Pages

Saturday, May 9, 2015

హరాజీకాలు - 8---నటజీవితం - అరంగేట్రం

హరాజీకాలు - 8






నటజీవితం -  అరంగేట్రం
---డి.వి.హనుమంతరావు.


విశాఖజిల్లా పాయకరావు పేటలో  ఉద్యోగరీత్యా  కొన్నాళ్లున్నాను. . ప్రక్కనే తుని. రెంటికీ మధ్య తాండవ నది. దానిపై బ్రిడ్జ్. నదికి అటు వైపు ఉన్న- పాయకరావుపేట - విశాఖజిల్లా, ఇటువైపు ఉన్న - తుని, తూ.గో.జిల్లా. నేను మకాము తునిలో ఉండి రోజూ పాయకరావుపేట ఉద్యోగానికి వెళ్ళేవాడిని. అంటే రెండు జిల్లాలు మారేవాణ్ణన్నమాట. పిల్లలు తునిలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. ఆ స్కూల్ కు మంచి పేరుంది. దానిక్కారణం ఆ స్కూల్ కరస్పాండెంట్ అని చెప్పక తప్పదు. మంచి కార్యసాధకుడు. పైకి అమాయకంగా కనిపించినా,  తన పని సాధించుకుంటాడు.


కొంచెం ముందురోజులకు  వెళ్తే.. తునిలో పబ్లిక్ పరిచయాలు నాకు ఈయనతోనే ప్రారంభం. ఓ సాయంత్రం నేను బయటికి వెళ్తే  ఈయన దారిలో కలిసాడు. ఆయన కూడా  అప్పటికి నాకు తెలియని వ్యక్తులు ఇద్దరున్నారు.
“రండి రావుగారు, కాసేపు కబుర్లు చెప్పుకుపోదాం” అంటూ ఆ ప్రక్కనే ఉన్న ఓ దేవాలయపు మంటపానికి దారి తీసాడు. మా మధ్య మాటలు అలా కుర్రకారు వారి చేష్టలు .. వాటిమీదకు పోయాయి.  
“పిల్లలు పాడైపోతున్నారండీ, అస్తమానం సినీమాలు, హోటల్స్ .. ఒక్కనిముషమైనా ఇంట్లో ఉండరు .. ఏంచదువుతారో ఏమిటో?” అన్నారు ఒకరు.
“రోజూ సాయంత్రమయ్యేసరికి హోటల్, శలవొస్తే సినీమా … ఏంటో పాడైపోతున్నారండీ” అని వాపోయడొకాయన.  [ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పుడింకా పెద్దలకు తెలియకుండా హోటల్ గోఇంగ్ లు, విచ్చలవిడిగా సినీమాలు లేవు. ఒకరకమైన కట్టుబాట్లలో ఉండేవారని, అదీ కాక ఈ కథా కాలం  డెబ్భైయోవ సంవత్సరం చివరి భాగంలోది. ముచ్చట్లు అంతకన్నా పాతవి కనుక, ఇంకా ఇంటర్ నెట్ లు, పబ్ లు, క్లబ్ లు, పిజ్జాలు, నూడిల్స్, బర్గర్ లు … ఇలాంటి కల్చర్ కు విద్యార్థి లోకం అలవాటు పడలేదు. ముఖ్యంగా తుని లాంటి టౌన్స్ లో. - అర్థం చేసుకోండి]
నిజం చెప్పాలంటే, మేమూ కాలేజి డేస్ లో మరీ కాకపోయిన .. కొంతవరకైనా, హోటల్ వాసన తెలిసినవాళ్లమే, సినీమాలు చూసినవాళ్లమే .. కాని ఇప్పుడు కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉండాలిగా. అప్పుడు నేనన్నాను.
“అంత ఠంచ్చన్ గా సాయంత్రం అయ్యేసరికి హోటల్ కు ఎందుకు వెళ్తారో చెప్పనా” అన్నాను ..  
“చెప్పండి” అంటూ  ఉత్సాహపరిచారు అక్కడున్నవారు.
“కందులు వేయించి, పప్పు చేసి శుభ్రపరుస్తారు కదా, అప్పుడు వచ్చిన పొట్టు, కొంత కందిపప్పు నూకతో కలిసి కమ్మగా ఉంటుంది.. పశువులు పగలంతా మేతకెళ్లొచ్చే టైముకి కుడితిలో ఈ కందిపొట్టు కలిపి రెడీగా ఉంచుతారు. పశువులు దానిపట్ల మక్కువతో పరుగు పరుగున ఇళ్ళకొచ్చేస్తాయి. అదిగో ఆ కందిపొట్టు హోటల్ వాళ్లు సాంబారులో కలుపుతారట. {ఇది నిజమో కాదో నాకు తెలియదు, ఐ గాట్ నో ప్రూఫ్}. మనం కూడా ఆ సాంబారు మీద మక్కువతో కుడితి మరిగిన పశువుల్లాగా హోటల్ కు పోతామన్నమాట…” అని చెప్పగానే జోకును మనసారా ఎంజోయ్ చేసారు మిత్రులు ఐనవారు, కాబోయేవారు.
“టిఫిన్స్ అంతంత రేట్స్ ఏంటండీ” అంటూ మరోసారి వాపోయారు…
“అయ్యా! ఇక్కడ ఒకవిషయం గమనించాలి, రేట్ దోసెలో కంటెంటుకి, పెట్టిన ఇడ్లీలసంఖ్యకూ  కాదు.. తక్కువ మినప్పిండితో ఇడ్లీ పడిపోకుండా ప్లేటులో ఎలా పెట్టాడన్న వాడి నైపుణ్యానికి. .. ప్రొద్దున్న ఒక చెమ్చా దోసెపిండి కాలే పెనం మీద వేసి సాయంత్రందాకా దోసెలు పెనం మెదనుంచి తీసే వాడి ప్రతిభకు .. నిజంగా ఎన్ని డబ్బులిస్తే సరిపోతుందండీ వాడి పనితనానికి, వాడి స్కిల్ కు“ .. అనగానే అన్ని బాధలూ మరచి ఆనందంగా హాయిగా
నవ్వుకున్నారు - మిత్రులు . ఆ రోజు పరిచయం అయిన షుగర్ కేన్ ఇన్స్పెక్టర్ గారు, సుమారు ముప్ఫై అయిదు - నలభై  సంవత్సరాలైనా  మా స్నేహాన్ని ఇప్పటికీ ఆత్మీయంగా మధురంగా కొనసాగిస్తున్నారు. మరి షుగర్ కేన్ అంటేనే మధురం కదా…


ఆ కరస్పాండెంట్ గారు-- స్కూలు ‘పేరెంట్స్ అసోసియేషన్’ లో మమ్మల్ని ముఖ్య సభ్యులుగా చేసారు. నాకు అప్పటికి 36 సంవత్సరాల వయస్సు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్ గారు  నాకన్నా కొంచెం పెద్ద. గౌరవనీయమైన ఉద్యోగాలు మావి అని పెద్దవాళ్లను కమిటీలో పెట్టుకుంటే స్కూలుకు గౌరవమని, మమ్మల్ని పెట్టాడాయన. మాది కొంచెం ఉడుకు రక్తం ..  మేమిద్దరం కలిస్తే .. సందడే సందడే .. ప్రథానప్రతిపక్షంలా కరస్పాండెంట్  అవునన్నది కాదనడమే మా లక్ష్యం,.
ఏది రైటో, ఏది రాంగో మాకు అంతగా ఆలోచించేవాళ్లము కాదు.  .. మీటింగుల్లో కరస్పాండెంట్ గారు మాత్రం ముఖంనిండా నవ్వు పులుముకునేవారు తప్ప మనసారా నవ్వేవారా అంటే అనుమానమే.                                     


ఓ సారి, “పిల్లలకు పుట్టినరోజులకి ఇళ్లకు గ్రీటింగ్స్ ఏదైనా చిన్ని కానుక పంపుదామనుకుంటున్నాను” అని  ప్రొపోజల్ పెట్టాడు..
“మీ అభిప్రాయం చెప్పండి” అని జనరల్ బాడీని అడిగాడు.
నిజానికి చాలా మంచి ఆలోచనే ఆలోచిస్తే.. బాగుందని చాలా మంది ఓటేసారు..
“ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్” అన్నాను..
“ఏమి”టన్నారు  కరస్పాండెంట్ గారు.
“మా ఇద్దరి పిల్లల పుట్టినరోజులు సమ్మర్ హాలిడేస్ లో వస్తాయి, నాకు కిట్ట”దన్నాను.
ఘొల్లు మని నవ్వులు, అందరు ముక్త కంఠంతో వద్దన్నారు.
తర్వాత మళ్లీ మమ్మల్ని కన్విన్స్ చేసి, ఆ ప్రపోజల్ ను యాక్ట్ గా పాస్ చేసాడాయన. అదే కార్యసాధకుడి లక్షణం.
పేరెంట్స్ డే చేసి, ఫంక్షన్ చేద్దామన్నారు ఓసారి. సరే అన్నాము. అయితే ఎవరో ఎమ్.ఎల్.ఏ ని పిలుస్తానన్నారు
చీఫ్ గస్ట్ గా ..
“నతింగ్ డూఇంగ్..రాజకీయ నాయకులొద్దు. అంతకీ కావాలంటే వచ్చిన పేరెంట్స్ లో ఒక వృద్ధుడినో, లేక మంచి ఉద్యోగస్తుడినో పిలుద్దామని మా ఆలోచన.” అని మేమన్నాము.
ఇంత మంచి ఫంక్షన్ కు నలుగురూ వస్తారుకదా, అలాంటప్పుడు  ఏ ఎమ్.ఎల్.ఏనో పిలిఛి గౌరవిస్తే, తమ స్కూల్ భవిష్యత్ దృష్ట్యా బాగుంటుందని అతని యోచన. మన ఫంక్షన్ క్రెడిట్ ఆతడు పట్టుకుపోవడమేమిటని మా ఆలోచన. తనకు అనుకూలంగా ఉన్న టీచర్స్ చేత, కొందరి పెద్దల చేత మాకు రాయబారాలు సలిపారు .. కరస్పాండెట్ గారు. చివరికి మోర్నింగ్ ఫంక్షన్ మా పేరెంట్స్ పరంగానూ, ఈవెనింగ్ పబ్లిక్ ఫంక్షన్ .. ఆయనిష్టం అని సెటిల్ చేసాం… మార్నింగ్ ఫంక్షన్ కు తుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.డి.బి. బ్రాంచ్ మేనేజర్ (ఆయన ఒక పేరెంట్) విశిష్ట అతిథి. సాయంత్రం తుని బుల్లిబాబుగారు, అప్పటి ఎమ్.ఎల్.ఏ ఆత్మీయ అతిథి.
ఆనాటి  వేదిక మీదనే  నా నట జీవితానికి అరంగేట్రం.. భమిడిపాటి కామేశ్వరరావుగారి నాటిక..భజంత్రీలు. అందులో నేను హీరో ఫ్రెండ్ ను. నాతోనే సీన్ ప్రారంభం. ఏదో ఉత్తరం. అది చదువుతున్నట్టుగా నిలుచుని ఉంటే సీన్ మొదలవుతుంది. ఉత్తరం పైకి పట్టుకున్నా.. కానీ చేతులు వణుకుతున్నాయి.. ఆ తర్వాత సీన్ లో .. విషయం హీరో తాతో తండ్రికో వినిపిస్తాను. ఆయన నమ్మనంటాడు. అప్పుడు నేను ఉత్తరం చూపాలి. ఆ తాతో తండ్రో వేషం ఇందాకా ప్రస్తావించిన బి.ఎమ్ గారు వేసారు. నమ్మనంటే ఉత్తరం చూపిద్దామని నేననుకుంటే, ఆయన నమ్మినట్టు ఏమీ అనకుండా అలా కుర్చీలోకి చూస్తూ ఉండిపోయాడు.. ఇక నా పరిస్థితి ఆలోచించండి. తర్వాత ఏంచెయ్యాలో తెలియదు. అనుభవం లేదు కదా.. నేను గుటకలు మింగుతున్నానని ఆయనకు తెలిసి.. లేచి “నేన్నమ్మనయ్యా” అన్నాడు. “హమ్మయ్య” అని నిట్టూర్చి నేను కంటిన్యు చేసా.. తర్వాత చాలా నాటికలు వేసాను..టి.వి.సీరియల్స్ చేసాను. హాస్యరచనలు చేసాను, వాటిలో నటించాను కూడా .  నా నటనకు కూడా  అభిమానులున్నారు. కళాతపస్వి అయితే ఒక సీరియల్ లో నా మాడ్యులేషన్ బాగుందని కితాబిచ్చారు కూడా .. .

పేరెంట్స్ లో ఈ స్కూలు పట్ల కొన్ని కంప్లైంట్స్ కూడా ఉండేవి. మా దృష్టికొచ్చినవి, మరి కొన్ని, కొంత నాటకీయత కలిపి ఒక ఆడియో డ్రామా తయారు చేసాం. అందులో ప్రధాన పాత్రధారులం మేమే. ఆయన గొంతు నేను ఇమిటేట్ చేసాను. రికార్డింగ్ చేసి ఆయనకే వినిపించాం. ఆయన నవ్వుతూ తీసుకున్నాడు కానీ .. నవ్వుతూనే తీసుకున్నాడా అన్నది అనుమానం. అయితే మా మైత్రి కొనసాగింది..అది ఆయన గొప్పతనం.       

Wednesday, March 25, 2015

a trip to Bhadrachalam





భద్రాద్రి రాముని చెంతకు శ్రీరామనామం


“రెండే రెండగు చిన్నియక్కరము లే లీలన్ జగంబంత తా
పండెన్ సర్వజనాంతరంగ హరమై, భాషా ప్రపంచంబునన్
నిండెన్నీ శుభ శబ్దమే, సహజమౌనే యాత్మకీ పేరు,బ్ర
హ్మాండంబంతట నిండు బ్రహ్మ మిది  రామా! రామ చన్ద్ర ప్రభూ !”

{వ్యాఖ్య: ‘రామ’ అనే రెండక్షరాలు విశ్వమంతా నిండి ఉన్నాయి. ప్రపంచంలో సర్వ నాగరిక భాషల్లోనూ ‘రామ’నామం ఉంది. అనేక నాగరిక దేశాల్లో రామకథాగానం ఉంది. ప్రతిభాషా ‘రామ’ కథతో పునీతమైంది. ఎందుచేత ? ఆత్మకంటే ఇష్టమైన వస్తువు మరొకటి లేదు.తనకంటే ప్రియమైన వస్తువు ఏ  వ్యక్తికీ ఉండదు.  ఆ ఆత్మే ఆనందమయం. అదే బ్రహ్మం, అదే బ్రహ్మాండ వ్యాప్తం. ఆ  ఆత్మకు ప్రియం కనుక ‘రామ’నామం సర్వజన ప్రియం.}   --- (గురువుగారి 
శ్రీరామ చన్ద్ర ప్రభూ శతకం.)
       
*********      *******     ******         *********      *********         *********

మన్మథ నామ సంవత్సరం .. ఉత్తరాయణం … వసంత ఋతువు
చైత్ర మాసం ….  శుక్ల పక్షం …. పాడ్యమి తిథి …. స్థిర వారం…
సాయం సమయం …
అంటే ఉగాది పర్వదినాన .. 21 మార్చి,2015 సాయంకాలం సుమారు 3 గంటలకు ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ కార్యాలయం నుండి 14కోట్ల “శ్రీరామ” నామం పసుపు-ఎరుపు వస్త్రములతో ముస్తాబై … భద్రాద్రి రాముని సన్నిధికి పయనమైంది.

సమన్వయ సరస్వతి, వాగ్దేవీ వరపుత్ర, ప్రవచన విరించి
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు 2015 మార్చి 3 వతేదీన ప్రారంభించి
ఆదిశంకర భగవత్పాద విరచిత “శ్రీరామ కర్ణామృతం” పై రాజమహేంద్రవరంలో
ప్రవచనము లనుగ్రహించారు.

ఆ నేపధ్యంలో గత 2014 శ్రీరామనవమికి భద్రాద్రి వెళ్ళిన - సతత శ్రీరామ ధ్యానైక నిరతులు .. డా॥టి.వి.నారాయణరావు గారికి  .. భద్రాద్రి రాముని సన్నిధిలో ఉండగా కలిగిన
దివ్యమైన ఊహ --- పదికోట్ల రామనామాన్ని అందరం వ్రాసి … ‘శ్రీరామ కర్ణామృత’ ప్రవచన సమయంలో వేదికపై నుంచి, ఆ తరువాత భద్రాద్రి రాముని సన్నిధికి చేర్చాలని ..
ఆ ఊహలోని భక్తిని  - నిజాయితీని  -  సుగ్రీవాజ్ఞగా భావించి  .. శ్రీ రామ దండు కదిలింది. ఫేస్ బుక్ ద్వారానూ, ఫేస్ టు ఫేస్ గానూ, కరపత్రములద్వారానూ .. రకరకాలుగా తెలుగు రాముడికి భక్తులైనవారందరికీ విషయం తెలియజేయబడింది. భక్తుల మనస్సుల్లో శ్రీరాముడు కదిలాడు.. నిండుమనస్సుతో, రామ హృదయంతో, ఎంతోమంది.. స్పందించారు. శ్రీ వెంకట సుబ్బ రాఘవమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో - ప్రధాన ట్రస్టీ శ్రీ చలమయ్య గారు కోరినప్పుడల్లా … కోరినన్ని “శ్రీరామోపసన” కాగితాలు శాఖా కార్యాలయానికి పంపిస్తే అవి భక్తులకందజేయబడ్డాయి .

“శ్రీ రామ” పలుకుతూ, “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” సౌందర్యం అక్షరాలలో తొణికసలాడేటట్లు  “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” కరుణ గుండెల్లో నింపుకొని “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” దర్శనం మనో నేత్రాలతో చేస్తూ “శ్రీ రామ” వ్రాసారు..

‘రా’ కలుషంబులెల్ల బయలం బడద్రోచిన, ‘మా’ కవాటమై
డీ కొని ప్రోచు, నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువగానరు గాక, విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ ! కరుణాపయోనిధీ ! --- [దాశరథీ శతకం]

********        **********         **********        ********         ************                   

“శ్రీ రామ కర్ణామృత”ప్రవచన సమయానికి, ఇంచుమించుగా పది కోట్ల సంఖ్యకు చేరువయ్యాం. తొమ్మిది రోజులు జరిగిన ఆ ప్రవచన మహాయజ్ఞ సమయంలో -
ఎంతోమంది కాగితాలు పట్టికెళ్లి ‘శ్రీరామ’ వ్రాసారు.. విదేశాలలో, తపోభూమి నైమిశారణ్యంలో, దేశంలోని పలుతావుల్లో “శ్రీ రామ” వ్రాసి నిర్వాహకులకు అందజేసారు. శ్రీమతి వాడ్రేవు ఉమా వేణుగోపాల్ గారి  సన్నిహితులు  కోటిన్నర ‘శ్రీరామ’ నామం శ్రీరామ ప్రేరణతో వ్రాసి అందజేసారు.  … శ్రీరాముని అనుగ్రహం. ఇలా ఎంతోమంది వ్రాసారు … వ్రాయించారు … కనుకనే పదునాలుగు కోట్ల  శ్రీరామనామం   విశ్వరూపంగా   దర్శనమైంది.   

“శ్రీరామ”నామం అధిరోహించిన రెండు బస్సులలో ఉగాది పర్వదినం సాయంకాల  వేళలో మనస్సులనిండా ‘శ్రీరాముని’ నింపుకొని భద్రాద్రి దిశగా మిత్రులు  బయల్దేరారు. జయ జయ ధ్వానాలతో .. శ్రీరామ నామ సంకీర్తనలతో .. మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రయాణం సాగింది.
పచ్చటి అడవులు… గల గల పారే  వాగులు… పశ్చిమాద్రి పై వెలిగే సూర్యకాంతిలో కనుల పండుగగా పచ్చటి అటవులు…ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ,,, జగదానంద కారకుడైన  శ్రీరాముడు సౌమిత్రీ సహితుడై, అమ్మ జానకమ్మతో కూడి .. ప్రసన్నాంజనేయుడు  కొలుస్తుండగా ప్రకృతిలో పరచుకు పోయాడనే భావన..  మనస్సుకు  తాకింది.

“ఇన్ని భాషలేల, ఇన్ని వర్ణములేల
‘రా’యు ‘మా’యును చాలు ‘రామ’ యనగ
‘రామ’యనుచు పిలువ, ‘రామా’యను జగతి
రాముడేలు జగము రమ్యముగను

**************                   ******************                        ****************
రాత్రి 7-30గంటలకు … అదిగో భద్రాద్రి, ఇదిగో రాముడు చూడండి…
మా వస్తువులు బసలో పెట్టి, వామాంక స్థిత జానకీ రాముణ్ణి చూడడానికి పరిగెత్తాం.  
ముందుగా శ్రీరామదూతకు “మేం వచ్చామయ్యా స్వామి, అయ్యకు కొంచెం చెప్పవా ?” అని అర్థించాము..
“మీరు రాలేదు, ఆయన రప్పించాడు” అన్నట్టు నవ్వుతూ చూసాడు స్వామి..
నిజమే .. ఆయన అనుగ్రహం లేకుండా .. ఇంతటి భాగ్యమా…
స్వామిదగ్గర లెంపలు వేసుకుని, భద్రుని శిఖరం పై కొలువై ఉన్న కోదండ రాముని, చతుర్భుజ రాముని, చూడడానికి త్వరపడ్డాం. స్వామి అద్భుత దర్శనం..

వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం, కరే
చక్రం చోర్ధ్వకరేణ, బాహుయుగళే శంఖం శరం దక్షిణే,
బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్థ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

[ఎడమ తొడయందున్న సీత సేవింప, శోభించుచున్న ధనువు నొక చేతను, పై చేత
చక్రమును, కుడిచేతుల రెంటి యందు శంఖమును, బాణమును ధరించుచున్నట్టియు, భుజకీర్తుల మొదలగు వానిచే నలంకరింపబడినట్టియు, భద్రాచల శిఖరమందున్నట్టియు,  నల్లనైన రఘురాజశ్రేష్టుడైనట్టియు రాముని సేవించుచున్నాను] (శ్రీ రామ కర్ణామృతం.)

****************             ******************               **************
“స్వామీ అనుగ్రహించావా … అద్భుత  దర్శనం అనుగ్రహించావా స్వామీ!  .. అనురాగ పూరిత దృక్కుల మా పై అనుగ్రహించావా స్వామీ…”  -
శిరసు వంచి, కేలు మోడ్చి-- “రప్పించావు స్వామి, రప్పించుకున్నావు ” అంటూ మౌనంగా రోదించాము.  

భద్రాచల పురంలో -- శ్రీ సీతా రాముల కల్యాణ వేడుకలు..  నిత్య కళ్యాణమూర్తులు
శ్రీ సీతారాముల పెళ్లికి …  చలువ పందిళ్ళు … పచ్చ తోరణాలు.  దగ్గరకి వస్తున్నది కదా మరి శ్రీరామనవమి పండుగ.  .. వసంత నవరాత్రుల శోభతో అప్పుడే  వధూవరులు వెలిగిపోతున్నారు... ఊరంతా పందిళ్ళు వేసారు..మామిడి తోరణాలు కట్తున్నారు .. పెళ్ళికి ప్రతి ఇంటికి  బంధు మిత్రులు తరలి వస్తున్నారు.. వీధులన్నీ సందడి సందడిగా ఉన్నాయి … అంగళ్ళన్నీ క్రొత్త క్రొత్త వస్తువులతో సుందరంగా అలంకరించబడి  శ్రీరాముని సేవించే భక్తుల రాకకోసం ఎదురుచూస్తున్నాయి…  ఎక్కడ చూసినా కల్యాణ శోభ  కనపడుతున్నది… వేదాంత వీధుల్లో విహరించే కోదండ చాప దారి ఏ మౌనివెంట రానున్నాడో … విదేహ రాజు వెనుకాల సిగ్గులొలికే సీతమ్మ కోమల హస్తాన్ని ఎప్పుడు గ్రహించనున్నాడో … ఆ పెళ్లి వేడుక చూసినవారిదె భాగ్యం…
**************      **************              **************             *************
మాకు - ‘అంబా’ సత్రానికి ఎదురుగా .. శృంగేరి శంకర మఠం వారి నిర్వహణలో గల కాటేజెస్ లో బస, అంబా సత్రంలో భోజనం ఏర్పాటు చేసారు. అక్కడ మేనేజర్ శ్రీ మధు గారు మాకు చాలా సాయ పడ్డారు.

ఆదివారం ఉదయం మా నిత్య విధులు పూర్తి  చేసుకుని, అంబా సత్రంలో కొలువైన బాలాత్రిపుర సుందరి ఆలయానికి చేరి, శ్రీరామ నామాన్నిముందుగా  జగన్మాత సన్నిధిలో ఉంచాం. “శ్రీరామో లలితాంబికా” అని అంటారు కదా..
శ్రీరాముని యందు భక్తిగల సహృదయులు ఎంతోమంది వ్రాసిన రామకోటిపత్రాలను  అరుణ పసుపు వర్ణాల వస్త్రాలతో కట్టిన మూటలను అందరం శిరస్సుపై పెట్టుకుని - అంబా సత్రం నుంచి  భద్రాద్రి రాముని సన్నిథికి కదిలాం. పసుపు రంగు చీరలతో స్త్రీ మూర్తులు, సాంప్రదాయ దుస్తులతో మగవారు…రెండు లైనులలో కదులుతూ,   ‘శ్రీ రామ జయ రామ, జయ జయ రామ’ అంటూ జయఘోష చేస్తూ … భద్రాద్రి వీధులలో ఊరేగింపుగా నడిచాం  .. అలా నడుస్తూ ఆలయానికి చేరి అక్కడ శ్రీ రామచంద్రమూర్తి కొలువై ఉన్న ప్రధాన ఆలయానికి  ముమ్మారు ప్రదక్షిణ చేసాం.  … మమ్మల్ని ఆలాయాదికారులు అనుమతించే దాకా .. ఆలయ ప్రాంగణంలో “శ్రీరాముని” మధ్యలో ఉంచుకుని,చుట్టూ కూర్చుని  రఘునాథ కీర్తనం  చేసాం -  అక్కడ తిరుగుతున్న భక్తులు భాష్పవారి పరిపూర్ణలోచనులై  పీతాంబరధారియైన శ్రీరామనామానికి .. శిరసా అంజలి ఘటించారు.

రెండు గుంపులుగా మమ్మల్ని లోపల అంతరాలయంలోనికి అనుమతించారు. వీర వైష్ణవాచార జనం, మా గోత్ర నామాలతో పూజచేసి, వేద మంత్రాలతో శ్రీరమయైన
సీతా మహాలక్ష్మికి , చేతనోద్ధారకుడైన శ్రీరామునికి, పదునాలుగుకోట్ల శ్రీ రామ నామాన్ని సమర్పించారు.   ఆయనది ఆయనకే..
పలుకే బంగారమైన స్వామి ఒక్క నామానికి బదులిచ్చినా  చాలును కదా ? జన్మలు అర్థవంతమౌతాయి.

అక్కడ ఆలయంలో ఈ నామాల ప్రతులనుంచే భాండాగారం పూర్తిగా నిండినదట, అంచేత మరల అంబా సత్రానికి తెచ్చి అక్కడ ప్రత్యేకంగా నిర్మింపబడిన స్థూపంలో-నామంవ్రాసినవారి   తరఫున- ఒక్కరొక్కరుగా వెళ్లి, నిక్షిప్తం చేసాం.

‘అంబా సత్రం’ 1877సం॥లో  కీ.శే పమిడిఘంటం వెంకట రమణ హరిదాసు గారు నిర్మించారు. .. వారు బాలాత్రిపురసుందరీ దేవి ఉపాసకులు..రామ భక్తులు. యోగి. శ్రీ చక్రార్చకులు...‘అంబా’ అని పిలిస్తే  జగదంబ పలికేదట. అందుకే ఈ సత్రం ‘అంబా సత్రం’. ఆయన నిత్యం అన్నదానం చేసేవారట. ఆయన జలాన్ని ముట్టుకుంటే అవసరమైనప్పుడు  నెయ్యిలా మారిపోయేదట. ఒకసారి శ్రీ రామనవమికి  భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయాలంటే వంట బ్రాహ్మణులు రాలేదట. అంబను నమ్మిన దాసు గారికి ఏ విధమైన ఆందోళనా లేదు. మేం చేసి పెడ్తామంటూ ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చి అన్ని పదార్థాలు వండి వెళ్లారు.  .. “మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, మేం మళ్లీ వస్తా” మని చెప్పి, మరి రాలేదట.. వారు వంట చేసిన పెద్ద పెద్ద గుండిగలు(రామ లక్ష్మణ గుండెగలు) ఈ నాటికి అక్కడ మనకు దర్శనమౌతాయి.. అంత మహిమాన్వితమైన స్థల విశేషంగల ప్రదేశంలో ‘శ్రీరామ’ ఉంచబడింది.

అక్కడనే మధ్యాహ్నం భోజనం చేసి మరల ఘాట్ రోడ్ లో రాజమండ్రి చేరాం.
శ్రీ వల్లభ గణపతి ఆలయం దగ్గర మాకు రాత్రి ఫలహారాలు ఏర్పాటు చేసారు..  
భద్రాద్రి రాముని, ఆనంద రాముని, సీతా లక్ష్మణ సహిత శ్రీరాముని, హనుమత్సేవిత కోదండ రాముని,మనసారా దర్శించుకుని, ఆనందంగా రాత్రి 9 ప్రాంతంలో ఇంటికి చేరాం..

తన ప్రవచనాల ద్వారా భగవత్ తత్త్వాన్ని సుబోధకం చేస్తూ .. ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తున్న  గురువర్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి అనుగ్రహ విశేషం…

ఒక శుభవేళలో, ఒక శుభ సంకల్పం చేసి, ఒక శుభప్రయత్నానికి భాగస్వాములమయ్యే  అవకాశం కల్పించిన సౌజన్యమూర్తి, శ్రీరామభక్తులు డా॥టి.వి.నారాయణరావుగారి సంకల్పబలం…

ఉండడానికి గూడు, స్వచ్చమైన భోజనం .. ఇవి లేనిదే యాత్రలు చేయలేని ఈ జీవులకు, చక్కటి వసతి, కడుపునిండా చక్కటి భోజనమే కాక, ఉత్సవ సమయాలలో కూడ భద్రాద్రి రామ మూర్తిని కన్నులారా చూసి, మనసారా స్తుతించే అవకాశం,  
చక్కటి, సంతృప్తికరమైన దర్శనం--  ఏర్పాటు చేసిన మిత్రులు చి॥ వరప్రసాద్ మంచితనం.

అన్నింటికీ మించి, ఎంతో భక్తిశ్రద్ధలతో “శ్రీ రామ” వ్రాసి .. సకాలంలో నిర్వాహకులకు అందజేసిన  ..’శ్రీరామ’ నామం వ్రాసిన అశేష భక్తుల -  అనన్య రామ భక్తీ,  ..  అనురాగ పూరిత ఆశీసుల వలననే  ఈ కార్యక్రమంలో  పాల్గొనే మహద్భాగ్యం కలిగింది.
శ్రీ సీతా రాముల  సన్నిధిలోనిలబడే అదృష్టం కలిగింది.…

గురువు గార్కి సాష్టాంగ ప్రణామములు …
శుభ సంకల్పానికి, సాకారం చేసిన మంచితనానికి … 
మా యాత్ర సఫలం చేసిన మిత్రులకు… 
శిరసు వంచి పాదాభివందనము చేస్తున్నాను.

గడప మీద దీప కళిక నుంచి నటుల
నాల్క చివర ‘రామ’ నామముంచు
చిత్త శుద్ధి చేసి జీవుని ముక్తికి
దారి చూపు తారక మది.  

నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నేటి సుజ్ఞాన మంత్రం
సత్యం శ్రీరామ మంత్రం సదమలహృదయే సర్వదారోగ్య మంత్రమ్
స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమనస్సౌఖ్య సౌభాగ్య మంత్రం
పఠ్యం శ్రీరామమంత్రం పవనజ వరదం పాతుమాం రామ మంత్రమ్

Wednesday, December 31, 2014

HAPPY NEW YEAR 2015

 

మళ్లీ హేపీ న్యూ యియర్ వచ్చేసింది..


నాకు డెబ్భై ఏళ్లు దాటాయి.. ప్రతి సంవత్సరం క్రొత్తదనంతో క్రొత్త సంవత్సరం వస్తోంది.. 
క్రొత్త కోరికలతో స్వాగతిస్తూనే ఉన్నాను.
అరవై ఏళ్ల క్రితం ఎలా స్వాగతించామో నాకు గుర్తు లేదు.. ఇంట్లో అన్నయ్యలూ అక్కయ్యలూ ఎలా క్రొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారో… ఆ తర్వాత ఏదైనా ముద్దు ముద్దు మాటలతో  ‘ హెప్పీ నా యియర్’ అన్నానేమో .. విన్నవారికి ముద్దొచ్చి పెట్టుకున్నారో, పట్టుకు తన్నారో … ఏమో మరి..

ఆ తర్వాత హైస్కూల్ … ఫ్రెండ్స్ ,, హడావుడి .. అప్పుడు న్యూ యియర్ విష్ ఎవరు ముందు చెప్తారన్న తొందర .. హేపీ న్యూ ఇయర్ … అని ఇద్దరమూ ఒకేసారి అనడం .. నేను ముందన్నానంటే నేనంటూ వాదులాడుకోవడం.. అలా నవ్వులతో కేరింతలతో హేపీ న్యూ ఇయర్ …
కాలేజీలోకి వచ్చాక… ఒక స్టైల్.. తెచ్చిపెట్టుకున్న స్టైల్.. ఆనందం దాచుకుని, నవ్వు పులుముకుని గ్రీటింగ్స్ చెప్పుకోవడం.

తర్వాత ఉద్యోగం..
ఉద్యోగాల్లో బాస్ ను గ్రీట్ చేయడమే కాని, బాస్ ఉద్యోగాలు నేను చెయ్యలేదు. అంటే బాస్ ఉద్యోగాలు చేసినా ఏదో పల్లెటూళ్లో .. అంతే …
ఉద్యోగం . మొదట్లో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ … ఫేస్ టు ఫేస్ బాస్ తో అప్పుడే.. ఆయనకు షేక్ హాండ్ ఇవ్వడం.. పదాలు కూడబలుక్కుని ‘విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరాస్ న్యూ యియర్ సర్” అని హడావుడిగా చెప్పడం ,, ఆయన చిరునవ్వు నవ్వితే .. ఓ యబ్బో.. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ … “మనం ఇచ్చిన యాపిల్స్, కేక్స్ ప్లస్ కాఫీ.”... అదే అపురూపం . అక్కడ్నించి, మా పై వారితో ఆయన మాట్లాడే బిజినెస్.మనల్ని పలకరించడం పెద్దాయనకు ఇబ్బందేమో…

తర్వాత బాంక్ ఉద్యోగం.. ఇక్కడ పధ్ధతి డిఫరెంట్ .. పలాసాలో ఉన్నప్పుడైతే చిన్న ఊరు .. మాకు మేమే బంధువులం.. ప్రొద్దున్నే ఏజంట్ గారింటికి వెళ్లడం, అక్కడ గ్రీట్ చేసాక పిచ్చాపాటీ … జోకులు సరదాలు..
మేం అక్కడ ఉండగానే మెసెంజర్ పోస్ట్ తీసుకు వచ్చేవాడు. స్వంత జిల్లాలకు దూరంగా ఉద్యోగాలలో ఉండి,
ట్రాన్సఫర్ కు ఎదురుచూస్తూ ఉండేవాళ్లం.. క్రొత్త సంవత్సరంలో మంచి వార్తగా మాకెవ్వరికైనా అలాంటి బదలీవార్త హెడ్ ఆఫీస్ వారు పంపితే, వస్తుందేమో అని ఆశగా ఎదురుచూడ్డం … నిరాశమిగిలి పోవడం.. అదికూడా ఆనందంగా రిసీవ్ చేసుకోవడం .. అదో సరదా..  నేనే ఒక్కోసారి స్టాఫ్ కు అందమైన గ్రీటింగ్స్ కొని.. ఆ పోస్టల్ బాగ్ లో వచ్చేటట్టు చేసేవాణ్ణి.. ఊహించని విధంగా వచ్చిన గ్రీటింగ్స్ చూసి ఏజంట్ గారు, మిత్రులు చాలా ఆనందించేవారు..మాలో చాలా మందికి  ఇంకా పెళ్లికాని రోజులు.. అదో ముచ్చట..

తర్వాత రాజమండ్రి వచ్చేసాను… నిజం చెప్పాలంటే పల్లెటూళ్ళలో కన్నాపట్టణ వాసాల్లో .. కొంచెం కనపడని బాసింగ్ మా బ్యాంకుల్లో కనపడేది.. సిటీ పెద్దదవుతున్నకొద్దీ … అది పెరిగేది.సెక్షన్ వైస్ బి.ఎమ్. గార్ని గ్రీట్ చెయడం. మా సెక్షన్ మేనేజర్ ముందు వాళ్లింటికి రమ్మనే వారు. ఆయన మాతో సరదాగా మాట్లాడి కాఫీలు అవీ ఇచ్చేవారు. ఆయనకు పార్టీలు ఇచ్చిన కమలాలు,ఆపిల్స్ మాకు ఇచ్చేసేవారు. ప్రొద్దున్న రష్ గా ఉంటుందని, సాయంత్రం మా సెక్షన్ వాళ్లందరమూ బి.ఎమ్. గారింటికి వెళ్లేవాళ్లం, మా మేనేజర్ గారి తో కలసి. అప్పుడు బి.యమ్ ఖాళీగా ఉండి, మాతో పిచ్చా పాటీ మాట్లాడేవారు.. సరదాగా గడిచేది.

ఇది హెడ్ ఆఫీస్, జోనల్ ఆఫీస్ స్థాయిలో … ఆ ఆఫీసులు ఉన్న నగరాలు పెద్దవేమో, నగరమంతా సందడిగా ఉండేది. ఒక బేచ్ తర్వాత ఒక బేచ్ పెద్ద వాళ్ల ఇళ్లకు వెళ్లేవారు.. ఒక గుంపు వస్తుంటే వేరే గుంపు లోపలకి వెళ్ళడం. దారిలో ఆగి ఒకరికొకరు హాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం.. కొందరి బాసులకు ముందరి రోజూ 'హాపి' ఎక్కువైతే,ఎవర్నీ మరునాడు చూడకపోవడం,, తమాషాగా ఉండేది. పెద్దాయనగారి ఇంట్లో ఆయన్ను ఒక గదిలో గ్రీట్  చేయడం, ఇంకోగదిలోమాకు పెట్టింది మేయడం. ఆ రోజుల్లో న్యూ ఇయర్ కు మొదట్లో శలవు ఇచ్చేవారు. తర్వాత తీసేసారు. గ్రీటింగ్స్ అయ్యాక మరల ఆఫీస్ కు వెళ్ళలి. వెళ్ళేవాళ్ళం, కాని ప్రధాన కార్యాలయాల్లో పని జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్లినప్పట్నించీ ఓ డిపార్ట్ మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్ కు పోయి విష్ చేయడం..అక్కడ్నించి మరో డిపార్ట్ మెంట్, అదీ కాక యూనియన్ లీడర్లను కూడా గ్రీట్  చేయాలిగా… లేపోతే అడక్కండి మరి…

కాలెండర్ల కలెక్షన్.. డైరీల కలెక్షన్ బాగానే ఉండేది.. పలాసాలో ఉన్నప్పుడైతే చిన్నఊరు కనుక బాంక్ వాళ్ళపై విపరీతమైన గౌరవం ఉండేది పార్టీలకు. అలా కష్టమర్స్ డైరీలు కొనుక్కొచ్చి, ముందు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమనేవారు. . ఆ తర్వాతనే గవర్నమెంట్ ఆఫీసు వారికిచ్చేవారు. కొందరైతే మా పేర్లు దైరీలమీద ప్రింట్ చేయించి ఇచ్చేవారు. .

ఉద్యోగపు మొదటి రోజుల్లో గ్రీటింగ్స్ కొని పంపించేవాణ్ణి .. చాలా కొనే వాడ్ని. ఇందులో ఓ చమత్కారముంది. మనం ఎవరికీ పంపిస్తామో వారినుంచి కాకుండా, మనం పంపని వాని దగ్గరనుంచి మనకు గ్రీటింగ్ వచ్చెది. కొన్నాళ్ళుప్రింట్ చేసి. ప్రెస్ వాణ్ణి మంచి చేసుకుని పది పది గ్రీటింగ్ కార్డ్ లు మా ముగ్గురు పిల్లల పేర్లనీ వేయిస్తే పాపం వాళ్లు ఎంత ఆనంద పడేవారో. కొన్నాళ్ళు రబ్బర్ స్టాంప్ .. హాపీ న్యూ ఇయర్ అని చేయించి అది వేసే వాడ్ని.. తర్వాత యస్. యమ్. యస్ లు. ఆ తర్వాత way2sms…

హైదరాబాదులో ఉన్నప్పుడు నేనున్న ఇళ్లలో జనాన్ని హుషార్ చేసి వీధిలో పెద్ద ప్రోగ్రామ్ చేసాము … అలాగే ఎక్కడున్నా ఏదో హడావుడి చేసి అందర్నీ ఇన్ వాల్వ్ చేయడం…

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఆ హుషార్ బాగా తగ్గింది.. ఈ రోజు 31-12-2014 ఇంట్లోనే ఉన్నా … కంప్యూటర్ ముందు కూర్చుని.. నా మనసు విపి మీకో విషయం చెప్దామని… అది ఏమంటే…

“మీకూ మీ కుటుంబము వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆరోగ్యం,ఆనందమూ,ఐశ్వర్యము మీకు రాబోవు సంవత్సరములో కలగాలని, మీకు మీ కుటుంబం వారికి సకల శుభాలు కలుగాలని కోరుకుంటున్నాను. 
మన మైత్రి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను… శలవు.  

Tuesday, November 25, 2014

“భారతవాసి”




“భారతవాసి”
   
రచన : డి.వి.హనుమంత రావు

సెంటర్ లో చాలా కోలాహలంగా ఉంది. .. ఓ ప్రక్కగా స్టేజ్ , షామియానా ... కెమెరాలు వేళ్లాడేసుకుని కొందరు, పెద్ద పెద్ద సంచులు భుజాన వేళ్లాడేసుకుని వీడియో వాళ్లు  కొందరు.. సందడి సందడిగా ఉన్నారు. వచ్చిన వాళ్లందరూ నీటుగా డ్రెస్సయి వచ్చారు.. దూరంగా కొందరు కానిస్టేబుల్స్ కబుర్లూ కథలూ చెప్పుకుంటూ నించొని ఉన్నారు. ఇంకో పది నిముషాలలో  ఎమ్.ఎల్.ఏ గారు, ఎమ్.పీగారూ రానున్నారని - గంట నుంచి మైకులో ప్రతి అయిదు నిముషాలకు ప్రకటిస్తున్నారు. వారు ప్రకటించినప్పుడల్లా వాచీలున్నవాళ్లు - వాళ్ల వాళ్ల  వాచీలు చూసుకుంటున్నారు. నిర్వాచీతులు టైమెంతైందని ప్రతి అయిదు నిముషాలకు ప్రక్కనున్న  వాచీ ఓనరులను
అడుగుతున్నారు. ఆ ప్రక్కనే, రక రకాల ఫోజుల్లో ఉన్న మోడీగారి ఫోటోలు, గుండూ , కర్రా, కళ్లజోడూ (గాంధీ గారనుకుంటా)ఉన్నాయన ఫోటోలు రెడీ చేసి ఉన్నాయి. ఆ ప్రక్కనే పాతబడిపోయిన వల్లభాయ్ ఫోటోట - గుర్రం మీద ఠీవీగా దర్జాగా స్వారీ చేస్తున్న శివాజీ గారట .. ఆయన బొమ్మా ఉన్నాయి. ఇప్పుడీ క్రొత్త ప్రభుత్వం వచ్చేదాకా - రక రకాల గాంధీ చిత్రాలు, వారి బొమ్మలే కాని, ఇవన్నీ చూడకపోవడం వలన గుర్తు పట్టలేకపోతున్నాం ఇప్పుడు క్రొత్తగా చూస్తున్న పాత ప్రముఖుల్ని. ఈ హడావుడి అంతా ఇలా ఉండగా.....  

సడెన్ గా “దొంగ .. దొంగా” అని కేకలు…
“ఎక్కడెక్కడ” అని పొలికేకలు,
రక్షక భటుల బూట్ టక టకలు …
వాళ్ళ వెనకాల కెమెరాలు .. వారితో కెమెరాలు తగులుకున్న భుజాలు ..ఆ వెనుక భుజాలు గల ఆసాములు … పరుగెత్తారు. కొందరు హీరోల్లా దొంగని పట్టడానికి పరుగెత్తితే,
“ఇలా వస్తే పట్టుకుందాంలే, ఎందుకు రిస్క్” అని కొందరు ఇక్కడే ఉండిపోయారు ..
ఈ లోగా అవకాశాన్ని అంది పుచ్చుకుని 64 కళల్లో దొంగతనంకూడా ఒక కళ అని గ్రాంధిక ఉపన్యాసం కొందరు  ఇస్తుంటే,
తమ తమ  జీవితాలలో దొంగ.. దొంగల కథలు -అనే అంశం మీద  అగ్రాంధిక ఉపన్యాసం కొందరు ఇచ్చేస్తున్నారు.

ఇలా దొంగకోసం వెళ్లినవాళ్లు.. ఆ వెనుకనే వెళ్లిన కెమెరాలు, కెమెరాల తాలూకు భుజాలు, భుజాల తాలూకు ఆసాములు అందరూ తిరిగి వచ్చారు. వారితో ఒక యువకుడు, సామాన్యంగా ఉన్నాడు. మామూలు బట్టలు కట్టుకున్నాడు. కూడా వచ్చాడు. అతగాడి ముఖంలో ఏ విధమైన భయమూ  లేదు..

“ఎందుకు చేసావీ పని” అడిగారు
“మంచి పని అనుకుని చేసాను”అన్నాడు.
“దొంగతనం మంచి పనా”అడిగారు
“ఎవరన్నారు”
“నువ్వంటున్నావు కదా?”
“నేనలా అనలేదు. నేను చేసిన పని మంచి పని అంటున్నా”
“ఎలా అవుతుంది ..మేమింత భారీ ఏర్పాటు చేసుకున్నాము ఓ ప్రక్క” అన్నారొకరు
“మరో ప్రక్క ఇంతమంది ఆల్ రెడీ వచ్చేసా(ము)రు..” అన్నారు మరొకరు
“అటు ప్రక్కనుంచి ఎం ఎల్ ఏ, ఎమ్.పి గారులు వచ్చేస్తున్నారు..”అన్నాడు  అటుప్రక్కాయన ..
“ఇంతకీ ఏమెత్తుకు  పోయాడండీ ..” ఇందాకణ్ణించీ  రిస్క్ తీసుకోకుండా గట్టు మీదే  ఉన్నాయన అన్నాడు..
అప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకుడు గొంతు సవరించుకుని చెప్పబోయాడు..
“మైకులో చెప్పండి .. అందరికీ వినపడుతుంది..” అన్నారొకరు
“ఎవరు విన్నా భయం లేదు, నేనేమన్నా తప్పు పని చేసానా.. మైకులో కాపోతే కొండెక్కి అరవండి, నా కేమిటి భయం” అన్నాడు దొంగగా నేరారోపణ చేయబడ్డ వ్యక్తి.
“ఇక్కడకు మా ఆహ్వానం మన్నించి విచ్చేసిన మిత్రులకి నమస్కారం” మొదలెట్టాడు నిర్వాహకుడు
“వేదిక మీదున్న ఎమ్.ఎల్.ఏ గార్కీ.....”
“వేదిక ఎక్కడుందిరా, ఎమ్.ఎల్.ఎ ఎక్కడున్నాడు.. సోది  ఆపి ..అసలు ఏమెత్తికెళ్లాడు.. అది చెప్పు”అన్నాడొకడు ..
“నన్ను మధ్యలో ఆపకండి .. ఫ్లో ఆగిపోతుంది… “
“ఫ్లో అక్కరలేదు .. స్లోగా మాట్లాడు చాలు”అన్నారొకడు.
“సరే ఐతే చెప్తాను వినండి .. ఇవ్వాళ కార్యక్రమంకోసం .. ఆ కార్యక్రమం జయప్రదం అవ్వాలని, ఫోటోల్లోనూ, వీడియోలోనూ కలర్ ఫుల్ గా కనపడాలని బోల్డు తట్టలతో రంగు రంగుల చెత్త తెప్పించి పోసాము.. మనం ఎంతో కష్టపడి సేకరించిన ఆ కలర్ ఫుల్ చెత్తంతా ఈ వ్యక్తి పట్టుకుపోతున్నాడు.. తట్టల్లోకి ఎత్తి మరీ పట్టుకు పోతున్నాడు.. రెడ్ హాండెండ్ గా దొరికిపోయాడు…ఇప్పుడేం చేద్దాం .. ఇతణ్ణి  శిక్షించాలా వద్దా… చెప్పండి.”
“శిక్షించాలి.. శిక్షించాలి” అంటూ కొందరరచారు
ఇంతలో .. బాగా తలపండి, పంట జుత్తు రాలినాయన కలుగజేసుకుని…
”ఇంతకీ ఆ చెత్త ఏంచేద్దామని పట్టుకెళ్తున్నాడు - అది అడగండి ..” అని ఖళ్ళు ఖళ్ళు దగ్గాడు.. పెద్దవాణ్ణని తెలియజేయడానికేమో ..    
“ఏముంది, పొరుగు రాష్ట్రాలకి అమ్మేస్తాడు.. అక్కడ చెత్త దొరక్క ఇలాంటి కార్యక్రమాలు తక్కువ చేస్తున్నారు కదా.. “ అన్నారొకడు.
“మనం బాగు పడిపోతామేమోనని ఏదో విదేశీ కుట్ర తాలూకు ఏజెంటేమో” అన్నారొకడు
“ఇప్పుడు ఎమ్.పీగారూ, ఎమ్.ఎల్.ఏ గారు వచ్చేస్తే ముహం ఎలా చూపించాలి,
ఫోటో గ్రాఫుల వాళ్లు ఫోటోలు తీస్తామంటే…  చెత్తలేని ముఖాలతో ఎలా నించుంటాము” అని వాపోయారు.. నిర్వాహకులు.
ఈలోగా ఆ పెద్దాయన మళ్లీ కలుగజేసుకుని, లేని జుట్టు తడుముకుని
“ఏమబ్బీ ఎందుకు చేసావీపని?” అని అడిగాడు.అడిగి ఖళ్ళు ఖళ్ళు దగ్గాడు.
అప్పుడు దొంగగా ఆరోపణ చేయబడిన వ్యక్తి గొంతు సవరించుకుని
“ఒక ప్రక్క మోడీ గారేమో ‘స్వచ్చ భారత్’ ‘స్వచ్చ భారత్’ అంటూ చెవిదగ్గర ఇల్లు కట్టుకుని, ఇల్లేంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుని మరీ అరుస్తున్నారు.. నిజమే మన ఇల్లు మనం శుభ్రం చేసుకోపోతే ఎవరు చేస్తారు? దీనికోసం ఎవరి కోసమో ఎందుకెదురు చూడాలి? అని ఆలోచించి ఎక్కడ చెత్త కనపడ్డా ఎత్తి పారేస్తున్నాను.. ఇక్కడ చెత్త కనపడింది, తట్ట కూడా కనపడింది.. మునిసిపాలిటీ కుండీ కూడా  కనపడింది … ఎత్తి అందులో వేసేసాను..
మీరు నన్నేదో చెత్త చెత్తగా తిట్టేస్తున్నారు ..
చెత్త ఎత్తి శుభ్రం  చేసిన నేను ‘దొంగనా’…
మీటింగ్ కోసమని చెత్త పోగేస్తున్న మీరు ‘దొరలా’ ? ..
ఏంటో అంతా చెత్త చెత్తగా ఉంది .. వెళ్లండి ..
వెళ్లి అక్కడ ఉన్న మునిసిపల్ కుండీ ప్రక్కకు లాగితే మీక్కావలసినంత చెత్త… చెత్త… చెత్త….”
అంటూ తానూ కలలు గంటున్న “స్వచ్చ భారత్” వైపు కర్తవ్యాతా నిష్టతో - స్వచ్చమైన ఆలోచనతో కదిలాడు
ఆ భారతవాసి. ..