ప్రసాదరావు మీకు తెలుసుకదా? అదే మన బామ్మగారి మనుమడండీ! అంటే సత్య సూర్య వేంకట మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాదరావు. మొన్న దసరాకు హైదరాబాదు వచ్చి పరుగెత్తే సిటీ బస్సులోంచి దిగేటప్పుడు కుడికాలు ముందు పెట్టకూడదన్న నీతి నేర్చుకుని వాళ్ళ ఊరువెళ్ళాడు..అప్పుడు ప్రసాదరావు కాలుకి పాపం దెబ్బ తగిలిందని బామ్మగారు చాలా యిదయ్యరు. బస్సులవాళ్ళనీ అందులో ఎక్కేవాళ్ళనీ, అందులోంచి దిగేవాళ్ళనీ అందర్నీ దుయ్యబట్తూ ఓ లెక్చరు ఇచ్చారు. ప్రమాద స్థలానికి స్వయంగా వెళ్ళి పరిస్థితి తెలుసుకోవాలని చాలా వుబలాట పడ్డారు. రెండు మూడుసార్లు ప్రసాదరావుని బామ్మగారు "ఒరేయ్ అబ్బీ ! ఓ సారి హైదరాబాదు తీసుకువెళ్ళరా.. చూడాలనివుంది." అని అడిగారు.. "మీ తాతగారు బాగున్నప్పుడు రోజూ--"అమ్మీ ! హైదరాబాదు రావోయ్ ! తీసుకువెళ్తా అనేవార్రా." అని బాధపడ్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ-- "ఆమహారాజు కోరిక ఆయన బ్రదికుండగ తీర్చలేకపోయాను" అని బామ్మగారు ముక్కు చీదుకున్నారు. బామ్మగారికళ్ళల్లో నీరుకారితే ప్రసాదరావు నీరుకారిపోతాడు...తన కాలుకేసి చూసినప్పుడల్లా హైదరాబాదు గుర్తొస్తుంది ప్రసాదరావుకి..కాని బామ్మగారి మీద ఉన్న ప్రేమ అనండి, తెలియని తాతగారి మీద వున్న గౌరవమనండి.. మొత్తానికి ప్రసాదరావు మళ్ళీ హైదరాబాదు ప్రయాణమయ్యాడు..... ఓ రోజు ఉదయమే గోదావరీ ఎక్స్ ప్రెస్సులో భాగ్యనగరాన దిగారు బామ్మగారు తన మనుమడితో సహా... "ఏరా ? మీ మామయ్యగాడు స్టేషనుకు రాలేదేం..వెధవ్వేషం వీడూను ?" ఝమాయించి మరీ అడిగారు.. "ఏమోనే బామ్మా! ఉత్తరం కూడా రాసాను మరి."అన్నాడు ప్రసాదరావు.. రాస్తే చాలదు పోస్టు చెయ్యాలన్న సంగతి బామ్మగార్కి తెలియదో, తెలిసే అడగలేదో ..ప్రసాదరావు మాత్రం చెప్పలేదు. అసలు విషయమేమిటంటే స్టేషనుకు రమ్మని మామయ్యకు రాస్తే తాను చులకనై పోతానేమోనని, మరదలు
సరోజ తన్ని ఆట పట్టిస్తుందని....... బామ్మగారు చెప్పినట్టు ఉత్తరం రాసినా ప్రసాదరావు పోస్టు చెయ్యలేదు. సరే...స్టేషనివతలికి వచ్చి రిక్షా అడిగాడు ప్రసాదరావు...
"కితనే సవారి ?" అడిగాడు రిక్షావాలా
"దో" ఆమాత్రం చెప్పగలిగాడంటే క్రితంసారి వచ్చినప్పుడు మామయ్యగారబ్బాయి సారథి ఇచ్చిన
ట్రైనింగు.. "నీ అమాయకత్వం కూలా..నువ్వు చెప్తావేం..ఒక్కరూపాయి
కన్నా యెక్కువ ఇవ్వక్కర్లా.. రెండంటావేమిటి.."అంటోంది బామ్మ తనకొచ్చిన హిందీ అంకెల్ని గుర్తు చేసుకుని... అది విననట్టుగా "డేఢ్" అన్నాడు రిక్షావాలా... అదిగో ! అక్కడే కన్ ఫ్యూజ్ అయిపోతాడు ప్రసాదరావు... "డేఢ్" అంటే రూపాయిన్నరా "ఢాయీ"అంటే రూపాయిన్నరా అని. ఈలోగా "ఒరేయ్ అబ్బాయి! రూపాయిన్నరకన్న యెక్కువపెట్టకురోయ్.. అంతకన్న దూరంలేదు. ఇక్కడకి దగ్గరే సత్తిపండు ఇల్లు.." అంటూ బామ్మ గొడవ. సత్తిబాబంటే ప్రసాదరావు మేనమామ... "అబ్బా..నువ్వుండవే బామ్మా..నన్ను కన్ ఫ్యూజ్ చేయకు" అంటూ రిక్షావాలాకేసి తిరిగి.. "ఢాయీ" "ఢాయీ" అని రెండుసార్లన్నాడు ప్రసాదరావు..రిక్షావాలా ఒకే ఒక్క నిమిషం వీళ్ళకేసి ఎగాదిగా చూసాడు...తర్వాత "బైఠో!" అన్నాడు "బైఠియే" అనలేదేమా అని కొంచెం బాధపడ్డాడు ప్రసాదరావు. మామయ్యగారింటికి తేలిగ్గానే చేరుకున్నారు బామ్మగారూ, ప్రసాదరావు. కాని డబ్బులిచ్చేటప్పుడు మాత్రం..."నాకు రావల్సింది..రెండున్నర" అంటాడు రిక్షావాలా... "నే బేరమాడింది రూపాయిన్నరకు" అంటాడు ప్రసాదరావు... అప్పటికీ ఓ స్టేజీలో కొంచెం మెత్తబడ్డాడు ప్రసాదరావు..కాని బామ్మగారు రంగప్రవేశం చేసి మళ్ళీ కథ మొదటికి తెచ్చారు.. కాని హైదరాబాదు రిక్షావాలా ఒప్పుకోలేదు..ఈలోగా మామయ్యవాళ్ళూ బయటికివచ్చి పరిస్థితిని చక్కబరచి లోపలికి తీసుకువెళ్ళారు మనవాళ్ళని.. ఎవరూ చూడకుండా ప్రసాదరావు తన చిన్ని నోట్ బుక్కులో రాసుకున్నాడు... "ఢాయీ అంటే రెండున్నర, డేఢ్ అంటే రూపాయిన్నర"అని ముందు జాగ్రత్తకోసం జేబులో పెట్టుకుంటూ... ************ మర్నాటినుంచి బామ్మగారిని తీసుకుని ప్రసాదరావు జంటనగరాలు చూడ్డం మొదలెట్టాడు..టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చూసారు.. ఈమధ్యనే దీనికి వినాయకసాగర్ అని పేరెట్టారని సారధి చెప్పగానే వచ్చే శివరాత్రికి అందులో స్నానం చెయ్యొచ్చని ఆ రోజే తీర్మానించుకున్నారు బామ్మాగారు. ప్రక్కనే బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్సు చూసారు..ఆకాశవాణి, అసెంబ్లీ హాలు బయట్నించే .."అవిగో" అని చూపించాడు సారథి... సుల్తాను బజారులో భూచరంలా కదులుతున్నతడిని చూసి కొంచెం కంగారు పడ్డారు బామ్మగారు..బిచ్చగాడైతే మాత్రం వాడిలో విష్ణ్వాంశ కనపడింది..అంతమంది జనం అటూ యిటూ తిరుగుతున్నా.. తోపుడుబళ్ళు తోసుకుంటూ అమ్మేవాళ్ళు కేకలువేస్తూ హోరెత్తిస్తున్నా, చిరునవ్వు చెదరకుండా ఓ చేయి తలక్రింద పెట్టుకుని ఓచేత్తో బిచ్చమెత్తుకుంటున్న అతగాడిని చూస్తూవుంటే... క్షీరసాగర మధ్యస్తుడై వేయితలలతోనూ ఆదిశేషుడు బుసలు కొడ్తూ హోరెత్తిస్తున్నా, చెరగని చిరునవ్వుతో ఓ చేయి తలక్రిందపెట్టుకుని... ఓ చేత్తో అభయహస్తం అందిస్తున్న శ్రీ మన్నారాయణమూర్తి గుర్తొచ్చాడు బామ్మగారికి.. అవును మరి ! వామనావతారంలో బిచ్చమెత్తింది శ్రీ మహావిష్ణువేకదా!" అనుకుని బామ్మగారు మనస్సులోనే అంజలి ఘటించారు ఆ నారాయణ స్వరూపానికి. ఆ ప్రక్కనే వున్నకూరల అంగళ్ళు చూసేటప్పటికి బామ్మగార్కి కడుపునిండిపోయింది. ధరవరలు తెలుసుకుని అవన్నీ కిలో రేట్లనుకుని చవకనుకున్నారు కాని తర్వాత తెలిసింది అవన్నీ పావుకిలో రేట్లని.. *********** ఆ మర్నాడు వీళ్ళతో ఊరు చూడ్డానికి సారథి రాలేక పోయాడు.. బామ్మగార్కి ఓ వేలో రెండువేళ్ళో విడిచిన మేనత్త కొడుకున్నాడంటే ఆ అడ్రస్ నీ, బామ్మగార్నితీసుకుని బయల్దేరాడు ప్రసాదరావు. ఏ ఏ బస్సులు ఎక్కాలో, ఎక్కడ దిగాలో అన్నీ వివరంగా ముందే తెలుసు కున్నాడు ప్రసాదరావు. ఓ బస్సు వీళ్ళు యెక్కవలసింది వచ్చి ఆగింది.."బామ్మా! అట్నించి నువ్వెక్కవే " అంటూనే వెనకాల గుమ్మందగ్గరకి పరుగెత్తాడు ప్రసాదరావు. బస్సెక్కేద్దామనుకుంటున్నాడు--ఈలోగా "ఒరేయ్ అబ్బీ! అంత రష్ లోకి యెక్కకురా..మళ్ళీ ఇదివరకులాగ పడిపోతావు." అంటూ చెయ్యి పట్టుకుని లాగేసారు బామ్మగారు. "అదేమిటే బామ్మా? నిన్ను అటెక్కమంటే ఇటొచ్చావు..ఆడవాళ్ళ గుమ్మం అదీ" అన్నాడు ప్రసాదరావు. "అదేంటిరా? నువ్విక్కడవుంటే నేను అక్కడెలా యెక్కుతాను " అని బామ్మగారు యిబ్బందిపడ్డారు.. అతి కష్టంమీద ఆవిడకి నచ్చచెప్పి మళ్ళీ వచ్చిన బస్సులో ఆవిడ ముందరనుంచి ఎక్కిన తర్వాత లోపలికి జొరబడ్డాడు ప్రసాదరావు..."అందర్ జావ్..అందర్ జావ్" అంటూ గుమ్మందగ్గిర కేకలతో కొంచెం లోపలికి గెంటబడ్డాడు ప్రసాదరావు... ఈలోగా కండక్టర్ చిటిక లేసుకుంటూ వచ్చి బామ్మగారి మొహం మీద ఓ చిటిక వేసాడు..."టికెట్" అంటూ.. "ఏమిటబ్బాయ్ ..ఏదో కుక్కను పిలిచినట్టు ఏమిటా చిటికలేయడం?" అని గదమాయించారు బామ్మగారు. "టికెట్" అన్నాడు కండక్టర్ అదేమీ వినిపింఛుకోకుండా.. "మా ప్రసాదరావు నడుగు" అంటూ లోపలికి చూపించారు బామ్మగారు. చిటికలేసుకుంటూ కండక్టర్ ముందుకు సాగాడు.... "ఏమిటి గట్ట చూస్తవ్...జరా జరగరాదె..."అంటూ ప్రసాదరావుని వెనకాలతను గెంటాడు...మళ్ళీ ప్రసాదరావు ముందరకి జరిగాడు.. కండక్టర్ ప్రసాదరావు ముఖం మీద చిటిక వేసి "టిక్కట్" అన్నాడు. రెండు టిక్కట్లు తీసుకున్నాడు ప్రసాదరావు. చిల్లరలో పది పైసలు తక్కువైందని అనుమాన పడ్తుంటే..."ముందరకి జర్గయ్యా" అంటూ మళ్ళీ తోసాడు కండక్టర్...ఆడవాళ్ళ సీట్లు దాటి ముందరకి జరిగాడు ప్రసాదరావు. "ఆయనే పాస్ ఖడా క్యా..దిమాగ్ ఖరాబుందా...చల్ చల్ "అన్నాడు డ్రైవర్ టర్నింగ్ తీసుకుంటూ.."ఉతర్నేకా...క్యా దేఖ్ తా...దిగ్గు..." అంటూ లోపల్నించి తోసారు ప్రసాదరావును... ప్రసాదరావు దిగడం...స్పీడందుకుని బస్సు బామ్మతో సహా ముందుకి సాగడం ఒకేసారి జరిగింది.... "అయ్యో!!! బామ్మా.." తనకి ఊరు క్రొత్త..బామ్మకి ఇంకా క్రొత్త..ఎక్కడని వెతకడం ఏం చెయ్యడం..ఈ లోగా బామ్మ ఎక్కడైనా దిగేస్తుందేమో..తప్పిపోయిన బామ్మని వెదకడంకోసం మామయ్య సహాయంకోసం ఇంటికి మళ్ళాడు ప్రసాదరావు.. తప్పిపోయిన బామ్మా వెంకటప్పయ్యగారి ఆచూకీ తెలిస్తే మన సత్య సూర్య వెంకట మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాదరావుకి తెలియజేయండి....ప్లీజ్......
**********
[ముప్ఫై సంవత్సరాలక్రితం నేను చూసిన హైదరాబాదు...కొంచెం గమనించండి....]
[జంటనగరాల సాహితీ సంస్థ "యువభారతి" వారి సాహిత్యలహరి కార్యక్రమంలో నా ఈ స్వీయరచన చదువగా ఆకాశవాణి, హైదరాబాదు'బి' కేంద్రంనుండి 3--2--1982 న ప్రసారం చేయబడింది..]
4 comments:
చదవగానే ఇదేమిటా హాయిదరాబాదులో రేట్లు బాదక ఇంత చవుకా
అనుకున్నా.చివరదాకా వచ్చాక ముప్పై ఏళ్లనాటి గాధ అని తెలుసుకున్నా!
ఆనాటి హైదరాబాదు కధ చాలా హాయ్ గా వుంది.
రోజూ "నా బ్లాగు...నా బ్లాగు" అంటూ వుండే మీరే నేను కంప్యూటర్ కొనడానికి బ్లాగు పెట్టడానికి స్పూర్తి...ఆ మీ ప్రోత్సాహం నా బ్లాగు పోస్ట్ లపట్ల లేదేమా అని కొంచెం ..ఇదవుతున్నమాట నిజం... అయితే భాగ్యనగరంలో వున్న బామ్మగారు మిమ్మల్ని కదిలించి...కలం(వ్యాఖ్య) కదిపించారంటే నాకు ..pat on my backoooo. ధన్యవాదాలు.
పాపం ప్రసాదరావుకు కడ చూపులైనా దక్కేయో లేదో కదా.
sir chaduvutunnappudu anukonnanu...enka ded rupaye rojulu vunnayaa ani..a rojullo sultan bazar lo veg market vundedi (memu konevallaom)..epudu ledanukondi...
baagundi sir..
Post a Comment