Pages

Friday, July 3, 2015

పుష్కరాలు… వచ్చాయి, వస్తున్నాయి…


రాజమండ్రి - 7

గోదావరి హారతి.

                                                                        రచన డి.వి.హనుమంతరావు. 


పెళ్లివారొచ్చేటప్పటికి తొమ్మిది దాటుతుందని వార్త వచ్చింది. ఆడపెళ్లివారిలో ఉన్న ఓ పెద్దాయన కన్యాదాతను పిలిచి 
“ఒరేయ్ నాన్నా! వాళ్లొచ్చేదాకా మనవారందర్నీ టిఫిన్స్ లేకుండా ఉంచేయకు. షుగర్ వాళ్లూ, బి.పి లవాళ్లూ ఉంటారు కదా. వీళ్లకు ఆ టిఫిన్స్ కాస్తా పెట్టేస్తే షుగర్ మాత్రలవాళ్లు ఆమాత్రలూ, బి.పి.ల వాళ్లు వాళ్ల మాత్రలు మింగుతారు. అంచేత మనవాళ్ళకి పెట్టించేయ్!” అన్నాడు.
“అలాక్కాదు బాబాయ్, మనం తినేస్తే బాగోదేమో, అదీకాక, మగపెళ్లివారి తాలూకు వారు కొందరు వేరే ఊళ్లనించి వచ్చి విడిదిలో ఉన్నారు, వాళ్లకి తెలిస్తే బాగోదు…”
“మరి చెప్పవేం.. వాళ్లనీ వచ్చేయమను, మీ వాళ్లలో పెద్దలూ పిల్లలూ ఉండలేరేమో అని పెట్టించేసాం, అని చెప్పొచ్చు”
అన్నాడు పెద్దాయన.
“మరి బాబాయ్.. “ .. 
“ఒరేయ్ అలా నసక్కు, వీళ్లందరూ టిఫిన్ తినేసి వాళ్లు  బస్సు దిగేటప్పటికి
నీరస ముఖాలు లేకుండా … స రస ముఖాలు వేసుకుని కళ కళ లాడుతూ నించుంటే ఎంత బాగుంటుందిరా….” అని ఉత్సాహ పరచారు బాబాయి గారు..


ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే …
ఒక సిద్ధాంతం ప్రకారం గోదావరికి పుష్కరాలొచ్చేసాయి. మరో లెక్కప్రకారం 14 జులై నుంచి ప్రారంభమవుతాయని అంటున్నారు.
ఆ నాటికి  చాలా మంది వచ్చేవారున్నారని అంచనాలున్నాయి. అలాంటప్పుడు మా రాజమండ్రీ జనాభాకూడా మీతో పాటు స్నానాలకి వస్తే రష్షూ పెరుగుతుంది, అటూ ఇటూ తిరుగుతూ మిమ్మల్నీ సరిగా రిసీవ్ చేసుకోలేం. అందుకని మాకిక్కడ ఓ పెద్దాయన చెప్పారు కనుక, అదీకాక  చాలా రేవులు ఖాళీగా ఉన్నాయి కనుక చాలామంది స్నానాలు చేసేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లు ఎలా వున్నాయో ముందే చూడ్డం మంచిది కనుక,  మీరొచ్చాక మీతో పాటు మునగ కలిగితే మరో మునక వేస్తాము. లేదా ఇదే పుష్కర స్నానంగా ఆ పైవాడు జమేసు కుంటాడు. అన్నది ఒక భావన. చెప్పినవారు దైవజ్ఞులు, బ్రహ్మవేత్తలు ..కనుక ఇదే పుష్కర ప్రారంభం అని ఇంకో భావన. . అప్పుడూ, ఇప్పుడూ అయితే మరీ లాభం. అధికస్య అధికం ఫలం అని మరో భావన.
ఈ భావనాత్రయానికి మా శ్రీమతి భావన తోడై నేను ఈ రోజు పుష్కర ఘాట్ కు బయల్దేరాను. అధికం కాకపోతే ఈ పున్నమి గురు పూర్ణిమ .. గురువారం .. ఇంకేం …
అక్కడ పరిచయమున్న పురోహితులు కలసి శాస్త్రీయంగా మా దంపతులచేత సంకల్పం చెప్పించి, స్నానం చేయించారు.. విశాలమైన గోదావరి నది పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంటే మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ఈ గోదావరీ తీరంలో ఉన్నందుకు.. గర్వం, ఆనందం కలిగాయి. అఖండ గౌతమి, రాజమండ్రి వాసుల ఆస్తి. ఈ నీటిసిరి మనందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ.




నిన్నటి రోజు నుండి గోదావరికి నిత్య హారతంటూ ప్రియతమ ముఖ్య మంత్రిగారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుష్కర ఘాట్ రేవులో పరిచయమైన వారు కలిస్తే  “మొత్తానికి గోదావరికి నిత్య హారతి జరగబోతోంది .. చాలా సంతోషంగా ఉంద”న్నాను. వారు వెంటనే స్పందించి.. “ఇది మీరు నాటిన బీజం” అన్నారొకరు, “మహావృక్షమయిం”దన్నారు మరొకరు. “మన కందనంత ఎత్తుకు ఎదిగిం”దన్నాను నేను. వారే కాదు నిన్న హారతి చూచివచ్చిన మిత్రులు, “మీరే గుర్తొచ్చారు.. మీరు మొదలెట్టిందే కదా” అన్నారు, ఎవరో ఫోన్ చేసి అదే అభిప్రాయం వెలిబుచ్చారు. అంటే నేనే మొదలెట్టానని కాదు, మొదలెట్టినవాళ్లలో నేనూ ఒకణ్ణి అని ….  

నేపధ్యంలో కొక్కసారి రండి .. గత పుష్కరాలలో గోదావరి హారతి ప్రభుత్వం ప్రారంభించింది. అయితే అది కేవలం ఒక మొక్కుబడిగా జరిగేది. కనీసం జరుగుతున్నదన్న బోర్డు కూడా ఎప్పుడూ కనబడ లేదు. నేను అక్కడున్న ఉద్యోగులతో ప్రస్తావించాను. కాని వారు మాత్రం ఏం చేయగలరు. తర్వాత  ఒక సేవా సంస్థతో నాకు అనుబంధం ఏర్పడింది. .. నేను దాని కార్య నిర్వాహక వర్గంలో ఉన్నప్పుడు మేమంతా ఆలోచించి ప్రతి పున్నమికి గోదావరికి హారతి పుష్కరఘాట్ లో ఈయడానికి సంకల్పించాము. 2005 మే పున్నమినాడు అద్భుతంగా ప్రారంభించాము. దానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చక్కటి హారతి పాటను అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చారు. దానితో హారతిచ్చేవాళ్లం. . హారతికి ముందు మహిళామణులు లలితాసహస్రనామ  పారాయణ, గంగహారతి పాటలు కూడా పాడేవారు. లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులు గోదావరి ప్రాశస్త్యము పై చక్కటి ప్రసంగాలు చేసేవారు. వారి ప్రసంగంలో గోదావరి ప్రాముఖ్యతను తెలుపడమే కాకుండా, పవిత్ర నదిపట్ల మనం పాటించవలసిన ధర్మాలను చెప్పేవారు. ఇదేకాకుండా ప్రాతఃకాలంలో మేము కొంతమంది, మహిళామణులతో సహా వెళ్లి రేవు శుభ్రపరచడమే కాకుండా, పరిశుద్ధంగా రేవును ఉంచాలని యాత్రీకులకు అవగాహన కల్పిస్తూ, మైకులో చెప్పెవాళ్లం. అయిదారేళ్ళు ఆ విధంగా ప్రతి పున్నమికి, ఏ రోజూ మానకుండా గోదావరికి హారతి యీయడం ఒక హంబుల్ వే లో జరిగింది. చాలామంది ఈకార్యక్రమంలో పాల్గొని హర్షం ప్రకటించేవారు. ఆ తర్వాత బుద్ధవరపు వారు వచ్చి గోదావరికి హారతి  భారీ స్థాయిలో ప్రారంభించారు. అప్పుడు మేము గౌతమ్ ఘాట్ కు మారాము. అక్కడకూడా చాలాకాలం హారతి కార్యక్రమం జరిగింది. తర్వాత కొనసాగించలేకపోయాము. అయితే అప్పణ్ణించి చాలా సంస్థలు ఆయా సందర్భాలలో గోదావరి హారతి తమ కార్యక్రమములలో కలపి నిర్వహించేవారు.. ఎవరు చేసినా … ఎలా చేసినా… రాజమండ్రి ఉనికికి, మనికికి కారణమైన గోదావరి మాతకు కృతజ్ఞత చూపడం మన కర్తవ్యం. అదే  జరుగుతోంది. ఆనంద దాయకం కదా?


1 comment:

Anonymous said...

"గోదావరి మాతకు కృతజ్ఞత చూపడం మన కర్తవ్యం. అదే జరుగుతోంది. ఆనంద దాయకం కదా?
Yes we are all indebted to " Mother Godavari " for what we are to day.