం.. అంచేత ఈ వృద్ధ దంపతులు అలా సత్కాలక్షేపం చేయడం చూసి వీధిలో వెళ్ళేవాళ్ళు ఆగిపోయి, ఆరాధనగా చూస్తూ అలా ఉండిపోయేవారు. అప్పటికి నాన్నగారికి ఎనభై దగ్గర, అమ్మకు డెబ్భై పైన. కొందరు వీరికి గౌరవంతో నమస్కరించుకునేవారు కూడా . వీళ్లకు అవేమీ పట్టేవి కాదు. వారి ఆనందం వారిది.

అలా అమ్మనూ నాన్నగారిని చూడ్డానికి ఇష్టపడేవాళ్లలో తివారి ఒకరు. ఈయన రాజస్థాన్ వాస్తవ్యుడు. ఇక్కడి పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తూ రాజమండ్రిలో మా ఇంటికి దగ్గరగా ఉండేవారు. . మొదట్లో అరుగు మీద నాన్నగారిని, అమ్మను చూడడానికి అలవాటుపడి,  క్రమేపీ నాన్నగారిదగ్గరకి వచ్చి, స్నేహం పెంచుకున్నారు. భక్తీ ప్రేమా పెంచుకున్న సౌజన్యుడు తివారీ. తరచూ వచ్చి నాన్నగారితోనూ మాతోను సరదాగా మాట్లాడేవారు. తెలుగులో కూడబల్కుని వచ్చీరాని భాషలో మాట్లాడుతూ ఉండేవారు. నాన్నగారు తెలుగులో వ్రాసిన తులసీ రామాయణానికి రెండవ ముద్రణ వేసిన రోజులవి. తివారీకి  తెలుగు రాదు. కాని నాన్నగారు తెలుగులో వ్రాసిన తులసీరామాయణాన్ని సుమారు యాభై కాపీలు ఖరీదు చేసి తన తెలుగు మిత్రులకు ఉచితంగా పంచారు. అది ఆయన సంస్కారం.

ఒకసారి ఆయన వారం పది రోజులు కనపడలేదు. తర్వాత వచ్చి కలిసారు. గుండు చేయించుకుని కనపడ్డారు.. నెత్తిమీద టోపీ ఉంది. ఆయన్ని చూసి నేను…
“క్యా తివారీ సాబ్ !శిర్ పర్  టోపీ లగా క్యోం..”అన్నా. “
[ఏంటి.. తివారీ గారూ, నెత్తికి టోపీ తగిలించారు]
“తిరుపతి గయా భాయ్.. యే హాయ్ ప్రసాద్” అని ప్రసాదం ఇచ్చారు.
[తిరుపతెళ్లాను, తమ్ముడూ, ఇదిగో ప్రసాదం ]
నేను ఊరుకోకుండా … “అచ్ఛా .. టోపీ… చాహే .. ఆప్ రఖియే .. హమారే శిర్ పర్ మత్ రఖ్నా..”అని నవ్వా ..
[సంతోషం.. సరే టోపీ కావాలంటే మీరు పెట్టుకోండి, మా నెత్తిని పెట్టకండి]

అతనికి కనులలో నీరు నిండింది..
“హమ్ కో ఆప్ క్యా సమఝ్ తే రావ్ సాబ్. హమ్ ఆప్కో అప్నా చోటే భాయీ సమఝ్ తే. పితాజీ హమ్ కో భగవాన్ జైసే .. మైనే క్యా నఫరత్  కియా. ఆప్ ఐసే క్యోం బోల్తే .. మేరా క్యా కసూర్ హై.. “ అంటూ చాలా బాధపడ్తూ మాట్లాడారు.
[రావుగారు, నన్ను మీరేమనుకుంటున్నారు. మిమ్మల్ని  నా తమ్మునిగా భావిస్తాను నాన్నగారు మాకు దైవ సమనులు. నేను మీకేం ఇబ్బంది కలిగించాను. ఎందుకలా అంటారు. నా తప్పు ఏంటి. ]
ఒక్క సారి గతుక్కుమన్నాను. నా తొందరపాటు తెలిసింది. నాన్నగారు నన్ను మందలించారు. తర్వాత తివారీ భుజం మీద చెయ్యేసి నాన్నగారు అతడ్ని అనునయించారు. తివారీ  తర్వాత మామూలుగానే ఇంటికొచ్చేవారు కాని, నేనే ఎదరపడి మాట్లాడలేకపోయేవాణ్ణి .. ఏదో గిల్టీ కాన్షస్ ….

తర్వాత అయిదారేళ్లకు రాజమండ్రి వదిలేసి, నా ఉద్యోగం చాలా ఊర్లు తిప్పింది. పదేళ్ల తర్వాత నాన్నగారు నా దగ్గరే హైదరాబాదులో రామ నామం చేస్తూ .. శ్రీరాముణ్ణి చేరారు...నాన్నగారి అంత్యేష్టిక్రియలకు రాజమండ్రి వచ్చినప్పుడు తెలిసింది. అంతకు కొద్ది రోజులక్రితమే తివారి ఊర్థ్వలోకాలకు చేరారని. ఏ జన్మలలో బంధాలో ఇవన్నీ…

Friday, August 14, 2015

నా బ్లాగు ఆరవ పుట్టిన రోజు…

పుష్కర సంవత్సరం



ఇంటి కొచ్చేటప్పటికి, చిట్టి తల్లి సోఫాలో మోకాళ్ళలో తలపెట్టుకుని కూర్చుంది.
నిజానికి, డోర్ బెల్ కొట్టినప్పుడు తలుపు తనే తీసింది.
నాకన్నా ముందు పరిగెత్తుకొచ్చి సోఫాలో కూర్చుని కోపం…
నటిస్తున్నదేమో అనుకున్నా..
కాని కోపం వినపడుతోంది.
వాళ్లమ్మనడిగా,“చిట్టితల్లి ఇలా మూడీగా ఉందేమి”టని..
“ఏమో నాకేం తెలుసు.. ఆ కంప్యూటర్ లో ఏం గొడవలొచ్చాయో “అంది ఆవిడ.
“అలా అని కాదు..”నసిగా .
“ఇందాకా వచ్చి నన్ను రేపు తారీఖు ఎంత అని ఆడిగింది. ‘ఆగస్ట్ 15 అని చెప్పా’ ఇండిపెండెన్స్ డే అని కూడా చెప్పా. “15 అంటే 2 తర్వాతనే కదా”అంది.
“అదేం ప్రశ్న వెర్రి ప్రశ్న అన్నా…అంతే దురుసుగా, చేతిలో ఉన్న పుస్తకాలక్కడ పాడేసి, ఇదిగో ఇలాగ“
అని విషయం చెప్పింది వాళ్లమ్మ.
నాకు లైట్ వెలిగింది.
“మరీ అలా చెప్పు.. “అన్నా  
“అవును చదవేస్తే ఉన్న మతీ పోయిందన్నట్టు, అంకెలు తెలియవా ఆమాత్రం, అని అలా అన్నాను.
ఆమాత్రం నేననకూడదా..”అని సాగతీసిందావిడ గారు.
“ఇక్కడ అంకెలు తెలియడం, ... యకపోవడం కాదు సమస్య..2వ తారీఖు అంటే చిట్టితల్లికి స్పెషల్,
అది మనం మర్చిపోయామని కోపం అన్నమాట “అన్నా.
“మీ స్పెషల్లూ, ఆర్డినరీలూ నాకు తెలియవు బాబూ…”అంటూ వాళ్లమ్మ లోపలికి దారి తీసింది.
నెమ్మదిగా చిట్టితల్లి దగ్గరికెళ్లి బుజ్జగించడం మొదలెట్టా…
“నీ ఫ్రాక్ బావుందమ్మా,” అని చెయ్య భుజం పై వేయబోయా… గట్టిగా తోసేసింది.
దెబ్బ తగిలిందన్నట్టు.. “అబ్బా” అన్నాను.. చట్టున తల పైకెత్తింది.
అహ్హహ్హా అని నవ్వేసా… తను కూడా నాతో నవ్వు కలిపింది.
చిట్టితల్లికి కోపం పోయింది… అన్నా..
బుంగ మూతి పెట్టి
“మళ్లీ నా పుట్టిన రోజు ఎందుకు మరచిపోయావు..”అడిగింది చిట్టి తల్లి.
నా సంజాయిషీ చెప్పడం మొదలెట్టా …
“జులై 25దాకా గోదావరికి పుష్కరాలుకదా. ఇంటికొచ్చిన అతిథులతో ఇల్లంతా కళ కళలాడింది.  .. ఊరంతా రాజమహేంద్రికి వచ్చిన పుష్కరయాత్రీకులతో సందడి సందడి.. గోదావరి స్నానాలు. పన్నెండేళ్లకోసారి ప్రత్యేకంగా అలంకరించుకునే నగరం.. ఊరంతా గోదావరి గల గలలు. నా గురించి ఆలోచించుకోడానికి కూడా నాకు ఖాళీ లేదు. అందుకని ఆగస్ట్ 2న నీ పుట్టినరోజు … అలా మనసులోనే ఉండిపోయింది.” అన్నా.
“సురేఖ హాసం అప్పారావ్  అంకుల్, జ్యోతి వలబోజు  ఆంటీ,బులుసు  సుబ్రహ్మణ్యం అంకుల్ .. వీళ్లెవరైనా ఫోనులు చేస్తారేమో అనుకున్నా… “అంది పసితనం.
“సురేఖ అంకుల్ - ముంబాయి వెళ్లి వచ్చారట. జ్యోతి ఆంటీ - పబ్లికేషన్స్, మాలికా మేగజైన్,సభలూ,సదస్సులు వీటితో బిజీట .. ఇక సుబ్రహ్మణ్యం అంకుల్ - మనం పలకరించటంలేదని అలిగారేమో..”అని సర్ది చెప్పబోయా.
...... ఎవరైనా మనల్ని పలకరించడానికి వారిని కూడా మనం పలకరిస్తూ ఉండాలిగా,
అయినా మనమేమీ వి.ఐ.పిల మా, సెలెబ్రిటీస్ మా ..... అని మనసులోనే అనుకున్నా,
చిట్టి తల్లి చిన్ని మనసు గాయపడుతుందని గట్టిగా అనలేదు..
“అయినా నువ్వు ఫేస్ బుక్, స్కైపు, వాట్సప్పూ అంటూ బిజీ అయిపోయావు.”అని నిష్టూరమాడింది.
“అదికూడా నిజమే అనుకో”అని ఒప్పుకున్నా.
“మొన్న ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చూసా .. అది ప్రపంచ జోకులు దినోత్సవం మీద, ఎవరో పోస్ట్ చేసారు.. చదివితే అది మనం పెట్టినదే. ఎప్పుడో 2011లో పెట్టాము కదా మనం.. అదే పోస్ట్ పేరు లేకుండా, మళ్లీ ..”అని కొంచెం బాధగా చెప్పింది.
“ఇదివరలో కూడా అదేతంతు“ నా బాధ  చెప్పా …
“కాపీ రైటు .. అంటే కాపీ చేసే రైటన్నమాట... “అని నవ్వింది.
“అయినా చిట్టి తల్లీ! ఈ మధ్యనే సూర్య ప్రకాష్ ఫేస్ బుక్ లో చూసా .. కాపీ కొట్టడం కూడా ఒక కళే అని, అలాంటి కళా నిష్ణాతులుంటారుగా, ఏం చేస్తాం.. “అన్నా నేను.
“ఆమధ్య సరసి గారు నా దగ్గర బాధపడ్డారు, తన కార్టూన్స్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, ఆయన పేరున్న చోట వ్హైట్ పెయింట్ పూస్తున్నారుట, ఎవరిదో తెలియకుండా.”అంది మా చిట్టి తల్లి..
“నీకో ముళ్లపూడి వారి జోకు చెప్తాను విను…
ఒక పత్రికా సంపాదకుడి దగ్గరకు ఒక కాగితాల కట్ట  పట్టుకుని, ఇలాంటి కాపీరైటర్ వచ్చాడుట.
ఆ కాగితాలు ఓపిగ్గా చదివి,
“ఎవరు వ్రాసారు” అన్నాట్ట సంపాదకుడు అనుమానం వచ్చి,
“నేనే” అన్నాడట ఈ కాపీ  రైటర్
“మీరేనా… అరె! అడివి బాపిరాజు గారు పోయారనుకుంటున్నాము, ఇంకా బ్రతికే ఉన్నారన్నమాట.”
వ్యంగ్యంగా అని నమస్కారం పెట్టాడట …ఆ సంపాదకుడు.  
ఇంతకీ ఆ కాపీ . రైటర్ తెచ్చినది … ప్రఖ్యాత రచయిత అడివి బాపిరాజుగారు వ్రాసిన ‘నారాయణ రావు’ నవల.
ఆ నవలకు సాహిత్య పురస్కారం కూడా వచ్చింది.”అని చెప్పగానే
జోకు విని… పక పకా నవ్వేసింది చిట్టి తల్లి, నవ్వుతూ
“అందుకే జోస్యుల సూర్య ప్రకాష్ గారన్నట్టు కాపీ చేయడం కూడా ఒక కళ”. అంది.
మూడ్ లోకి వచ్చింది కదా.. అని
“బిలేటెడ్ గ్రీటింగ్స్ ఫర్ ఏ హేపీ బర్త్ డే …” అని షేక్ హేండ్ ఇచ్చా …
“థాంక్యూ “అంది.
“పుట్టిన రోజుకి ప్రెజెంటేషన్, ఏం కావాలి నీకు తల్లీ, అడుగు” అంటే …
గోదావరి పుష్కరాలకు ముస్తాబైన కోటిలింగాల ఘాట్ చూపించమంది. 



తీసుకెళ్లా… గోదావరి పుష్కరాల సందర్భంగా  కోటిలింగాల రేవును నవీకరించి,
భారత దేశంలోనే మొదటి పెద్ద ఘాట్ గా తీర్చి దిద్దారు.  
ఆ పెద్ద ఘాట్ చూసి .. చిట్టి తల్లి చాలా ఆనందపడిపోయింది. ఆ విశాలమైన రేవులో అటూ ఇటూ పరుగులు పెట్టింది. నీళ్లదాకా వెళ్లి, శిరస్సు పై పవిత్ర జలాలు జల్లుకొంది. అరచేతిలోకి నీటిని తీసుకుని భక్తితో పానం చేసింది.
గోదావరీ తీర వాసుల రచనలకు  ప్రాణం పోసే అఖండ గౌతమీ జలాలకు ప్రణమిల్లింది.. నా చిట్టి తల్లి.
“బ్లాగాభివృద్ధిరస్తు” అంటూ ఆ “నీటి సిరి” గలా గలా దీవించింది.
నా చిట్టి తల్లిని మరి మీరూ దీవిస్తారు కదూ ?

Friday, July 17, 2015

రాజమండ్రి - 10


పుష్కర ప్రారంభంలో


చందమామలో ఎప్పుడో ఒక కథ చదివాను.. మీకూ గుర్తుండే ఉంటుంది....


బ్రతుకుతెరువుకోసం ఒకామె పాలమ్ముకుని జీవిస్తోంది.. ఆ పాలమ్ముకునే స్త్రీ గంపలో పాలతో ఉన్న చెంబులు పెట్టుకుని నగరంలో అమ్మడానికి తీసుకువెళ్తోందోసారి.  ఆ పాల చెంబులపై పల్చటి వస్త్రం కప్పిఉంది.. ఇంతలో వచ్చిన గాలికి ఆ పైనున్న వస్త్రం తొలగి కొన్ని పాలచెంబులకు ఆచ్చాదన తొలగింది. అదే సమయంలో పైన ఆకాసంలో ఒక గ్రద్ద ఆహారంకోసం ఒక పామును కాళ్లతో పట్టుకుని ఎగురుతోంది. ప్రాణ భయం చేత ఆ విషనాగు నోరుతెరచి గరళం క్రక్కుతుంది.. అది సరిగా అచ్చాదన తొలగిన  పాలచెంబులో పడింది. ఆ పాలు కొనుక్కున్న వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు..
ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాకు వెయ్యాలి.. బ్రతుకుతెరువుకోసం పాలమ్ముకుని జీవిస్తున్న  ఆ స్త్రీకా... గాలిని వీచి వస్త్రం తొలగజేసిన తన ఉనికి చేత లోకరక్షణ చేస్తున్న వాయుదేవుడికా... భయంతో విషం కక్కిన విషనాగుకా.. తన పొట్ట నింపుకునే కనీసధర్మంతో ఆహారాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుడికా అని..దేవలోకంలో సంబంధిత దేవతలు క్రిందామీదా పడుతున్నారు.. ధర్మశాస్త్రాలు తిరగేస్తున్నారు.


ఈ విషయం గురించి దేవలోకానికి చెందిన రెండు పక్షులు భూలోకంలో ఓ చెట్టు మీద కూర్చుని చర్చించుకుంటున్నాయి.. ఆ చెట్టు నీడలో ఇద్దరు వ్యక్తులు విశ్రమిస్తున్నారు.. అందులో ఒకనికి పక్షి భాష తెలుసు. అతను విషయం విని పెద్దగా నవ్వి మిత్రుడికీ విషయం తెలియజెప్పి చేతకాని దేవతలని దేవతలను నిందించాడు. దేవదూతలొచ్చి అతన్ని పట్టుకుపోయారు... ఇతన్ని నిలదీశారు..నోటికొచ్చిన సమాధానం చెప్పి గేలిచేసాడు ఈ వ్యక్తి.. అంతా విన్న ఆ సమవర్తి "ఇతని సమాధానం ధర్మ బద్ధంకాదు..దేవతలనే ధిక్కరిస్తున్న ఈ అతితెలివిమంతుడిఖాతాలో ... ధిక్కరించిన పాపం, ప్లస్ మనకు తెగని సమస్యకు సంబంధించిన పాపం జమకట్టండి" అని తీర్పు ఇచ్చాడు...


రాజమండ్రి ఆహ్వానిస్తే వచ్చారు భక్తితో యాత్రీకులు.. వారికు రాజమండ్రి సరియైన సదుపాయాలు చేయడంలో విఫలమైంది..
ముఖ్యమంత్రా, అతనికి  సరియైన ఆలోచనలు అందీయలేకపోయిన మంత్రిగణమా, రక్షణ వైఫల్యమా, బాధలు పడేవాళ్లు దొరికితే చాలు, ఓదార్చేద్దామని మాటా ముల్లూ సర్దుక్కూర్చున్న విపక్ష పార్టీలా .. బాధ్యతారహితంగా విస్తృత ప్రచారం కల్పించే న్యూస్ మాధ్యమాలా… తమ వంతు క్రమశిక్షణ తాము పాటించక ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన క్రమశిక్షణ లేని ప్రజలా… గోదావరికి పుష్కరకాలం 12 రోజులూ  పవిత్రమని ముందే చెప్పని జ్ఞానులా…ఎప్పుడూ లేని విధంగా ఒక ముహుర్తం చెప్పి అదే పవిత్రమంటూ విశేష ప్రచారం చేయడమా … ఎవరిదీ తప్పిదం.
రాజమండ్రి గృహస్తుగా నాదే తప్పేమోననిపిస్తోంది … చాలా బాధ కలుగుతోంది…. శిరస్సు వంచి బాధాతప్త హృదయంతో సోదర ప్రజానీకానికి క్షమార్పణలు తెలుపుకుంటున్నాను.. జరిగిన నష్టం దీనివలన తీరదని తెలుసు… మిగిలిన రోజులు యాత్రికులకు ఆనందకరమైన అనుభవాన్ని కలిగించమని ఆ గోదావరీ మాతను కోరుకుంటున్నాను. పైనున్నదేవతలను ప్రార్థిస్తున్నాను.

Monday, July 13, 2015

రాజమండ్రి - 9

రాజమండ్రి - 9
 
అర మహా పుష్కరాలు

రచన: డి.వి.హనుమంత రావు.


రేపట్నించి ప్రారంభమయ్యే గోదావరీ పుష్కరాలు… అందరికీ మహా పుష్కరాలట. 
అయితే నాకు అర మహా పుష్కరాలు. అందరూ దీన్ని మహా పుష్కరమంటున్నారు …
అంటే 144ఏళ్ల క్రితం పుష్కరాలు లేవా.. గోదావరి లేదా.. ఆ చర్చ జోలికి మనం పోవద్దు. 
సరే - ఇది మహా పుష్కరమయితే నాకు ఇది అర మహా పుష్కరం. ఎలాగా…? 
చదివితే మీకే తెలుస్తుంది. చడవండి.


1943వ సంవత్సరంలో నేను పుట్టానండి. అప్పుడో పుష్కరమొచ్చిందటకదా ? నాకు గుర్తు లేదు. ఎందుకంటే నాకు పళ్లు లేవు .. అబద్ధాలాడే వయసు కాదన్నమాట. కాని అప్పుడు ప్రపంచ యుద్ధం టైమన్నమాట. నా జాతక చక్రంలో గంటో, గంటన్నరో కలుపుకోవాలి ఆర్ తీసేయాలి.

1955లో నేను హైస్కూల్ లో చదువుతున్నాను. భారత్ స్కౌట్ లో ఉన్నాను. శ్రీ కలగా కృష్ణమూర్తి గారు మా స్కౌట్ మాష్టారు. ఆయనని విత్తనాల మేష్టారనేవారు. ఎందుకంటే ఇంట్లో పండించుకునే బెండ,బీరా,చిక్కుడు లాంటి విత్తనాలు అడగకపోయినా ఇచ్చి పాదులు పెంచమనేవారు.వాళ్లింట్లో  తేనెటీగల పెంచే  పరిశ్రమ ఉండేది. మంచి మేష్టారు . పుష్కారాలకు నాకు డ్యూటీ వేసారు. కోటిలింగాల రేవు లోనే డ్యూటీ, ఉమా కోటి లింగేశ్వర స్వామి వారి ఆలయం వెనకాల దేవస్థానం వారి ఆఫీస్ ఉండేది. మేము మెడలో స్కార్ఫ్, చేతిలో కర్ర, నడుందగ్గర బెల్ట్ కి ఓ తాడు అన్నీ పెట్టుకుని, డ్యూటీకి వెళ్లగానే, దేవస్థానం ఆఫీసులో టిఫిన్, కాఫీ ఇచ్చేవారు. అక్కడనుంచి రేవులోకి వెళ్లేవాళ్లం. కర్రతో చెత్త ప్రక్కకు లాగుతూ, పెద్దవాళ్ళకి చెయ్యి పట్టుకొని రేవులో సాయం చేయడం ఇలా ఏవో చేసేవాళ్లం. అప్పుడు పిండ ప్రదానాలు అవీ గట్టు మీదే పెట్టేవారని గుర్తు. కళావెంకట్రావుగారు, అప్పుడు మంత్రి అనుకుంటా, వచ్చి రేవును చూస్తూ నాకు దగ్గరగా నించున్నారు. అది ఒక థ్రిల్. నాన్నగారికి ఆయన మంచి ఫ్రెండ్. అది తెలుసు. కానిఅలా అని చెప్పి పరిచయం చేసుకోడానికి ఏదో  బెరుకు. గట్టుమీంచి మెట్లు దిగాక ఎడమ వైపు ఒక బురుజులా ఉండేది. దానిపైన పోలీసులు అబ్సర్వేషన్ పోస్ట్ అని పెట్టి రేవు పరిశీలిస్తూ హెచ్చరికలు చేసేవారు. సీతంపేట నుంచి కోటిలింగాల రేవు వైపుకు పెద్ద పెద్ద కంపార్ట్మెంటులు వెదురుతో కట్టి క్రౌడ్ ను కంట్రోల్ చేయడం గుర్తు. అప్పుడు కూడా పుష్కరాలు రెండు పంచాంగాల పద్ధతిలోనే వచ్చినట్టున్నాయి.. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే .. స్కౌట్ డ్యూటీ కి రోజుకి పావలా ఇచ్చేవారు. నాకు 22 పావలాలు వచ్చాయి. అంటే అయిదు రూపాయల ఎనిమిదణాలు. అవి పెట్టి నేను ఒక బేబీ గొడుగు కొనుక్కున్నాను. చాలా కాలం వాడాను.

1967లో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం రిజైన్ చేసి, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో -  పలాసాలో ఉద్యోగం. చేరి ఆరునెలలవకుండానే పుష్కారలొచ్చాయి. సెలవడిగితే ఏజెంట్ (అప్పుడు ఏజెంట్ అనేవారు )గారిని సెలవడిగితే, ఇంకా ప్రబేషన్ అవలేదు. ఇప్పుడిస్తే మీ సర్వీస్ కు ఇబ్బందవుతుందన్నారు. కాని మంచాయన,భగవత్ చింతన ఉన్నాయన, మిత్రులుకూడా నా అభ్యర్థనకు మద్దత్తిచ్చారు. ఆదివారము కలసొచ్చేటట్టు రెండు రోజులు సెలవిచ్చారు. పరుగెత్తుకుని రైలు బండిలో వచ్చేసాను. సుబ్రహ్మణ్య మైదానంలో స్టేజి మీద ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు. అప్పుడే వేదాంతంవారి స్త్రీ వేషధారణ చూసాను. టి.టి.డి. వాళ్లు అతి చవకగా పుస్తకాలమ్మారు.  మునిసిపల్ స్టేడియం లో ఎగ్జిబిషన్. లోపల డాన్స్ చేస్తున్న అమ్మాయి, బయట స్క్రీన్ పై కనపడడం ఒక వింత. అప్పుడే అనుకుంటా పది రూపాయలకో అయిదు రూపాయలకో విమానం నగరసౌందర్యాన్ని చూపేది. ఆఫ్ కోర్స్ నేనెక్కలేదు..

1979లో ఆఫీసర్ గా ప్రమోషన్, పాయకరావుపేటలో ఉద్యోగం. ఇనప్పెట్టి తాళాలు  పట్టుకునే ఉద్యోగం. సెలవంటే ప్రాబ్లం .. మొత్తం మీద ఒక రోజో రెండురోజులో వచ్చి వెళ్లాను. అప్పటికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఆనందం, ఉత్సాహం - నాకున్న ఉద్యోగ బాధ్యతల బరువుతో  అణగింది. యువభారతి, జంట నగరాల సాహితీ సంస్థ బుక్ స్టాల్ పెట్టింది. నాకున్న పరిచయం దృష్ట్యా కొంత మాట సాయం చేసాను ఉన్న రెండురోజులూ .

1991లో రాజమండ్రికి దగ్గరగా ఇందుకూరుపేటలో బి.యమ్ గా వేసారు. ప్రొద్దున్న పోతే సాయంత్రమే తిరిగి రావడం. అయినా వచ్చాక ఉత్సాహం తెచ్చుకుని ఊరు చూసేవాణ్ణి. మా మేనమామగారబ్బాయి శ్రీరామనగర్ లో ఇల్లు తీసుకుని వచ్చిన వాళ్లందరికీ భోజానాలు ఏర్పాటు చేసాడు. మా ఆవిడా పిల్లలూ వడ్డనలో  సాయపడేవారు. నాకు ఆదివారాలలాంటి శలవుదినాలలో కుదిరేది. అప్పుడు పాల్గొని ఆనందాన్ననుభవించాను. ఇంతకు ముందు పుష్కరాలకు హోటల్ వాళ్లు చాలా సొమ్ము చేసుకున్నారట. మనుషులు నడచే రాంప్ మీదకూడా ఆకులేసి పెట్టేసే వారట. అయితే నాకు తెలిసి 1991 పుష్కారాలలో రాజమండ్రి ఒక అన్నపూర్ణ -- ఒక డొక్కా సీతమ్మ అందరిళ్లల్లోనూ భోజనాలు యథా శక్తి పెట్టేవారు. అప్పుడు మేం రాజా టాకీస్ ప్రక్క నూనె మిల్లు కాంపౌండ్ లో ఉండేవాళ్లం. శ్రీకాకుళం జిల్లాలనుంచి ఒక కాంట్రాక్టర్ బస్సు వేసి ఒక batch జనాన్ని తీసుకొచ్చి ఇంకో batchని తీసుకువెళ్ళే వాడు. అందులో వచ్చిన ఒకరిద్దరు బ్రాహ్మణులు మా ఇంటికొచ్చి భోంచేసారు. స్కూల్ పిల్లల చేత అన్య మత  ప్రచారం. ఓ రోజు నేను నదీ స్నానం చేసి భస్మ ధారణ తో ఇంటికొస్తుంటే అన్య మత సాహిత్యం పట్టుకొచ్చి చేతిలో పెట్టబోయాడు. వెనక్కి త్రిప్పమన్నాను. చూస్తే అర్థంఅయిపోయింది. చాలాకోపం వచ్చి, అసలు నీకు బుద్ధుందా, ఇదేం పనంటే .. విదేశీ పైసలతో ఆత్మ ద్రోహం చేసుకుంటున్న ఆ ఆసామీ.. థాంక్యూ సర్ అంటూ పారిపోయాడు. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధ కలిగేది.. ఇవన్నీ ప్రక్కనెట్తే ఆ పుష్కరాలు చాలా ఆనందాన్నిచ్చాయి.  ఈ ఆనందానుభవం నాతో 2003 పుష్కరాలదాకా ప్రయాణం చేసింది.    

ఇక 2003 పుష్కరం. 2003 జనవరిలో నాకు షష్ట్యాబ్ది పూర్తి. 2001లో వి.ఆర్.యస్ తీసుకున్నాను. అప్పటికి వైజాగ్ లో ఉన్నా పుష్కరాలకు రాజమండ్రి చేరాలని గట్టిగా నిర్ణయించుకుని, రాజమండ్రి మకాం మార్చేసాను. నేనూ మా మేనమామ గారబ్బాయి కలసి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము. అంతా అయ్యాక ఆ ఇంటివారు అద్దె ఏమీ తీసుకోకుండా తమ సౌజన్యం చూపారు. వైజాగ్ నుంచి ఒక చక్కని వంటాయన (చక్కదనం వంటలో) మాకు తన నైపుణ్యం చూపాడు .. రోజుకి మిత్రులు, బంధువులు 100కి తక్కువకాకుండా భోంచేసారు. ఆచార్య తిరుమల, అక్కిరాజు సుందరరామకృష్ణ, వడ్డె శ్రీకృష్ణ వంటి ప్రముఖులు తమ పుష్కర స్నానం చేసి, తీర్థ విథులు పూర్తి చేసుకుని, మా తావులో భోంచేసి వెళ్ళేవారు. అప్పటి పరిచయాలు కొన్ని ఇప్పటికి కొనసాగుతున్నాయి అంటే అది మా దంపతుల అదృష్టం. రోజూ మా చిన్న ఇంటిలో 15మందైనా విశ్రమించేవారు. రాత్రి వారికి ఫలహారం మా శ్రీమతి ఏర్పాటు చేసేది. ఉదయం కాఫీ మా ఇంట్లో, పుష్కరస్నానం, తరువాత మా తావులొ భోజనం. మరొక ఇల్లు అద్దెకి తీసుకుంటే దూరాలనుంచి వచ్చిన పురోహితులు మకాం చేసి, వారు కార్యక్రమములు నిర్వర్తించి నాలుగు రూకలు సంపాదించుకునేవారు. సమయం దొరికినప్పుడు ఊరు చూసేవాళ్లం. తెలుగుదేశం నేతృత్వంలో ఊరు సర్వాంగ సుందరంగా తయారైంది. అప్పుడే ఘాట్లన్నింటికి టైల్స్ వేసారు. రోడ్లన్నీచదును చేసారు. పచ్చటి మొక్కలు పాతారు. ఎన్నో స్వచ్చంద సంస్థలు టిఫిన్స్, భోజనాలు ఉదారంగా పంచారు. యాత్రీకులు ఎంతో తృప్తి పడ్డారు.
పుట్టుకనుంచి, షష్టి పూర్తి దాకా ఆరు పుష్కరాలు … అర మహా పుష్కరాలు. మొదటిది పాపం చిన్నపిల్లాడ్నని వదిలేస్తే ఇది ఆరవ పుష్కరం..

2015 .. 6 x 12 = 72 పూర్తి అయ్యాక వచ్చిన పుష్కరం. ఇది అరమహాపుష్కరం … పనులు లేట్ గా మొదలయ్యాయి, విపరీతమైన ఎండలు, అకాల వర్షాలు పనుల వేగాన్ని తగ్గించాయి. కోటిలింగాల ఘాట్ పెద్దది చేయడం, నిత్య గోదావరి హారతి కొన్ని విశేషాలు. గోదావరి హారతి అన్నది క్రితం పుష్కరాలలో ప్రారంభమైంది. కాని మ్రొక్కుబడి. అప్పుడు మేమున్న సంస్థద్వారా, ప్రతి పున్నమికి పుష్కర ఘాట్ లో హారతి  2005లో మే లో ప్రారంభించాము. సామవేదం వారు హారతి పాట కూడా వ్రాసారు. అయితే ఆత్మీయంగా, నిరాడంబరంగా సాగేది. రాజకీయనాయకుల ప్రవేశం లేదు. ఆ తర్వాత ప్రస్తుతం చేస్తున్న సంస్థ అదే రేవులో అదే పున్నమి నాడు భారీగా కార్యక్రమం మొదలెట్టారు. రాజకీయ నాయకులు ఓహో అద్భుతమైన ఆలోచన అన్నారు, మాది తగ్గింది.. ఇప్పుడు అందరూ ఆనందించేవిధంగా నిత్య హారతి గా గోదావరీ మాత నీరాజనాలు అందుకోవడం శుభ పరిణామం. విషయ పరిజ్ఞానంతో మహనీయులు  తమ ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికత సామాన్య జనులలో పెంచడం వలన, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన లక్షల్లో యాత్రీకులు వస్తారని అంచనా..
పన్నేండేళ్లకోసారి వచ్చే ఈ పండుగకు,,
కడియం మొక్కల పచ్చదనంతో, విద్యుత్ కాంతుల ప్రకాశంతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో  
ఊరు సన్నధ్ధమైంది. యాత్రీకులను ఆహ్వానించడానికి, అట్టహాసంగా --

హృదయాలు తెరిచి యాత్రీకులను ఆహ్వానిస్తున్నాము ఆత్మీయంగా ….  

Friday, July 3, 2015

పుష్కరాలు… వచ్చాయి, వస్తున్నాయి…


రాజమండ్రి - 7

గోదావరి హారతి.

                                                                        రచన డి.వి.హనుమంతరావు. 


పెళ్లివారొచ్చేటప్పటికి తొమ్మిది దాటుతుందని వార్త వచ్చింది. ఆడపెళ్లివారిలో ఉన్న ఓ పెద్దాయన కన్యాదాతను పిలిచి 
“ఒరేయ్ నాన్నా! వాళ్లొచ్చేదాకా మనవారందర్నీ టిఫిన్స్ లేకుండా ఉంచేయకు. షుగర్ వాళ్లూ, బి.పి లవాళ్లూ ఉంటారు కదా. వీళ్లకు ఆ టిఫిన్స్ కాస్తా పెట్టేస్తే షుగర్ మాత్రలవాళ్లు ఆమాత్రలూ, బి.పి.ల వాళ్లు వాళ్ల మాత్రలు మింగుతారు. అంచేత మనవాళ్ళకి పెట్టించేయ్!” అన్నాడు.
“అలాక్కాదు బాబాయ్, మనం తినేస్తే బాగోదేమో, అదీకాక, మగపెళ్లివారి తాలూకు వారు కొందరు వేరే ఊళ్లనించి వచ్చి విడిదిలో ఉన్నారు, వాళ్లకి తెలిస్తే బాగోదు…”
“మరి చెప్పవేం.. వాళ్లనీ వచ్చేయమను, మీ వాళ్లలో పెద్దలూ పిల్లలూ ఉండలేరేమో అని పెట్టించేసాం, అని చెప్పొచ్చు”
అన్నాడు పెద్దాయన.
“మరి బాబాయ్.. “ .. 
“ఒరేయ్ అలా నసక్కు, వీళ్లందరూ టిఫిన్ తినేసి వాళ్లు  బస్సు దిగేటప్పటికి
నీరస ముఖాలు లేకుండా … స రస ముఖాలు వేసుకుని కళ కళ లాడుతూ నించుంటే ఎంత బాగుంటుందిరా….” అని ఉత్సాహ పరచారు బాబాయి గారు..


ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే …
ఒక సిద్ధాంతం ప్రకారం గోదావరికి పుష్కరాలొచ్చేసాయి. మరో లెక్కప్రకారం 14 జులై నుంచి ప్రారంభమవుతాయని అంటున్నారు.
ఆ నాటికి  చాలా మంది వచ్చేవారున్నారని అంచనాలున్నాయి. అలాంటప్పుడు మా రాజమండ్రీ జనాభాకూడా మీతో పాటు స్నానాలకి వస్తే రష్షూ పెరుగుతుంది, అటూ ఇటూ తిరుగుతూ మిమ్మల్నీ సరిగా రిసీవ్ చేసుకోలేం. అందుకని మాకిక్కడ ఓ పెద్దాయన చెప్పారు కనుక, అదీకాక  చాలా రేవులు ఖాళీగా ఉన్నాయి కనుక చాలామంది స్నానాలు చేసేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లు ఎలా వున్నాయో ముందే చూడ్డం మంచిది కనుక,  మీరొచ్చాక మీతో పాటు మునగ కలిగితే మరో మునక వేస్తాము. లేదా ఇదే పుష్కర స్నానంగా ఆ పైవాడు జమేసు కుంటాడు. అన్నది ఒక భావన. చెప్పినవారు దైవజ్ఞులు, బ్రహ్మవేత్తలు ..కనుక ఇదే పుష్కర ప్రారంభం అని ఇంకో భావన. . అప్పుడూ, ఇప్పుడూ అయితే మరీ లాభం. అధికస్య అధికం ఫలం అని మరో భావన.
ఈ భావనాత్రయానికి మా శ్రీమతి భావన తోడై నేను ఈ రోజు పుష్కర ఘాట్ కు బయల్దేరాను. అధికం కాకపోతే ఈ పున్నమి గురు పూర్ణిమ .. గురువారం .. ఇంకేం …
అక్కడ పరిచయమున్న పురోహితులు కలసి శాస్త్రీయంగా మా దంపతులచేత సంకల్పం చెప్పించి, స్నానం చేయించారు.. విశాలమైన గోదావరి నది పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంటే మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ఈ గోదావరీ తీరంలో ఉన్నందుకు.. గర్వం, ఆనందం కలిగాయి. అఖండ గౌతమి, రాజమండ్రి వాసుల ఆస్తి. ఈ నీటిసిరి మనందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ.




నిన్నటి రోజు నుండి గోదావరికి నిత్య హారతంటూ ప్రియతమ ముఖ్య మంత్రిగారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుష్కర ఘాట్ రేవులో పరిచయమైన వారు కలిస్తే  “మొత్తానికి గోదావరికి నిత్య హారతి జరగబోతోంది .. చాలా సంతోషంగా ఉంద”న్నాను. వారు వెంటనే స్పందించి.. “ఇది మీరు నాటిన బీజం” అన్నారొకరు, “మహావృక్షమయిం”దన్నారు మరొకరు. “మన కందనంత ఎత్తుకు ఎదిగిం”దన్నాను నేను. వారే కాదు నిన్న హారతి చూచివచ్చిన మిత్రులు, “మీరే గుర్తొచ్చారు.. మీరు మొదలెట్టిందే కదా” అన్నారు, ఎవరో ఫోన్ చేసి అదే అభిప్రాయం వెలిబుచ్చారు. అంటే నేనే మొదలెట్టానని కాదు, మొదలెట్టినవాళ్లలో నేనూ ఒకణ్ణి అని ….  

నేపధ్యంలో కొక్కసారి రండి .. గత పుష్కరాలలో గోదావరి హారతి ప్రభుత్వం ప్రారంభించింది. అయితే అది కేవలం ఒక మొక్కుబడిగా జరిగేది. కనీసం జరుగుతున్నదన్న బోర్డు కూడా ఎప్పుడూ కనబడ లేదు. నేను అక్కడున్న ఉద్యోగులతో ప్రస్తావించాను. కాని వారు మాత్రం ఏం చేయగలరు. తర్వాత  ఒక సేవా సంస్థతో నాకు అనుబంధం ఏర్పడింది. .. నేను దాని కార్య నిర్వాహక వర్గంలో ఉన్నప్పుడు మేమంతా ఆలోచించి ప్రతి పున్నమికి గోదావరికి హారతి పుష్కరఘాట్ లో ఈయడానికి సంకల్పించాము. 2005 మే పున్నమినాడు అద్భుతంగా ప్రారంభించాము. దానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చక్కటి హారతి పాటను అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చారు. దానితో హారతిచ్చేవాళ్లం. . హారతికి ముందు మహిళామణులు లలితాసహస్రనామ  పారాయణ, గంగహారతి పాటలు కూడా పాడేవారు. లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులు గోదావరి ప్రాశస్త్యము పై చక్కటి ప్రసంగాలు చేసేవారు. వారి ప్రసంగంలో గోదావరి ప్రాముఖ్యతను తెలుపడమే కాకుండా, పవిత్ర నదిపట్ల మనం పాటించవలసిన ధర్మాలను చెప్పేవారు. ఇదేకాకుండా ప్రాతఃకాలంలో మేము కొంతమంది, మహిళామణులతో సహా వెళ్లి రేవు శుభ్రపరచడమే కాకుండా, పరిశుద్ధంగా రేవును ఉంచాలని యాత్రీకులకు అవగాహన కల్పిస్తూ, మైకులో చెప్పెవాళ్లం. అయిదారేళ్ళు ఆ విధంగా ప్రతి పున్నమికి, ఏ రోజూ మానకుండా గోదావరికి హారతి యీయడం ఒక హంబుల్ వే లో జరిగింది. చాలామంది ఈకార్యక్రమంలో పాల్గొని హర్షం ప్రకటించేవారు. ఆ తర్వాత బుద్ధవరపు వారు వచ్చి గోదావరికి హారతి  భారీ స్థాయిలో ప్రారంభించారు. అప్పుడు మేము గౌతమ్ ఘాట్ కు మారాము. అక్కడకూడా చాలాకాలం హారతి కార్యక్రమం జరిగింది. తర్వాత కొనసాగించలేకపోయాము. అయితే అప్పణ్ణించి చాలా సంస్థలు ఆయా సందర్భాలలో గోదావరి హారతి తమ కార్యక్రమములలో కలపి నిర్వహించేవారు.. ఎవరు చేసినా … ఎలా చేసినా… రాజమండ్రి ఉనికికి, మనికికి కారణమైన గోదావరి మాతకు కృతజ్ఞత చూపడం మన కర్తవ్యం. అదే  జరుగుతోంది. ఆనంద దాయకం కదా?


Wednesday, June 17, 2015

హరాజీకా - 11---చేజారని శీలం

హరాజీకా - 11

చేజారని శీలం
  రచన : డి.వి.హనుమంతరావు

 
యస్.యస్.యల్.సీ (ఇప్పటి యస్.యస్.సి.కన్నా ఒక క్లాసు ఎక్కువ ఇది) మాత్రం ఫస్ట్ చాన్స్ లో పాసయ్యాను. ఆ ఏడాదే ఇంట్రడ్యూస్ చేసిన పి.యు.సి - ఫస్ట్ బాచ్ లో చేరి, డింకీ కొట్టాను. సెప్టెంబర్ లో వ్రాయకుండా, మార్చిలో పరీక్షలు వ్రాసాక..  కొత్తావకాయ, మామిడి పళ్లు పట్టుకుని   అన్నయ్యగారి ఊరు వెళ్లి ఇచ్చి రమ్మని నాన్నగారు నన్ను చిట్టివలస పంపారు. నేను వెళ్లిన వారానికి మా మేనల్లుడు(నాకన్నా పెద్ద) వాడికి అక్కడేదో పని ఉందని వచ్చాడు. వీడుకూడా నా ఈ కథనంలో పాత్రధారి. అందుకని పరిచయం చేస్తున్నాను. చదువరులు గ్రహింతురుగాక.
మా అన్నయ్యగారి ఊరిలో ఉండగానే మా పరీక్షాఫలితాలు వచ్చాయి. అప్పట్లో ఇంటర్నెట్ లో చూడడం లేదు కదా.. న్యూస్ పేపర్లకు డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ కూడా లేవు. అన్నిచోట్లా అన్ని పేపర్లలోనూ రిజల్ట్స్ లాంటివి వచ్చేవి.  సరే!అలా చూసిన ఒక పేపర్లో నా నంబర్ ఉంది. అంటే పాసయ్యాను అన్నమాట. అన్నకామాట చెప్పగానే ఆనందించాడు. ఎందుకంటే నా చదువుకు అన్నయ్య ఆర్థికంగా నాన్నగారికి వెసులుబాటు కలిగించేవాడు. సరే నాన్నగారు కూడా ఉత్తరం వ్రాసారు… ‘రిజల్ట్స్ వచ్చాయి కనుక ఇంటికొచ్చేయ’ మని.’తర్వాత చదువులగురించి ఆలోచించాలి కదా’ అని.  
అన్నయ్యగారి ఊరు వచ్చిన మా మేనల్లుడుకూడా తన పని అయిపోయిందని తిరుగు ప్రయాణానికి నాతో రెడీ అయ్యాడు. అన్నయ్య గారి చిట్టివలసనుంచి రాజమండ్రి రావాలంటే వైజాగ్ వచ్చి రైలు కాని బస్సు కాని ఎక్కాలి. బస్సులు కూడా ఆ రోజుల్లో డైరెక్ట్ గా  లేవు.  వైజాగ్ టచ్ చేయకుండా డైరెక్ట్ అనకాపల్లి అలా రాజమండ్రి వెళ్లడానికి .. లారీలు అవీ  వెళ్తుంటాయని. అలా వెళ్తే డబ్బులు, టైము కలసొస్తాయని - మా మేనల్లుడికి ఎవరో చెప్పారట. ఇంకేముంది సెంటర్ లో నుంచుని, రాజమండ్రి వెళ్లే లారీకోసం ప్రయత్నం మొదలెట్టాడు,. చివరకు తుని దాకా వెళ్లేలారీ దొరికింది. లారీ అనకాపల్లి నుంచి లోడ్ తో వచ్చింది. ఇప్పుడు ఖాళీగా పోతోంది. మా మేనల్లుడు లౌక్యమంతా ఉపయోగించి వాడితో మేటర్ సెటిల్ చేసాడు. భోంచేసి మేం పన్నెండింటికి బయల్దేరితే సాయంత్రానికి తుని చేరతాము. అక్కడున్న మా పిన్నిగారింట రాత్రికి ఆగి, మర్నాడు ఉదయమే అన్నవరం వీరవేంకటసత్యనారాయణస్వామి వారి దర్శనం చేసుకుని, మధ్యాహ్నానికి ఇంటికి చేరొచ్చు. అదీ ఆలోచన. ఎలాగా దేవుని దయవలన పరీక్ష పాసు అయ్యాను కదా, స్వామికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకోవచ్చు అని … మనం అనుకున్నట్టు అన్నీ అవాలనేముంది ?
లారీ బయల్దేరింది.. మేమనుకున్నట్టు పన్నెండుకి కాదు, నెమ్మదిగా రెండింటికి హుషారుగా బయల్దేరింది. కొంచెం దూరంపోయాక, మా రూట్ మార్చి, ప్రక్కకు తిరిగి కొంచెం దూరం పోయి .. అక్కడ ఓ షాప్ ముందు, లారీలో ఉన్న లోడ్ దింపాడు. అంటే బయల్దేరేటప్పటికే ఈ లోడ్ చిట్టివలసలో లోడ్ చేశాడన్నమాట.. సరే అక్కడనుంచి ప్రక్క ఊరు .. అక్కడ మళ్లీ లోడ్ ఎక్కింది. అది పుచ్చుకుని ఇంకో చోట. ఇలా అటూ ఇటూ తిరుగుతూ లారీ ఇంకా సబ్బవరం కూడా రాకుండా మధ్యలో ఆగిపోయింది. అటూ ఇటూ తిరగడంలో ఆయిల్ అయిపోయింది. అప్పటిదాకా పడుకునిఉన్న క్లీనర్ ను లేపి ప్రక్కఊళ్లో ఆయిల్ పట్టుకురమ్మని డబ్బా, డబ్బులూ ఇచ్చి పంపి, డ్రైవర్ గారు పైకెక్కి పడుకున్నాడు. మమ్మల్ని కాబిన్ లో కునకమన్నాడు. అప్పటికి రాత్రి సుమారు తొమ్మిది దాటిందేమో. ఎలాగా అనకాపల్లి చేరిపోతామని ఏమీ తినలేదు. ఆకలి మొదలైంది. ఈ వెళ్లిన క్లీనర్ మహాశయుడు వచ్చేటప్పటికి చాలా సేపు పట్టింది. వాడు వచ్చి ఆయిల్ పోసి, వాడి గురువుగార్ని లేపకుండా తానే లారీ నడపి నెమ్మదిగా అనకాపల్లి చేర్చాడు. ఇక్కణ్ణించి బోల్డు రైళ్లుంటాయి పొమ్మన్నాడు. రాత్రి పన్నెండవుతోంది. లారీ దిగినదగ్గర్నుంచి ఒక రిక్షామాట్లాడుకుని, అందులో స్టేషనుకి చేరాము. ఆకలి చచ్చింది. దాహమేస్తోంది. స్టేషన్ లో ఏదో కుళాయి ఉంది కాని అందులోంచి, సౌండ్ తప్ప నీళ్లు రావటం లేదు. “ఒరేయ్ రాజూ, దాహమేస్తోందిరా” అంటే మా మేనల్లుడు “ఒరేయ్ . వచ్చేదారిలో ఏదో సినీమాహాల్ ఉంది, అక్కడ ఏ సోడాయో తాగి, నాకు బిస్కట్లేమైనా ఉంటే పట్రా” అని పంపాడు.
సరే అని బయల్దేరా… స్టేషన్ బయటికి వచ్చా.  వేసవి కాలం. అర్థరాత్రి. చల్లటి గాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. స్టేషన్ బయట ఓ ప్రక్క కొన్ని ఇళ్లున్నాయి. బయట మంచాల మీద ఆ అర్థరాత్రి, మగాళ్ళు ఆడాళ్లూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ముందు నేనంతగా గమనించలేదు. వాళ్లున్న మంచాల ముందర్నించి వారిని దాటి రెండడుగులు వేసా.. ఓ స్త్రీ కంఠం వినపడింది. “ఏయ్ బాబూ… ఇలా రామ్మా” అంటూ … ఎందుకో పిలుస్తోందని ఆ కంఠం వైపుకు రెండడుగులు వేసా… ఆ స్త్రీని చూడబోయా .. ఒక్కసారి గతుక్కుమన్నా… ఆ అమ్మాయి చేతిలో సిగరెట్ కాలుతూ కనపడింది. పైగా అక్కడ మగాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో! ఏదో తేడాగా ఉంది వ్యవహారం -ఎలాగరా భగవంతుడా ! క్రొత్త చోటు.. అప్పటికి నా వయస్సు 16ఏళ్లు. ఆ సంవత్సరమే నాకు ఒడుగు చేసారు. ఒడుగులో నన్ను దీవించి వీళ్లూ వాళ్లూ పెట్టిన ఉంగరాలు చేతికున్నాయి. ఉంగరాలకున్న రాళ్లు  బాగా మెరుస్తున్నాయి. బొటనవ్రేళ్లతో మెరుస్తున్న రాళ్లను పైకి కనిపించకుండా  చేతి లోపలకి  జరిపేసా. తెలివితేటలెక్కువగా మరి. ఈ లోగా ఆ అమ్మాయి మళ్లీ పిలిచింది. “దామ్మా ఇలా దగ్గరకి రా, ఇలా కూర్చో” అంటూ… నా ప్రాణాలు పైకి పోవడానికి దారి వెతుక్కుంటున్నాయి అనిపిస్తోంది. వెనక్కి స్టేషన్ కు పోవాలంటే వీళ్ళని దాటి వెళ్లాలి. అందుకని.. ఇప్పుడే వస్తా .. అంటూ రెండోవైపు పరుగో నడకో తెలియని అయోమయంతో సాగిపోయాను. వెనకాలనుంచి .. ఆడ,మగ నవ్వులు కోరస్ గా వినపడుతున్నాయి.. కొంపదీసి వచ్చేస్తున్నారేమో పట్టుకుపోతారేమొనన్నభయంతో  సినీమా హాల్ దగ్గరకి చేరాను. సోడాకొట్టుదగ్గరకొచ్చాక ఊపిరి పీల్చుకున్నాను. ఓ సోడా తాగా… ఏదో బిస్కట్ ప్యాకెట్ కొన్నా.. డబ్బులిస్తూ ఆ సోడా అబ్బినడిగా.. “స్టేషన్ కు పోవాలంటే ఇంకో దారేమన్నా ఉందా..”అని. “మీరు వచ్చిన దారినే  వెళ్లిపోండి, ఇదేదగ్గర” అన్నాడతడు. “అలా అని కాదు, అక్కడెవరో అమ్మాయి, సిగరెట్ త్రాగుతూ నన్ను పిలుస్తోంది, భయమేస్తోంది” అన్నా భయం భయం గా.. ఆ సోడా కొట్టువాడు, సోడా కొట్టినట్టు గట్టిగా నవ్వాడు, నవ్వి.. “ఏయ్ పంతులు, ఇంకోదారి ఉంది.. అలా వెళ్తే … చెయ్యట్టుకు లోపలకి లాగేసి తలుపేసేస్తారు.. వెళ్తావా ?” అన్నాడు... “అమ్మో తలుపేసేస్తే ఇంకేమన్నా ఉందా?” అని జరగనిదేదో  జరిగినట్లు ఊహించేసి.. సోడావాడికేసి చూసి, ఓ వెర్రినవ్వు నవ్వి… వచ్చినదారినే వెనక్కి మళ్లి … “దేవుడా … దేవుడా ..” అనుకుంటూ స్టేషన్ వైపుకి నడిచా… ఈసారి ఎవరూ పిలవలేదుకాని… “రా రో యి మాఇంటికి” లాంటి ఆడపాటలు.. కవ్విస్తున్న మగనవ్వులు - ఈ నేపథ్యంలో స్టేషన్ లో పడ్డా .. నాకన్నా పెద్దవాడయిన మేనల్లుణ్ణి పట్టుకుని భోరుమందామని.. నిద్రలోంచే వాడు “ఏమిటిరా ఇంతసేపు జేసావు?” అంటూ అటు తిరిగి పడుకున్నాడు.. నాగోడువినకుండా….

Wednesday, June 3, 2015

హరాజీకా - 10 జీవిత వైఫల్యపురస్కారము

హరాజీకా - 10

జీవిత వైఫల్యపురస్కారము

అయ్యొయ్యో .. మీరు పొరపాటు పడలేదండీ ! హెడ్డింగ్ సరిగానే చదివారు. విషయమేమిటంటే….

రాజమండ్రిలో ప్రస్తుతం నాగదేవి టాకీసుగా ఉన్న సినీమా హాల్ ఒకప్పుడు రామా టాకీస్ గా పిలవబడేది. దాని ఎదురుగా ఉన్న ‘Y’ jn.లాంటి రోడ్ పాయింట్ దగ్గరనుంచి, ఎదురుగా గౌతమి లైబ్రరీ వైపుకాక, కుడి వైపు యాంగిల్ లో ఉన్నవీధిలోకి వెళ్లితే  -  అక్కడ ఎడమ చేతి వైపు కనబడే  ఎత్తైన మేడింట్లో మేం కొన్నాళ్ళున్నాము. అప్పటికి నాకు అయిదేళ్లుంటాయేమో ? అక్కడుండగానే ఒకసారి నన్నూ, ఒక ఏడాది చిన్నదైన మా మేనకోడల్ని పూలూ, జాంపళ్లూ ఇస్తానని చెప్పి ఓ  దొంగాడు పట్టుకుపోయాడు. త్రిప్పి త్రిప్పి, మా మేనకోడలి చెవులకున్న బంగారు రింగులు - చాక చక్యంగా లాగి, మమ్మల్నిద్దర్నీ సాయంత్రానికి కోటగుమ్మం దగ్గర వదిలేసి, జనంలో కలసిపోయాడు.. ఎలాగో ఇంటికి చేరాము. బంగారం పోయినందుకు కాదు కాని, ఆ దొంగాడితో చేసిన నా సంవాదానికి మా వాళ్లు చాలా ముచ్చట పడేవారు. మా తాతగారొకాయన ఎప్పుడు కలసినా నాచేత ఆ కథంతా చెప్పించుకుని, నా ముద్దు పలుకులకు  (అప్పట్లో మరి చిన్నవాణ్ణి కదండీ.. ముద్దుగానే ఉంటాయిగా) అభినందించేవారు.

సీతంపేటలో మా బాబాయిగారుండేవారు. ఒకసారి మా పెద్దన్నయ్య (బాబాయిగారబ్బాయి) మా ఇంటికి వచ్చాడు. అతనితో ఆడుతూ, మా గుమ్మంలో ఉన్న ఇనప స్తంభం మీద పడ్డాను. నుదురు చిట్లింది .. చాలా రక్తం వచ్చింది. ప్రక్కవీధిలో డాక్టర్ గారనుకుంటా కుట్లు వేశారన్నారు. నా నుదుటిమీద ఆ మచ్చ నేటికీ ఓ విజయపతాకలాగా ప్రకాశిస్తూనే ఉంది. ఇంకో తమాషా ఏమిటంటే నేను ఏ స్థంభం మీద పడ్డానో, ఆ స్థంభం ఇప్పటికీ అలాగే ఉంది. కావాలనుకున్నవాళ్లు వెళ్లి చూడవచ్చు. (ఎవరు చూస్తారులెండి )

అక్కడనుంచి శ్రీరామనగర్ కు  నాన్నగారు మకాం మార్చారు. తాటాకు పాక. అయినా  ఇది స్వంతం. 1949లో మా చుట్టుప్రక్కల పది ఇళ్లకన్నా లేవు. చక్కటి గాలీ వెలుతురూ. ఆహ్లాదకరంగా ఉండేది..1400 గజాల స్థలంలో పడమర వైపు మేడ కడదామని, శంకుస్థాపన చేసారు నాన్నగారు. ఇల్లు ప్రారంభించలేదు కాని, దానికోసం తీసిన గొయ్యి. అలాగే ఉండిపోయింది. వర్షానికి నీరు చేరి సగానికి నీరు నిండింది. ఆటలాడుతూ, ఆ ఆటల మత్తులో ఆ గోతిలో నీళ్లలో  పడ్డాను.  తలకి  దెబ్బ తగలకుండానే, దెబ్బకి దిమ్మెక్కిపోయింది. జలగండం తప్పిందని, బ్రతికి బయట పడ్డానని అందరూ సర్టిఫై చేశారు.

మన ఇళ్లల్లో ఆ రోజుల్లో - వచ్చిన ఉత్తరాలు పదిలపరచుకోడానికి, ఒక తీగ ఉండేది. దానికి అడుగున ఒక ఫ్లాట్ చెక్క ఉండేది. దానివల్ల ఉత్తరాలు క్రిందకు జారిపోవన్నమాట. తీగ మొదట్లో మొన దేరి ఉండేది, ఉత్తరాలు సులువుగా గుచ్చుకోడానికి. ఓ రోజు ఉత్తరం గుచ్చే సంబరంలో .. ఉత్తరం గుచ్చుతుంటే ఆ తీగ చూపుడువేలిలో గుచ్చుకుపోయింది. నా లేత చేతి వేలులో అట్నుంచి ఇటు వచ్చేసింది. రక్తం కారింది. మా ఇంటి దగ్గరనుంచి ఆర్యాపురం అంటే సుమారు రెండు కిలోమీటర్లు వస్తే కాని, హాస్పిటల్ లేదు. సీతంపేటలో డాక్టర్ గారి ఇల్లు వుంది, కాని ఆ టైములో డాక్టర్ గారు హాస్పిటల్ లోనే ఉంటారు. మా చుట్టాలబ్బాయి నన్ను భుజానికెత్తుకుని (అప్పుడు బరువు తక్కువవాణ్ణికదా) ఆర్యాపురం పరుగెత్తాడు. [అప్పటికి సైకిల్ రిక్షాలు లేవు, లాగుడు రిక్షాలే .. అవీ మా మారుమూల పేటల్లోకి తరచు రావు.. గమనించగలరు.]
దాక్టర్ గారు ముందు సైకిల్ షాపుకి పంపారు, తీగలో అటూ ఇటూ ఉన్న ముక్కలు కటింగ్ ప్లేయర్ తో కట్ చేసాక, ఆయన చిన్న సైజ్ ఆపరేషన్ తో తీగ సాంతం లాగేసి, కట్టు కట్టారు. “తీగకు ఉత్తరం గుచ్చరా అంటే తీగనే గుచ్చుకున్నావు, ఘటికుడివిరా” అని ముద్దు చేసారు.. డాక్టర్ గారు. ఆయన నాన్నగారి స్నేహితులు కూడా..

హై స్కూల్ చదువు మొదలైంది. మా క్లాస్ మేట్ కు ఆ రోజుల్లోనే  పెళ్లి నిశ్చయించారు.  పెళ్లి ధవళేశ్వరంలో. సైకిళ్ల మీద వెళ్దామని నిర్ణయించాము. అంత దూరం సైకిల్ మీద వెళ్ళడం ఓ థ్రిల్. మిత్రులము నలుగురైదుగురం అద్దె సైకిళ్ళ మీద బయల్దేరాం. దారిలో మరో మిత్రుడ్ని పికప్ చేసుకుని  నా సైకిల్ పై ఎక్కించుకోవాలి. అతనికోసం ఆగాలి కదా, .. సైకిల్ బ్రేక్ వేసాను, అంత దూరం సైకిల్ ప్రయాణం అని ఆనందంలో దిగేటప్పుడు, ఒక చేతితో హేండిల్ బార్ పట్టుకొని, మరో చేత్తో సీటు పట్టుకున్నాను. అదో ఫీట్ .. ఎవరో చేస్తుంటే చూసాను. అప్పటికే సీటు కవరికీ - సైకిల్ కీ బంధం తెగిపోయిందిలా ఉంది, సీట్ చేతిలోకి వచ్చేసింది, సైకిల్ బాలన్స్ కాలేదు.. నేలమీద పల్టీలు కొట్టాను. బుర్ర చితికింది.. రక్తం .. రక్తం… నలుగురూ లేవదీసారు. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారో మరేం చేసారో తెలియదు. కట్టు కట్టబడింది.  ఇంటికెళ్తే, ఇంకేమన్నా ఉందా, పెళ్ళికెళ్ళ లేదేమని మొదలెట్టి, విషయం గ్రహిస్తారు అమ్మా  నాన్నగారూ. అందుకని రాత్రి పెళ్లైయ్యాక వస్తే - వచ్చేటప్పటికైతే, నిద్రలో ఉంటారు కనుక ఫరవా ఉండదని, పెళ్లికెలాగో ఓలాగ వెళ్లడమే మంచిదని నిర్ణయించి, పెళ్లికెళ్లాను. నాకు  మిత్రుల సపోర్ట్ కూడా ఉందికదా. తమాషా ఏమిటంటే ఆ పెళ్లికి వచ్చిన వారిలో  నా లాంటి క్షత గాత్రులు ఇంకా ఒకరిద్దరున్నారు అని తెలిసింది. ముహూర్త బలం .. అని వెటకరించడం సరికాదు, ఎందుకంటే  .. ఆ మిత్రుడు ఆరోగ్యంగ, చాలా కాలం కాపురం చేసి,  ఎమ్.ఆర్వో గా రిటైర్ అయి ఈ మధ్యనే పోయాడు. భార్య కొద్ది కాలం ముందు ముత్తైదువగా కాలం చేసింది. నిజానికి నేను ఎంత బాగా  సైకిల్  త్రొక్కగలిగినవాణ్ణయినా, అప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యాను.

43ఏళ్లకు, కంటికి సైట్ .. అప్పటిదాకా ఉన్న చూపు తగ్గి, అద్దాల అవసరం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం. ఇంకో నాలుగైదేళ్లకు బి.పి వచ్చింది. ఆ రెండూ రివార్డ్సే .. కాని బ్యాంక్ వారు పాతికేళ్ళు .. బాగా పనిచేసావని, [చేసానో లేదో తెలియదు కాని], ఓ వేయిరూపాయలు ఇచ్చి,  ఏమన్నా కొనుక్కోమన్నారు... అదే నా చేతినున్న ‘ఆల్విన్’ రిస్ట్ వాచ్. వాచీల కొట్టువాడు
రు.1100 చెప్తే .. బ్యాంక్ వాళ్లు ఇంతే ఇచ్చారని, మిగతా వందరూపాయలకు ఏవో జోకులు చెప్పి తెచ్చుకున్నాను. నా పనికి మెచ్చి ఇచ్చామని బ్యాంక్ చెప్పినా ..  ఆవాచీచూసినప్పుడు  నాకు - కంటికి వచ్చిన అద్దాలు, వంటికి వేసుకునే బి.పి మాత్రలు …ఆ టిక్ టిక్ సౌండ్ లో క(వి)నపడ్తాయి.

షుగర్ షురూ అయిందని ఆ మధ్యనే వైద్యులు శలవిచ్చారు. వాకింగ్ చేయమంటూ సలహా ఇచ్చారు. ఎలాగా పింక్ కార్డ్ వాళ్లం కనుక షుగర్ కొంటే ఖరీదే. కనుక షుగర్ కొనడం తగ్గించొచ్చు. అలాగ్గానే బంతి భోజనాలలో వడ్డించేవాడు తినేవాడికన్నా ఎక్కువ మొహమాట పడి ఎలాగూ  స్వీట్ వెయ్యడు. అంచేత ఆ బాధా లేదు.  షుగర్ వాళ్ళ ఏదో బాధ ఉందనుకోలేదు - కాని, మీకు సుగరొచ్చింది ..మీరు  షుగర్ తినకండీ అని ఇంటా బయటా అంటూంటే,  అదిగో సరిగ్గా అప్పుడేచాలా బాధ కలిగేది. పైగా  స్వీట్ మీద మోజు పెరుగుతుంది కూడా . దాంతో తినాలనే కుతి పెరుగుతుంది. కాని అర్థాంగి .. స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టేసింది. ఆవిడ పతిభక్తి అలాంటిది. ప్రొద్దున్నే విదౌట్ సుప్రభాతం సాంగ్, వాకింగ్ కి వెళ్లండంటూ లేవగొట్టేస్తుంది.  చీకటి ఉండగానే వాకింగ్ మొదలు పెట్టి, సూర్యోదయం అయేటప్పటికి వాకింగ్ పూర్తి చేసి ఇంటికొచ్చేస్తూ వచ్చాను. వచ్చాక సంధ్యావందనం, పూజాదులు. ముసలితనం వచ్చాక కదా మురహరి గుర్తుకొచ్చేది. కొన్ని రోజులు బాగానే ఉంది. శీతాకాలం వచ్చింది. స్వెటర్, మంకీ కేప్, చేతిలో టార్చిలైట్ .. బందోబస్తుగానే బయల్దేరి, జనం తక్కువగా ఉన్న రోడ్ లోంచి ప్రశాంతంగా నడచుకుంటూ అరగంట నడిచి కాలేజ్ గ్రౌండ్స్ కు చేరా .. కొంచెం ముందుకెళ్ళి సెంట్రల్ జైలు వైపు తిరిగి వెనక్కి వస్తానన్నమాట .. అప్పటికి 1గంట నడచిన పుణ్యం దక్కుతుంది. సకాలంలో ఇంటికొచ్చి సంధ్యావందనం చేస్తే ఉత్తమ గతులు కలిగే పుణ్యం కూడా వస్తుంది.. అన్నమాట. కాలేజ్ ఆర్ట్స్ బ్లాక్ ముందరనుంచి వెళ్తూ, ఆ కాలేజ్ లో చదివిన రోజులు తలచుకుంటూ, నడుస్తున్నాను .. నా ఆలోచనల్లో నేనుండి చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసుకోవడం మరచిపోయాను… అసలే చీకటి… పైగా వయస్సు.. కాళ్లకు కళ్లుండవుగా, అందుకని వాటికి కనపడదు. … ఆలోచనలకు బ్రేక్ పడింది, .. స్పీడ్ బ్రేకర్ .. కాళ్లకు తగిలి, వయసు బాలన్స్ చేయక పోడం వలన, ఆ చీకట్లో బోర్లా పడ్డాను. ముక్కు క్రింద - పై పెదవి చితికింది. నడిచిన ఉత్సాహం ఆ రోజు టార్గెట్ పూర్తి  చేయడానికి ఉత్సాహ పడుతోంది .. వయసు లేవ నీయటం లేదు. చేతికి వేడి రక్తం తగిలింది-(ఈ వయసులో ఉడుకు రక్త మేమిటి, చోద్యం కాకపోతే అనకండి. , నడచి నడచి ఉన్నానుగా అప్పటికే, అందుకని వేడెక్కింది). నెమ్మదిగా లేచా .. ముక్కులోంచి బొటబొటా నెత్తురు చుక్కలు పడుతున్నాయి … సరే - వదిలేయండి … ఆ దెబ్బ రెండు మూడు నెలలు బాధ పెట్టింది. ఇప్పటికీ అక్కడ ఏ కుట్లు వేయకపోయినా, ఆ రోజునుంచి మానేసిన వాకింగ్ వ్యాయామానికిగుర్తుగా… కుట్లు వేసినట్టే మచ్చ వుంది.

ఈ మధ్య లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ దగ్గర నొప్పి .. హిందీ సినీమాలో ఫైట్ చేయని విలన్ కె.యన్.సింగ్ ఉండేవాడు.. అతని  లాగా దాని మీద నాజూకుగా రాస్తుంటే సెమనగానే ఉంటోంది.. కాని నా కుడి చెయ్యి నాకు  తెలియకుండా ఆ నొప్పిని పట్టుకోడానికి, అలా భుజంమీదకు ప్రాకుతూ పోతోంది. . ఆ తర్వాత మెడక్రింద నొప్పి. రాత్రిళ్ళు నొప్పితో మెలకువ వచ్చేస్తుంది. భయంకరమైన ఆలోచనలు. ఎవర్నైనా లేపాలా వద్దా.. లేపితే అందరూ నిద్రలో ఉంటారు లేస్తారా.. లేవకపోతే.. అమ్మో, ఇంతకీ ఈ నొప్పి భుజానిదా కొంపదీసి గుండెదా.. ఓరి దేవుడోయ్ .. రామా రామా, అంటూ రామనామం బలవంతంగా చేసుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాను. లేచాక డాక్టర్ గారి దగ్గరకి పరుగెత్తా…x-రే తీసారు.. వెన్ను పొజిషన్ బాలేదు. అర్జంట్ గా కాలర్ వేయాలన్నారు .. వెయ్యకపోతే - ఇంతే సంగతులన్నారు.. మళ్లీ భయం.. మెడికల్ షాప్ కు వెళ్లాను. కంఠాభరణం తగిలించాను. అక్కడ కూర్చున్న ఓ ఆగంతకుడు .. కాలర్ అనుభవం ఉందిలా ఉంది.. నువ్వు పెట్టుకున్న పొజిషన్ తప్పు అని నా కాలరు సర్ది, సరిగా పెట్టాడు.. మొత్తానికి కాలర్-- కొత్త రివార్డ్ వచ్చింది. కాలర్ ఎత్తుకు తిరిగే నేను, ఈ కాలర్ తో తల దించుకోవలసి వచ్చింది. ఇప్పుడు వెనకాల ఉన్నవారిని చూడాలంటే మెడ త్రిప్పితే సరిపోదు.. ఈ హ. రావు మొత్తంగా  తిరగాలి తోకమీద వాలిన ఈగను పట్టుకోడానికి తిరిగే శునకం లాగా..  

జీవితంలో ఏదైనా సాధిస్తే నిజంగా అంత గొప్పవాళ్ళం మనమైనప్పుడు .. జీవిత  సాఫల్య పురస్కారం [LIFE TIME ACHIEVEMENT AWARD] ఇస్తారు. కాని మనం, అంటే నేను అంత కాదు కదా,  కొంచెం కూడా గొప్పవాణ్ణి కాదుగా? నాకు నేనే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఇవన్నీ ఎవర్డ్సే .. పురస్కారాలే .. ఎటొచ్చీ ఇవి జీవితంలో గొప్పవి సాధించినప్పుడు వచ్చినవి కావు.. అల్లరికి, అలవాటుకీ, అసమర్థతకు వచ్చినవి అందుకనే హోల్ సేల్ గా ఇవి జీవితవైఫల్యపురస్కారాలని  ముద్దుగా - నే - పెట్టుకున్న పేరు.